వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువ సాహితీ సమ్మేళనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Youth literary meet in Hyderabad
హైదరాబాద్: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు హైదరాబాదులోని యువ సాహితీ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి పది గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాదులోని శ్రీత్యాగరాయ గానసభలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

తెలుగు సాహిత్య ప్రపంచంలో బహుశా మొట్టమొదటి సారిగా, కేవలం యువతీ యువకులకు ప్రాధాన్యత కలిగిస్తూ వారిదే అయిన ఒక సాహిత్య వేదికను ఆవిష్కరిస్తూ జరుగుతున్న "మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం" లో పాల్గొనమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువతని సాదరంగా ఆహ్వానిస్తున్నామని వంగూరి ఫౌండేషన్ తెలిపింది. ఈ మేరకు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ఇలా ఉంది...

ప్రభుత్వ విద్యా విధానాలలో చెప్పరాని నిర్లక్ష్యం, ఉద్యోగావకాశాలకి ఆంగ్లం మాత్రమే అవసరం అనే కాకుండా తెలుగు ప్రతిబంధకం అనే అపోహతో తెలుగు భాషని విస్మరిస్తున్న, తిరస్కరిస్తున్న మధ్యతరగతి సమాజం, దిగుమతి చేసుకున్న "సంకర" సంస్కృతినే తెలుగు సంస్కృతిగా ప్రచారం చేస్తున్న ప్రసార మాధ్యమాల ప్రభావం మొదలైన అనేక కారణాల వలన అపురూపమైన మన భాషా సాహిత్యాలకి తగిన గౌరవం, గుర్తింపు రోజు రోజుకి మరుగై పోతున్నాయి అని అందరికీ తెలిసిందే!

ఈ తరుణంలో, తెలుగు భాషా, సాహిత్యాలకి వెన్నెముకగా నిలిచి, భవిష్యత్తుని దేదీప్యమానంగా చేద్దామని తపన పడుతున్నది కొంతమంది వయోధికులే అయినా తెలుగు భాషా సాహిత్యాలను, తద్వారా మన సంస్కృతిని కాపాడే గురుతర బాధ్యత ఈ నాటి యువతరానిదే. అందువలన కళాశాల విద్యార్ధులూ, 15-35 సంవత్సరాల వయస్సు గల యువ రచయితలూ, కవులూ, సాహిత్యాభిలాషులూ, తెలుగు భాషను జీవనోపాధిగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్న వారు మాత్రమే వేదిక మీద ప్రసంగాలతోనూ, చర్చా వేదికలలోనూ పాల్గొనే ఈ అపురూప సమ్మేళనానికి వయస్సు తో నిమిత్తం లేకుండా అందరూ ఆహ్వానితులే. రాజకీయపరమైన ప్రాంతీయ వాదోపవాదాలకు, సామాజిక సమస్యల చర్చలకు ఈ వేదికలో తావు లేదు. కేవలం భాష, సాహిత్యాల విషయాలకే ఈ వేదిక పరిమితం.

సమ్మేళన ప్రధాన ఉద్దేశ్యాలు

1. తెలుగు యువ రచయితలు, సాహిత్యాభిలాషులూ తెలిసిన స్నేహితులతోబాటు అనేక ప్రాంతాలనుంచి వచ్చే తోటి వారిని కలుసుకుని, సాహిత్యపరంగా ముచ్చటించుకోవడం. కొత్త పరిచయాలు పెంచుకోవడం. తెలుగు భాషా, సాహిత్యాలపై తమ మక్కువ చాటుకోవడం.

2. యువతరం తెలుగు రచయితలు తమ స్వీయ రచనలను సభాముఖంగా వినిపించి ఇతరులతో పంచుకోడం.

3. అన్నింటికంటే ప్రధానంగా, తెలుగు సాహిత్యం విషయంలో ప్రస్తుత సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించుకోడం.

4. భవిష్యత్తులో భాష మనుగడకి, సాహిత్య పోషణకీ మంచి మార్గాలు నిర్దేశించుకోడం.
యువ వక్తలకు ఆహ్వానం, విన్నపం

సాహిత్యపరమైన విషయాలపై ప్రసంగించి, తమ అభిప్రాయాలను ఇతర రచయిత్రులూ, సాహిత్యాభిమానులతో పంచుకోవాలని అభిలషించే తెలుగు యువతీ యువకులందరికీ (వయస్సు పరిమితి 15-35) ఈ సమ్మేళనం ఒక ప్రత్యేక సాహిత్య వేదిక. ఈ క్ర్ంద ప్రచురించబడిన "ప్రాధమిక కార్యక్రమ వివరాలు" పత్రంలో సూచించబడిన ప్రసంగాంశాలు మాత్రమే ఆమోదయోగ్యం. ఈ సమ్మేళనంలో ప్రసంగించదల్చుకుంటే మీ పేరు, చిరునామా, ఫోన్, ఈ-మెయిల్ లతో సాహిత్యపరమైన పూర్తి ప్రసంగం మాకు తెలియవలసిన ఆఖరి తేదీ సెప్టెంబర్ 1. 2013. అన్ని విషయాలలోనూ తుది నిర్ణయం నిర్వాహకులదే. వక్తలందరూ తమ వయస్సు నిర్ధారించే పత్రం (బర్త్ సర్టిఫికేట్, స్కూల్ పత్రాలూ మొదలైనవి) కాపీ కూడా మాకు విధిగా పంపించాలి. ఎటువంటి వయో ధృవీకరణ పత్రమూ జతపరచని ప్రతిపాదనలు/అభ్యర్ధనలు పరిశీలించబడవు.

ప్రత్యెక సూచనలు, నిబంధనలు

1. సెప్టెంబర్ 1. 2013 లోపుగా మాకు అందిన వ్యాసాలలో మేము పరిశీలించి ఎంపిక చేసుకున్న వాటికి మాత్రమే ప్రసంగించే అవకాశం కలిగించబడుతుంది.

2. ఏ వక్తికైనా వేదిక పై ప్రంసంగావకాశం వారం రోజులలోనూ ఒక్క సారే ఇవ్వబడుతుంది.
3. హైదరాబాద్ నివాసులైన స్థానిక వక్తలకు రూ. 500 పారితోషికం, ఇతర ప్రాంతాల వారికి
రూ.1116.00 పారితోషికం ఇవ్వబడతాయి.

4. ప్రయాణ మరియు వసతి ఏర్పాట్లు, ఖర్చుల బాధ్యత ప్రసంగీకులదే.

వక్తలు తమ వ్యక్తిగత వివరాలను (పేరు, చిరునామా. ఫోన్ నెంబర్, ఈ-మెయిల్, వయస్సు ధృవీకరణ పత్రం) సెప్టెంబర్ 1. 2013 లోపుగా ఈ క్రింది చిరునామాకు పంపించాలి.

"Sromani" Vamsee Ramaraju, Managing Trustee
Vanguri Foundation of America
Satya Sai Puram, Survey No: 139 (part)
Kuntloor, Hayatnagar Mandal, R.R. Dist.
Hyderabad -501505, A.P

ఈ చారిత్రక యువ సాహితీ సమ్మేళనం పూర్తీ వివరాలకు ఈ క్రింది వారిని సంప్రదించండి.

డా. తెన్నేటి సుధా దేవి
Cell: 92465 77745
డా. ద్వా. నా. శాస్త్రి
Cell: 98492 93376
డా. వంగూరి చిట్టెన్ రాజు (Houston, TX, USA)
Phone: 832 594 9054
E-mail: [email protected]

English summary

 Vanguri Foundation of America is organizing youth literary meet in Hyderabad at Sri Tyagaraya Gana Sabha from september 29 to october 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X