శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్‌గా డాక్టర్ శ్రీకర్ రెడ్డి..అభినందించిన ఆటా ఉపాధ్యక్షులు..!
USA:శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్ జనరల్‌గా డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రిండ సామ, కమ్యూనిటీ లీడర్ వినోద్ నాగిలు డాక్టర్ శ్రీకర్ కె రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.ఆటా తరపున జరుగుతున్న సేవాకార్యక్రమాల గురించి వివరించిన ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, డిసెంబర్‌లో జరిగే ఆటా వేడకల గురించి కూడా చెప్పారు. అదే సమయంలో జూన్‌లో జరిగే ఆటా 18వ కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ అట్లాంటా కార్యక్రమాలకు డాక్టర్ శ్రీకర్ కె రెడ్డిని ఆహ్వానించారు.
యాదాద్రి జిల్లాలోని మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామంలో జన్మించిన డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి 1996లో కాకతీయ వర్సిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై తన బ్యాచ్‌లోనే సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పనిచేసిన ఆయన.. ఢిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోనూ సేవలందించారు. 2014 ఆగష్టు నుంచి 2017 అక్టోబర్ వరకు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో కౌన్సెలర్ బాధ్యతలు నిర్వర్తించారు.

అక్టోబర్ 2017 నుంచి మార్చి 2020 వరకు వియత్నాంలోని హో చి మిన్హ్ నగరంలో భారత కాన్సుల్ జనరల్‌గా పనిచేశారు.భారత విదేశాంగ శాఖలో పనిచేసిన సమయంలో డాక్టర్ శ్రీకర్ రెడ్డి భారత్ పాకిస్తాన్ సత్సంబంధాల విషయంలో కీలక పాత్ర పోషించారు. జూలై 2011 నుంచి ఆగష్టు 2014 వరకు డాక్టర్ శ్రీకర్ రెడ్డి హైదరాబాదులో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా పని చేశారు. ఆ సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవా పురస్కార్ అవార్డుతో డాక్టర్ శ్రీకర్ రెడ్డిన గౌరవించింది. గతంలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన డాక్టర్ టి.వి.నాగేంద్ర ప్రసాద్ తర్వాత మరో తెలుగు వ్యక్తి ఆ పదవి చేపట్టడం తెలుగువారికి గర్వకారణం.












Click it and Unblock the Notifications