డాక్టర్ మణికి ధర్మాత్మ బిరుదు
న్యూయార్క్: హిందూ అమెరికా టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(హెచ్ఎటిసిసి), శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ (ఎస్‌విబిఎఫ్) ఛైర్మన్ డాక్టర్ యెగ్నసుబ్రమణ్యన్(మణి)కి అరుదైన గౌవరం దక్కింది. అమెరికాలోని మోర్గన్‌విల్లేలో జరిగిన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారతదేశంలోని గొప్ప పీఠాలలో ఒకటైన శృంగేరి శారద పీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థానంద మహాస్వామిజీ చేతుల మీదుగా ధర్మాత్మ బిరుదును డాక్టర్ మణి అందుకున్నారు.
ఈ సందర్భంగా శృంగేరి పీఠం సిఈఓ విఆర్ గౌరిశంకర్ మాట్లాడుతూ.. గత 1200 సంవత్సరాల చరిత్రలో ఒక ప్రవాస భారతీయుడు ఇలాంటి గౌరవం పొందడం ఇదే తొలిసారని అన్నారు. తన జీవితకాలంలో డాక్టర్ మణి ఈ గౌరవం పొందిన ఏకైక ఎన్నారై అని ఆయన అన్నారు. ఈ గౌరవానికి అతను అర్హుడని, శారద పీఠం దీవెనలు అతనికి ఎప్పుడూ ఉంటాయని అన్నారు.

శృంగేరి శారద పీఠం 1200ఏళ్ళ చరిత్రలో ఈ బిరుదును అందుకున్న మూడో వ్యక్తి డాక్టర్ మణి అని ఆయన అన్నారు. అనేక మంది భక్తుల సహకారంతో హిందూ అమెరికన్ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్, శ్రీ గురువాయురప్పన్ ఆలయాలను అమెరికాలోని న్యూజెర్సీలో డాక్టర్ మణి నిర్మించారు. పూల మొక్కలతో కూడిన సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయాలను, భక్తుల కోసం భారీ వరండాలను, స్వామిజీల కోసం 12 భవంతులను, గోశాలలు, మన సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు సరస్వతీ విద్యాలయాలను నిర్మించారు.
సనాతన ధర్మాన్ని ముందుతరాలకు అందించేందుకు డాక్టర్ మణి అమెరికాలోనే కాక ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ధార్మిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అమెరికా, కెనడా దేశాల్లో శృంగేరి పీఠం శాఖలను ఏర్పాటు చేసి వేదాలు, భగవద్గీత సందేశాలను భక్తులను అందించేందుకు వేదిక్ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
చిన్న వయస్సులోనే అనేక ధార్మిక కార్యక్రమాలను చేపట్టిన తన ప్రియ శిశ్యుడు డాక్టర్ మణి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారని స్వామిజీ తెలిపారు. ఈ గౌరవం దక్కించుకోగల అన్ని అర్హతలున్నాయని, అతనికి శారదా చంద్రమౌళీశ్వర స్వామివార్ల అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని భారతీ తీర్థానంద స్వామిజీ తెలిపారు.












Click it and Unblock the Notifications