డల్లాస్‌లో ఘనంగా ఈద్ మిలాప్ వేడుక.. ముఖ్య అతిథిగా పెమ్మసాని హాజరు!
రంగురంగుల కాంతులతో, ఆత్మీయ పలకరింపులతో, శాంతి సౌభ్రాతృత్వాల నినాదాలతో డల్లాస్ పులకించిపోయింది. ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కేవలం సంబరాలకే పరిమితం కాలేదు. విభిన్న సంస్కృతులు, మతాల మధ్య ఐక్యత ఎంత గొప్పగా ఉంటుందో చాటి చెప్పింది. మానవతా విలువలను మరింత పెంపొందించేలా స్ఫూర్తినిచ్చింది.శాంతి, ఐక్యత, మానవతా విలువలను కేంద్రంగా చేసుకున్న ఈ వేడుకకు భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి & కమ్యూనికేషన్ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏప్రిల్ 12న ఇర్వింగ్ నగరంలోని విమల్ బాంకెట్ హాల్‌లో, ఉత్తర అమెరికాలోని ఆంధ్ర ముస్లింల సంస్థ AMANA (Andhra Muslims of North America) ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. నసీం షేక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పలు మతాలకు చెందిన ప్రముఖులను, సుమారు 200 మందిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ముస్లిం, హిందూ, క్రిస్టియన్ సమాజాల మధ్య అనుబంధాన్ని పెంపొందించడమే ఈ మిలాప్ లక్ష్యం గా ఈ కార్యక్రమాన్ని చెప్పటారు..

కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని ఈ వేడుకలో మాట్లాడుతూ, "రమజాన్ కేవలం ఉపవాసం గురించి కాదు. ఇది ఆకలితో బాధపడే వారిని గుర్తుచేసే, మానవతా భావాన్ని పెంపొందించే సీజన్," అని అన్నారు. మతపరమైన నియమాలను గౌరవించడం ద్వారా మనం సమాజాన్ని మరింత మానవీయంగా మలచగలమని చెప్పారు. తాను గుంటూరు నియోజకవర్గం ముస్లింల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ముస్లిం వర్గాలకు చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మమేకం కావడం, వారి అభివృద్ధికి పని చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని చెప్పారు.
నసీం షేక్ మాట్లాడుతూ, AMANA Global Foundation ఒక నాన్ ప్రాఫిట్ సంస్థగా, అమెరికాలో స్థిరపడిన ఆంధ్ర ముస్లిం కుటుంబాలను ఒకచోట కలిపి, వారి ద్వారా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సేవా కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. డాక్టర్ పెమ్మసాని జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని నసీం షేక్ ప్రశంసించారు. "అమెరికాలో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదిలి, ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు.
ఈ వేడుకలో షాజహాన్ షేక్, రియాజుద్దీన్ షేక్, అబ్దుల్ మాజిద్, జమీరుద్దీన్ మొహమ్మద్, ముజాహిద్ షేక్, సిద్దిఖ్, ముస్తఫా, ఇస్మాయిల్ పెనుకొండ, జాకీర్, నవీదుద్దీన్, బాల చెరుకూరి, భాను ప్రకాష్, పవన్ బెల్లం, విజయ్ బొర్రా, రామ్ గుళ్లపల్లి తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం, డల్లాస్‌లో భారతీయుల సమాజంలో మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని వారు ప్రశంసించారు.












Click it and Unblock the Notifications