గ్రామ సర్పంచ్ కావాలని.. రూ. 2 కోట్ల ఉద్యోగాన్నే వదిలేశాడు
జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యావంతులైన యువతలో కదలికను తీసుకొస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ దిగే అభ్యర్థులకు ప్రభుత్వం కనీస విద్యార్హత ఉండాలనే నిబంధనను తీసుకొచ్చింది. దీంతో ఉన్నత చదువులు చదివిన యువత రంగంలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే విదేశంలో ఉద్యోగం, కోట్లలో జీతం తీసుకుంటున్న ఓ యువకుడు కూడా సర్పంచ్ పదవికి పోటీ పడేందుకు సిద్ధపడ్డాడు.
ఆ యువకుడే ఆస్ట్రేలియాలోని గోల్ట్ కోస్ట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న హనుమాన్ చౌదరి (27). అతని వార్షిక జీతం రూ. 2కోట్లు కావడం గమనార్హం. పంచాయతీ సభ్యులుగా పోటీకి ఎనిమిదో తరగతి, సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే పదోతరగతి పాస్ కావాలన్న ప్రభుత్వ నిబంధనతో గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతం మంది పోటీకి అనర్హులయ్యారు. దీనిపై జోక్యానికి రాష్ట్ర హైకోర్టు కూడా నిరాకరించింది.

ఈ నేపథ్యంలో నాగౌర్ గ్రామానికి చెందిన తన తండ్రి భురారాం పిలుపుతో ఆస్ట్రేలియా నుంచి గ్రామానికి వచ్చిన హనుమాన్ చౌదరి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆరువేల ఓట్లతో భారీ విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న హనుమాన్ చౌదరి తన గ్రామంలో కుల రాజకీయాల సంగతి అవగాహన ఉందన్నారు. తన సోదరుడి సహకారం వల్లే తాను పోటీ చేస్తున్నాని చెప్పారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను పోటీలో దిగుతున్నట్లు తెలిపారు.
తన ప్రచారంలో కుల రాజకీయాల ఊసే ఎత్తడం లేదని చెప్పారు. అభివృద్ధి లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామర్థ్యం గల వ్యక్తిని సర్పంచ్‌గా అయితే మంత్రులు, అధికారులతో నేరుగా సంప్రదింపులు జరుపవచ్చునని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ గ్రామంలో జాట్లు, రాజపుత్రుల మధ్య రాజకీయ విభేదాలున్నాయి. హనుమాన్ చౌదరి జాట్ కాగా, ఆయన ప్రత్యర్థి రాజపుత్రుడు కావడంతో ఈ పోటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications