హైమాపై దాడిని ఖండించిన ఎన్నారైలు
న్యూయార్క్: ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో లోక్‌సత్తా పార్టీ నాయకురాలు హైమా ప్రవీణ్‌పై ఇటీవల జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా(పిఎఫ్ఎల్) నేతలు అమెరికాలో తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని శ్యామలకుంట కాలనీలో నివాసముంటున్న హైమా ప్రవీణ్‌ను అక్కడి నుంచి ఖాళీ చేయాలని బెదిరించిన దుండగులు ఆమెపై దాడికి దిగారని వారు చెప్పారు.
తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న హైమాను అడ్డుకుని, బైక్ పై వచ్చిన ఓ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోసి బెదిరింపులకు గురిచేసినట్లు వారు తెలిపారు. పక్కా ఇళ్ల కోసం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ బల్కంపేట డివిజన్‌లోని శ్యామలకుంట బస్తీవాసులు చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన నేపథ్యంలోనే హైమాపై దుండగులు దాడులకు పాల్పడ్డారని పిఎఫ్ఎల్ నేతలు ఆరోపించారు.

అమెరికాలోని టెక్సాస్‌లో సుమారు 12ఏళ్లపాటు వ్యాపార వ్యవహారాలను విజయవంతంగా నిర్వహించిన హైమా ప్రవీణ్, తన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తిరిగి భారతదేశానికి వచ్చినట్లు వారు తెలిపారు. తను జన్మించిన హైదరాబాద్‌లోని సనత్ నగర్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ఆమెపై దాడి చేయడం దారుణమని వారు అన్నారు. ఏడాది కాలంగా లోక్‌సత్తా పార్టీలో ముఖ్య నేతగా కొనసాగుతున్న హైమా ప్రజల కోసం పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వారు చెప్పారు.
లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తన అమెరికా పర్యటనలో సుమారు 12 నగరాలను సందర్శించి తెలుగు ప్రజలను కలుసుకున్నట్లు వారు తెలిపారు. జయప్రకాష్ నారాయణ ప్రసంగానికి ఆకర్షితురాలైన హైమా తన సొంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2011లో భారతదేశానికి వచ్చినట్లు పిఎఫ్ఎల్ నేతలు పేర్కొన్నారు. బస్తీవాసులకు మద్దతుగా నిలిచిన హైమా ప్రవీణ్‌పై దాడిని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు.
పిఎఫ్ఎల్ ఉపాధ్యక్షుడు ప్రదీప్ చుక్కపల్లి మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోరాడుతున్న హైమ లాంటి నేతలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. హైమపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు సామాజిక సంస్థలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావాలని పిఎఫ్ఎల్ నాయకుడు సురేష్ ఈదిగ కోరారు. సామాన్య ప్రజల కోసం పోరాటం చేస్తున్న హైమా ప్రవీణ్‌పై దాడి చేయడం దారుణమని, దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని డల్లాస్ అధ్యక్షుడు రజనీకాంత్ అన్నారు.