ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ గా తెలంగాణ ఆడబిడ్డ; అభినందించిన మహేష్ బిగాల!!
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. తెలుగువారు ప్రత్యేకతను సంతరించుకోవడం మామూలే. ప్రఖ్యాతి గాంచిన ఎన్నో దేశాలలో వివిధ ఉన్నతమైన పదవులలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇక తాజాగా ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ గా తెలంగాణ ఆడబిడ్డ విజయం సాధించింది. దీంతో తెలంగాణ బిడ్డకు అపూర్వ గౌరవం దక్కిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన ఆస్ట్రేలియా సాధారణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కరెన్ పెన్సబెన్ మేయర్ గా ఎన్నికయ్యారని స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ ప్రకటించింది. తెలంగాణ బిడ్డ కౌన్సిలర్ సంధ్యారెడ్డి అలియాస్ శాండీ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారని వెల్లడించింది.

స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా జరిగాయి. రాజకీయ పార్టీల ప్రాబల్యంతో జరిగిన ఉత్కంఠభరితమైన స్థానిక పోరులో 25 వేల మంది ఓటర్లు తెలంగాణ ఆడబిడ్డ శాండీ రెడ్డిని డిప్యూటీ మేయర్ ను ఎన్నుకున్నారు. ఆమె స్థానిక నివాసితులకు ప్రాతినిధ్యం వహిస్తుందని, వారికి అండగా నిలబడతారని నమ్మి ఓటర్లు ఆమెకు పట్టం కట్టారు.
సంధ్యా రెడ్డి అలియాస్ శాండీ రెడ్డి ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా నియమితులైన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళ. అందులోనూ ఆమె మన తెలంగాణ బిడ్డ కావడం విశేషమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య రెడ్డి అలియాస్ శాండీ రెడ్డి కి 2020 సంవత్సరానికి స్ట్రాత్ ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది.
తెలంగాణ బిడ్డ ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం పట్ల ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అభినందనలు తెలియజేశారు. తెలుగువారి ఖ్యాతి ఖండాంతరాలు దాటిందని ఆస్ట్రేలియాలో ఘనంగా మొట్టమొదటి పీవీ విగ్రహావిష్కరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న శాండీ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని తెలంగాణ వాసులు, ఎన్నారైలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications