తానా ఆధ్వర్యంలో ‘మాతృభాషా దినోత్సవం’
మిచిగాన్: అమెరికాలోని తెలుగు వారందర్నీ భాగస్వాములను చేసేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా (తానా) మాతృ భాష సంబరాలను, సాహిత్య వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకలు మిస్సోరి రాష్ట్రంలోని బిల్విన్‌లోని గాంధీ సెంటర్‌లో ఫిబ్రవరి 22 తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు తానా వర్గాలు పేర్కొన్నాయి. సెయింట్ లూయిస్‌లోని తెలుగు భాషాభిమానుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపాయి.
ఈ వేడుకలను మాతృ భాష దినోత్సవం పేరిట తొలిసారిగా గాంధీ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. ప్రముఖ తెలుగు భాషావేత్త, సంగీత అధ్యాపకుడు వెల్చేరు నారాయణ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. వెల్చేరు నారాయణ రావు భారత సాహిత్యంపై యూనివర్సిటీ ఆఫ్ విస్కన్సిన్-మిడిసన్, యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో గత 38 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, సాహిత్య అకాడమీ విజేత ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్రధాన వక్తగా హాజరుకానున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉంటున్న 2 లక్షలకుపైగా తెలుగు మాట్లాడేవారికి ఈ కార్యక్రమం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుందని వారు చెప్పారు. భవిష్యత్ తారాలకు తెలుగు గొప్పదనాన్ని తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని అన్నారు.
అమెరికాలో పుట్టి పెరిగిన చిన్నారులకు మాతృ భాషాపై మమకారాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంతేగాక తెలుగు సంగీతం, నృత్యంపై వారికి ఆసక్తి కనబర్చేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని తానా ఆధ్వర్యంలో డాక్టర్ చౌదరి జంపాల, డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ బాబు దండమూడి, యుగంధర్ యడ్లపాటి, రాజా సూర్పనేని, తెలుగు ప్రమోషన్ ఛైర్మన్ శివరాం యార్లగడ్డ నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications