
తెలుగు సంఘాల ఐఖ్యవేదిక కువైట్ సారధ్యంలో ఆన్‌లైన్‌లో నాటకం: సురభి నాటక కళాకారులకు చేయూత
గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలు కలిసి గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య గా ఏర్పడి గత సంవత్సరం కాలంగా ఎన్నో కార్యక్రమాలను ఉమ్మడిగా నిర్వహిస్తూ తమ ఉనికిని చాటుకుంటూ మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషాభివృద్దికి ఎంతో పాటుపడుతున్నారు.
కరోనా మహమ్మారి వల్ల నాటక కార్యక్రమాలు జరగక జీవనోపాదికి ఇబ్బంది పడుతున్న సురభి కళాకారులకు చేయూత ఇవ్వాలనే సదుద్దేశ్యంతో సురభి నాటకోత్సవాలను ఏర్పాటుచేసి నెలకి ఒక నాటకం చొప్పున ఒక్కొక్క గల్ఫ్ దేశం వారు ఆన్లైనో నాటకాలని ప్రదర్శించటానికి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే జులై మాసంలో తెలుగు కళా సమితి బహరైన్ వారి నిర్వహణలో మాయాబజార్ నాటకాన్ని, ఆగస్టు మాసంలో తెలుగు కళా సమితి ఓమన్ వారి నిర్వహణలో పాతాళభైరవి నాటకాన్ని, సెప్టెంబరు మాసంలో తెలుగు తరంగిణి రాస్ అల్-ఖైమా వారి నిర్వహణలో శ్రీకృష్ణ లీలామృతం నాటకాన్ని, అక్టోబరు మాసంలో ఆంధ్ర కళా వేదిక ఖతార్ వారి నిర్వహణలో లవకుశ నాటకాన్ని ప్రదర్శించారు.

తెలుగు సంఘాల ఐఖ్య వేదిక కువైట్ వారి సారధ్యములో నవంబరు పంతొమ్మిదవ తారీఖున పవిత్ర కార్తీక పొర్ణమి సందర్బముగా భూకైలాస్ నాటకాన్ని ప్రదర్శించి ఆన్లైన్లో అందరు గల్ఫ్ దేశాలలోని తెలుగువారందరు తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కువైట్లో భారత రాయభారి సిబి జార్జ్ తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు.
తెలుగు సంఘాల ఐఖ్య వేదిక కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ గల్ఫ్ తెలుగు సంఘాలు ఒక తాటిమీదకు వచ్చి ఇలా ఎన్నో కార్యక్రమాలను ఉమ్మడిగా ఆన్లైనో నిర్వహించుకోవటం చాలా శుభపరిణామం అన్నారు. ఈ సందర్భముగా ఈ సమాఖ్యలో భాగస్వాములైన అన్ని సంఘాల అధ్యక్షులకు వారి కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.

Recommended Video
ఈ సురభి నాటకోత్సవాలు ఇలా ఉమ్మడిగా నిర్వహించుకోవటం అన్ని గల్ఫ్ దేశాలవారు వీక్షంచటం సంతోషం అన్నారు. దాదాపు 135 సంవత్సరాల చరిత్ర ఉన్న సురభి నాటకరంగానికి తమవంతు సహాయం అందించాలని, తద్వారా నాటక రంగాన్ని బతికించుకోవాలని గల్ఫ్ సంఘాల వారు ముందుకు వచ్చారన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత వెంకప్ప భాగవతుల కాగా, సాంకేతిక సహకారాన్ని విక్రం సుఖవాసి అందించారు. అలాగే శుభోదయం వారు మరియు కుదరవల్లి ఫౌండేషన్ వారు స్పాన్సర్స్ గా వున్నారు.