బ్రిటన్ బీచ్‌లో తెలుగు అమ్మాయి ప్రాణం తీసిన భారీ అల
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇంగ్లాండ్‌లోని సముద్ర తీరంలో సరదాగా ఈతకొడుతుండగా.. పెద్ద అలలు రావడంతో సాయి తేజస్విని అనే తెలుగు అమ్మాయి కొట్టుకుపోయింది. కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి సాయి తేజస్వినికి సీపీఆర్ చేసినా స్పందించలేదు. పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు నిర్ధరించారు. విషయం తెలిసి తేజస్విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయితేజస్విని మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకుని రావడానికి సాయం చేయాలని ఆమె కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌ను కోరారు.అవసరమైన సహాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.

'మీ కుటుంబానికి జరిగిన నష్టం తీర్చలేనిది.. నా కార్యాలయ బృందం వెంటనే సహాయం చేయడానికి స్థానిక బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ బృందం-హైదరాబాద్‌తో కలిసి పని చేస్తుంది' అని కేటీఆర్ పేర్కొన్నారు. సాయి తేజస్విని మృత దేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి తమ కుటుంబం చాలా అధికార సవాళ్లను ఎదుర్కొంటోందని సాయి సోదరి ప్రియారెడ్డి చేసిన ట్వీట్‌పై కేటీఆర్ ఈ మేరకు స్పందించారు.
Very sorry for your loss
— KTR (@KTRBRS) April 17, 2023
My team @KTRoffice will work with local British Deputy High Commissioner’s team @UKinHyderabad to assist asap https://t.co/92BX6OmcOJ
యూకేలో క్రాన్‌ఫీల్డ్ యూనివర్శిటీలో ఏరోనాటిక్స్ , స్పేస్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చదువుతోంది సాయి తేజస్వి. ఆమె కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం.. ఏప్రిల్ 11న బ్రైటన్ బీచ్‌లో పెద్ద అలలో చిక్కుకుని మరణించింది. అప్పటి నుంచి ఆమె మృతదేహం యూకే ఆస్పత్రిలోనే ఉంది.
వాస్తవానికి బ్రైటన్ సముద్రంలో ఇటువంటి దారుణ సంఘటనలు అనేకం గతంలో జరిగాయి. లాంగ్ వీకెండ్ అవడంతో సాయి తేజస్విని విహారానికి వెళ్లినట్టు తెలుస్తోంది. సాయి తేజస్విని స్వస్థలం హైదరాబాద్ లోని సైదాబాద్. కాగా, యూకే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయి తేజస్వినితో ఎవరెవరు వున్నారు.. ఆమెకి ఈత వచ్చా లేదా ? వివిధ కోణాల నుంచి పోలీసులు ధైర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications