లండన్‌లో ఘనంగా 'టాక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం'
లండన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. కరోనా వల్ల వర్చువల్ విధానంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్ పర్సన్, మాజీ మంత్రి సునీతా లక్షారెడ్డి గారు హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు.
మహిళలు బాగుంటే దేశం, రాష్ట్రం బాగుంటుందని సునీత తెలిపారు. ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలన్నారు. అందివచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని.. అప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని వివరించారు. ప్రతి అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలనీ పురుషుల కన్నా మహిళలు ఎందులో తక్కువ కాదని నిరూపించాలనీ, దేశాభివృద్ధిలో మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వారికి అండగా ఉంటామని అన్నారు. మహిళల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ.. సంస్థ చేస్తున్న కార్యక్రమాలని వివరించారు. తల్లిదండ్రులు అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూడాలనీ కోరారు.
వారిలో అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనీ, ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా వారిలో స్ఫూర్తి నింపాలనీ కోరారు. ఎన్నో సంస్థలకు మహిళలు నాయకత్వం వహించి అద్భుత విజయాలు సాధిస్తున్నారని అన్నారు. టాక్ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురుషులకు ధీటుగా అద్భుత విజయాలు సాధిస్తున్నారని తెలిపారు.
ప్రముఖ గాయని స్వాతి రెడ్డి పాటలు పాడి అలరించారు. కార్యక్రమానికి సుప్రజ పులుసు అధ్యక్షతన వహించగా.. టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, న్యూజిలాండ్ నుంచి బ్రాండ్ తెలంగాణ అంబాసిడర్ సునీత విజయ్, కువైట్ నుంచి నందిని అబాగోని, టాక్ మహిళా విభాగం సభ్యులు జాన్వీ , సుష్మణ, శ్వేతా మహేందర్, ప్రియాంక , మమత , సంధ్య , శోభ, శ్వేత, లక్ష్మి , యూకేలో ఉంటోన్న మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications