పొలిటికల్ హాట్‌స్పాట్‌గా రామతీర్థం: ఇక జనసేన వంతు: రెండురోజుల షెడ్యూల్ ఇదే
విజయనగరం: విజయనగరం జిల్లాలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రామతీర్థం.. తాజాగా పొలిటికల్ హాట్‌స్పాట్‌గా మారింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ ఆ ప్రాచీన ఆలయం మీదే నిలిచింది. 400 సంవత్సరాల ఘన చరిత్ర గల ఈ క్షేత్రం రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువైంది. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు ఈ ఆలయాన్ని ఆయుధంగా వినియోగించుకుంటోండగా.. కౌంటర్ అటాక్ చేయడానికి వైసీపీ కూడా దీన్నే ప్రయోగిస్తోంది. ఒక పుణ్యక్షేత్రాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోండటం పట్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.

జనసేన రెండు రోజుల షెడ్యూల్..
రామతీర్థం ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడి విగ్రహం నుంచి తలను వేరు చేశారు. దాన్ని కొలనులో పడేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత.. రాజకీయ వేడి హైపిచ్‌కు చేరుకుంది. తొలుత భారతీయ జనతా పార్టీ.. అనంతరం తెలుగుదేశం నేతలు ఈ ఆలయాన్ని సందర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు సైతం రామతీర్థం ఆలయాన్ని సందర్శంచారు. ఇక జనసేన పార్టీ వంతు వచ్చింది. ఆ పార్టీ నేతలు మంగళవారం రామతీర్థాన్ని సందర్శించబోతోన్నారు.

4న నిరసన దీక్షలు..
దానికంటే ఒకరోజు ముందే.. జనసేన పార్టీ నాయకులు నిరసన దీక్షలను చేపట్టనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన జనసేన నేతలు సోమవారం రోజంతా నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై చోటు చేసుకుంటోన్న దాడులను నిరసిస్తూ.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గుంటూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనసేన కార్యకర్తలు, వీరమహిళ విభాగం నేతలు ఇందులో పాల్గొననున్నారు.

ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో..
మరుసటి రోజు ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ నాయకులు ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో రామతీర్థానికి తరలివెళ్లనున్నారు. బీజేపీ నేతలు ఇందులో భాగస్వామ్యులు కానున్నారు. రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాలు, ఆలయ ఆస్తులపై ఒక పరంపరగా జరుగుతున్న దాడులకు పరాకాష్టగా రామతీర్థం ఘటనను పేర్కొంది జనసేన. దీనికి ముందు నుంచీ రాష్ట్రంలోని ఆలయాలు, ఆస్తులపై యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయని విమర్శించింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం ఉండట్లేదని విమర్శించింది.

ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ..
పలు ఆలయాల్లో విగ్రహాలను పగులగొట్టారని, రథాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రామతీర్థ ధర్మయాత్రను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లిన బీజేపీ నేతలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని జనసేన పార్టీ విమర్శించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడింది. రామతీర్థం వద్ద పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించింది.












Click it and Unblock the Notifications