• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ మూడు నవలలు

By Staff
|

ఒక పుస్తకం మొదటి ముద్రణ ప్రతులు అమ్ముడుపోవడమే గగనం. అటువంటిది నవీన్‌ రాసిన అంపశయ్య నాల్గవ ముద్రణ, ముళ్లపొదలు, అంతస్స్రవంతి ద్వితీయ ముద్రణలు పొందాయి. వాస్తవానికి మూడు వేర్వేరు నవలలు కావు; ఒకే నవల. ఒక దానికొకటి ఎక్స్‌టెన్షన్‌. అంపశయ్యకు సీక్వెల్‌గా రాయబడిన నవలలు ముళ్లపొదలు, అంతస్స్రవంతి. అంపశయ్యలో రవి విద్యార్థి దశను, ముళ్లపొదలు నవలలో నిరుద్యోగ దశను, అంతస్స్రవంతి నవలలో ఉద్యోగ దశను చిత్రీకరించారు. ఈ మూడు నవలల్లో రవి క్రమవికాసం వుంది. రవి చుట్టూ తిరిగిన మిగతా ప్రధాన పాత్రల వికాస, పతనావస్థలూ చిత్రీకరించబడ్డాయి. కేవలం పాత్రల ప్రాధాన్యం మాత్రమే అయితే ఇన్ని ముద్రణలకు ఈ నవలలు నోచుకుని వుండేవి కావు. సామాజిక పరిస్థితులను, మార్పులను కళ్లకు కట్టినట్లు చూపారు రచయిత నవీన్‌. అయితే సామాజిక చిత్రణ చేయడంలో ఆయన శిల్ప ప్రాధాన్యతను విస్మరించలేదు. ముక్కు పట్టుకొని రచయిత పాత్రలను నడిపించలేదు. ''నవలంటే కథ మాత్రమే కాదని... నవలంటే వివిధ సంఘటనల్ని ముందే నిర్ణయించుకున్న ప్రకారం అమర్చడం కాదని... నవలంటే.. పాత్రలని.. నవల ఆ పాత్రల బాహ్య స్వరూపాన్ని, బాహ్య చేష్టలను మాత్రమే కాకుండా వాళ్ల అంతరంగ ప్రపంచాన్ని, ఆ ప్రపంచంలో చెలరేగుతున్న వివిధ సంఘర్షణల స్వరూపాల్ని సమగ్రంగా చిత్రించేద''ని నవీన్‌ విశ్వసించడమే కాకుండా నిరూపించారు కూడా.

అంపశయ్యలోని ''ఇతివృత్తం, వాతావరణం, పాత్రలు, చిత్రణ, శైలి వాటికవే విశిష్టతను కలవిగా, సామాజిక జీవితంలోని అతి ముఖ్య విభాగమైన ఉన్నత విద్యారంగానికి తీసి చూపిన ఎక్స్‌రేగా రూపొంది, ఈ రచనకు మరే నవలకూ లేని ప్రత్యేకతను సంతరించి పెట్టాయ''ని చలసాని ప్రసాదరావు ప్రశంసించారు. చలసాని ప్రసాదరావు మాటలు అంపశయ్య నవలను ఉద్దేశించి అన్నవే అయినప్పటికీ ముళ్లపొదలు, అంతస్స్రవంతి నవలలకు కూడా వర్తిస్తాయి. మూడు నవలలు కూడా మన విద్యావ్యవస్థ దుస్థితిని, దుర్మార్గాన్ని ఎత్తి చేపేవి. స్థూలంగా చూస్తే అంతే. కానీ సామాజిక రుగ్మతలను ఎత్తి చూపే నవలలు ఇవి. అంతే కాకుండా ఆ రుగ్మతలకు కారణాలను కూడా చూపే నవలలు. సాహిత్యానికి ప్రయోజనం వుండాలనే తెగకు చెందిన రచయిత నవీన్‌. అయితే ఈ నమ్మకంతో రచయిత ఎక్కడా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి సృజనాత్మకతను దెబ్బ తీయలేదు. ప్రబోధాలు చేయలేదు. ప్రసంగాలు చేయలేదు. అసలు రచయిత కనిపించడు. పాత్రలే కనిపిస్తాయి. రచయిత ప్రతిభకు ఇదే గీటురాయి. అందుకే ఈ మూడు నవలలు కూడా సాహిత్యాభిమానుల మన్ననలు పొందాయి.

అంపశయ్య, ముళ్లపొదలు, అంతస్స్రవంతి ఒక రకంగా రచయిత ఆత్మకథ. ఈ నవలల్లోని ప్రధాన పాత్ర రవి రచయితనే. సామాజిక ప్రయోజనానికి 'ఆత్మాశ్రయం' గొడ్డలి పెట్టులాంటిదని ఉద్యమ సాహితీపండితులు గగ్గోలు పెట్టిన కాలంలోనే ఈ రచనలు వచ్చాయి. ఆత్మాశ్రయ రచనలు సామాజిక వాస్తవికతను బలంగా చిత్రీకరించగలవనే విషయాన్ని నవీన్‌ దళిత, స్త్రీవాద రచనలు రాక ముందే నిరూపించారు. ''ఒక తపస్సులా సాగిన ఈ రచనకు ప్రధానమైన ప్రేరణ వైయక్తిక విముక్తి... డి.హెచ్‌. లారెన్స్‌ ఆర్ట్‌ ఈజ్‌ ఫర్‌ మై సేక్‌! అని ఎందుకన్నాడో నాకు అంపశయ్య రాశాక అర్థమైంది'' అని నవీన్‌ 'అంపశయ్య నేనెందుకు రాశాను' అనే ప్రశ్న వేసుకుని జవాబిచ్చుకున్నారు. 'వైయక్తికత' అనేది సామాజిక వాస్తవితను ప్రతిఫలిస్తుందనే విషయాన్ని నవీన్‌ నవలలు నిరూపిస్తున్నాయి. ''అంతస్స్రవంతి ఒక చేతనకు ప్రతిరూపం కాదు, ఒక సామాజినక చేతనకు ప్రతిరూపం. అందుచేత దీన్ని ఆత్మాశ్రయ రచనగా కాక, వస్తు నిష్ఠమైన రచనగానే నిర్దేశించవలసి ఉన్నద''ని ఆర్‌.ఎస్‌. సుదర్శనం 1991లో అంతస్స్రవంతి నవలకు రాసిన ముందుమాటలో అన్నారు. నిజానికి మూడు నవలలు కూడా ప్రథమంగా ఆత్మాశ్రయాలే. ఆత్మాశ్రయ సాహిత్యం సమాజాన్ని విస్మరిస్తుందనే అపోహ ఉన్నందుననే అంతస్స్రవంతి నవల ఆత్మాశ్రయం కాదని చెప్పి దానికో 'ఉన్నత స్థాయి'ని కల్పించాలని సుదర్శనంగారు భావించినట్లు తోస్తోంది. ఆత్మాశ్రయ సాహిత్యం తప్పనిసరిగా సమాజాన్ని ప్రతిఫలిస్తుందనేది ఇవాళ్ల మన అనుభవంలోకి వచ్చింది. నవీన్‌ అచ్చమైన సృజనాత్మక రచయిత కాబట్టే ఆత్మాశ్రయానికి, వస్తునిష్ఠ సాహిత్యానికి మధ్య ఉన్న అభేదాన్ని మన ముందుంచారు.

అంపశయ్య నవలలోనే కాదు, ముళ్లపొదలు, అంతస్స్రవంతి నవలల్లో కూడా రచయిత రవి మానసిక సంఘర్షణను ప్రతిభావంతంగా చిత్రీకరించారు. రవి తన చుట్టూ ఉండే వ్యక్తుల అంతరంగాలను, వారిలోని మంచిచెడులను నిష్పాక్షికంగా అర్థం చేసుకోవడానికి పడే తపనను చూపించాడు. రవి చేసే అంతర్‌, బాహిర్‌ యుద్ధారావాలను రచయిత వినిపించారు. మానవ జీవితంలోని వైరుధ్యాలను కళ్లకు కట్టినట్లు చూపారు. కుహనా విలువల దుమ్ము దులిపారు. ఒక వ్యక్తిలోని మంచీచెడులకు మధ్యనే కాకుండా సమాజంలోని మంచీచెడులకు మధ్య జరుగుతున్న సంఘర్షణను చిత్రీకరించారు రచయిత. మానవ చైతన్యాన్ని పరిస్థితులు నిర్దేశిస్తాయనే సూక్తిని అక్షరాలా నిరూపించిన నవలలు ఇవి. మనిషి అన్ని వేళలా ఒకే రకంగా ప్రవర్తించడనే విషయాన్ని అర్థం చేసుకోగల రచయిత మాత్రమే ఇంత మంచి రచనలు చేయగలడు. సమాజాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన రచయిత మాత్రమే ఉత్తమ నవలలు రాయగలరనేది నవీన్‌ తన నవలల ద్వారా రుజువు చేశారు.

అంపశయ్య నవలలో రవి విశ్వవిద్యాలయం చదువులకు వచ్చే సరికి విశాల ప్రపంచం తలుపులు తెరుచుకుని ఉంటాయి. అనేకానేక ప్రలోభాలకు గురి చేస్తుందీ ప్రపంచం. తెలంగాణ ప్రాంతంలోని వ్యక్తులు విశాల ప్రపంచానికి అలవాడు పడనివారు, ఒక్కసారిగా సంకెళ్లు తెగినట్లు అనిపించే సరికి రవి అన్నింటి వైపూ ఆకర్షితుడవుతాడు. ఎండమావుల వెంట పరుగులు తీస్తాడు. మథనపడ్తాడు. నిరాశ చెందుతాడు. అప్పుడు వీస్తున్న శ్రీకాకుళోద్యమం అతడ్ని ఎంతగా ఆకర్షిస్తుందో, కిరణ్మయి అందమూ అంతే ఆకర్షిస్తుంది. ఉత్తమ సాహిత్యం ఎంతగా చలింపజేస్తుందో, సెక్స్‌ వాంఛా అంతే చలింపజేస్తుంది. ఈ రెంటి మధ్య అతడు నలిగిపోతాడు. రవి పాత్రను చిత్రీకరించడంలో రచయితకు హిపోక్రసీ లేదు. అందుకే నవీన్‌కిది మొదటి నవలే అయినప్పటికీ సాహిత్య ప్రపంచంలో అంపశయ్య సంచలనం సృష్టించింది. ముళ్లపొదలు నవలలో రవి, అతని మిత్రుల నిరుద్యోగ దశను వస్తువుగా స్వీకరించారు. రవితో పాటు వేణు, సాగర్‌, రమేష్‌, నిధి తమ గమ్యాలను నిర్దేశించుకున్న దశ కూడా ఇదే. ఏ ఐదుగురే అంపశయ్యలో కూడా ప్రధాన పాత్రలు. రవి కాలేజీ లెక్చరర్‌ను కావాలనుకుంటాడు. వేణు విప్లవోద్యమం వైపు అంపశయ్య నవలలోనే మొగ్గు చూపుతాడు. సాగర్‌ తెలంగాణ ఉద్యమం వైపు వెళ్తాడనేది 'అంపశయ్య' నవలలోనే సూచనప్రాయంగా చెప్పాడు. రమేష్‌ అమెరికా వెళ్లాలని అంపశయ్య నవలలోనే కలలు గంటున్న విషయాన్ని రచయిత చూపించారు. నిధిది ఆరాచక ప్రవృత్తి. ముళ్లపొదలు నవలలో వీరు తమ లక్ష్యాల సాధన కోసం పడే సంఘర్షణ కనిపిస్తుంది. అదే సమయంలో ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల వారివారి అవగాహన కూడా రచయిత చిత్రీకరించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రజా జీవితంపై చూపిన ప్రభావాన్ని సమర్థంగా చిత్రీకరించిన నవల ముళ్లపొదలు. తెలంగాణ ఉద్యమాన్ని సాగర్‌ తాను రాజకీయ నాయకుడిగా ఎదగడానికి వాడుకున్న వైనాన్నే కాకుండా ఆ ఉద్యమాన్ని రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న వైనాన్ని కూడా రవి దృష్టితో సమర్థవంతంగా చూపారు నవీన్‌. ఆనాటి (1969) విప్లవ కవులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తప్పుగా అవగాహన చేసుకున్నారనే విషయాన్ని రచయిత ఆ రోజే అర్థం చేసుకోగలిగారు. విప్లవ రచయితగా ఎదిగిన వేణు ఆనాటి విప్లవ మేధావులకు ప్రతినిధి. వేణుది తప్పుడు అంచనా అనే విషయాన్ని రవి ద్వారా చెప్పించాడు రచయిత.

అంతస్స్రవంతి నవల రవి దాంపత్య జీవితానికి, అధ్యాపక వృత్తికి సంబంధించింది. రచయితను కావాలనుకున్న అంపశయ్య రవి రచయితగా ఎదిగిన దశ ఇది. విప్లవోద్యమానికి, జాతీయ వాదులకు మధ్య జరిగిన సమకాలీన సంఘర్షణలకు అద్దం పడుతుందీ నవల.

మొత్తంగా ఈ మూడు నవలలు తెలంగాణ సామాజిక చరిత్రకు నిలువుటద్దాలు. సమాజంలోని ప్రతి మార్పును అక్షరీకరించిన నవలలు ఇవి. ఈ నవలలు చదువుతుంటే ముసుగులను తీసేసి మనల్ని మనం పరీక్షించుకుంటున్న అనుభూతికి లోనవుతాం. ఈ నవలలు ప్రధానంగా రచయిత స్వీయ వేదనలకు, అంతర్మథనానికి చెందినవే అయినప్పటికీ మనకందరికీ చెందినట్లనిపిస్తాయి. అందుకే ఇవి ఉత్తమ నవలలు అయ్యాయి. వస్తువుకు, శిల్పానికి సమన్వయం కుదిర్చిన రచనలు ఇవి. వస్తు ప్రాముఖ్యాన్నే కాకుండా శిల్ప ప్రాముఖ్యాన్ని కూడా ఈ నవలలు వివరిస్తాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more