• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దళిత తార రాలిపోయింది

By Staff
|

మద్దెల శాంతయ్యను అకాలంగా మృత్యువు కాటేసింది. తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఈయనను ఇంత అకస్మాత్తుగా మృత్యుదేవత తన ఒడిలోకి లాక్కున్న వార్త విన్నప్పుడు భూమి బద్దలు కాలేదు; ఆకాశం కూలి పడలేదు. కానీ సాహిత్యలోకాన్ని ఒక మబ్బు కమ్ముకుంది. గల గల పారే సెలయేరులాంటి శాంతయ్యలో అంతులేని వేదన గూడు కట్టుకుని ఉందని ఎంత మందికెరుక!

జీవితం పట్ల ఒక బాధ్యతతో కూడిన నిర్లక్ష్యం ఆయనకు వుండి వుంటుంది. అందుకే తనను కామెర్ల వ్యాధి కాటేసే దాకా నిర్లిప్తంగానే వుండిపోయాడు. మద్దెల శాంతయ్య కవి. వ్యాసకర్త. చాలా మందిని విప్లవోద్యమం ప్రభావితం చేసినట్లే శాంతయ్యనూ ప్రభావితం చేసింది. విప్లవోద్యమ ప్రేరణతో ఆయన కొంత కవిత్వం రాశాడు. అయితే, దళితవాదం ఆయనకు చుక్కాని అయినట్లే, దళితవాదానికి ఆయన చుక్కాని అయ్యాడు. దళితవాదంలో ఆయన కలం పదునెక్కింది. అయితే, ఆయన తన కవిత్వాన్ని అచ్చు వేయించుకోవడానికి పత్రికల చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. తన అనుభూతులను, వేదనలను, అనుభవాలను ఆయన కవిత్వీకరించాడు. భావోద్వేగాలు ఎదను తన్నుకుని వస్తుంటే ఆయన కవిత్వం రాశాడు. అందుకే, ఆయన కవిత్వం చాలా వరకు అముద్రితంగానే వుండిపోయింది.

ఆయన సమాజంలోని అన్యాయాలకు, అక్రమాలకు గొంతునిచ్చాడు. అలా గొంతునిచ్చాడు కాబట్టే 'ఓ.సి. క్రీస్తు' అనే కవిత రాయగలిగాడు. ''క్రైస్తవంలో కులం లేదన్నప్పుడు/ క్రీస్తు మళ్లి పుట్టినంత సంబరమయింది/ మరి జరుగుతున్నదేంటి ప్రభూ..?'' అని ఆయన ఆ కవితలో ప్రశ్నించాడు. ప్రజా గాయకుడు గద్దర్‌పై దాడి జరిగినప్పుడు ఆయన ప్రతిస్పందించి కవిత రాశాడు. దాన్ని ఆయన అచ్చుకివ్వలేదు. అంటే, తాను కవిత్వం ఎందుకు రాస్తున్నాననే విషయం శాంతయ్యకు బాగా తెలుసు. ఒక ఊరట కోసం, లోలోని మంటను చల్లార్చుకునేందుకు ఆయన కవిత్వం రాశాడు. శాంతయ్య ముస్లింలలోని పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని చూసి కరిగి నీరయిపోయాడని ఆయన రాసిన కవితలే చెప్తాయి.

1996లో తుఫాను బీభత్సానికి ఒళ్లంతా కన్నీరై రాసిన శాంతయ్య కవిత ఆదివారం ఆంధ్రజ్యోతి కవర్‌ పేజీని అలంకరించింది. 'సముద్రం చోటు చాలక/ మనిషి కంట్లో చోటడిగింది'' అని అన్నాడా కవితలో. శాంతయ్య ఏది రాసినా తన హృదయాన్ని దహించివేస్తేనే రాశాడు. అందుకే ఆయన కవిత్వం ఒక చెలిమెలోంచి జాలువారే స్వచ్ఛమైన జలం లాంటిది. అందులో ఆర్ద్రత మనను కట్టి పడేస్తుంది.

శాంతయ్య దళితవాదాన్ని ముందుకు నడిపించేందుకు ఓ చేయి వేశాడు. దళిత ఉద్యమాన్ని సమర్థిస్తూ ఆయన వ్యాసాలు రాశాడు. తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సాహిత్య, సామాజిక కృషిని కొనసాగించాడు. వ్యక్తిగత పేరు ప్రతిష్టల కోసం కాకుండా తాను నమ్మిన విశ్వాసాల కోసం నిబద్ధతతో కృషి చేసిన కృషీవలుడు శాంతయ్య. నిన్న నాగప్పగారి సుందర రాజు, ఇవ్వాళ్ల మద్దెల శాంతయ్య- దళిత సాహిత్య నల్లటి ఆకాశం కోల్పోయిన రెండు తారలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X