వాహనాలపై కులం పేరు కనిపిస్తే రూ. 2 వేలు ఫైన్.. రవాణాశాఖ సంచలన ప్రకటన
సాధారణంగా మన వాహనాలపై మన పేర్లు, మన ఇంటి పేర్లు, కులం పేర్లు, పిల్లల పేర్లు, సెలబ్రిటీల పేర్లు ఇలా రకరకాలుగా తమ అభిమాన వ్యక్తుల పేర్లను రాసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇలా వాహనాలపై కులం పేర్లు రాస్తే రూ. 2వేలు ఫైన్ చెల్లించాల్సిందే. అవును బిహార్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాలపై కులం పేరు కనిపిస్తే ఫైన్ చెల్లించాల్సిందేనని బిహార్ రవాణాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లోగా పేర్లు తొలగించని వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం రూ. 2 వేల రూపాయల ఫైన్ వేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ మేరకు జూన్ 1 వరకు వాహనదారులకు గడువు విధించింది.
జూన్ 1 గడువు ముగిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహించనుంది. గడువు ముగిసిన తర్వాత కులం పేర్లు కనిపిస్తే ఆ వాహనాలపై మోటార్ వెహికల్ యాక్ట్ 1988 లోని సెక్షన్ 177 కింద 500 రూపాయల నుంచి సెక్షన్ 179 కింద 2 వేల రూపాయల వరకు ఫైన్ వేసేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వాహన యజమానులు వెంటనే కులం పేర్లను తొలగించాలని రవాణాశాఖ సూచనలు చేసింది. ఈ మేరకు కొత్త రూల్ కు సంబంధించి జిల్లా రవాణా అధికారులకు ఇప్పటికే రవాణా శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు బిహార్ ప్రభుత్వం పేర్కొంది.

అయితే తాజాగా బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి వాహనదారులు మండిపడుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే రూల్ ను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications