మాట పెళుసు - మంచి మనసు

Posted By:
Subscribe to Oneindia Telugu

యాభయిఒక్క సంవత్సరాల నాటి మాట. 1949 దీపావళి రాత్రి, తొమ్మిదిదాటి పోయింది. గుంటూరు పట్టణం ప్రమిదలతోనూ, ప్రమదలతోనూ కళకళలాడిపోతోంది. ప్రతి ఇంటా పర్వదిన సంరంభం చిందులు తొక్కుతోంది. ఓ పదిహేడేళ్ళ 'పసివాడు' మాత్రం ఎందుకో నిర్వేదంగా వీధులన్నీ విహరిస్తున్నాడు. విసిగెత్తి చివరికి రూముకెళ్లి పడుకున్నాడు. పండగపూట పస్తు పడుకోవలసి రావడం అతనికి మింగుడు పడలేదు. తొమ్మిదేళ్ళ వయసులోనే తల్లిని పోగొట్టుకొని ఉండకపోతే తనకీ దుర్గతి పట్టేది కాదు కదా అనుకుని కుమిలిపోయాడు. అమ్మ ఉన్న రోజుల్లో సాగించుకున్న సరదాలు జ్ఞాపకం చేసుకున్నాడు. దుక్ఖం రెట్టింపయ్యింది. చేతికందిన పుస్తకం తీసుకుని తిప్పాడు. ఎవరో ఇంగ్లీష్‌ కవి చిన్నతనంలోనే చనిపోయిన తన తల్లి స్మృత్యర్ధం రాసిన కవిత అది. పాపమా కుర్రాడి దిగులు మరింత ఎక్కవయింది. కుళ్ళి కుళ్ళి ఏడవడానికి బదులుగా కలమూ కాగితమూ తీసుకున్నాడు. తన ఆవేదనకు అక్షరరూపమిచ్చాడు. అవే తర్వాత కాలంలో 'గతస్మృతి' పేరిట అచ్చయి ఎందరో ప్రముఖుల ప్రశంసలకు పాత్రమయిన పద్యాలు. అంతటితో ఆపి పడుకున్నా బాగుండేది. అలా చెయ్యలేదా కుర్రకవి. అల్లూరి సీతారామరాజు జీవితం మీద రాసిన ఏదో పుస్తకం చూసి, వెంటనే 'ఆటుపోట్లు' అనే శీర్షికన కొన్ని పద్యాలు వెలయించాడు. అంత కవిత్వం రాసిన ఆ యువకుడికి కడుపు కింత తినాలని మాత్రం అనిపించలేదు. నడిరాత్రి దాటేవరకూ మెలకువగా ఉండి తీవ్రమైన భావావేశంతో కవిత్వంరాయడం - లోలోపల దుక్ఖంతో కుమిలిపోవడం - ఖాళీ కడుపుతో పడిఉండడంతో అతని పరిస్థితి వికటించింది. కళ్ళు తిరిగి పడిపోయాడు. మర్నాడు పొద్దున్నే 'కవికోకిల' గుర్రం జాషువా అతని గదిలోకి యథాలాపంగా తొంగిచూసి ఉండకపోతే ఆ కుర్రాడు మనకి దక్కేవాడే కాదేమో! ఆత్మావేదనను కవిత్వంగా అనువదించగల నేర్పు అంత చిన్న వయసులోనే ఒంట పట్టించుకున్న ఆ యువకుడు అచిరకాలంలోనే కవిత్వాన్ని వదిలేస్తాడని అప్పట్లో ఎవరూ అనుకోలేదు. కానీ బూదరాజు రాధాకృష్ణగారి విషయంలో అదే జరిగింది.

పెడసరంగా వ్యాఖ్యానిస్తూ, పెళుసుగా వ్యవహరిస్తూ - నోటితో మాట్టాడుతూనే నొసటితో వెక్కిరిస్తూ ఉండే బూదరాజు రాధాకృష్ణ మనసులో ఇంతటి మార్దవం, ఆర్ద్రత ఉన్నాయని చెబితే నమ్మడం కష్టమే. తొలిచూపులోనే ఎదుటివాణ్ణి ఝమాయించి మాట్టాడ్డం ఆయన నైజం. అతి చనువు ప్రదర్శించి హాస్యాలాడడం ఆయన స్వభావం. అడిగిన ప్రశ్నని పక్కనపెట్టి, పృచ్ఛకుడి అర్హతానర్హతల పరిశీలనకు దిగడం బూదరాజుగారి వ్యవహార సరళి. ఓపిగ్గా ఆయన్ని భరించగలిగిన వాళ్ళకి త్వరలోనే ఒక విషయం అర్ధమవుతుంది. మనిషి పైకి కనిపించేంత కటువైనవాడు కాకపోగా ఎంతో స్నేహశీలి అనీను. వయోభేదం కూడా లక్ష్యపెట్టకుండా కలిసిపోగల సౌజన్యం ఆయన సొంతమనీను. అయితే ఎక్కువ కేసుల్లో కథ ఇందాకా రాదు. అందువల్లనే 'బూదరాజు' అనే మాట 'బూచి'గా మారిపోయింది. ఆ పేరు వినిపిస్తే చాలు ఎక్కడివాళ్ళక్కడ జారుకోవడం కద్దు. అలా జరగనివాళ్ళకి మాత్రమే ఆయన సాన్నిహిత్య భాగ్యం సంక్రమించేది. పాపం అలాంటివాళ్ళు అల్పసంఖ్యాకులుగానే మిగిలిపోతున్నారు.

ఇటీవల వివిఎన్‌ ట్రస్ట్‌వారు డాక్టర్‌ బూదరాజు రాధాకృష్ణగారికి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చారు. విమర్శకుడిగా, భాషాపరిశోధకుడిగా, శాసనశోధకుడిగా, కాలమిస్ట్‌గా - అన్నిటికీ మించి వందలాదిమంది పత్రికారచయితలకు శిక్షణ నిచ్చిన అధ్యాపకుడిగా బూదరాజు చేసిన సేవ అనుపమానం. తొలిరోజుల్లో మంచి పద్యకవిత్వం కూడా చెప్పిన రాధాకృష్ణ తర్వాత్తర్వాత తన ఆశుకవితా సామర్థ్యాన్ని హాస్యస్ఫురణకే పరిమితం చేశారు. అందువల్ల ఉభయులకూ (ఆయనకీ- మనకీ కూడా) మంచే జరిగిందని నా నమ్మకం. అలాంటి మహానుభావుడికి ఎన్ని అవార్డులిచ్చినా ఎన్ని పురస్కారాలు చేసినా తక్కువేమరి.

''నేను మూడు విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేశానని తరచు చెబుతూనే వుంటాను. వేటపాలెం గ్రంధాలయం నా తొలి యూనివర్శిటీ. దాదాపు హైస్కూలు రోజుల నుంచీ వేటపాలెం లైబ్రరీని నిత్యం సందర్శించడం నాకొక రివాజుగా మారిపోయింది. ఫిఫ్త్‌ ఫామ్‌కి వచ్చేసరికి కాస్త ఛందస్సు ఒంటబట్టడంతో పద్యకవిత్వంమీదికి గాలి మళ్ళింది. ఆ ధోరణిలో పడ్డ తర్వాత వేటపాలెం లైబ్రరీలో గడిపే గంటలు రెట్టింపయ్యాయి. ఇవాళ బూదరాజు రాధాకృష్ణలో కనపడే సకలఛాయలకు ఆ లైబ్రరీలోనే బీజం పడింద''ని అంటారాయన.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి