కులవాదులు దారి తప్పిన సోదరులు: 'మో'

Posted By:
Subscribe to Oneindia Telugu

మొన్న రాత్రి- కచ్చితంగా చెప్పాలంటే జూన్‌ పందొమ్మిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల వేళ- కార్టూనిస్టు మోహన్‌ నన్ను షాక్‌ చేశాడు. ఏదో మాట్లాడుతూ మధ్యలో ''ఓ కవిగారు రిటైరై పోతున్నారు గురూ!'' అని మోహన్‌ ఒక మాట వదిలాడు. నిర్ఘాంతపోయాను నేను. మన తెలుగుదేశంలో- ఒక కవి సజీవంగా రిటైర్‌ కావడమా? ఇది నిజమా-కలా? అని నివ్వెరపోతున్న నన్ను నా మిత్రుడే గట్టెక్కించాడు. సదరహీ కవివరేణ్యుడు రిటైరవుతున్నది కవిగా కాదనన్నీ- ఏదో పాఠాలు చెప్పుకునే బడిపంతులు ఉద్యోగంలో నించి మాత్రమేనన్నీ-మోహన్‌ వివరించే సరికి నా నివ్వెరపాటు నీరసంగా మారింది. అప్పటికి నా మిత్రుడు ప్రస్తావిస్తున్నది వేగుంట మోహన్‌ప్రసాద్‌ గురించని నాకు తెలియదు. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఆంగ్ల అధ్యాపకుడిగా ఆయన రిటైరవుతున్న సంగతీ తెలియదు. తత్సందర్భంగా తన మిత్రుల్నీ అభిమానుల్నీ కలిసే నిమిత్తం ఆయన ఆబిడ్స్‌లో ఫలానా హోటల్లో మకాం చేసి వున్న విషయం తెలియనే తెలియదు. తెలిసిన మరుక్షణం, ఏడు సీట్ల ఆటో పట్టుకుని, ధూమ వేగ ధూళి వేగాలతో వేగుంట మోహన ప్రసాద్‌ మకాంను చేరుకున్నాను.

కవిగారు అప్పటికే కొలువు తీరి వున్నారు. అలెక్సాంద్ర్‌ బ్లోక్‌ కొలువు కూటం గురించి ఆనా అహ్మాతవ రాసినట్టే వుంది ఆ వొటేలు గది. శిఖామణ్యాది శిష్యపరమాణువులు సభను రక్తి కట్టిస్తుండగా వేగుంట మోహన ప్రసాద్‌ నాలుగు గంటల సేపు 'విజయ(వాడ) విహారం' చేశారు. ఆయన ప్రస్తావించని ప్రసంగం లేదు. వ్యాఖ్యానించని కావ్యాంశం లేదు. వింగడించి, విశ్లేషించని విషయం లేదు. బయట విసుగెరుగని ముసురు. లోపల అంతెరుగని వాగ్ధార. ''అమృతం కురిసిన ఆ రాత్రి, అంగాంగం తడిసినదీ ధాత్రి'' అన్నట్లే వుంది. మోహన ప్రసాద్‌గారిని నేను మౌనంగా అడిగి తెలుసుకున్న అనేక విషయాల్లోంచి ముఖ్యమయినవి ఏర్చి, కూర్చి మీ ముందు పేరుస్తున్నాను.

''మీరు నమ్మకపోవచ్చు కానీ నేను పెర్‌ఫెక్ట్‌ జెంటిల్మన్ని'' అంటూ చతుర్లాడారు మోహన ప్రసాద్‌. హెరాల్డ్‌ లాస్కీ ''ద డేంజర్‌ ఆఫ్‌ బీయింగ్‌ ఎ జెంటిల్మన్‌'' అంటూ రాసిన సుదీర్ఘ వ్యాసం ఆయనకి ఆ సమయంలో స్ఫురణకు వచ్చి ఉండదు. లేనట్లయితే హాస్యానికి సైతం తనను తాను జెంటిల్మన్‌గా అభివర్ణించుకునేవారు కాదనిపిస్తుంది. ''వృత్తి అను-లేదా ఉజ్జోగం మాత్రమే అను-ఇన్నాళ్లూ చేస్తూ వచ్చింది లెక్చరర్‌ జాబ్‌. అది డిమాండ్‌ చేసే ప్రపోర్షన్‌లో నేనెప్పుడూ జెంటిల్మన్షిప్‌ ప్రదర్శిస్తూనే వచ్చాను. ఇక కవి మోహన ప్రసాద్‌ గురించంటావా! వాడునిరంకుశుడు! వాణ్ని అదుపుచేసే ప్రవర్తనా నియమావళి ఏదీ పుట్టలేదు'' అన్నారాయన గలగలా నవ్వుతూ.

''అజంతా గారికి నేనంటే- నిష్కారణంగా- చచ్చేంత ప్రేమ'' అని అర 'మో' డ్పు కన్నులతో స్మరించుకున్నారు 'మో'. మెహ్‌ఫిల్‌లో ఇన్వాల్వ్‌ అయి వున్న ముగ్గురు నలుగురు మిత్రులు ఈ స్టేట్మెంట్‌కు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అందులోంచి 'నిష్కారణంగా' అనే మాట తీసేయాలని గట్టి పట్టు పట్టి మోహన్‌ ప్రసాద్‌ని ఒప్పించారు. ''ఎందుకో గానీ గురుడు నన్ను 'కింజల్కం' అని పిల్చేవాడు. అంటే ఏంటి గురుగారూ అని ఎప్పుడడిగినా 'అబ్బే ఏం లేదురా- దానికేం అర్థం లే'దని దాటేసేవాడు. ఆ తర్వాతెప్పుడో ఆయనే చెప్పాడు. పువ్వులో వుండే వెన్ను-కేసరం అని ఆ మాటకి అర్థం. అదీ మా గురుడు నాకిచ్చిన యోగ్యతాపత్రం'' అని వేగుంట అజంతాని జ్ఞాపకం చేసుకున్నారు.

''నిజానికి మా గురువు పైకి కనిపించేంత సింపుల్‌ పర్సన్‌ కాదు. ఆయన ప్రవర్తన అంతా నిజం కాదు. ఆయన అమాయక చక్రవర్తో, అన్నెం పున్నెం తెలియని వాడో ఎంత మాత్రం కాడు. అలాగే సంప్రదాయ సాహిత్యం చదవనివాడూ తెలియనివాడూ కానే కాడు. వందలాది పద్యాలు నాలిక చివర వుండేవి. క్లాసిక్స్‌ ఎప్పుడూ తిరగేస్తూ ఉండేవాడు. సంస్కృతంతో బాగా పరిచయం వుండేది. కానీ అవేవీ తెలియనట్టుండడం ఆయనకి ఇష్టం. అందుకే అలా 'బిహేవ్‌' చేసేవాడు తప్ప అది ఆయన సహజస్వభావం కాదు. ఇంటిమేట్‌ మొమెంట్స్‌లో-

ఏదో మాలాంటివాళ్ల దగ్గిర మాత్రమే- ఆయన విడ్డూరంగా ప్రవర్తించేవాడు. అదంతా ఓ వినోదం. మహానుభావుడు మా గురుడు'' అంటూ భక్తితో గుర్తు చేసుకున్నారు 'మో'. ''అజంతాగారి కవితలు కొన్నింటిని ఇంగ్లిష్‌లోకి అనువదించాన్నేను. ఇండియన్‌ లిటరేచర్‌లో ప్రచురణ కోసం పంపించాను. గురుడు బతికున్న రోజుల్లోనే వాటిని అచ్చు వేసి ఉంటే సంతోషించి వుండేవాడు. ఆయనకు ఆ అసంతృప్తి కడదాకా ఉండేది. ఆఎn్టా్రల్‌, మనిషిక్కావల్సింది చిటికెడు సంతృప్తే కదా!'' అని ఫిలసాఫికల్‌గా పేర్కొన్నారు వేగుంట.

''షేక్స్పియరేం పోటుగాడనుకుంటున్నారా? జీవితాంతం గ్యాలరీకి ప్లే చేశాడు తప్ప గొప్ప కవిత్వమేం రాశాడు? కీట్స్‌, షెల్లీ, మిల్టన్‌లతో పోల్చదగినవాడు కాదన్నది నా అభిప్రాయం. ఫ్యూడల్‌ థియేటర్‌ని సామాన్యుడి దిశగా మరల్చాడు కదా అంటుంటాడు చలసాని ప్రసాద్‌. అది నిజమే కావచ్చు. కానీ అంత మాత్రాన అతను గొప్ప కవి అయిపోడు'' అని జడ్జిమెంట్‌ జారీ చేశారు మోహన ప్రసాద్‌. ''ఇలా అన్నాననుకోకండేం- షేక్‌స్పియర్‌ రాసిన కొన్ని నాటకాలు మన ఆదివిష్ణు కాలక్షేపం కోసం రాశాడే-వాటిల్లాగే ఉంటాయి. ఇందులో ఒక్క అక్షరం కూడా అతిశయోక్తి లేదు- నమ్మండి!!'' అన్నారాయన. తన వాదాన్ని కొనసాగించబోయి, శ్రోతల మీద జాలి తల్చి, నాలుగు పద్యపాదాలు మాత్రం నాటకీయంగా పైకి చదివి విరమించారు.

''ప్రోజ్‌ విషయానికి వస్తే డాస్టవ్‌ స్కీని మించినవాడు ఈ భూప్రపంచంలోనే లేడంటాను నే''నన్నారు 'మో'. ఏదో సిగరెట్‌ వెలిగించుకునే సందర్భంగా 'కన్యాశుల్కం' డైలాగ్‌ ఒకటి (' పిల్లా! అగ్గిపుల్ల' ) వాడినా చాలామంది తెలుగు కవుల్లాగా వేగుంటకు తరచు ఆనాటకంలోనించి కోట్‌ చేసే అలవాటున్నట్టు లేదు.

మోహన్‌ ప్రసాద్‌ చాలా కొద్దిమంది తెలుగు కవుల పేర్లే ప్రస్తావించారు. ఇస్మాయిల్‌, త్రిపుర, చండీదాస్‌లను క్లుప్తంగా ప్రశంసించారు. సౌదా, సురేంద్రరాజులాంటి యువకుల (?) పేర్లెత్తారంతే. ఎదురుగా కూర్చున్నందుకు శిఖామణిని మాత్రం పదేపదే ముద్దు చేశారు. ఎప్పుడో 'ప్రజాతంత్ర'లో శ్రీశ్రీ 'అనంతం' రాసే రోజుల్లో దేవిప్రియను మహాకవి పెట్టిన పాట్లు జ్ఞాపకం చేసుకున్నారు. నగ్నముని పట్టుకెళ్లిన క్వార్టర్‌ పుచ్చుకున్న శ్రీశ్రీ ''మరి నీకో?'' అని గడుసుగా అడిగిన వైనం తెరలు తెరలుగా నవ్వుతూ పేర్కొన్నారు. అంతటితో 'కవిత్వం' గురించిన ప్రస్తావన కట్టి పెట్టేశారు.

''మనం బ్రిటిష్‌ దుకాణదారుల వలసపాలనలో కాకుండా ఏ ఫ్రెంచ్‌వాళ్ల ఆధిపత్యంలోనో, జెర్మన్ల పెత్తనంలోనో వుండివుంటే బ్రహ్మాండంగా వుండేదనిపిస్తుంది నా''కన్నారు మోహనప్రసాద్‌. ''ఫ్రెంచ్‌వాళ్ల ఏలుబడిలో వుంటే కళాసాంస్కృతికరంగాల్లో అద్భుతమయిన అభివృద్ధి సాధించి వుండేవాళ్లం. జెర్మన్‌ సామ్రాజ్యంలో భాగంగా వుంటే తాత్వికధార్మికాధ్యయన రంగాల్లో ఉన్నతప్రమాణాలు నెలకొల్పివుండేవాళ్లం. కిరాణాకొట్టు జాతి బ్రిటిష్‌జాతి పెత్తనం కింద రెండున్నర శతాబ్దాలు మగ్గిపోయి మంచి గుమస్తాల జాతిగా కూడా నిలవలేకపోయా''మని మో ఆవేదన ప్రకటించారు.

అదిసరే- ఎవరి ఏలుబడిలోనూ లేకుండా స్వతంత్రజాతిగా మిగిలి వుంటే ఎలా వుండేదన్న ప్రశ్నకు మోహనప్రసాద్‌ సీసా బద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పారు- ''అలా మిగిలి వుంటే పరమ దరిద్రంగా ఉండేది. నన్ను యాంటీ నేషనల్‌ అనుకుంటే అనుకోండి- మరేం ఫర్వాలేదు గానీ నా అభిప్రాయం అదే! అలాగే జరిగి వుంటే, అదిగో వాడున్నాడే- మన శిఖామణి- ఇవాళ ఇక్కడ మనతో కూర్చుని వుండేవాడే కాదు. గివ్‌ ద డెవిల్‌ ఇట్స్‌ డ్యూ అంటారు- బ్రిటిష్‌ పాలన వల్ల జరిగిన మంచేమిటో చెప్పుకోవలసిందే''నన్నారాయన.

''లార్డ్‌ మెకాలే- మన గుమస్తా చదువుల చట్రాన్ని తయారు చేసి పుణ్యం కట్టుకున్న మహానుభావుడు- బ్రిటిష్‌ ప్రభుత్వానికి సమర్పించిన 'మినిట్స్‌'లో మన సంప్రదాయ సాహిత్యం గురించి పరమనీచంగా రాశాడు. భారతీయ భాషలన్నింటిలోనూ ఉండే క్లాసిక్స్‌ను ఒక చోట చేరిస్తే వాటితో నా ఛాంబర్‌లోని ఒక కేబినెట్‌ కూడా నిండదన్నాడు మెకాలే. కానీ మ్యాక్స్‌మ్యులర్‌ ఈ పొగరుమోతు ప్రకటనను ఖండఖండాలుగా ఖండించాడు. భారతీయ భాషల్లోని క్లాసిక్స్‌తో ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాలనూ నింపేయవచ్చన్నాడు మ్యాక్స్‌మ్యులర్‌. మన గురించి జెర్మన్లకున్న అవగాహన అదీ!'' అన్నారు వేగుంట. ''ఆ జాతి పాలనలో ఉండి వుంటే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది వుండేవాళ్లం'' అనుకుని అలా జరగనందుకు విచారపడ్డారు.

''బ్రిటిష్‌ పాలన ప్రభావమే అను- ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిణామాల ఫలితమే అను- మన దేశంలో కులం నెమ్మదిగా వినిర్మితమవుతూ వస్తోంది. అంటే డీకన్‌స్ట్రక్ట్‌ అవుతోందన్న మాట! అలాంటప్పుడు, ఇప్పుడు కుల ప్రాతిపదికపై సాంస్కృతిక సామాజిక రాజకీయ ఉద్యమాలు ప్రతిపాదించడంలో అర్థమేమిటి? అర్థిక రంగం కథ వేరు- అక్కడ కులం ప్రమేయం మరికొంత కాలం అవసరమేనని నా వ్యక్తిగత అభిప్రాయం'' అన్నారు వేగుంట. కుల, మత, ప్రాంతీయ దురభిమానాలపై ఆధారపడి వుండే ఏ ఉద్యమాన్నీ తాను సమర్థించనని ఆయన స్పష్టం చేశారు.

''అలాగని వాళ్లతో నాకేం వైరం లేదు. నా దృష్టిలో వాళ్లు దారి తప్పిన సోదరులు'' అని ఆయన వివరించారు.''ఎవడు ఏ కులంలో పుట్టినా అది కేవలం యాక్సిడెంటల్‌- మన చేతిలో ఉందా మనం ఏ అబ్బాఅమ్మకు పుట్టాలో ఎంచుకోవడం? పైపెచ్చు ఈ కులాలు మతాలు ఎప్పుడూ కలగలిసి పోలేదా? మహానదుల్లో ఎన్ని పంట కాలవలూ మురుక్కాలవలూ వచ్చి కలిసి పోతాయో ఎవరికి తెలుసు? అంత మన నమ్మకం! నేను ఫలానా కులస్థుడిని అనుకుంటాం-అంతవరకే! అది నిజమని వాదించడం వృధా. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కులాల మీద ఆధారపడి చేసే సిద్ధాంత ప్రతిపాదనలకు అర్థమేమిటి?'' అని వేగుంట ప్రశ్నించారు.

హైదరాబాద్‌ సాహిత్యవలయాల్లో సుళ్లు తిరిగే అనేక కథనాల్లో వేగుంట వాగ్ధోరణికి సంబంధించినవి చాలా వున్నాయి. ఆయన్ను మౌలికంగా 'అండర్‌వేర్‌ వరల్డ్‌ డాన్‌'గా (మాటలవరకు) అభివర్ణించడం కద్దు. కానీ కారణమేమిటో తెలియదు గానీ ఆయనతో నేను కూర్చున్న ఆ నాలుగ్గంటల్లో మోహనప్రసాద్‌ ఒక్క బూతు ముక్క కూడా ప్రయోగించలేదు. ''మనవణ్నత్తిన తర్వాత నిలువెల్లా గాంభీర్యం వచ్చేసిం''దన్నారాయన నవ్వుతూ. అదే నిజమయితే అందుకు ఆ మనవణ్ని అభినందించాల్సిందే మరి!

-మందలపర్తి కిశోర్‌

నీ పాటల్‌!
నీ బాటల్‌!!
నీ బాటిల్‌!!!

మహన్మమహతీ సునాదాలో
రహస్తంత్రీ వినాదాలో
జగత్కంత్రీ నినాదాలో
కవీ నీ పాటల్‌!

కంటకావృత కాననాలో
మంట చిక్కిన మంటపాలో
మింట సాగే పుంతపాలో
కవీ నీ బాటల్‌!!

శోధనామృత శీధు పాత్రో
బోధనా వ్యయస్వాదు మాత్రో
వేదనాద్భుత 'తీర్థ'యాత్రో
కవీ నీ బాటిల్‌!!!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X