సీరియస్‌పాఠకులున్నారు: నవీన్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

నవీన్‌ తొలి నవల 'అంపశయ్య'. ఆ నవలే పేరే ఆయన ఇంటి పేరుగా మారి అంపశయ్య నవీన్‌ అయ్యారు. ఆయన పలు నవలలు, కథలు రాశారు. ఆయనను కాలువ మల్లయ్య ఇంటర్వ్యూ చేశారు.

తెలంగాణ కథ అంటే ఏమిటి?
ఈనాడు సాహిత్యంలో స్థానీయతా స్పృహ చోటు చేసుకుంటున్నది. ఒక ప్రాంతపు ప్రత్యేక సంస్కృతిని, ప్రత్యేక సమస్యల్నీ, ప్రత్యేక పలుకుబళ్లను కథల్లోనూ, నవలల్లోనూ మలచడానికి ఆయా ప్రాంతాల రచయితలు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి మొదట్నుంచీ కొన్ని ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక లక్షణాలున్నాయి. తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషక్కూడా కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇట్లా తెలంగాణ ప్రాంతపు ప్రత్యేకతల్ని చిత్రిస్తూ రచించబడే కథల్ని తెలంగాణ కథలనవచ్చు. అయితే సాహిత్యం విశ్వజనీనంగా ఉండాలి. ఒక ప్రాంతపు ప్రత్యేక ఉనికిని తన రచనల్లో ఆవిష్కరిస్తూనే దాన్ని అన్ని ప్రాంతాలవారికీ అన్వయించేలా మలచడంలోనే ఒక రచయిత గొప్పదనం వ్యక్తమవుతుంది.

మలితరంలో తెలంగాణ నుంచి మాండలిక కథలెక్కువగా రాలేదు. ఎందుకు?
మలితరం అనడంలో మీ ఉద్దేశం మాతరంవాళ్లని అనుకుంటాను. అరవైలలో మా తరం వాళ్లం కథలు రాసే రోజుల్లో తెలంగాణ మాండలికాలను పాత్రోచితంగా వాడినా అప్పటి పత్రికలు ఆ కథల్ని ప్రచురించేవి కావు. అరవైలలోనే దాశరథి రంగాచార్య 'చిల్లరదేవుళ్లు' నవలలో తెలంగాణ మాండలికాన్ని పాత్రోచితంగా వాడటంతో మాకు చాలా ధైర్యం కలిగింది. అయితే ఎనభైల వరకు తెలంగాణ నుంచి మాండలిక కథలు అనబడే కథలు ఎక్కువగా రాని మాట నిజమే. అందుకు ప్రధాన కారణం - ఆనాటి మెయిన్‌ స్ట్రీమ్‌ మాగజిన్స్‌ మాండలిక కథల్ని ప్రచురించకపోవడమే.

చైతన్య స్రవంతి కథనం తెలుగు కథల్లోకి ఎప్పుడు వచ్చింది? తెలంగాణలో చైతన్య స్రవంతి గురించి చెబుతారా?
శ్రీశ్రీ నలబైలలో రాసిన " ఒసే.. తువ్వాలందుకో!'', "కోనేటి రావు'' అనే ఈ రెండు కథల్ని తెలుగులో వెలువడిన మొట్టమొదటి చైతన్య స్రవంతి కథలని చెబుతారు. ఆ రోజుల్లోనే మల్లాది రామకృష్ణశాస్త్రి కూడా ఒకటి రెండు చైతన్య స్రవంతి కథల్ని రచించాడు. ఆ తర్వాత బుచ్చిబాబు యాభైలలో "చైతన్య స్రవంతి'' అనే పేరుతోటే ఆ శిల్పలక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న కథను రచించాడు. నేను పందొమ్మిది వందల అరవై నాలుగులో "అధోలోకం'' అనే కథ రాశాను. బహుశా ఈ కథను తెలంగాణ నుండి వెలువడిన మొట్టమొదటి చైతన్యస్రవంతి కథగా చెప్పవచ్చుననుకుంటాను. ఆ తర్వాత నేనీ శిల్పంలో మరికొన్ని కథల్ని రాశాను. ఇటీవలి కాలంలో అంటే తొంబైలలో ఆడెపు లక్ష్మీపతి, కాలువ మల్లయ్యాంటి తెలంగాణ కథకులు ఈ శిల్పంలో మంచి కథలు రాశారు.

తెలంగాణ దళిత కథ గురించి మీరేం చెబుతారు?
అట్టడుగు వర్గాలకు చెందినవాళ్ల జీవితాలను చిత్రించే కథల్ని దళిత కథలనవచ్చు. తెలంగాణ నుంచి ఇవ్వాళ్ల దళిత కథలు గణనీయంగానే వెలువడుతున్నాయి. బోయ జంగయ్య, బి.యస్‌. రాములు, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడి, పెద్దింటి అశోక్‌కుమార్‌, జాతశ్రీ, కె.వి. నరేందర్‌ లాంటి ఎందరోకథకులు దళితుల సమస్యల్ని చిత్రిస్తూ మంచి కథలు రాస్తున్నారు.

మీ తరంలోనూ, ఈ తరంలోనూ తెలంగాణ కథా పాఠకుల గురించి మీరేమంటారు?
మేం కథలు రాస్తున్న రోజుల్లో - అంటే అరవైలలో తెలంగాణలో కథా పాఠకుల సంఖ్య చాలా తక్కువగానే వుండేది. కానీ క్రమంగా ఈ ప్రాంతంలో కూడా కథా పాఠకుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా డెబ్బైలలో, ఎనభైలలో తెలంగాణలో కథా పాఠకుల సంఖ్య పెరిగింది. మళ్లీ తొంబైలలో టీవీ చానళ్లు మధ్య తరగతి కుటుంబాల్లో ప్రవేశించడంతో కథా పాఠకుల సంఖ్య తగ్గింది. అయితే సీరియస్‌ పాఠకుల సంఖ్య మాత్రం యధాతథంగానే వుంది. ఈ సీరియస్‌ పాఠకులే ఇవ్వాళ్ల వెలువడుతున్న కథల్ని, నవలల్ని చదువుతున్నారు. వాటిల్లోని మంచిచెడుల్ని చర్చిస్తున్నారు.

మీరు కథలు రాయడానికి ప్రేరణ ఏమిటి?
చాలా చిన్న వయస్సులోనే - పందొమ్మిది వందల యాబై రెండులో నేను నాల్గో తరగతి చదువుతున్నప్పుడే - నాకు కథళు రాయాలనిపించింది. ఆ రోజుల్లోనే ఓ జానపద కథ రాసి 'చందమామ'కు పంపించాను. హృదయాన్ని కదిలించే ఏ సంఘటనను చూసినా, విన్నా నేను తీవ్రంగా స్పందించేవాడిని. నా స్పందనను నా చుట్టూ వున్నవాళ్లతో పంచుకోవాలని ఆరాటపడేవాడిని. నాలో సహజంగా చోటు చేసుకున్న ఈ రెండు లక్షణాలే నాలో కథలు రాయాలన్న ప్రేరణకు కారణాలయ్యాయి. నేను ఇప్పటి వరకు రాసిన అరవై కథల్లో ఏ కథను కూడా నేను పూర్తిగా కల్పించి రాయలేదు. యథార్థ జీవితంలో నాకు ఎదురైన అనేక మంది వ్యక్తుల, సంఘటనల ఆధారంగానే నేను కథలు రాశాను.

వివిధ తెలంగాణ సాహిత్యోద్యమాలు కథపై చూపిన ప్రభావం ఏమిటి?
నలబైలలో సంభవించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆధారంగా కొన్ని కథలు రచించబడ్డాయి. పందొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సంభవించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంగా కూడా కొన్న కథలు వెలువడ్డాయి. అలాగే నక్సలైట్‌ ఉద్యమం నేపథ్యంగా కూడా కొన్ని కథలు వచ్చాయి. మళ్లీ ఇవాల్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కారణంగా తెలంగాణ కథకుల్లో స్థానీయతా స్పృహ పెరిగింది. ఇవ్వాళ్ల వెలుడుతున్న తెలంగాణ కథల్లో తెలంగాణ మాండలికం విరివిగా చోటు చేసుకోవడానికి స్థానీయతా స్పృహే కారణం.

కథల్లో మాండలిక ప్రయోగం గురించి మీరేమంటారు?

కథల్లో మాండలిక ప్రయోగం సంభాషణల వరకే పరిమితం కావాలన్నది నా దృఢమైన అభిప్రాయం. పాత్రలు నివసిస్తున్న ప్రాంతాల్లో సామజిక, సాంస్కృతిక వాతావరణాన్ని కథల్లోకి తీసుకురావడానికి సంభాషణల్లో ఆ ప్రాంతపు మాండలికాల్ని వాడుకోవాలి. అంతేగాని కథనంతా మాండలికంలో చెప్పాలనే వాదంతో నేను ఏకీభవించలేను. సాహిత్యాన్ని అన్ని ప్రాంతాలవాళ్లు ఆస్వాదించాలని రచయిత ఆశిస్తాడు. ఆ ప్రయోజనం నెరవేరాలంటే కథనాన్ని అన్ని ప్రాంతాలవాళ్లకూ అర్థమయ్యే భాషలోనే సాగించాలి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి