వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-1

By Staff
|
Google Oneindia TeluguNews

చిమ్మ చీకటి. మెల్లగా అడుగులు వేస్తున్నాడు. వెనకెవరిదో అడుగుల చప్పుడు. దాంతో అతను వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు నడుస్తున్నాడు. మాటి మాటికీ అడుగుల చప్పుడు వినిపించడం, వెనక్కి తిరిగి చూడడం, తనదంతా భ్రమేనని అనుకుని ముందుకు సాగడం భయంకరంగా తోచిందతనికి. దారి తెగడం లేదు. అనంతాగు దగ్గర పడుతున్న కొద్దీ అతని గుండె వేగం పెరుగుతోంది. ఈ వాగు దాటితే దయ్యాల బెడద తప్పుతుందని అనుకున్నాడు. గుండె దిటవు చేసుకుని ముందుకు సాగుతున్నాడు.

కళ్లు చిట్టించి చూశాడు. ఎదురుగా చీకటి ఆకాశం మీంచి భూమికి దిగుతోంది. చీకటి చుక్కలు చుక్కలుగా పరుచుకుంటోంది. అకస్మాత్తుగా ఎదురుగా పెద్ద మంట కనిపించింది. భయమేసింది. ఎవరో కల్లం దగ్గర మంట పెట్టుకున్నట్లున్నారని అనుకున్నాడు. కానీ భయం వీడలేదు. గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. నడుస్తూనే ఉన్నాడు. కానీ ఊరు రావడం లేదు. ఇలా బయలుదేరాల్సింది కాదు, బాయి దగ్గరే పడుకుంటే బాగుండేదనుకున్నాడతను. అలా అనుకోవడం అది ఏ వందో సారో.

పదిహేనేళ్ల రాంరెడ్డి అదే వూరిలో పదో తరగతి చదువుతున్నాడు. బడిలో చదువుతూ వ్యవసాయం పనులు కూడా చేస్తాడు. కల్లం దగ్గర కావలి వుండుమని, తాను పొద్దున్నే చాయ్‌ తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిపోయింది అమ్మ. బాపు వచ్చి- ''నేను కావలి వుంట గని నువ్వు ఇంటికి పో'' అంటే బయలుదేరాడు.

ఆలోచిస్తూ నడుస్తున్న రాంరెడ్డి కొద్ది సేపు భయాన్ని దూరం చేసుకున్నాడు. ఆలోచనలో ముళ్ల కంప మీద కాళ్లు పెట్టాడు. జాగ్రత్తగా ముళ్ల నుంచి బయట పడ్డాడు. మోకాళ్ల వరకు ముల్లు గీరుకుపోవడంతో మంట పెడుతున్నాయి. ఎదురుగా కాగడా అలాగే మండుతోంది. ఒక్కసారి ఒళ్లు జలదరించింది. గుండెను చిక్కబట్టుకుని అడుగులు ముందుకేశాడు. సరైనా దారి వెంట నడుస్తున్నానా లేదా అని పరికించి చూశాడు. తాను దారి తప్పలేదని నిర్ధారించుకున్నాడు.

అలా కొంత దూరం నడిచాడో లేదో కుడి కాలు పట్టింది. తమాయించుకునే లోపే బొందలో పడిపోయాడు. శరీరమంతా ముల్లు గుచ్చుకున్నాయి. లేవడానికి ప్రయత్నించాడు. అది ఎంత లోతు వుందో తెలియడం లేదు. మెల్లగా లేచి నిలబడ్డాడు. చిమ్మ చీకటి. ఏమీ కనిపించడం లేదు. గుడ్డివాడిలా రెండు చేతులు ముందుకు చాపి దరి కోసం వెతకసాగాడు. ఎంతకీ దరి చేతులకు తాకడం లేదు.

ఎంత సేపు అలా ప్రయత్నించాడో తెలియదు. అలసి పోయి, కూలబడ్డాడు. కళ్లు మూతలు పడుతున్నాయి. తన ప్రమేయం లేకుండా నిద్ర పట్టేసింది. కళ్లు తెరిచే సరికి మసక మసక వెలుతురు. తానెక్కడుందీ అర్థం కాలేదు కొద్దిసేపు. అర్థమయ్యే సరికి చుట్టూ తుపాకులు తన వైపు గురి పెట్టి పోలీసులు పాకుంటూ రావడం కనిపించింది. వెన్నులో చలి పుట్టింది. పారిపోదామనుకున్నాడు.

రాత్రి తాను తమ బొంద పొలంలోనే పడ్డానని అర్థమైంది. అంటే, తాను ఊరు బాట పట్టలేదన్న మాట. కొరివి దయ్యం దారి తప్పించిందా అని ప్రశ్నించుకున్నాడు. తమ పొలంలోని చివరి మడి లోతుగా వుంటుంది. దాన్ని బొంద పొలం అంటారు. నీరు ఎక్కువైతే దాని నుంచి బయటకు వదలడానికి పెద్ద కాలువ కూడా వుంది. ఆ కాలువ కంచెలోకి వెళ్తుంది. కాలువకు ఇరు పక్కలా గుబురుగా పొదలు. పోలీసుల కళ్లు కప్పి ఆ కాలువ నుంచి పారిపోవచ్చు.

అదే అనుకుని చప్పుడు కాకుండా పాకడం మొదలు పెట్టాడు. పాకుతూనే వున్నాడు. కానీ అక్కడి నుంచి అంగుళం కూడా కదలడం లేదు. పోలీసులేమో దగ్గరి దగ్గరికి వచ్చేస్తున్నారు. వారు అతనికి స్పష్టంగా కనిపిస్తున్నారు. వారికి కూడా తాను కనిపిస్తున్నట్లు రాంరెడ్డికి తెలుస్తూనే వుంది. తన మరణం తథ్యమని అనిపించింది.

తాను చేసిన నేరమేమిటో, పోలీసులెందుకు తనను చంపాలనుకుంటున్నారో అతనికి అర్థం కాలేదు. అయినా, తాను రాత్రి ఎందుకు ఇంటికని బయలుదేరాడు. ఏనాడో చనిపోయిన బాపు తన దగ్గరకు వచ్చి కావలి వుంటానని చెప్తే ఎలా నమ్మాడు తను.

బాపు రావడం తాను ఊళ్లోకి బయలు దేరడం కలా, నిజామా అర్థం కావడం లేదతనికి. అదో భ్రమ మాత్రమే. మరి, కల్లం దగ్గర పడుకున్న తాను ఇక్కడికెలా వచ్చాడు. చీకట్లు తొలుగుతున్నాయి. పోలీసులు మరింత దగ్గరగా వచ్చారు. ఒక పోలీసు తనకు సూటిగా గురి పెట్టి పేల్చడానికి సిద్ధంగా వున్నాడు.

తన చావు ఖాయమని అనుకున్నాడు. పెద్దగా అరిచాడు. ఆ అరుపు కూడా గొంతు దాటి బయటకు రావడం లేదు. తన మొర ఎలాగూ బయటకు వినిపించే అవకాశం లేదు. తను పోలీసులకు తప్ప మరెవరికీ కనిపించడం లేదు. చుట్టుముట్టిన పోలీసులంతా మాయమయ్యారు. ఒకే ఒక పోలీసు తన గుండెలకు తుపాకిని గురి పెట్టి వికృతంగా నవ్వుతున్నాడు. అతని నవ్వు తనకు వినిపించడం లేదు. కానీ నవ్వుతున్నాడు. అతను మీట నొక్కబోతున్నాడంతే కెవ్వున కేక వేశాడతను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X