పార్ట్-29

Posted By:
Subscribe to Oneindia Telugu

శివుడికి రాంరెడ్డి మాటల మీద నమ్మకం కుదరలేదు. తానే ఒక జనప్రభంజనమనేది అతని విశ్వాసం.

శివుడి మనస్సు మార్చలేకపోయినందుకు రాంరెడ్డికి పెద్ద చింతేమీ లేదు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లాడు. అసెంబ్లీ కవరేజ్‌ ఒక పెద్ద బోర్‌. అయినా భరించక తప్పదు. ఎప్పుడో కానీ అర్థవంతంగా చర్చలు జరగవు. పాత తరం నాయకులు కొందరు విలువైన ప్రసంగాలు చేసేవారని సీనియర్‌ జర్నలిస్టులు అంటూ వుంటారు. కానీ తాను జర్నలిజంలోకి వచ్చేసరికి వారెవరూ లేరు.

ఇవాళ్ల కచ్చితంగా అసెంబ్లీలో గొడవ జరుగుతుందనేది తెలుసు. తాను రాసిన వార్త మీదే గొడవ జరగడానికి అవకాశం ఉంది. అది కొంత అతనికి ఉత్సాహకరమైన విషయం.

సారా ఉద్యమం వెల్లువలా సాగుతోంది. సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగి ప్రాంతీయ పార్టీ పెట్టి రెండు సార్లు ఘన విజయం సాధించిన నాయకుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఎన్నికల్లో ప్రజలు కొన్ని సార్లు తెలివి, ఇంగితాన్ని ప్రదర్శిస్తారనేది ఆ ప్రాంతీయ పార్టీ ఓటమి నిదర్శనం. అంతేకాదు, మహామహుడు అనిపించుకున్న ఆ నాయకుడు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక నియోజకవర్గంలో ఓడిపోయాడు. రాష్ట్రంలో ఇదో పెద్ద సంచలనం.

ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్న కొన్నాళ్లకు సారా వ్యతిరేకోద్యమం రాష్ట్రంలో ఉప్పెనలా ఎగిసిపడింది. రాష్ట్రంలోని మహిళలు రోడ్ల మీదికి వచ్చి మద్యపానాన్ని నిషేధించాలని పెద్ద యెత్తున ఆందోళన చేపట్టారు. ఈ మధ్య కాలంలో ఇంత మహత్తరమైన ఉద్యమం జరగలేదు. ఈ ఉద్యమానికి ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీ మద్దతు తెలుపుతోంది. ప్రతిపక్ష నాయకుడు, సినీనటుడు ఈ ఉద్యమానికి అండగా నిలిచాడు.

ఆలోచనలతో అసెంబ్లీ ఆవరణలోకి చేరుకున్నాడు రాంరెడ్డి. లాబీలోకి అడుగు పెట్టగానే కృష్ణ కనిపించాడు. కృష్ణ మొదట తెలుగు పత్రికల్లో పని చేసి ఆ తర్వాత ఇంగ్లీషులోకి మారాడు. అయినా రాట్‌నెస్‌ పోలేదు. రాంరెడ్డిని చూడగానే ''హాయ్‌! రామ్‌!'' అని పలకరించాడు.

కృష్ణను చూస్తే ఒక ఊరట. అతని దగ్గరుంటే సమస్యలేవీ రాంరెడ్డిని చుట్టుముట్టవు. అంతగా అతను ఎంగేజ్‌ చేస్తాడు. ఇద్దరికి మధ్య మంచి స్నేహం ఉంది. వ్యక్తిగత విషయాల దగ్గరి నుంచి అమెరికా రాజకీయాల వరకు, విప్లవవాదం నుంచి సామ్రాజ్యవాదం వరకు ఇరవురి మధ్య చర్చలు జరుగుతాయి. అవన్నీ సరదాగానే జరుగుతాయి. కానీ వారిద్దరు అన్ని విషయాల గురించి చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారనేది ఆ చర్చలను బట్టి అర్థమవుతుంది.

ఇద్దరూ లాబీలోంచి ప్రెస్‌ గ్యాలరీలోకి వెళ్లడానికి బయటకు నడుస్తుండా ఎక్సైజ్‌ మినిస్టర్‌ ఎదురయ్యాడు. వీరిద్దరినీ చూసి పలకరించాడు. వారు ఆగిపోయారు. రాంరెడ్డిని చూసి ''థాంక్యూ'' అన్నాడు. ''థ్యాంక్సెందుకు?'' అని ఆశ్యర్యం వ్యక్తం చేశాడు రాంరెడ్డి.

''మాకో ఆయుధమిచ్చారు ఇవ్వాళ్ల'' అని నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇద్దరూ తిరిగి నడక ప్రారంభించారు. ''ఆ స్టోరీ రాయడానికి నేనేం పెద్దగా కష్టపడలేదు'' అన్నాడు రాంరెడ్డి కృష్ణతో. ''ఆ నటుడు బై చాన్స్‌ నాయకుడు, సిఎం అయ్యాడే తప్ప గ్లామర్‌ వరల్డ్‌ అతన్ని వదిలిపెట్టలేదు'' అన్నాడు కృష్ణ. ''అతని సినిమాలు ఎగబడి చూసేవాళ్లం తెలుసా?'' అన్నాడు రాంరెడ్డి. ''మాస్‌ హీరో అతను'' అన్నాడు కృష్ణ.

''ఆ గ్లామర్‌ను వదులుకోలేకనే కావచ్చు మళ్లీ సినిమాలు తీస్తున్నాడు'' అన్నాడు రాంరెడ్డి. ''ప్రతిపక్ష నాయకుడికి పనేం ఉంటుంది. పైగా అతనికి ఈ ప్రపంచం పట్టదు. తాను బిజీగా వుండాలి. ఒంటరిగా ఉండడం అతని వల్ల కాదు. చుట్టూ చప్పట్లు కొట్టేవాళ్లుండాలి. ప్రతిపక్ష నాయకుడైన తర్వాత అప్పటి లాగా జనం ఆయన దగ్గరికి వస్తారు. దాన్ని తట్టుకోలేక పని కల్పించుకున్నట్లున్నాడు'' అన్నాడు కృష్ణ.

''అపెంబ్లీ నడుస్తున్నది కాబట్టి షెడ్యూల్స్‌ మార్చుకోవాల్సింది. అంతకు ముందు ఎన్నిసార్లు అసెంబ్లీని సమావేశ పరచాలని అతను ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది ఉటంకిస్తూ ఆయన ఇప్పుడేం చేస్తున్నాడని రాశానంతే'' వివరించాడు.

''ఆ సినిమా కథ కూడా కొంత రాశావే. ఇప్పుడు చిత్రీకరించే దృశ్యాల గురించి కూడా రాశావు. మెటీరియల్‌ ఎలా వచ్చింది?'' రాంరెడ్డి నవ్వి ఊరుకున్నాడు. తాను రాసిన వార్త మీద చర్చ జరగడం, దానిపైన ఇవ్వాళ్ల అసెంబ్లీలో చర్చ జరుగుతుందని తెలియడం రాంరెడ్డి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి