'కిటికీ పిట్ట'కు ఇస్మాయిల్ అవార్డు
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు పి. మోహన్ కవితా సంకలనం 'కిటికీ పిట్ట' ఎంపికైనట్లు తమ్మినేని యదుకుల భూషణ్ (న్యూయార్క్ ) చెప్పారు. నవంబర్ 24వ తేదీన హైదరాబాదులో జరిగే ఇస్మాయిల్ సంస్మరణ సభలో ఈ అవార్డును బహూకరిస్తారు. కవిత్వంలో నిజాయితీ, అద్భుతమైన ఊహాశాలీనత, భావగతులను ఘనీభవింపజేసే భాషాశక్తి మోహన్ ను నేటి కవుల నుంచి ఎడంగా నిలబెడతాయని యదుకుల భూషణ్ వ్యాఖ్యానించారు. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్ కుమార్ లకు ఈ అవార్డు లభించింది.
వేంకటేశ్వర శాస్త్రికి బ్రౌన్ పురస్కారం
జె.పి. గ్విన్ నిఘంటు నిర్మాణంలో పాలు పంచుకుని సహ సంపాదకత్వం నెరిపినందుకు గాను జొన్నలగడ్డ వేంకటేశ్వరశాస్త్రికి ఈ ఏడాది బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు భూషణ్ తెలిపారు. లండన్ యూనివర్శిటీ నుంచి పిహెచ్.డి పట్టభద్రులు ఆయన. అనువాదం, నిఘంటు నిర్మాణాల్లో అవిరళ కృషి, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిశోధన ఆయన ప్రతిభలు. మలయాళ భాష నుంచి అనువాదాలు చేశారు. భాషేతరులకు తెలుగు బోధన కోసం వాచకాలు తయారు చేశారు. నిరుడు ఈ అవార్డు ఉత్తమ అనువాదానికి గాను డి. కేశవరావుకు లభించింది. ఈ నెల 24వ తేదీన జరిగే ఇస్మాయిల్ సంస్మరణ సభలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.












Click it and Unblock the Notifications