సాహిత్యంలో వైయస్సార్ మృతి ప్రకంపనలు

వేణుగోపాల్ మావో ఆలోచనా విధానాన్ని విశ్వసించే విరసంలో సభ్యుడిగా కొనసాగుతూ వర్గ రాజకీయాల ప్రాధాన్యంపై పుస్తకాలు రాశారు. ప్రసంగాలు చేశారు. రచయితలకు విప్లవ రాజకీయ నిబద్ధత ఉండాలనేది ఆయన రచనల్లోని, ప్రసంగాల్లోని ప్రధాన సారాంశం. నిజానికి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఆయన పలు వ్యాసాలు రాశారు. నక్సలైట్ల ఎన్ కౌంటర్లను ఖండిస్తూ పాలక వర్దాలను దూషించారు. అయితే, నివాళులర్పిస్తూ రాసిన వ్యాసంలో వేణుగోపాల్ వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించారని గట్టిగానే చెప్పవచ్చు. ఈ సమయంలో ఆయన తన నిబద్ధత పరిధులు దాటి వ్యవహరించారు. తటస్థ పాత్రను కూడా పోషించలేకపోయారు. జర్నలిస్టుగా వైయస్ తో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ నివాళి అర్పించానని వేణుగోపాల్ చెప్పుకున్నారు.
నిజానికి, జర్నలిస్టులకు రాజకీయ నేతలతో సాన్నిహిత్యం కొత్తదేమీ కాదు, అసాధారణమైందేమీ కాదు. చాలా మంది రాజకీయ నాయకులు జర్నలిస్టుల భుజం మీద భుజం వేసి సాన్నిహిత్యాన్ని ప్రకటిస్తారు. కరచాలనాలు కూడా చేస్తారు. చాలా మంది ప్రముఖులకు కూడా లభించని సాన్నిహిత్యం చాలా మంది రాజకీయ వార్తాకథనాలు రాసే జర్నలిస్టులకు ఉంటుంది. పొలిటిల్ రిపోర్టర్లకు అవన్నీ మామూలే. నిబద్ధత గల జర్నలిస్టు తటస్థ వైఖరి అవలంబిస్తూ వాస్తవాలను తన వార్తాకథనాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. పరిణామాల మంచీ చెడుల గురించి కూడా వార్తాకథనంలో ప్రస్తావించడు. పరిణామాలను, వాటి భవిష్యత్తు ఫలితాలను వివరించే ప్రయత్నం చేస్తాడు. రాజకీయ నేతలపై వ్యాసాలు రాసే విషయంలో ఆ రాజకీయ నేత వ్యవహార శైలిని, విధానాలను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రముఖ రాజకీయ నేత వ్యక్తిత్వాన్ని వివరించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే వార్తాకథనాలు కాకుండా ప్రత్యేక వ్యాసాలు రాసే సమయంలో ఏదైనా ఒక రాజకీయ నేత గురించి రాయాల్సి వచ్చినప్పుడు తనకు ఆయనతో ఉన్నసాన్నిహిత్యాన్ని కూడా రాయవచ్చు. ఆయనలోని మంచిని కూడా ప్రశంసించవచ్చు. కానీ వేణుగోపాల్ లాంటి విప్లవ రాజకీయాల పట్ట నిబద్ధత గల సాహిత్యకారుడు ఆ పని చేయడమే ఇక్కడ పెద్ద సమస్యను సృష్టించింది. ఆయన ఆచరణను ప్రశ్నార్థకం చేసింది. పార్లమెంటరీ రాజకీయాలపై, ఆ రాజకీయాలను నడిపే నేతలపై అభిప్రాయాలను వెల్లడించే విషయంలో సంయమనం, తటస్థత పాటించాల్సి ఉంటుంది. వేణుగోపాల్ వ్యాసంలో ఆ తటస్థే లోపించింది. తర్వాత క్షమాపణలు చెబుతూ రాసిన వ్యాసంలో కూడా ఆ తటస్థ కనిపించలేదు.
అసలు తెలుగు సాహిత్యంలో నిబద్ధత పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఆచరణకు, విశ్వాసానికి సంబంధం లేని చర్యలు చాలా కనిపిస్తాయి. చెప్పింది ఆచరించే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అదే నేటి తెలుగు సాహిత్య సమస్యగా మారింది.












Click it and Unblock the Notifications