• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అస్తిత్వ చింతన 'కుంపటి'

By Pratap
|

Banala Srinivas
నల్లగొండ జిల్లా సూర్యాపేట నాకు చాలా ఆలస్యంగా పరిచయమైంది. అక్కడి నుంచి వచ్చిన నా తోటివారిని చూస్తుంటే నాకు కొంత ఆశ్చర్యంగానూ, కొంత వింతగానూ అనిపించేది. వారంతా తమ ఉనికిని ప్రకటించుకునే తీరు అద్బుతంగానూ, ఆసక్తికరంగానూ వుండేది. కొత్తవాళ్ల ముందు కూడా అక్కడ లేని తమ సూర్యాపేట మిత్రుల గురించి వారికి కూడా అంతా తెలుసన్నట్లుగా మాట్లాడేవారు. అంతగా తమ ఉనికిని, అస్తిత్వాన్ని వారు ప్రకటించుకునేవారు. ఇది కొత్తలో నాకు కొంచెం విచిత్రంగా అనిపించేది. తర్వాత్తర్వాత నాకు అలవాటైపోవడమే కాకుండా దాదాపుగా వారంతా ముఖపరిచయం లేకున్నా నాకు పరిచయమైపోయారు. అటువంటి సూర్యాపేట నుంచి వచ్చిన కవి బాణాల శ్రీనివాసరావు. నిజానికి సూర్యాపేట పోరాటాల గడ్డ అటువంటి ప్రాంతం నుంచి బాణాల శ్రీనివాసరావు వంటి కవి రావడం ఒక రకంగా విచిత్రంగానే అనిపిస్తుంది. అయితే పోరాటాల్లోనూ వ్యక్తిగత, సామూహిక అస్తిత్వ అన్వేషణ ఇమిడే వుంటుంది. ఆ అస్తిత్వ వేదన నుంచి బాణాల శ్రీనివాసరావు దూరం కాలేదు. అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్న నేపథ్యంలో ఆయన 'కుంపటి' కవిత వెలువడింది. ఇది ఆయన ఆత్మప్రకటన. గ్రామీణ వ్యవస్థలో తన కుటుంబ అస్తిత్వాన్ని తెలియజేయడంలో భాగంగా తన అస్తిత్వాన్ని కూడా ఆయన ఈ కవితలో ప్రకటించారు.

జూలూరు గౌరీశంకర్‌, ప్రసేన్‌లు వెలువరించి 'వెంటాడే కలాలు' కవితా సంకలనం నిజానికి చాలా విశిష్టమైంది. ఇందులో వెనకబడిన తరగతుల నుంచి కవుల ఆత్మకథనాత్మక కవితలు చోటు చేసుకున్నాయి. ఆ కవితలను చదువుతుంటే భారత సమాజ నిర్మాణం, దాని కదలిక, మానవ మనుగడ మూలాధారాలు అర్థం కావడమే కాకుండా ఆయా కులాల అస్తిత్వ వేదనలు, బయటి ప్రపంచానికి తెలియని నూతన విశేషాలు తెలిసివస్తాయి. అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా బిసిల అస్తిత్వాన్ని పోత పోసిన కవితా సంకలనం ఇది. అయితే దాని ముందుమాట ఆ సంకలనం విలువను గుర్తించడానికి ఆటంకంగా మారింది. దాన్ని దాటి లోపలికి ప్రవేశించడం కాస్తా మనసుకు ఇబ్బందిగా వుంటుంది. కానీ దాన్ని దాటేసి కవితల్లోకి ప్రవేశిస్తే ఆ ముందుమాట మన నుంచి దూరమవుతూ మరుగున పడిపోతుంది. ఆ కవితాసంకలనంలో బాణాల శ్రీనివాసరావు రాసిన 'కుంపటి' కవిత కూడా ఉంది.

బాణాల శ్రీనివాసరావు కులరీత్యా కంసాలి. బంగారం నగలు చేసే కులానికి చెందిన కవి. ఆయన బాల్యమంతా ఆ వృత్తి చుట్టే తిరిగింది. ఆయన తండ్రి ఆ వృత్తిలోనే మునిగితేలారు. తెలంగాణలోని చాలా మందిలాగే బహుశా బాణాల శ్రీనివాసరావు కులవృత్తికి దూరమైన మొదటి తరం విద్యావంతుడు. తన బాల్యం చుట్టూ అల్లుకున్న కులమూల్యాలను ఆయన నెమరేసుకుంటూ రాసిన దీర్ఘకవిత 'కుంపటి'. నిజానికి, అణచివేత దృష్ట్యా చూస్తే కులం చాలా అమానుషమైనది. ఆ అణచివేత, కుల తారతమ్యాల గౌరవాగౌరవాలుం లేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఈ వృత్తులు దోహదపడి వుండేవి. రెండు కులాలను మినహాయిస్తే, గ్రామంలోని అన్ని కులాలకు ఉత్సత్తిలో భాగం పంచుకునే బాధ్యత వున్న వ్యవస్థ అది.

ఆ అవుసలోళ్ల కుటుంబం ఆ గ్రామంలో తన ఉనికిని చాటుకున్న వైనాన్ని తన బాల్య జ్ఞాపకాల నుంచి కవిత్వీకరించాడు బాణాల శ్రీనివాసరావు, ఆవుసలోళ్ల కుటుంబం ఆయనదే. ఆ విషయాన్ని బాణాల శ్రీనివాసరావు వ్యక్తం చేస్తూ తన వారసత్వాన్ని ఈ విధంగా ప్రకటించుకున్నాడు.

''కుంపటి

మా ఇళ్లకు వెలుగు

మా చీకటి బతుకుల నావకు దిక్సూచి

అది మా నాయనకు నిశాని

మా తాతకు ప్రతీక

మా తరతరాల వారసత్వాల

కులవృత్తికి చిత్రిక

మా కులం మొత్తానికే సజీవ సంకేతం'' - అని అంటూ బంగారాన్ని పోత పోయడానికి ఉపయోగించే కుంపటితో ఆయన తన అస్తిత్వాన్ని ప్రకటించుకున్నాడు బాణాల శ్రీనివాసరావు.

ఈ కవితను బాణాల శ్రీనివాసరావు 15 భాగాలుగా విభజించాడు. ఊరు ఉనికిని చాటుకుంటూ ఊరిలో తమ కుటుంబ అస్తిత్వాన్ని, దాని ఆసరాగా తన అస్తిత్వాన్ని ఆయన వ్యక్తం చేశాడు.

''కంటికి దూరం కాలికి దగ్గర మా వూరు'' అంటూ తాను పుట్టిపెరిగిన 'తురకగూడెం' గ్రామాన్ని పరిచయం చేయడం ద్వారా మొదలయ్యే కవిత రెక్కలు ముక్కలు చేసుకుని తన తండ్రి తన బతుకును తీర్చి దిద్దిన తీరుపై -

''నా బతుకు బంగారాన్ని

మెరిగిసుకతో రుద్ది

వెలిగించాడు ఎల్లిగారంతో'' అంటూ ముగుస్తుంది.

తండ్రి వరకు కొనసాగిన కులవృత్తి బాణాల శ్రీనివాసరావు ఎదిగే సరికి ఆ కుటుంబం నుంచి వేరైపోయింది. నిజానికి, అప్పటికే కులవృత్తి నుంచి ఆ కుటుంబం దూరం కావాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్న వైనాన్ని బాణాల శ్రీనివాసరావు ఈ కవితలో వ్యక్తీకరించాడు. అయితే ఆ కులవృత్తి జ్ఞాపకాలు, దాని చుట్టూ అల్లుకున్న బాల్య జీవితం జ్ఞాపకాలు కవిలో ఇంకా సజీవంగానే వున్నాయి. కులవృత్తుల విధ్వంసంతోపాటే పల్లెలు విధ్వంసం కావడం మనం చూస్తాం. ఇదే క్రమాన్ని బాణాల శ్రీనివాసరావు ఒక నిర్దిష్టత నుంచి పలికాడు.

అంతకు ముందు కుటుంబ ఆదాయాన్ని, వ్యయాన్ని పక్కన పెడితే ఒక గుర్తింపు బాణాల శ్రీనివాసరావు తండ్రికి, తండ్రి నుంచి బాణాల శ్రీనివాసరావుకు, ఆయన కుటుంబానికి వుండేది. ఆ గుర్తింపు ఎలా వుండేదో బాణాల శ్రీనివాసరావు తన కవిత్వంలో వ్యక్తీకరించాడు.

''మా వూరు పెట్టుకున్న నగల్ని

ఎప్పుడెక్కడ చూసినా

నాయనతో మాట్లాడిన అనుభూతి

నాయన చేసే పుస్తెమెట్టల్తో

అమ్మ కట్టే భాష్కాలతో

ఊళ్లో డోలు వాయిద్యాలు మోగేవి

పెళ్లిళ్లు జరిగేవి'' అని బాణాల శ్రీనివాసరావు తన తల్లిదండ్రులకు సామాజిక బాధ్యతల్లో ఉన్న ప్రాధాన్యాన్ని చాటుకుంటాడు. అంతేకాదు,

''పెళ్లి చేసే అయ్యగారు రాకపోతే

నాయనే అయ్యగారు'' - అని బ్రాహ్మణ తంతును నిర్వహించే పాత్రను కూడా చెప్పాడు. నిజానికి, బ్రాహ్మణీయత ఆధిక్యాన్ని తెలుగు సమాజంలో ప్రశ్నించి, వారికి ధీటుగా నిలబడడానికి విశ్వకర్మలు చేసిన ఉద్యమం చిన్నదేమీ కాదు. బ్రాహ్మణులపై తిరుగుబాటుగా ప్రారంభమైన విశ్వకర్మల ఉద్యమం పెళ్లి వంటి తంతులన్నీ వారే నిర్వహించుకునే స్థాయికి చేరుకుంది. అలా బాణాల శ్రీనివాస రావు తండ్రి అయ్యవారి బాధ్యతను కూడా నిర్వహించేవాడు. అదీ ఆయనకు గల ప్రత్యేక ప్రతిభ. బిసిల్లోని విశ్వకర్మలు సాంస్కృతిక ఆధిపత్యాన్ని సాధించుకునే ప్రయత్నంలో బ్రాహ్మణీయతను అందుకునే ప్రయత్నం బలంగానే సాగింది.

దళిత, బహుజన ఉద్యమాలు ముందుకు వచ్చిన తర్వాత ప్రతిభకు అర్థం మారిపోయింది. తమ అస్తిత్వ ప్రకటనలో భాగంగా దళిత, బహుజన కవులు తమ ప్రతిభాపాటవాలను గొప్పగా చాటుకునే గుణం సాహిత్యంలోకి ప్రవేశించింది. అందులో భాగంగానే శ్రీనివాసరావు -

''యజ్ఞ గుండం ముందు ఋషిలా

ఒక చేత్తో గొట్టాన్ని ఊదుతూ

మరో చేత్తో నీరుకారును

కుంపట్లో నాట్యం చేయిస్తూ

చేతుల్ని సవ్యసాచిలా ఆడిస్తూ

చెంపలకు రెండు బెలూన్లు తగిలించుకొని

తీక్షణమైన చూపుల్తో

ఊపిరితిత్తుల్లోని గాలినంత

కుంపట్లోకి ఊదితే

ఏ కాలం నాటి ఎండి బంగారమైనా

మూసల్లో నీళ్లలా కరగాల్సిందే'' - అని అంటాడు.

గ్రామాల్లో కులవృత్తులు నశిస్తూ పోవడంతో బహుజనుల అస్తిత్వం ప్రమాదంలో పడింది. వారి ప్రతిభకు గుర్తింపు నశించింది. ఆర్థికంగా, సామాజికంగా వారు చితికిపోయారు. దాన్నే శ్రీనివాసరావు -

''మా ఊళ్లో కరువొచ్చినప్పుడు

నందికొండ కాలవ పనికిపోయి

నగల్ని చేసిన నాయన చేతులు

నాపరాళ్లెత్తినప్పటి విషాద స్మృతులు

చరిత్ర చెరపలేని చేతు సాక్ష్యాలు'' అని పలికాడు. కుల అసమానతలు, అణచివేతల దృష్ట్యా చూస్తే కులం నశించడం అత్యంత ఆవశ్యకమైన ప్రక్రియగానే పరిగణించాల్సి వుంటుంది. అయితే కులవృత్తుల విధ్వంసం వల్ల ఆయా కులాల గౌరవమర్యాదలు, అస్తిత్వాలు కూడా మంటగలిసిన వైనాన్ని చూస్తాం. కుల అసమానతలను, అణచివేతలను తొలగించి ఆయా కులాలవారు ఆర్థికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఔన్నత్యాన్ని పొందే తాత్త్విక చింతనను భారత రాజకీయాలు అందించలేకపోయాయి. అందుకే శ్రీనివాసరావు 'కుంపటి' కవిత్వంలోని మనాది ఆనందవిషాదాలకు, మంచీచెడులకు అతీతంగా కనిపిస్తూ వుంటుంది.

బాణాల శ్రీనివాసరావును తన కులవృత్తి జ్ఞాపకాలు, తన నాయినకు సంఘంలో లభించిన గౌరవమర్యాదల ఉనికి, దానివల్ల తనకు బాల్యంలో ఒనగూరిన ప్రత్యేక అస్తిత్వం కలవరపెడుతూనో, సంతోషపెడుతూనో వస్తున్నాయనడానికి 'కుంపటి' కవిత ప్రబల నిదర్శనం. వృత్తి మారినా బాణాల శ్రీనివాసరావులో తన కులవృత్తికి చెందిన అస్తిత్వ ఛాయలు మాసిపోలేదు. ఆ రకంగా బిసిల అస్తిత్వ చింతనను బలంగా పలికిన కవితగా 'కుంపటి'ని చూడవచ్చు.

English summary
A Telugu poet Banala Srinivas, born in goldsmith family has written a poem Kumpati, symbolizing it to his particular identity. He narrates how his family played a key role in village life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X