• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బహుజన స్త్రీల దృశ్యకావ్యం 'బతుకుపోరు'

By Pratap
|

BS Ramulu
ఉత్తర తెలంగాణ కల్లెపెల్లె ఉడుకుతున్న కాలం. దళిత, బహుజన కులాల చైతన్యం పోరాట మార్గం పడుతున్న కాలం. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీతీరుతెన్నులు తెలిసిపోతుండడంతో అసంతృప్తి పేరుకుపోయిన స్థితి. ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్నది. ఈ అసంతృప్తి, ఆగ్రహం కాలువలు కాలువలుగా ఉద్యమంలోకి పారుతున్నాయి. వ్యవసాయం దెబ్బ తింటూ మనుగడ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్న సన్నకారురైతులు, రైతు కూలీలు. ఆ సమయంలో తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, బీడీ పరిశ్రమ వారికి ఆశ్రయాలుగా కనిపించాయి. సింగరేణి బొగ్గు గనులకు మించి దళిత, బహుజన కులల్లోకి చొచ్చుకుపోయింది బీడీ పరిశ్రమ. నాట్లేయడానికి, కోతలు కోయడానికి వెళ్లే స్త్రీలకు మంచి ఆదాయ మార్గంగా ఆశలు చిగురింపజేసింది. చేతుల్లో పైసలాడుతాయనే భ్రమను పెంచింది. దిగితే గానీ లోతు తెలియదు. ఆ పరిశ్రమలో కమీషన్‌ ఏజెంట్లు, దాదాలు, సేట్లు ఎక్కడికక్కడ కార్మికులను, అందునా స్త్రీ కార్మికుల శ్రమను ఎలా దోచుకుంటున్నారో తెలిసి రాసాగింది. పదేళ్ల వయసు ఎలా కుదించుకుపోతుందో అనుభవంలోకి రాసాగింది. విప్లవోద్యమ పాదులు పడిన ఉత్తర తెలంగాణలో, ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లాలో ఈ దోపిడీ, దోపిడీ దుష్ఫలితాల ఎరుక కలగడానికి ఎంతో కాలం పట్టదు. ఇలా లోలోన రగులుతున్న బీడీ కార్మికుల చైతన్య నిప్పుకణికలకు అద్దం పడుతుంది బి.యస్‌. రాములు 'బతుకుపోరు' నవల. ఈ నవల వెలువడినప్పుడు పట్టణాల్లో ఉన్న మేధావులకు, ఆలోచనాపరులకు, రచయితలకు ఎక్కడ లేని ఉత్సాహం, అంతులేని ఆశ.

అప్పట్లో నవలా సాహిత్యంపై ఆశ చిగురింపజేసిన నవలలు 'బతుకుపోరు', ఆ తర్వాత సింగరేణి కార్మికుల జీవితాలను చిత్రీకరిస్తూ పవన్‌కుమార్‌ రాసిన 'నల్లవజ్రం'. 'బతుకుపోరు' వెలువడేనాటికి స్త్రీలను బీడీ పరిశ్రమ పీల్చి పిప్చి చేయడం మొదలై పదేళ్లకు పైనే అయింది. బీడీ పరిశ్రమ స్త్రీలను, పిల్లలను తనలోకి లాక్కుంది. స్త్రీలు, బాలకార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేయడం చాలా సులభం.'బతుకుపోరు' నవల వెలువడేనాటికి కమీషన్‌ ఏజెంట్లు, దాదాలు, షేట్లు మూడంచెల్లో ఈ దోపిడీ నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. విప్లవోద్యమం గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామీణ ప్రజలు చైతన్యాన్ని సంతరించుకున్నారు. తమ హక్కుల ఎరుక వారికి క్రమంగా వారికి తెలిసి వచ్చే పరిస్థితి నెలకొంది. ఆ చైతన్యం లోలోన రగులుతూనే ఉంది.

బి.యస్‌. రాములు రాసిన 'బతుకుపోరు' నవల గ్రామీణ బహుజన శ్రామిక స్త్రీల జీవితాలను వాస్తవికంగా చిత్రించిన నవల. బీడీ పరిశ్రమలో పని చేసే తెలంగాణ స్త్రీల జీవితాలను, బీడీ పరిశ్రమ వారిని పీల్చి పిప్పి చేస్తున్న తీరును ఈ నవల చిత్రించింది. ఆ పరిశ్రమలో తాము దోపిడీకి గురవుతున్న వైనాన్ని గుర్తించి, దాన్ని ఎదుర్కొనే చైతన్యాన్ని సంతరించుకుని, పోరాటానికి ఉపక్రమించే స్త్రీల జనసమూహాన్ని చిత్రిక కట్టిన నవల ఇది. నిర్దిష్టత ఒక విశ్వజనీన సత్యాన్ని ఆవిష్కస్తుందనే విషయానికి బతుకుపోరు నవల తార్కాణం. నవల ప్రారంభం నుంచి చివరి దాకా పట్టు సడలకుండా సాగిన నవల ఇది. పాత్రలకు అనవసర చైతన్యాన్ని ఆపాదించడం గానీ, రచయిత మధ్యలో చొరబడి పాఠకులకు ఉద్బోధలు చేసే వాక్యాలు గానీ లేకపోవడం గొప్ప రిలీఫ్‌. ఏ పాత్ర కూడా తన స్థాయిని దాటి ప్రవర్తించదు. తన జీవితాన్ని కాదని మరో జీవితంలోకి పరకాయ ప్రవేశం చేయదు. స్త్రీపురుష అసమానతల గురించి, దోపిడీ గురించి స్త్రీలు మాట్లాడినప్పుడు గానీ, చివరగా వారు పోరాటానికి సమాయత్తమయ్యే సమయంలో గానీ మితిమీరిన ప్రవర్తించిన పాత్ర ఏదీ లేదు. సహజాతి సహజంగా తమకు జరుగుతున్న అన్యాయాలను, తమ పట్ల అమలవుతున్న అసమానతను, మానవసంబంధాలను స్త్రీలు జీవితంలో భాగంగానే వ్యక్తీరిస్తారు. చూడగలిగే ప్రతిభ ఉంటే బి.యస్‌. రాములుకే కాదు, అందరికీ అది అనుభవంలోకి వచ్చేది. కానీ దాన్ని చూసి పట్టుకోగలిన నేర్పును ఆయన ప్రదర్శించి ఒక రచనగా పాఠకుల ముందు ఆవిష్కరించగలిగారు. ఆ రకంగా కళాత్మక సౌందర్యం ఈ నవలకు చేకూరింది. దీన్ని సాధించడంలో రచయిత బి.యస్‌. రాములు పడిన శ్రమ, ప్రదర్శించిన నైపుణ్యం 'బతుకుపోరు' నవలను అసలు సిసలైన సృజనాత్మక రచనగా నిలబెట్టింది. దాని వల్ల ఆ నవలకు ఎనలేని ప్రయోజనం చేకూరింది.

నవల ప్రారంభం నుంచి చివరి దాకా ఏకసూత్రత చెడకుండా నడుస్తుంది. నవల ప్రారంభంలో సమస్యను రచయిత అన్యాపదేశంగా పరిచయం చేసిన పద్ధతి తర్వాత్తర్వాత ఆ సమస్య వెంట పాఠకులు నడవడానికి పునాది వేస్తుంది. నిజానికి ఇది మంచి ప్రారంభం చాలా తక్కువగా చూస్తాం. ''ఆ చిన్న యింట్లో గ్యాసు నూనె గుడ్డి దీపం వెలుగుతోంది'' అని చెప్పడంతో ఆగకుండా 'బీడీ కొరుకులాగ వెలుగేమీ యివ్వడం లేదు' అని అంటారు. 'అలాగే నానిగాడికి నల్లి కుట్టినట్టుంది. అటు నుండి యిటు పొర్లాడు. కళ్లు మూసుకుని నిద్రలో పాలకై నోరు చాపి అమ్మ మీద చేయి వేయబోయాడు. చేతికి అమ్మ అందలేదు.'' అని చెప్పడంతో సరి పెట్టకుండా 'చేయి పక్కనున్న బీడీల చేటలో పడింది' అని అంటారు రచయిత. దీని వల్ల రెండు విధాల ప్రయోజనం చేకూరింది. స్త్రీల జీవితాల్లోకి బీడీల పరిశ్రమ ఎలా చొచ్చుకుని వచ్చిందో పాఠకులకు తెలియజెప్పడంతో పాటు నవల వస్తువును అనాలోచితంగా, అన్యాపదేశంగా పరిచయం చేస్తున్నారు రచయిత. ఒక మంచి కావ్యానికి ఇది మంచి ప్రారంభం.

దళిత, శ్రామిక స్త్రీలు గ్రామాల్లో పురుషులతో సమానంగా కాయకష్టం చేస్తారు. ఆ కాయకష్టం కాస్తా తెలంగాణలో వ్యవసాయ రంగం నుంచి అసంఘటిత రంగమైన బీడీ పరిశ్రమలోకి మారింది. ఆర్థికంగా బాగుపడదామనే ఆశలు అడగంటి పోతుండగా శరీరాలను పీల్చి పిప్పి చేస్తున్న వైనాన్ని 'బతుకుపోరు' నవల ప్రతిభావంతంగా చిత్రీకరించింది. ఇందులోని ప్రధాన పాత్ర లక్ష్మి సాత్విక పాత్ర. లోకజ్ఞానమెరిగిన స్త్రీ. రామక్క, సత్తెక్క, సుగుణ ఒక్కో పాత్ర ఒక విలక్షణతను సంతరించుకుంది. ఇవి మూస పాత్రలు కావు. రచయిత వాటిని తన సిద్ధాంతాన్నో, తానెరిగిన జ్ఞానాన్నో పంచడానికి వాటిని రక్తమాంసాలు లేని కొయ్యబొమ్మలుగా తయారు చేయలేదు. అవి సజీవ పాత్రలు. మన కళ్ల ముందు కదలాడే తెలంగాణ పల్లె స్త్రీలు.

'బతుకుపోరు' నవల తెలంగాణ బహుజన శ్రామిక స్త్రీలు తమ కథలను, తమ వెతలను, తమ పోరాటాలను తామే నోరు తెరిచి చెప్పకుండానే వారి మాటల ద్వారా, చేష్టల ద్వారా మనకు చెప్పుకుంటూ పోతారు. తమ ఆడ బతుకులెంత కనాకష్టమైనవో, తాము అదనంగా అనుభవిస్తున్న పునరుత్పత్తి కష్టామేమిటో, తాము వివక్షకు ఎలా గురువుతున్నామో గ్రామీణ బహుజన శ్రామిక స్త్రీలకు స్పష్టంగానే తెలుసు. ఆ పల్లె స్త్రీని పలకరించిన తన భాషలో, తన యాసలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలదు. తన సహజమైన శైలిలోనే ఈ విషయాన్ని లక్ష్మి తన భర్త రాజయ్యతో చేసిన సంభాషణలో మనకు అర్థమవుతుంది. ''మేం ఆడోల్లం జేసే పనిల మీరు ఏ పాటి పని జేత్తన్రు? మేం ఒక్క పోరగాన్లను సగవెట్టినంత పని గాదు మీరు పొద్దుందాక రాజ్యాలేలవచ్చేది, పనులు జేసేది అంత గలిపి! ఏదో ఆడిపుటక పుట్టినమని వంచిన తల ఎత్తకుంట మాటకు ఎదురు జవాబివ్వకుంట, మాట్లాడకుంట పని జేసుకుంట జేర్తె మీకు ఏమేర్పడుతది మేం జేసే పని, ఆడోల్లందరు ఓసారి పదిహేను రోజులు పిలగాన్లను మొగనికి అప్పజెప్పి తల్లిగారింటికోతే తెలుత్తది'' అని లక్ష్మి అంటుంది. ఆ మాట అనడానికి భర్తకు, ఆమెకు మధ్య పెద్ద సంభాషణే జరుగుతుంది. అది సాధారణంగా పల్లెల్లో అన్ని ఇళ్లలో ఏదో రూపంలో జరిగే సంభాషణే.

కష్టం రూపం మారినా మారని లైంగికదోపిడీని, దాన్ని ఎదుర్కొనే వైనం ఈ నవలలో ఉన్నాయి. చేయి గుంజ బోయిన రాజారామన్నను ఈశ్వరి అనే యువతి ఎదుర్కుంటుంది. ఆ ఈశ్వరిని లక్ష్మి తన భాషలో 'గడుసుపోరి, మంచి పని జేసింది'' అని అభినందిస్తుంది. స్త్రీలు అటు యజమానుల చేతుల్లోనే కాకుండా అదనంగా భర్తల చేతుల్లో కూడా అణచివేతకు, దోపిడీకి గురువుతున్న విషయాలను 'బతుకుపోరు' నవల సమర్థంగా చిత్రీకరించింది.

స్త్రీల ఆరోగ్యాలు బీడీ పరిశ్రమ వల్ల ఎలా దెబ్బ తింటున్నాయో మనకు లచ్చిరాజవ్వ యాతన చూస్తే అర్థమవుతుంది. ఆరోగ్యాన్ని బీడీ పరిశ్రమ పీల్చి పిప్పి చేస్తోంది. ''నీడ పట్టుకు కూసుండి చేసుడే గదా అనుకొన్న తొల్తల. కూసుండి కూసుండి నడుమువాయె. సూసి సూసి కండ్లు వాయె, తంబాకు ఘాటు వశపడక పాన్‌ అలవాటు జేసుకుంటే పండ్లు పాడైపాయె, పుప్పి పండ్లయిపాయె, పండ్లు ఊసిపోయసరికి ముసల్దాని తరీకైతి. ఈ బీడీలు జేసి సంపాదించి లేదాయె, బంగ్లాలు కట్టింది లేదాయె, ఉత్తగ పానం తెర్లయిపాయె'' అని తన గోసను లచ్చిరాజవ్వ లక్ష్మి ముందు వెళ్లబోసుకుంటుంది. ''కలువబోతె, కొయ్య బోతె యింత మంచి గాలన్న తాకతది. ఈడేంది కంపిన్లంత గెదడు, గెదడు, ఆ వాసనకు ఎక్కడలేని రోగాలత్తయి'' అని అనుభవం ద్వారా తెలుసుకుంది.

'బతుకుపోరు' నవలలోని సమస్య బీడీ పరిశ్రమలో పని చేస్తున్న స్త్రీ 'కారిదార్ల'దే అయినా దాన్ని పెనవేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోని మానవ సంబంధాలను, ఆ సంబంధాల మధ్య పని చేసే శక్తులను, స్త్రీపురుష సంబంధాలను, దోపిడీ రూపాలను, పని పరిస్థితులను, కొత్త పరిశ్రమ సృష్టించిన కొత్త దోపిడీదారులను, దాని వల్ల అంతరాలు మారే క్రమం, అన్ని రకాల దోపిడీలను ఎదుర్కునే స్త్రీల తెగువను సహజాతి సహజంగా చిత్రీకరిస్తుంది. బహుముఖీనంగా ఈ నవల సాగుతుంది. బీడీ పరిశ్రమ యజమానులపై స్త్రీ కార్మికులు తిరగబడే తీరును సమర్థంగా చిత్రించారు రచయిత. ఇక్కడ కూడా ఏ మాత్రం అసహజత చోటు చేసుకోకపోవడమే ఈ నవల గొప్పదనం.

ఏ సౌకర్యాలు లేక, దోపిడీకి గురువుతూ బీడీలు చేస్తున్న స్త్రీ కార్మికుల వెతలను చెబుతూనే వారు పోరాటానికి సిద్ధమయ్యే ఒక పరిణామ క్రమాన్ని 'బతుకుపోరు' నవల చిత్రించింది. ఇందులో దళారీలు, వారిని గుర్తించడం, వారిని తిప్పి కొట్టడమూ ఉంది. ప్రేమ సన్నివేశాలూ ఉన్నాయి. పోరాటానికి ఉద్యుక్తులయ్యే క్రమంలో నారాయణ, సుగుణల మధ్య వెల్లివిరిసిన ప్రేమను, వారు దాన్ని వ్యక్తం చేసుకున్న తీరును రచయిత అత్యంత ప్రతిభావంతంగా చిత్రించాడు. వారు విప్లవోద్యమం వైపు వెళ్తారన్న విషయాన్ని రచయిత బి.యస్‌. రాములు వాచ్యంగా చెప్పకుండా, పాఠకులకు ఆ విషయాన్ని స్ఫురింపజేస్తారు. ఇలా పాఠకుల కోసం వదిలేసిన సన్నివేశాలు, ఆ వదిలేసిన సన్నివేశాల ఊహ నవలను నెమరు వేసుకుని అనుభూతి చెందడానికి అవకాశం కల్పించింది.

స్త్రీల భాష ఏ వర్గంలోనైనా, ఏ కులంలోనైనా, ఈ సామాజిక శ్రేణిలోనైనా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ స్త్రీ భాషను, స్త్రీ హావభావాలను, చేష్టలను పట్టుకుని దానికి అక్షర రూపంలో ఇవ్వడంలో బి.యస్‌. రాములు విజయం సాధించారు. అందువల్ల ఈ నవల ఒక సృజనాత్మక వచన రచనగా మన ముందున్నది. బిడ్డను కుడి చంక నుంచి ఎడమ చంకకు, ఎడమ చంక నుంచి కుడి చంకకు మార్చుకుంటూ అన్ని వ్యవహారాల్లోనూ పాత్ర ధారి అయిన ప్రొటోగనిస్టు లక్ష్మి కదలికలు, చేష్టలు, మాటలు, ఆమెకు అప్పుడే వెళ్లగక్కే కోపాలు, ఆ వెంటనే కురిపించే ప్రేమలు, వ్యవహారాలు నడపడంలో, వాటిని చక్కదిద్దడంలో ఆమె నేర్పరితనం దృశ్యాలు దృశ్యాలుగా మన కళ్ల ముందు కదిలిపోయి ఒక నాటకం చూస్తున్న అనుభూతిని నవల కల్పిస్తుంది.

భాష ఒక సృజనాత్మక రచనను కళాత్మకంగా తీర్చిదిద్ది ఏ విధమైన ప్రయోజనకారిగా మారుతుందో 'బతుకుపోరు' నవలను చదివితే అర్థమవుతుంది. ఇందులో వాడని శ్రామిక బహుజనుల భాష వల్ల కృత్రిమత్వాన్ని ఏ మాత్రం అంటుకు రానీయకుండా మరింత సహజత్వాన్ని సంతరించుకుంది. తెలంగాణ స్త్రీల అనుభవాల నుంచి రూపుదిద్దుకుని వారి నాలుకల మీద ఆడే సజీవ భాషను రచయిత సమర్థంగా ఉపయోగించుకున్నారు. 'సరిస్తే దయ్యమొదలాలె', 'గుంటెడు జాగుండది గుడిసెకు కప్పుండది గని వేలకు వేలు కావాలె కట్నాలు!' - ఇలా ఈ నవలంతా తెలంగాణ భాషా పరిమళం, అందునా తెలంగాణ తల్లుల నోటి తీయదనం గుభాళిస్తూ ఉంటుంది.

తెలంగాణలోని స్త్రీల ఆరాటాలను, పోరాటాలను స్త్రీవాద ఉద్యమకారులు రికార్డు చేస్తే చాలు, అంతకన్నా ఎక్కువ ఏమీ అవసరం లేదని 'బతుకుపోరు' నవల చదివిన తర్వాత అనిపించింది. 'బతుకుపోరు' నవల తెలుగు ఉద్యమ నవలకు ఒక మంచి నమూనా. 1980 థకంలో గల తెలంగాణలోని వాస్తవిక పరిస్థితిని సృజనాత్మకంగా వ్యక్తీకరించింది. ఇందులో రచయిత అభిప్రాయాలకు, విశ్వాసాలకు ఎక్కడా తావు లేదు. అప్పటి పరిస్థితిని చిత్రిక కట్టి పాఠకుల ముందుంచుతుంది. ఆ రకంగా ఇది ఎల్లకాలం సాహిత్యంలో నిలిచిపోయే రచన.

"Since all narrative art has to do with small and even trivial details of life; it can not allow the hero to figure personally in the foreground all the time for their would mean reducing him to the general level of the life portrayed..."

- కాసుల ప్రతాప రెడ్డి

English summary
An eminent writer in Telugu BS Ramulu has written a novel, Bathuku poru, on women beedi workers struggle. The beedi making has become part and parcel of women in North Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X