సాహిత్యంలో అస్తిత్వాల ఆరాటం

నిజానికి, మైనారిటీ ప్రజాస్వామిక, అస్తిత్వ ఉద్యమం మిగతా అస్తిత్వ ఉద్యమాలతో కలిసి పనిచేయడానికి తగిన రూపాన్ని సంతరించుకుంది. అందుకు అవసరమైన సైద్ధాంతిక, కార్యాచరణ రంగాలను ముస్లిం అస్తిత్వ ఉద్యమం రూపొందించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ సందర్భంలో తమతో ఇంతవరకు నడిచిన వచ్చిన ముస్లిమేతర ఉద్యమాల, మేధావుల పాత్రను మరింతగా గుర్తించాల్సి వుంది. దాన్ని అంచనా వేసుకోవాల్సి ఉంది. ముస్లిం కవిత్వం విషయానికి వస్తే, ‘జల్‌జలా', ‘జిహాద్' కవితా సంకలనాలు తెలుగు సమాజంలో ఒక కొండగుర్తు. ఖాదర్ మొహియుద్దీన్ ‘పుట్టుమచ్చ' ఎలా ఒక కొండ గుర్తో, ఈ రెండు కవితా సంకలనాలు ఒక కొండ గుర్తు. ఈ సంపుటాల ప్రచురణల మధ్యగల వైరుధ్యాలను ఇక్కడ చర్చించడం అవసరం. తెలుగు సాహిత్యంలో ఇంతవరకూ వచ్చిన కవితా సంకలనాలు, తెచ్చిన తరువాత ఎదురయ్యే సవాళ్లను, విమర్శలను, ఆరోపణలను ఎదుర్కోవడానికి తగిన సాధనసంపత్తిని ముందే సమకూర్చి పెట్టుకోవడానికి పెద్ద అంతర్మథనమే జరిగింది.
మైనారిటీవాద సాహిత్యానికి మూలాలేమిటో, ముస్లింలపై గుండుగుత్తగా జరుగుతున్న సాంస్కృతిక, సాహిత్య దాడులు, భౌతిక దాడులు ఎంత దారుణంగా, పాశవికంగా ఉన్నాయో వీలుచూసుకొని విమర్శకులు, సామాజిక ఆలోచనాపరులు మాట్లాడుతూనే ఉన్నారు. కేవలం సాహిత్యకారులు తమ అంతర్గత సమాజంలోని చెడుపై చేసిన సాహిత్య సూచనకు మాత్రమే మద్దతు లభిస్తుందని, మతోన్మాదంపై చేసే విమర్శలకు మద్దతు లభించడం లేదని అనడం పాక్షిక సత్యం మాత్రమే. ముస్లిం అస్తిత్వవాద ఉద్యమం బలంగా ముందుకు రావలసిన అవసరాన్ని తెలియజేస్తూనే ఆ సామాజిక శ్రేణిపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి పాత లౌకికవాదుల, మార్క్సిస్టుల పనిముట్లు సరిపోవనే విషయాన్ని చాలా ముస్లిమేతర ఆలోచనాపరులు వెల్లడిస్తూనే ఉన్నారు.
శివసాగర్ లాంటి పెద్దలు మాత్రమే కాకుండా ఈ తరం ఆలోచనాపరులు ‘స్థిరీకృత' అభిప్రాయాలను, కార్యాచరణను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పగలితే స్థితిలో వుంటే తప్ప వారు ఆ ప్రశ్నలను లేవనెత్తరనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ స్థితిలో ముస్లింవాద సాహిత్యం, అస్తిత్వ ఉద్యమం ప్రశ్నలను ఎక్కుపెట్టే దశను దాటి తమను తాము నిలబెట్టుకుంటూ తదుపరి కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్థితిలో పాజిటివ్ విమర్శనే కాకుండా మనం గుర్తించి, జవాబు చెప్పాల్సిన నెగెటివ్ విమర్శ కూడా వచ్చింది. ముస్లిం సాహిత్యకారులు పనికట్టుకొని ఉర్దూ పదాలను తెచ్చిపెడుతున్నారనే విమర్శ అది.
తెలంగాణ సాహిత్యం కూడా ఈ విమర్శను ఎదుర్కొంటున్నది. తమ ఉద్యమానికి ముందుకు తీసుకోవడానికి భాష కూడా ఒక సాధనమనే విషయాన్ని గుర్తిస్తే ఆ విమర్శకు సమాధానం చెప్పడం సులభం. తమను తాము నిలబెట్టుకోవడానికి, తమ ఉద్యమానికి బలం చేకూర్చుకోవడానికి ముస్లింలకే కాదు, దళితులకైనా, స్ర్తిలకైనా, తెలంగాణ వారికైనా భాష తప్పకుండా ఆయుధమే.
ఎవరికి వాళ్లు ఎవరి అస్తిత్వ ఉద్యమాలు సాగిస్తూ వస్తున్నారు. ఈ ఉద్యమాలన్నీ ఒక కీలకమైన దశకు చేరుకున్నాయి. ఇదే సమయంలో ఫ్రాగ్మంటేషన్‌కు గురయ్యాయని ఉ.సా. అన్నారు. ఈ ఫ్రాగ్మంటేషన్ వల్ల తాలు కొట్టుకుపోయి గట్టి గింజలు మిగిలాయని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ ఫ్రాంగ్మంటేషన్‌ను నివారించడానికి అస్తిత్వ ఉద్యమాలన్నీ ఐక్యకార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందనే ఉసా మాటలు మాత్రం గుర్తించదగినవి. అలా ఐక్య కార్యాచరణకు దిగడానికి అవసరమైన ప్రాతిపదిక ఉంది. అస్తిత్వ ఉద్యమాలన్నింటికీ ఉమ్మడి శత్రువు ఉన్నాడనే విషయాన్ని గుర్తించడమే ఆ ప్రాతిపదిక.
మనలోని భిన్నత్వాన్ని తుడిచిపెట్టేసి ఏక రూప సంస్కృతిని, సమాజాన్ని ఏర్పాటుచేసి మనుషులందరినీ ‘వినియోగదారులు'గా మార్చేసే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతున్నది. ముస్లిం దేశాల్లో అయితే సాయుధ దాడి ద్వారా, భారత్ వంటి వర్ధమాన దేశాల్లో సాంస్కృతికంగా అమెరికా ఈ దాడులను సాగిస్తూ వస్తున్నది. అమెరికా, దాని అనుచర దేశాల మార్కెట్లకు వినియోగదారులుగా మాత్రమే మిగిలే ఒక దారుణమైన సందర్భాన్ని మనం ఎదుర్కొంటున్నాం. మొత్తంగా మనం వలసపాలనను అనుభవించబోతున్నాం. ప్రపంచీకరణ ద్వారా మన సమాజాలపై ఆధిపత్యం చెలాయించే అమెరికా, దాని గుత్త సంస్థలకు మన పాలకులు కేవలం దళారులుగా మాత్రమే వ్యవహరిస్తున్న దశను మనం చూస్తున్నాం. ఈ దాడిని ఎదుర్కోవడానికి మార్క్సిస్టుల, విప్లవ మేధావుల కార్యాచరణ సరిపోదు.
కేవలం రాజకీయ ఉద్యమాలు దానికి పరిష్కారం చూపలేవు. నిజానికి ఈ విషయాన్ని ఆ మార్క్సిస్టు, విప్లవ ఉద్యమాలు సీరియస్‌గా పట్టించుకుని ఉంటే పరిష్కారం దొరికి వుండేది. రెండున్నర దశాబ్దాలుగా విప్లవోద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమాధానాలు కూడా దొరికి వుండేవి. మార్క్సిజం కేవలం మొదట్లో ఉన్న విధంగానే జడంగా లేదని, దానికి అభివృద్ధి దశలే లెనినిజం, మావో ఆలోచనా విధానాలని మన దేశంలోని మార్క్సిస్టులు, విప్లవకారులు గుర్తింపు వుంటే మన దేశ, కాల పరిస్థితులకు అనుగుణంగా దాన్ని అన్వయించుకుని వుంటే చాలా వాటికి పరిష్కారాలు దొరికి వుండేవి.
మార్క్సిజానికి సారంలో అభివృద్ధి దశను మార్క్సిస్టు, విప్లవోద్యమాలు నిర్ధారించుకోలేకపోయాయి. కుల మతాల విషయంలో ఆచరణాత్మక కార్యాచరణను రూపొందించుకోలేకపోయాయి. అందుకే ప్రస్తుతం అస్తిత్వ ఉద్యమాలపై ఎనలేని బాధ్యత ఉంది. రాజకీయ ఉద్యమాలకన్నా మిన్నగా సాంస్కృతికోద్యమాన్ని నడిపించాల్సిన అవసరం ఉందని, ఈ సాంస్కృతికోద్యమం సర్వస్వతంత్రంగా జరగాల్సి వుందని గుర్తిస్తే అస్తిత్వ ఉద్యమాలకు ప్రపంచీకరణను ఎదుర్కొనే లక్షణాలు, శక్తి వున్నాయని మనం గుర్తించడం పెద్ద కష్టం కాదు. మనలోని భిన్నత్వాన్ని రూపుమాపడానికి ప్రపంచీకరణ ద్వారా జరుగుతున్న దాడిని ఎదుర్కొనే లక్షణం స్వతహాగా అస్తిత్వ ఉద్యమాలకు ఉంది. అందువల్ల అస్తిత్వ ఉద్యమాలు తమ తమ భిన్నత్వాలను కాపాడుకుంటూనే ప్రపంచీకరణకు వ్యతిరేకంగా బలమైన సాంస్కృతికోద్యమం నిర్మించగలుగుతాయి. ఈ అస్తిత్వ ఉద్యమాలే స్వయం సమృద్ధి సాధించుకునే దేశీయ ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేస్తాయి. ఈ విషయాన్ని వివరంగా చర్చించాల్సిన అవసరం ఉంది.
ఏదో రూపంలో సమాజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అస్తిత్వ ఉద్యమాలు ప్రస్తుత కర్తవ్యాన్ని సమర్థంగా, శక్తివంతంగా నిర్వహించగలవనే నిర్ధారణకు రావచ్చు.
- కాసుల ప్రతాప రెడ్డి












Click it and Unblock the Notifications