• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాలం కన్నా ముందున్న రచయిత

By Pratap
|

Potlapalli Rama Rao
తెలంగాణ సాహిత్యానికి సంబంధించి, ముఖ్యంగా కథా సాహిత్యానికి సంబంధించి ఒక అపోహ ఉంటూ వస్తున్నది. తెలంగాణలో 1970 వరకు కథా సాహిత్యం వర్ధిల్లలేదనేది ఆ ఆపోహ. సురపరం ప్రతాప రెడ్డి వంటి వాళ్లు కథలు రాసినా వాటిని అంతగా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కొందరు రాసిన కొన్ని కథలను మాత్రం వెలికి తీశారు. కేవలం పోరాట కథలను వెలికి తీశారు. అవి కూడా అంసపూర్ణంగానే. ఆంధ్రప్రదేశ్ అవతరణకు కొంచెం ముందూ వెనకా కథలు రాసినవారే తెలంగాణలో లేరనే అభిప్రాయాన్ని తెలుగు సాహిత్యంలో బలంగా నాటారు. తెలంగాణ సాహిత్య విద్యార్థులు, సాహిత్యవేత్తలు కూడా తెలంగాణ కథా సాహిత్యంలో ఒక సంధి కాలం ఉందని భావించే స్థితిని కల్పించేంత బలంగా ఆ అభిప్రాయం స్థిరపడిపోయింది.. మేం తెలంగాణ కథ – దేవులాట అనే చిన్న పుస్తకం అచ్చేసేదాకా, ముదిగంటి సుజాతా రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ వంటి పరిశోధకులు తెలంగాణ కథా సాహిత్యాన్ని వెలికి తీసి చెప్పదాకా ఆ అభిప్రాయం బలంగా చెలామణిలో ఉంది.

తెలంగాణ అస్తిత్వ ఉద్యమం అన్ని రంగాల్లో కన్నా సాహిత్య రంగంలో బలంగా ముందుకు వచ్చిన తర్వాత, సాంస్కృతిక వేదిక ఆవిర్భావంతో తెలంగాణ కథపైనే కాకుండా తెలంగాణ సృజనాత్మక సాహిత్యంపై అంత వరకు కప్పుకున్న మబ్బులన్నీ పటాపంచలవుతూ వచ్చాయి. క్రమంగా తెలంగాణ కథా రచయితలు ఒక్కరొక్కరే ముందుకు రావడం ప్రారంభమైంది. వారి కథా సాహిత్య కృషి వెలుగు చూడడం మొదలైంది. కాలం చేసిన రచయితల గురించి సరేసరి, జీవించి ఉన్న కథా రచయితలు కూడా దాదాపుగా మరుగున పడిపోయారు. జీవించి ఉన్న కాలంలోనే మళ్లీ వెలుగులోకి వచ్చిన రచయితగా గూడూరి సీతారాంను తీసుకోవచ్చు అలా ఎందుకు జరిగిందనే దానికి కారణాలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత సీమాంధ్ర సాహిత్యం ఒక్కసారిగా తెలంగాణపై దాడి చేసింది. తెలుగు సాహిత్యానికి సంబంధించి ప్రవక్తలు అక్కడి వారే కావడం, తెలంగాణ పరిశోధకులు, విమర్శకులు తమ ప్రాంత సాహిత్యంపై ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం కారణంగా చెప్పవచ్చు. వివక్ష అనే మాటను అలా పక్కన పెడితే విస్మరణ మాత్రం ఒక అడ్డుగోడను నిర్మించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత రాసిన కథలను పరిగణనలోకి తీసుకోని స్థాయిలో విస్మరణ కొనసాగింది.

తెలంగాణ సాహిత్యకారులు ఒక్కసారి వెల్లువలా ప్రవహించిన సీమాంధ్ర సాహిత్యంలో కొట్టుకుపోయి తమ ప్రాంత రచయితలను పట్టించుకోని వాతావరణం ఏర్పడింది. అందుకే, పొట్లపల్లి రామరావు వంటి ప్రతిభావంతుడైన రచయిత కూడా మరుగున పడే పాడు కాలం దాపురించింది. పొట్లపల్లి రామారావు వంటి కథా రచయితలను గుర్తించకుండా తెలంగాణ పోరాట కథ తప్ప మరో కథ లేదనే వాదన బలంగా వినిపిస్తూ వచ్చింది. ఆధునిక చలనశీలతను, సామాజిక సంబంధాలను చిత్రీకరించిన కథలు తెలంగాణలో లేవనే అపోహ మర్రివృక్షంలా విస్తరించింది. నిజానికి, ఆ కథా రచయితల సంకలనాలు కొన్ని వచ్చాయి. వారి కథలను ప్రచురించిన పత్రికలు ఉన్నాయి. అయినా, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఉమ్మడి సాహిత్యానికి వేదికను తయారు చేయాల్సిన అవసరాన్ని మరిచిపోయి ఏకపక్ష సాహిత్య చరిత్ర రచన, విమర్శ, పరిశోధన సాగుతూ వచ్చింది. తెలంగాణ ప్రాంతంలోని విశ్వవిద్యాలయాల్లోని తెలుగుశాఖల పాఠ్యప్రణాళికల్లో కూడా అక్కడి సాహిత్యం దాడి చేసింది. ఎక్కువ మంది సాహిత్యాచార్యులు అక్కడి వారే కావడం కూడా అందుకు కారణం కావచ్చు.

ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత పుట్టిన తెలంగాణ పాఠకులకు తమ ముందు తరం రచయితలు పరిచయం కూడా కాని పరిస్థితి వచ్చేసింది. దీంతో ఉమ్మడి సాహిత్యంగా కోస్తాంధ్ర సాహిత్యమే చెలామణి అవుతూ వచ్చింది. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని కావడం వల్ల తెలంగాణేతర ప్రాంత సాహిత్యవేత్తలకు కూడా ఇదే ప్రధాన కేంద్రం కావడం కూడా అందుకు కారణం కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఆధునికతను అంది పుచ్చుకున్న పొట్లపల్లి రామరావు కథలు తెలంగాణ పాఠకులకు, సాహిత్యకారులకు అందకుండా పోయాయి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ద్వారా జరిగిన దేవులాటలో ఆయన సాహిత్యంపై కూడా దృష్టి పడింది. పొట్లపల్లి రామారావు 1945 – 1956 మధ్యలో ఎక్కువగా కథలు రాసినట్లు అర్థమవుతోంది. సాహిత్య విమర్శకులు, ముఖ్యంగా తెలంగాణేతరులు నిర్దేశించిన కొలమానాల దృష్ట్యా చూస్తే, పొట్లపల్లి రామారావు పోరాట కథలు రాయలేదు. కానీ, ఆయన కథల్లో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం ఉంది. ఆ పోరాట నేపథ్యంలోని సమాజంలోని కదలికలు, ఆలోచనాధోరణులు ఆయన కథల్లో కనిపిస్తాయి.

తెలంగాణ సమాజం చలనశీలతను, ఆలోచనాధోరణిని, పేదల పాట్లను తన కథల్లో పట్టించిన పొట్లపల్లి రామారావు కథలను తెలంగాణ ప్రచురణలు పుస్తకం రూపంలో తెస్తోంది. ఇందులో కథలతో పాటు ఆయన ముల్లా కథలు, ఆచార్యుల కథలు పేర రాసిన ఊహాచిత్రాలను కూడా ఇందులో పొందుపరుస్తోంది. తెలంగాణలోని కొన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చిన ఆధునికత పొట్లపల్లి రామారావు కథల్లో వ్యక్తమైంది. ఆయన కథలు ఒక రకంగా మధ్యతరగతి ఆలోచనా ధోరణిని ప్రతింబింబిస్తాయి. మంచీచెడుల మధ్య, ధనికపేదల మధ్య గిరి గీసి ఒక మంచి సమాజ నడవడి కోసం మార్గం వేయడానికి ఆయన కథలు చైతన్యభూమికను పోషించాయని చెప్పవచ్చు. వెనకబడిన ప్రాంతం రచయిత ఆలోచనా ధోరణి కాకుండా ఆధునిక సమాజం ఆలోచనా ధోరణి పొట్లపల్లి రామారావు కథల్లో కనిపిస్తుంది. అందుకు మంచి ఉదాహరణే – అడగనిదే తల్లి అయినా పెట్టదు కథ. మంచితనం అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్దేశిస్తూ రాసిన కథ ఇది. దీనికి మంచివాడు అనే శీర్షిక బాగా అతుకుతుంది. ఆధునిక సమాజం ఆలోచనా ధోరణిని ఇది వ్యక్తపరుస్తుంది. ఇద్దరు సోదరుల మధ్య తల్లి చూపే వ్యత్యాసాన్ని అద్భుతంగా చిత్రీకరించిన కథ ఇది. నిజానికి తల్లి ప్రేమ లేకపోవడం వల్ల కాక, తన అసమర్థత చేత తన తమ్ముడి చేతిలో ఎలా అన్యాయానికి గురవుతాడో, తల్లి తమ్ముడి ఒత్తిడికి ఎలా గురై తనకు అన్యాయం చేస్తూ పోతుందో చెప్పే కథ ఇది. మంచివాడనే ముద్ర పడిన తర్వాత దాన్ని కాపాడుకోవడానినికి ఒక వ్యక్తి ఎంత అసమర్థుడిగా మారుతాడో ప్రతిభావంతంగా ఆయన చెప్పారు ఒక రకంగా మంచితనమనేది అసమర్థతగా రూపాంతరం చెందిన పరిణామాన్ని ఈ కథ చెబుతుంది.

పెళ్లయిన తర్వాత తన కొడుకు మారిపోయాడని, తనను అన్యాయం చేస్తున్నాడని, కోడలే కాపురంలో చిచ్చు పెట్టిందని స్త్రీలు రొద పెట్టడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. తల్లి ప్రభావం నుంచి భార్య ప్రభావంలోకి వెళ్లిన తర్వాత మంచివాడనే వ్యక్తిలోని సమర్థత బయట పడుతూ ఉంటుంది. ఆ కారణంగా అంతవరకు మంచితనం ముద్రలో కోల్పోయిన వాటిని దక్కించుకోవడానికి అతను ప్రయత్నిస్తాడు. ఈ ఘర్షణలో అతను తల్లిని వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఈ పరిణామాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన పొట్లపల్లి రామారావు ఆధునికుడు కాకుండా పోతాడని చెప్పలేం. చన్నుబాలు గుంజుకున్నట్లు గుంజుకోవాలె – లేకపోతే ఇంకెవరికైనా దఖలు పడుతాయని భార్య రమణమ్మ వెంకులుకు బోధిస్తుంది. అదే కోడలికి, అత్తకు మధ్య వైరంగా మారుతుంది. ప్రతి కుటుంబంలోని అత్తాకోడళ్ల మధ్య ఘర్షణకు కారణమయ్యే లక్షణాన్ని లోతుగా ఆలోచించి చెప్పిన కథ ఇది. ఈ కథ గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఇది అనుభవంలోని తాత్వికతను వెల్లడించిన కథ.

పొట్లపల్లి రామారావు కథల్లో చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు. కానీ, అతని తత్వంలో ధిక్కారం ఉంది. తిరుగుబాటు లక్షణం ఉంది. ఆధిపత్యాలను, ఆధిపత్యాలకు కేంద్రంగా ఉన్న ప్రభుత్వాలను, అవి నిర్దేశించిన సూత్రాలను అత్యంత నిర్మొహమాటంగా తన కథల్లో ఆయన దునుమాడాడు. అసమానతలకు కారణమైన సామాజిక లక్షణాలపై ఆయనకు అప్పటికే ఒక స్పష్టమైన అవగాహన ఉంది. న్యాయం కథ అటువంటిదే. ముఖ్యంగా మనిషిలోని అసహాయత, అజ్ఝానమే ఒక లోకువతనానికి, మరొకని ఆధిపత్యానికి దారి తీస్తుందని చెబుతాడు. అలాగే, రామసింగు అనే పాత్ర ద్వారా – అవును, ఏ విధంగానైనా బ్రతుకుతెరువుకు తోడ్పడని శాసనాలు, ప్రభుత్వాలు వున్నప్పుడు బీదలు శాసనధిక్కారము చేయక ఏమి చేస్తారని ప్రశ్నింపజేశాడు. సత్యాన్ని మరుగుపరిచి అసత్యం ఎలా ఊరేగుతుందో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు విముక్తి కథలో నూటికి కోటికి సత్యము చెప్పేవారెవరైనా ఉంటే వాళ్లను విప్లవకారుల క్రిందనో, దేశద్రోహుల క్రిందనో జతకట్టి జైళ్లలో తోసేస్తారని విముక్తి కథలో ఓ పాత్రతో అనిపిస్తాడు రచయిత. రాజ్య స్వభావం పట్ల పొట్లపల్లి రామారావుకు అప్పుడే స్పష్టమైన అవగాహన ఉందని చెప్పడానికి సోములు చేసిన నేరము, దొంగతనము చేయించింది ఆకలి, శాసనాలు చేసే ప్రభుత్వము అని జైలు కథలో చెప్పిన మాటలు అద్దం పడుతాయి. మా గ్రామం కథ రాజ్య యంత్రాంగం ఎంత పకడ్బందీగా ఉంటుందో, దానికి దళారులు ఎవరో చెబుతుంది. ఆ యంత్రాంగం సమాజంలోని కింది స్థాయిలో ఎంత పకడ్బందీగా ఉంటే, పైస్థాయి వరకు అంత పకడ్బందీగా ఉంటుందని ఈ కథ నిరూపిస్తుంది. దాని దుష్టస్వభావం ప్రభుత్వాల తాబేదార్ల నుంచి ఎలా పైకి పాకుతూ పోతుందో ఈ కథనే కాకుండా న్యాయం కథ కూడా అంత ప్రతిభావంతంగా చెబుతుంది.

హఠం, వెన్న కథలు అత్యంత సరళమైన రీతిలో కథనాత్మకంగా రచయితలు లేదా మేధావుల ఆలోచనా సరళిని వివరిస్తాయి. కీర్తి కోసం పాకులాడే మధ్యతరగతి మేధావుల వలువలు విప్పుతాయి. ఇతరుల గౌరవము కొరకు ఆత్మస్వేచ్ఛను చంపుకునే తన బలహీనతలన్నీ గోపాల్‌రావుకు జ్ఞాపకం వచ్చాయని హఠం కథలో రచయిత వ్యాఖ్యానిస్తాడు. ఈ రెండు కథల్లోనూ పిల్లల మనస్తత్వాలను తీసుకుని పెద్దలు గుణపాఠం నేర్చుకునే పద్ధతిని రచయిత ఎంపిక చేసుకున్నాడు.

పొట్లపల్లి రామారావు కులం అసమానతలను పెంచి పోషిస్తూ మానవుల మధ్య దడి కడుతున్న వైనాన్ని ఊరు – అడవి కథలో నర్మగర్భంగా చెప్పారు. నీరు అడిగితే పేరు అడుగుతారంటూ కులం ప్రాధాన్యాన్ని చెప్పారు. ముత్యాలబేరం కథ బాధితుల పక్షాన ఆలోచించే ఓ వ్యక్తి ఎలా పిచ్చివాడిగా పరిగణనలోకి వస్తాడో చెబుతుంది. సామాజిక పోకడకు, లక్షణాలకు భిన్నంగా వ్యవహరిస్తూ లోకకళ్యాణాన్ని కోరుకునే వ్యక్తి సమాజానికి అర్థం కాకపోవడాన్ని ఈ కథలో చూస్తాం. గజేంద్ర మోక్షం కథ చదువుతుంటే పతంజలి పిలక తిరుగుడు పూవు కథ గుర్తుకు రావడం యాధృచ్ఛికమే కావచ్చు. జైల్లో సిగరెట్ ముక్క, నా డైరీలో కొన్ని పేజీలు, కల వంటి కథలు పొట్లపల్లి రామారావును ఆలోచనాపరుడైన రచయితగా, ఆధునికతను అందిపుచ్చుకున్న రచయితగా చూపిస్తాయి. ఆలోచనలో, వ్యక్తీకరణలో ఆయన కాలం కన్నా ముందున్న రచయిత అని మనకు ఆయన రాసిన కథలు వెల్లడిస్తాయి. అదే సమయంలో పొట్లపల్లి రామారావు రైతుల పక్షాన నిలిచిన రచయితగా చూపిస్తాయి. రాజ్య యంత్రాంగానికి గ్రామం ఎలా మూలకేంద్రమో, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలం వ్యవసాయమనే విషయాన్ని చాలా నిర్దిష్టంగా చెబుతాయి. ఆ రకంగా నిర్దిష్టత నుంచి సార్వజనీనతకు ఈ కథలు విస్తరిస్తాయి. కోస్తాంధ్రకు చెందిన కరుణకుమార, పాలగుమ్మి పద్మరాజు తదితరుల స్థానంలో నిలబెట్టడానికి తగిన వస్తువు, కథనా నైపుణ్యం పొట్లపల్లి రామారావు ప్రదర్శించారు.

తన అమూర్త భావనలకు, ఆలోచనలకు సమర్థవంతమైన మూర్త రూపం ఇచ్చారు పొట్లపల్లి రామారావు. ఆలోచనలను, భావాలను రాసుకుంటూ పోతే కథ కాదు. కథా నిర్మాణానికి కావాల్సిన పనిముట్లు వేరే ఉంటాయి. సమస్య, సంఘటన, పరిష్కారం కథను నిర్మిస్తాయి. ఈ మూడు విషయాల్లో పొట్లపల్లి రామారావు తన సామర్థ్యాన్ని, విచక్షణను తన కథల్లో ప్రదర్శించారు. క్లుప్తత పాటించారు. అక్కడక్కడ ఆ కాలం తెలుగు రచయితల మాదిరిగానే జోక్యం చేసుకుని వ్యాఖ్యానాలు చేసినప్పటికీ అతివ్యాప్తి ఎక్కడా కనిపించదు. అమూర్త భావనలకు, ఆలోచనలకు సంఘటనలు, పాత్రల ద్వారా మూర్త రూపాన్ని కల్పించి, అద్బుతమైన శిల్ప నిర్మాణాన్ని ప్రదర్శించారు. మరి, ఎందుకు పొట్లపల్లి రామారావు తెలుగు సాహిత్యానికి ఆనకుండా పోయాడు. అలా ఆనకుండా పోవడానికి గల కారణాలను ఇప్పటికే చాలా చెప్పుకున్నాం. ఆయన కథలు తెలుగు సాహిత్యంలో ఏ కోవకు, ఏ స్థాయికి చెందుతాయో చెప్పడానికి వీలు కల్పించేందుకు తన వంతు బాధ్యతగా తెలంగాణ ప్రచురణలు ఆయన కథలను అందిస్తోంది. వాటిని చదివిన తర్వాత ఆ రచయిత స్థానాన్ని అంచనా వేసుకోవాలని చెప్పడానికి కాకుండా మన రచయితను మనం గుర్తు చేసుకుందాం, చదువుకుందాం అని ప్రకటించుకోవడానికి కూడా ఈ సంస్థ రామారావు కథలను అందిస్తున్నదని అనుకుందాం.

- కాసుల ప్రతాప రెడ్డి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Potlapalli Rama Rao was a prolific short story writer from Telangana. He was neglected by Telugu literature. He wrote short short stories in Telugu as an intellectual from middle class emerged in Telangana region. Telangana Prachuranalu brought out a book with his short stories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more