వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవగాహన, ఉద్వేగ వాస్తవికత

By Pratap
|
Google Oneindia TeluguNews

Varavara Rao
తెలంగాణలో పుట్టినందుకు తలలో అశాంతి సముద్రాలను, హృదయాల్లో నిప్పుల గుండాలను మోసుకుని తిరగాల్సి వుంటుంది. అలా మోస్తూ వాస్తవికతకు, భావోద్వేగానికి మధ్య సమన్వయం సాధిస్తూ మార్గనిర్దేశం చేయాల్సి వుంటుంది. వరవరరావు 'తెలంగాణ వ్యాసాలు' పుస్తకం చూసినప్పుడు ఒక రకమైన ఆవేదన, మరో రకమైన ఆనందమూ ఒకేసారి ముప్పిరిగొనడం ఆశ్చర్యమేమీ కాదేమో! గత నలబై యేళ్ల తెలంగాణకు, ఉద్యమాలకు ఆయన సాక్ష్యాలను తన వెంట మోసుకుని తిరుగుతున్నారు. థాబ్దాల మోత నుంచి ఆయనకు విరామం లభించే పరిస్థితులు రానందుకు బాధ, అన్ని సంకట స్థితుల్లోనూ తన వాణిని వినిపిస్తుంన్నందుకు ఆనందం కలగడం సహజమే. తన వద్ద వున్న సాక్ష్యాల్లో కొన్నింటిని ఇప్పటి పరిణామాలను సమన్వయం చేస్తూ వరవరరావు రాసిన తెలంగాణ వ్యాసాలను స్వేచ్ఛా సాహితి పుస్తకంగా తెచ్చింది.

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని ఒక ప్రజాస్వామిక పోరాటంగా అర్థం చేసుకుని ఆ వెలుగులో జ్ఞాపకాల దొంతరలను వర్తమానానికి అన్వయిస్తూ వరవరరావు ఈ తెలంగాణ వ్యాసాలు రాశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను నిటారుగానూ, స్పష్టంగానూ పెట్టే ప్రయత్నం ఆయన ప్రతి వ్యాసంలో కనిపిస్తుంది. అందుకు ఆయనకు సహకరించింది మొక్కవోని నిబద్ధత. తెలంగాణ ఉద్యమం ఆయన వెలుపలే కాదు, లోపలా వుందని, అది లోపలి నుంచి వెలుపలకి, వెలుపలి నుంచి లోపలికీ గుండె ఒడ్డును ఒరుసుకుంటూ సాగుతుందని ఆ వ్యాసాలు చదివితే అర్థమవుతుంది. ఇప్పటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి 1980 థకంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఉద్యమానికి చెందినవారు ప్రవక్తలు (?)గానూ, కార్యకర్తలుగానూ వున్నారు. వారికి గత తెలంగాణ ఉద్యమం ఒక బాల్య జ్ఞాపకం. ఆ ఉద్యమం పడిన పురుటి నొప్పులను, పుట్టిన శిశువుకు ఉగ్గుపాలు తాగించినవారిని గుర్తు చేస్తూ '1968-69, 1972 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - నా జ్ఞాపకాలు' అని వరవరరావు రాసిన వ్యాసం చాలా విలువైంది. ఇప్పటి ఉద్యమానికి అప్పటి ఉద్యమానికి మధ్య ఒక లంకెను కుదిరిస్తూ గత ఉద్యమానికి అర్థం చేసుకోవడానికి పనికి వస్తుందీ వ్యాసం.

వరవరరావు తన వ్యాసాల్లో తెలంగాణకు సంబంధించిన పలు చారిత్రకాంశాలను మన ముందుంచి రాజకీయాలు, వాటి ఆలంబనగా చేసుకుని కోస్తా ఆధిపత్య వర్గాలు ఒక వైపు కదిలి ఎక్కడ నిలబడ్డాయో వివరిస్తారు. సిపియం తీసుకున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిలోని లోగుట్టును విప్పిన వ్యాసాలు రెండు మూడు ఈ పుస్తకంలో ఉన్నాయి. 'తెలంగాణలో ఏభైలలో నీళ్ల కోసం పోరాడినవాళ్లు మాత్రమే కాకుండా నీళ్ల పట్టున ఉ్నవాళ్లు కూడా కమ్యూనిస్టులు మాత్రమే కాకుండా కోస్తా అగ్రవర్ణ ఆంధ్రులు కూడ అయ్యారన్నది ఒక చేదు నిజం' అని సూత్రీకరించడం ఆయన అవగాహన లోతువల్లనే సాధ్యమైంది. కోస్తాలో జరిగిన చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటంలోని నాయకులు తదనంతర కాలంలో ఎక్కడ నిలబడ్డారో, కోస్తాంధ్ర నాయకత్వంలోని సిపియం అక్కడి నుంచే రాజకీయాలను మాట్లాడుతున్నదనే విషయాన్ని, అది తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడానికి చారిత్రక భౌతికవాదాన్ని పక్కన పెట్టేసి ఎంత భావవాదానికి గురువుతున్నదో తెలియజేయడానికి వరవరరావు 'చిన్న రాష్ట్రాల ఆలోచన హిందూత్వ, ప్రపంచ బ్యాంకు కుట్రలో భాగమా?' వంటి వ్యాసాలను అందించారు. తెలంగాణ పోరాట వారసత్వ నైతిక బలం మీద మాత్రమే సిపియం, సిపిఐ ఇప్పటికీ నిలబడుతున్నాయి. అంతటి బలాన్ని, బలగాన్ని అందించిన తెలంగాణకు వ్యతిరేకంగా ఆ పార్టీలు వ్యవహరించడానికి గల కారణాలను, వాటి లోతులను నిర్మమకారంగా ఆయన విశ్లేషించారు.

ఒక చారిత్రక దృక్కోణం నుంచి ఆంధ్రప్రదేశ్‌ అవతరణను దాశరిథి, కాళోజీ వంటి కవులు ఎందుకు ఆహ్వానించారో, వారి కలలు ఎలా కల్లలయ్యాయో ఆయన వ్యాసాలు వివరిస్తాయి. తెలుగువాళ్లు అనే సూత్రం మీద వారు భావోద్వేగమైన కలయికను, ఆలింగనాలను వారు కోరుకున్న తీరును, వారి ఆకాంక్ష గాలిలో దీపమైన వైనాన్ని వరవరరావు వివరించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తెలుగు పరిరక్షణ ఉద్యమం ఎలా ముందుకు వచ్చిందో వివరించిన తీరు చాలా మందికి ఉపయోగపడుతుంది. పైకి చాలా ఆదర్శంగా, అనుసరణీయంగా కనిపించే ఉద్యమాల లోపాలను, వాటి వెనక ఉన్న ప్రజావ్యతిరేక వైఖరిని విశ్లేషించడం చాలా కష్టమైన పని. వాటిని నలుగురికి అర్థమయ్యేలా, అపోహలకు తావు ఇవ్వకుండా సంయమనంతో, చారిత్రక దృష్టితో వివరించడం కూడా అంతే కష్టమైన పని. చారిత్రక అవగాహన, సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకునే సైద్ధాంతిక పనిముట్లు వరవరరావుకు వాటిని సరైన దృక్కోణంలో వివరించడానికి పనికి వచ్చాయనిపిస్తుంది.

వరవరరావు తెలంగాణ వ్యాసాలు పుస్తకం విషయాలను అర్థం చేసుకోవడానికే కాకుండా మన ఆలోచనలను, అవగాహనలను పెంపొందించుకుని దిశానిర్దేశం చేసుకోవడానికి పనికి వస్తాయి. అంతేకాకుండా గత పదేళ్లకు పైగా మాట్లాడుతున్న విషయాలను మరింత స్పష్టంగా మాట్లాడడానికి ఇప్పటి తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రచయితలకు పనికి వస్తాయి.

"...underdevelopment is total, integral, It affects every part of our lives. The problems of our societies are mainly political. And the committment of a writer is with the reality of all of society, not just with a small part of it. If not, he is as bad as the politicians who disregard a large part of our reality. That is why authors, painters, writers in Lation America get politically involved" - Gabriel Garcia Marquez.

తెలంగాణ రచయితల పరిస్థితి అదే. అందువల్ల వరవరరావులాంటి వాళ్లతో చాయ్‌లు చప్పరిస్తూ కేవలం సాహిత్యం గురించి మాత్రమే మాట్లాడుకోవాలనే స్వప్నం అందని ద్రాక్ష పండుగానే మిగిలిపోతున్నది. అన్నీ తెలిసి ఉండడమే కాదు, తెలుసుకోవాల్సి రావడం కూడా శాపమే. ఎవరేమైనా మాట్లాడవచ్చు గానీ తెలంగాణ రచయిత విషయాలు తెలుసుకోకుండా, విషయాలు తెలియకుండా మాట్లాడడానికి వీలు కాదు. ఆ విషయాలను తెలియజేయడానికి, ప్రజాస్వామిక దృక్పథాన్ని అందించడానికి వరవరరావులాంటి వారు కూడా నిత్యం రగులుతూనే ఉండాలనే విషయాన్ని ఆయన 'తెలంగాణ వ్యాసాలు' పుస్తకం తెలియజేస్తున్నది.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
An eminent revolutionary writer and social activist Varavara Rao has written articles on Telangana. collection of these essays were published as Telangana Vyasalu (Telangana Essays).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X