వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్లిష్ట సమాజానికి సరళమైన కథలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sujatha Reddy
గత అరవై యేళ్ల కాలంలోని సామాజిక పరిణామాలు ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పులు అనేకం. ఆ పరిణామాల ఫలితాలు అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన రీతిలో ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత 35 యేళ్ల కాలంలో తెలంగాణలో వచ్చిన మార్పులు సామాజిక సంబంధాల్లో విస్తృతమైన మార్పులు తెచ్చాయి. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, సంస్కరణోద్యమాలు అన్నీ కట్టగలిసి ఆర్థిక సంబంధాలను ప్రభావితం చేస్తే అవి మానవ సంబంధాల్లో మార్పులకు కారణమయ్యాయి. ఈ నేపథ్యాన్ని అంతటినీ చిత్రిక కట్టడం చాలా కష్టమైన పని. వాటిని విభిన్న కోణాల నుంచి అర్థం చేసుకోవడమే కష్టం. అర్థమైన తర్వాత వాటిని సరళమైన రీతిలో వ్యక్తీకరించడం చాలా మరింత కష్టం. సంక్లిష్టమైన అనేక విషయాలను అర్థం చేసుకుంటే తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో వచ్చిన పెనుమార్పులను సరళంగానూ, సూటిగానూ, నిర్మమకారంగానూ వ్యక్తీకరించగలం. ఈ దృష్ట్యా చూసినప్పుడు ముదిగంటి సుజాతారెడ్డి 'వ్యాపార మృగం' కథల విస్తృతి, వాటి విలువ మనకు అర్థమవుతాయి. ఆమె ఇంతకు 'విసుర్రాయి', 'మింగుతున్న పట్నం' అనే కథా సంపుటాలను వెలువరించారు. మొదటి సంపుటి నుంచి రెండో సంపుటికి ఆమె చేసిన ప్రయాణమే అత్యంత విలువైంది. భూకబ్జాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల చుట్టూ అల్లుకున్న మాఫియా గుట్టును అత్యంత సాధారణమైన పద్ధతిలో, సరళమైన అవగాహనతో వ్యక్తీకరించిన తీరు మరో రచయితకు సాధ్యం కాదనిపిస్తుంది. ఇక 'వ్యాపార మృగం' కథా సంకలనానికి వచ్చేసరికి అతి విస్తృతమైన కాన్వాసు మీద పర్చుకోవాల్సిన విషయాలను కథలు కథలుగా మలుచుకుంటూ పోయిన తీరు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తుంది కూడా. ఈ ఐదేరాళ్ల కాలంలోని మార్కెట్‌ ఎకానమీ ప్రభావం, ప్రపంచీకరణ మన జీవితాలపై వేస్తున్న ప్రభావాలతో పాటు కొనవూపిరితో ఉన్న ఫ్యూడల్‌ సంస్కృతి మచ్చలు - అన్నీ కలగలసి తెలంగాణ సమాజాన్ని అద్దంలో చూపెట్టారు సుజాతారెడ్డి.

'వ్యాపార మృగం' సంకలనంలో మొత్తం 20 కథలున్నాయి. ఈ కథల్లో సుజాతారెడ్డి భిన్న మతాల మధ్య, భన్ని సంస్కృతుల మధ్య సామరస్యాన్ని కాంక్షించారు. ఈ సామరస్యం యథాతధ సామరస్యం కాదు. ఆధిపత్యమతాలు, ఆధిపత్య సంస్కృతులు తమ తప్పిదాలను గ్రహించే పరిణామాలు చోటు చేసుకోవడం ద్వారా బలహీన పక్షాల సానుకూల వైఖరిని తీసుకోవడం ఈ కథల్లో కనిపించే సాధారణ లక్షణం. అలా శాంతియుత పరివర్తన సాధ్యం కాని చోట 'జహంగీర్‌బీ' కథలో మాదిరిగా అన్యాయంపై పోరాటం చేసేందుకు సహకారాన్ని అందించే ఉదారవాదులు ఉండడం చూస్తాం. గత శతాబ్ది ఉద్యమాలు, ఇటీవలి ప్రపంచీకరణ, మత రాజకీయాల ప్రాబల్యం నేపథ్యంలో అత్యంత వేగంగా సంభవించిన మార్పులను అన్నింటినీ సుజాతారెడ్డి తన కథల్లో చిత్రిక కట్టారు. 'ముంజలు', 'న్యూ ఆనంద్‌ హోటల్‌', '9/11 లవ్‌స్టోరీ' కథలు ప్రపంచీకరణ ప్రభావాల వల్ల సంభవించిన పరిణామాలను గుర్తించి వాటికి అనుగుణంగా తమ కార్యకలాపాలను మలుచుకుని నయా సంపన్నవర్గాలుగా ఎదిగిన సామాజిక శ్రేణులను చూపిస్తాయి. అదే సమయంలో 'న్యూ ఆనంద్‌ హోటల్‌' యంత్రాలు ప్రవేశించి మనుషులను వీధుల మీదికి నెడుతున్న విషయాన్ని చాలా అలవోకగా, మానవ సంబంధాల కోణం నుంచి చెబుతుంది. 'ముంజలు' కథ అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్వదేశీగడ్డ మీద తాను అనుభవించిన ఆనందాన్ని నెమరేసుకునే రవీందర్‌ అనే పాత్ర ద్వారా విచ్ఛిన్నమవుతున్న మన సంస్కృతీసంప్రదాయాలను తెలియజేస్తుంది. '9/11 లవ్‌స్టోరీ' ఒక ప్రతీకాత్మక కథ. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి నేపథ్యాన్ని తీసుకుని ఆధిపత్య, బలహీన సమాజాల మధ్య ప్రేమపూరితమైన సంబంధాలను నెలకొల్పుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.

'వ్యాపారమృగం'లోని కథల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కథలు 'జహంగీర్‌బీ', 'షబానా దుఃఖం', 'మున్నీబాయి'. ముస్లింవాద సాహిత్య ఆవిర్భావ, వికాసాల నేపథ్యం నుంచి వచ్చిన కథలివి. ముస్లిమేతర రచయితలు ముస్లింల పట్ల అనుసరించాల్సిన బాధ్యతా యుతమైన కర్తవ్యాన్ని ఈ కథలు గుర్తు చేస్తాయి. ఈ కథల్లో 'జహంగీర్‌బీ' కథ అత్యంత విషాదకరమైంది. ముస్లిం సమాజంలోని పేద ముస్లిం స్త్రీకి జహంగీర్‌బీ ఒక ప్రతీక. ఇక 'షబానా దుఃఖం' ఒక ప్రతీకాత్మక కథ. అత్యంత ప్రతిభావంతమైన కథ కూడా. మతాలకు అతీతంగా కలిసి వున్న సమాజాన్ని రాజకీయాలు, ఆ రాజకీయాలను అడ్డం పెట్టుకుని ప్రయోజనం పొందే శక్తులు వేరు చేసి తమ పబ్బం గడుపుకున్న వైనాన్ని పరిణత అవగాహనతో రాసిన కథ ఇది. ముస్లింలను స్వదేశంలోనే పరాయీకరణకు గురవుతున్న తీరును, వారి మానసిక సంక్షోభాన్ని సుజాతారెడ్డి ఈ కథలో ప్రతీకాత్మకంగా చిత్రించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఒక సానుకూల దృక్కోణాన్ని అందించే కథలు ఇవి. హిందూ మతం వ్యక్తి విముక్తి బోధిస్తే, ఇస్లాం, క్రైస్తవ మతాలు సమిష్టి విముక్తిని ప్రబోధిస్తాయి. స్వేచ్ఛ కోసం, మానవ స్పర్శ కోసం కిందికులాలవాళ్లు, బాధితులు ఇతర మతాలను ఆశ్రయించారు; ఆశ్రయిస్తున్నారు. దాని ఫలితాన్ని అనుభవించిన కుటుంబగాథే 'నిస్సహాయులు'. హిందూ ధర్మ ప్రబోధకులు నిజాయితీగా ఆలోచించాల్సిన అవసరాన్ని ఈ కథ తెలియజేస్తుంది.

'కొసరి కొసరి బేరాలు', 'మారిన బంధాలు', 'నిశ్శబ్ద విప్లం', 'లోకాస్‌' కథలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారినవారి జీవితాలను, మారని జీవితాలను చిత్రిస్తూనే ఆర్థికంగా చితికిపోయినా అగ్రకుల సాంస్కృతిక, మానవ సంబంధాలను తెలియజేస్తాయి. 'కొసరి కొసరి బేరాలు' కథ మొత్తం సంభాషణలతో సాగుతూనే ఫ్యూడల్‌ సంస్కృతిని వదులకుని బయట పడి కొత్త వృత్తిలోకి మారిన నయా సంపన్నవర్గాల సంస్కృతిని, ధనవ్యామోహాన్ని, కుహనా విలువలను దృశ్యమానం చేసే డాక్యుమెంటరీ. రఘోత్తమరెడ్డి 'చావు విందు' తర్వాత చితికిపోతున్న దొరల జీవితాలను చిత్రిక కట్టిన కథలు బహుశా ఇవేనేమో! ఈ కథల్లో నేరుగా రెడ్ల దొరలు అని రచయిత్రి ప్రస్తావించకపోయినా అవన్నీ రెడ్ల దొరల జీవితాలేనని చదువుతుంటే అర్థమవుతుంది.

'బారామాసీలు', 'ఇంకా పొద్దుపొడవలేదు' స్త్రీవాద కథలు. స్త్రీలు వ్యక్తిత్వాలను సంతరించుకునే ప్రయత్నాలను పురుష ప్రపంచం సానుకూలంగా చూడలేని కోణాన్ని ఈ కథల్లో చిత్రించారు. 'సంస్కారబంధం', 'ముంజలు' తెలుగులో వచ్చిన డయాస్పోరా కథలు. ఇక, 'వ్యాపార మృగం', 'డబుల్‌ మర్డర్‌' వస్తురీత్యా బలమైన కథలే అయినా శిల్పరీత్యా కాస్తా క్లుప్తత దెబ్బ తిన్నట్లు అనిపిస్తాయి. 'వ్యాపార మృగం' కథావస్తువు సామాజికావసరం. ఆ కథలోని కళాకారిణి హత్యకు నేపథ్యం అత్యంత సంక్లిష్టమైంది. ఆ సంక్లిష్టతను అర్థం చేసుకుని సరళంగా చెప్పేగల సత్తా సుజాతారెడ్డికి ఉందనే విషయం మిగతా కథలు తెలియజేస్తాయి.

మొత్తం మీద సుజాతారెడ్డి కథలు వర్తమాన సమాజం అవసరాలను తీరుస్తాయి. సమాజం పట్ల, మానవ సంబంధాల పట్ల, మన సంస్కృతీసంప్రదాయాల పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని పాఠకులు అందిస్తాయి. శిల్పపరంగా కూడా ఆ కథలు పరిణతిని సాధించడం వల్ల ఆ ప్రయోజనాన్ని తప్పకుండా బలంగా నెరవేరుస్తాయి.

-కాసుల ప్రతాపరెడ్డి

English summary
A prominent short story writer and novelist is known for her language usage and analysis of society in a simplistic way. The complex society will be presented in her stories in simple way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X