వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్దం, దివిటీ ఒక్కడే

By Pratap
|
Google Oneindia TeluguNews

Suravaram
సురవరం ప్రతాప రెడ్డి సామాజిక కార్యకర్త, సామాజిక పరిశోధకుడు మాత్రమే కాదు, గొప్ప కవి కూడా. ఆయన కవిత్వాన్ని ఒక దగ్గర చేర్చి సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకుడిగా కవిలె సంస్థ సురవరం కవిత్వం పేర పుస్తకాన్ని వెలువరించింది. ఆ పుస్తకానికి ప్రముఖ విమర్శకుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ముందు మాట రాశారు. పాఠకుల కోసం ఆ ముందుమాటను ఇక్కడ ఇస్తున్నాం-

‘‘ఎందరి సురల వరాల వల్లనో సురవరం ప్రతాపరెడ్డి గారిని తెలంగాణం నిజ గర్భశుక్తిముక్తాఫలంగా నోచింది' -వానమామలై వరదాచార్యులు

ఇప్పటిదాకా సురవరం కవిత్వం పుస్తకంగా రాకపోవడం తెలుగు సాహిత్యం దురదృష్టం. కవిత్వం నుంచి ఎటువైపూ మళ్ళీ ఉండక పోతే సురవరం గొప్ప కవి అయి ఉండేవాడు. అందుకు ఆయన తొలినాటి కవిత ప్రబల సాక్షంగా కనిపిస్తుంది. అది ‘సుల్తాన్‌ మహ్మద్‌ ఘజ్నవీ' (1923). గజనీ క్రౌర్యాన్ని, ఫిరదౌసి పట్ల చేసిన మోసాన్ని, చివరికి గజనీ హృదయ పరితాపాన్నీ, వేదనను రసవంతంగా చిత్రించిన కవిత ఇది.

కీర్తియొక్కటి నిత్యమై క్షితిని వెలుగు......
బియ్యమున నూలుగలసిన విధము చూవె,
భూమిపై హెచ్చుతగ్గులు పొసగి యుండు
నుర్వి బూడిద నందఱునొకటి సుమ్ము''

కవిగా బయలు దేరిన సురవరం ఎక్కడ తేలినాడు? కవిగా బయలు దేరడమే ఒక పుణ్యకార్యం. కవిగా బయలుదేరిన శేషాద్రి రమణకవులు, గడియారం రామకృష్ణశర్మ, బిరుదురాజు రామరాజు లాంటి ఎందరో ఇతర రంగాలకు మళ్ళినారు. సురవరం కూడా అంతే. బహుముఖంగా పయనించినాడు. రెడ్డి హాస్టల్‌ బాధ్యత, గోలకొండ పత్రిక స్థాపన దగ్గరి నుంచి సురవరం పయనం ఆయన కోరుకున్నట్టు జరుగలేదు. ఆనాటి తెలంగాణ సమాజం ఎట్లా డిమాండ్‌ చేస్తే అట్లా పయనించినాడు. సురవరం ఒక్కరే కాదు ఆనాటి సాహితీపరులు చాలామంది తెలంగాణ అవసరాలను బట్టి ఏకకాలంలో అనేక ముఖాలుగా అనేక చేతులతో పనిచేయాల్సి వచ్చింది. అట్లా సురవరం కూడా సంపాదకుడుగా, చరిత్రకారుడిగా, విమర్శకుడిగా, వ్యాసకర్తగా, కథకుడిగా, నవలాకారుడిగా, నాటకకర్తగా, తెలంగాణ మహాసభ ఉద్యమకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా, సామాజిక వ్యాఖ్యాతగా, సంస్కరణశీలిగా, సామాజిక న్యాయదృష్టితో సామాజిక చోదక శక్తిగా పలురంగాలలో అగ్రగామిగా సమర్ధవంతంగా పనిచేసి తెలంగాణకే కాదు తెలుగు జాతికే వైతాళికుడైనాడు.
ప్రసిద్ధ పరిశోధకుడైన మల్లంపల్లి సోమశేఖరశర్మ మాటల్లో చెప్పుకుంటే ‘‘విమర్శకులలో ఆయన విమర్శకుడు, కవులలో కవి, పండితులలో పండితుడు, రాజకీయ వేత్తలలో రాజకీయవేత్త, పత్రికా రచయితలలో పత్రికా రచయిత, నాటకకర్తలలో నాటకకర్త వీని అన్నింటికి మించి పరిశోధకులకు మహా పరిశోధకుడు, దేశాభిమానులలో మహా దేశాభిమాని''.

అట్లా ఆయన ఇన్ని రంగాలలో మునిగి తేలుతూ కూడ కవిత్వం పట్ల అభిమానాన్ని వదిలి పెట్టలేదు. జీవితాంతం కవిత్వం రాయడం మానలేదు. అయితే కథకుడిగా, సంపాదకుడిగా, విమర్శకుడిగా, చరిత్రకారుడిగా, పరిశోధకుడిగా లోకానికి తెలిసినంతగా కవిగా తెలియదు. అందుకు ఆయన కవితలు ఒక పుస్తకంగా రాకపోవడమే కారణం. తెలంగాణ వైభవాల మీద పడిన దుమ్ము ధూళినీ తొలగిస్తున్న పరిశోధకుడు, మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ సురవరం కవిత్వాన్ని మొదటి సారిగా పుస్తకంగా తేవడం అభినందనీయం. తెచ్చి సురవరం కవిత్వం గురించి ఒక అంచనాకు రావడానికి అవకాశం కల్పించినందుకు మరోసారి అభినందనలు.

కవి ప్రతిభను అంచనా కట్టడానికి రెండు గీటురాళ్ళుంటవి. ఒకటి కవితా వస్తువును ఎన్నుకోవడంలో కనబరిచే ప్రతిభ. రెండు ఎన్నుకున్న వస్తువును అభివ్యక్తీకరించడంలో చూపే ప్రతిభ.

సురవరం కవిత్వం మొదలుబెట్టిన కాలం నుంచి ఆయన జీవితాంతం వరకు తెలంగాణ సమాజం అనేక పరివర్తనలకు, సంక్షోభాలకు, సంచలనాలకు సంఘర్షణలకు లోనైన కాలం. ఆ పరిణామంలో సురవరం ప్రతాపరెడ్డి స్వయంగా భాగస్వామి. దానిక చోదక శక్తి గూడ. దాని చేత ప్రభావితుడు కూడ. ఇవి పడుగు పేకలా అల్లుకు పోయినస్థితి. ఇంగ్లీషులో చెప్పాలంటే తీవషఱజూతీశీషaశ్రీ మార్క్సిస్టు పరిభాషలో చెప్పాలంటే గతితార్కికం.

తెలిసినంతవరకు సురవరం సామాజిక గమనం పట్ల ఎరుకతో రాసిన మొదటి కవిత ‘దేశమాత'.గాంధీ ప్రవేశంతో జాతీయోద్యమం మలుపుతిరిగి ఆ ప్రభావంతో -

అట్టి ప్రధిత హిందూస్థానమునకు నేడు
పరుల చేబడి క్షీణింపవలసెగాదె
దేవ!జగదీశ! మా మాతృదేశమునకు
పూర్వ వైభవమొనర్చి ప్రోచుమయ్య (దేశమాత)

శృంఖలాబద్ద భారతి క్షేమమరసి
దాస్య మొనరింప దలచు మీర
లట్టి ధన్యుల సంతతి నడచి వైచు
టెంత శూరత్వమో మదినెంచుడయ (ఎంతటి శూరత్వమో)

ఆంగ్లేయ వ్యతిరేకత వీటి సారం. సురవరాన్ని జాతీయోద్యమ కవిగా నిలబెట్టే కవితలివి.‘భక్త తుకారాం'లో కూడా దేశాభిమానాన్ని వ్యక్తం జేసే పద్యాలున్నవి.

‘ఆంధ్రజనసంఘం' ఆవిర్భావంలో, ఆ తర్వాత ‘ఆంధ్రమహాసభ' ఆవిర్భావ వికాసంలో తనూ భాగస్వామిjైు రాసిన పద్యం

సీ. ఒకనాడు పూర్వాపరోదధి వేళల
వ్యాపించి మించెను వన్నె చెలగ
ఒకనాడు వింధ్యాచలోత్తుంగ శిఖరంబు
పై నుండి యంతట పాఱ జూచె
ఒకనాడు పటు భీకరోద్ధామ శక్తిjైు
భామినీ పతుల సలాములందె
ఒకనాడు కాకత ప్రకటిత బలముచె
సంగ్రామ విజయ ధ్వజంబు నెత్తె
అట్టి సాహసంబుల జేసె ఆంధ్రమాత
తన కుమారులు శూరులై తనరు కతన
మరల యుద్ధరింపుడు మన మాతృభూవి (ప్రబోధము)

ఆంగ్లేయులు కల్పించిన ఆత్మన్యూనత నుంచి బయటపడటానికి భారతీయుల్లో ఐక్యతా భావం కలిగించడానికి జాతీయోద్యమంలో గత వైభవాన్ని గానం చేసినారు. సీమాంధ్రలో తమిళుల ఆధిక్యత నుంచి బయటపడటానికి, ఆంధ్ర రాష్ట్ర సాధనకు గతవైభవాన్ని ఉన్నతీకరించినారు. వీటితో కొంత సామ్యమున్నప్పటికీ తెలంగాణ పరిస్థితి కొంత భిన్నం.పై రెండు సందర్భాల్లో దేశ స్వాతంత్య్రం, ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు అనేవి ముఖ్యాంశాలు. తద్భిన్నంగా తెలంగాణలో నిజాం రాష్ట్రంలో ఉంటూనే ఉర్దూ, మరాఠీ భాషావ్యవహర్తల ఆధిక్యత నుంచి బయటపడటానికి తెలంగాణ ప్రాతినిధ్యాన్ని సాధించడం, తెలంగాణ ఉనికిని నిలబెట్టడం అనే లక్ష్యాలతో గతవైభవ కీర్తి గానం జరిగింది. అదే పై పద్య సారాంశం. ఆ ధోరణి ప్రారంభకుల్లో సురవరం ప్రముఖుడు. దాన్ని ఈ పద్యం వ్యక్తం చేస్తుంది.

తెలంగాణ ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని ప్రోది చేయడానికి ఆనాటి రాజకీయ నిర్బంధాల మూలంగా సూటిగా ఆ అంశాల ప్రాతిపదికమీద కాకుండా తెలుగు భాషను కేంద్రబిందువుగా చేసుకున్నాడు. అట్లా తెలుగుభాషా వైభవాన్ని, దానికి తగ్గిన ప్రాధాన్యతను బేస్‌గా చేసికొని రాజకీయ లక్ష్యం వైపు గురిపెట్టినాడు సురవరం.

ఆలంపురీ నందనారామ విభ్రాజి
మల్గోబ ఫలరాజి మధుర రుచికి...
తేనె తేటల నవకంపు సోనలకునుÑ
సాటియగును మా తెనుగు భాషామతల్లి.
(తెనుగు భాష)
సన్నగిలి నట్టి యాంధ్రభాషా ప్రసక్తి...
జృంభితంబుగ బహుధాన్య! చెయవలదె? (ఉగాది కోరిక)

శ్రీ నిజాం రాష్ట్ర ఘనతా విశేషమెఱిగి
పటుకవిత్వంపుఁ దత్వమ్ము ప్రౌడి నరసి...

రాష్ట్రియ సుకవి పోషణ భ్రాజితంబు (గోలకొండ కవుల సంచిక
బలిమిగలవారె పూజ్యులు వసుధలోన
బానిసలకెందు మన్నన వడయనౌనె (నీతిపంచకం)

అనిశము మాతృదేశహిత మాత్మను గోరెడు వాడె భక్తుడౌ
(నీతి పంచకం)

ఈ అంశాల ద్వారా, ఆంధ్రమహాసభ, గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, గోలకొండ పత్రికా నిర్వహణ తదితర కార్యకలాపాల ద్వారా రాజకీయ ప్రజాస్వామికీకరణకు పునాది వేసి, దాని విస్తృతికి దోహదం చేసినాడు.

సురవరం సామాజికంగా కూడా ప్రజాస్వామికీకరణకు చోదక శక్తి అయిండు. యూరప్‌లో వచ్చిన మానవవాద నేపథ్యంలో బ్రహ్మసమాజము, ఆర్యసమాజం, ప్రార్థన సమాజం, తదితర సంస్థలు తెచ్చిన సంస్కరణోద్యమ వాతావరణంలో సామాజిక కదలికలను ఆవాహన చేసుకొని సురవరం ప్రజాస్వామ్యం హృదయంగా పయనించినాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, హేతువు, మార్పు అనే పంచభూతాల కలయికగా నిర్మితమైన ఆధునికత, ప్రజాస్వామిక దృక్పథం ఆయన అన్ని కార్యకలాపాల్లో కవితా వస్తు వరణంలో అడుగడుగునా కనిపిస్తది. స్వేచ్ఛా భావన పైన పేర్కొన్న జాతీయోద్యమ, ఆంధ్రోద్యమ కవితల్లో రాజకీయాభివ్యక్తిని పొందగా, సమానత్వ, సౌభ్రాతృత్వ, హేతువాద భావనలు, మిగతా కవితల్లో వ్యక్తమయినవి.

యూరపు పునరుజ్జీవనోద్యమంలో మత వ్యవస్థను, మూఢ నమ్మకాలను, నిలువరించడానికి హేతువాదాన్ని, తార్కికతను, శాస్త్ర విజ్ఞానాన్ని (గెలీలియో, కోపర్నికస్‌) సాధనంగా చేసుకున్నారు. చేసికొని మత ప్రామాణికతను ప్రశ్నించినారు. తెలుగులో గురజాడ, త్రిపురనేని రామస్వామి చౌదరి ఆ పనిచేసినారు. అలాంటి పని సురవరం కూడా చేసినాడు కింది కవితల్లో
నాపేర మీపేర నానాపురాణముల్‌
వ్రాయించి వంచింత్రు పామరులను
స్మృతి శాస్త్ర కర్తల మేటి తాతల పేర
వెలయింప జేతురు వేరు స్మృతుల...
వర్ణాశ్రమాచార పాలనంబుల మిష
సర్వుల హింసింత్రు సాహసించి...
వ్రతములు తంత్రజాలమని, వంచన సేతురు ద్రవ్య కాంక్షచే
(సూతాఖ్యాయిక)
ఇట్టి వారిని నేవేళ! నింద్ర! చంద్ర!
నారద! యవతార పురుష! నాగ మిగుల
సన్నుతించి పౌరాణికుల్‌ జనుల మోస
గించి రాది కాలము నుండి యింతదనుక
(పౌరాణికేంద్రజాలము)

తక్కువ కులాల వారిని గాడిదతో ఉపమించిన సందర్భంలో బాధపడిన సురవరం వేదకాలం మొదలుకొని గాడిద ప్రాశస్త్యాన్ని ఉగ్గడిరచి శ్రీశ్రీ ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల'లకు కావ్య గౌరవం కలిగించినట్టు (శ్రీశ్రీ కంటే ముందే) ‘‘అల్పు''లకు కావ్యగౌరవాన్ని కలిగించినాడు. కింది పద్యంలో
నీ తేజమును గాంచి చేతో ముదంబంది
తరణియే నీపేరు దాల్చె సుమ్ము
కామదేశుడు జయకాళహంబు ధ్వనింప
నిను సాధనుగ గైకొనియె సుమ్ము
జడదారులెల్ల నీ నడవడి గాంచియే
బూడిద మైనిండ బూసి కొనిరి
భవదీయ గాత్ర సంస్పర్శ చేఁబూతమౌ
నుడుపుల నందఱు తొడిగికొనిరి
(గార్ధభేశ్వర స్త్రోత్రము)

రెడ్డి హాస్టల్‌ నిర్వహణ , రెడ్డిహాస్టల్‌తో పాటు మున్నూరుకాపు, వైశ్య, గౌడ, పద్మశాలి మొదలైన హాస్టళ్ల ఏర్పాటు, అందుకు సురవరం తోడ్పాటు కులాల పరంగా పైకి కనిపిస్తున్నా అది ప్రజాస్వామికీకరణలో భాగమే.

ఈ వివిధ కులాలు తమ ప్రాతినిధ్యం కోసం ఎదుర్కొన్న సంఘర్షణలో ఒకవైపు మరాఠీ, ఉర్దూ భాషా వ్యవహర్తల ఆధిక్యత, రెండో వైపు బ్రాహ్మణాధిక్యత (రెడ్డి హాస్టల్‌ నిజాం ప్రభుత్వ వ్యతిరేకుల నిలయంగా మారిందని కొందరు పండితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడాన్ని ఇక్కడ గమనించాలె చూ. గోలకొండ పత్రిక ) అడ్డంగా నిలిచినవి. ఆ ఆధిక్యతను తోసి వేస్తే తప్ప చోటు లభించదు. అందుకు ప్రతాపరెడ్డి మిగతా రచనలతోపాటు కవిత్వ రచన కూడా చేసిండు. ఈ సామాజిక ప్రజాస్వామకీకరణలో భాగంగానే గోలకొండ కవుల సంచికలో ప్రతాపరెడ్డి అన్ని కులాలకు, స్త్రీలకు, జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించినాడు.

ఈ క్రమంలో ఆయన అనేక కులసంఘాలకు అండగా నిలబడినాడు. భాగ్యరెడ్డి వర్మ రచనలకు గోలకొండ పత్రికలో స్థానమివ్వడమే గాకుండా మాదిగలు సంఘటితం కావడానికి వసతి(1928) కల్పించాడు. వాళ్ళ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉండి వాళ్ళ అభిమానానికి పాత్రుడయినాడు. ప్రథమాంధ్ర మహాసభలో భాగ్యరెడ్డి వర్మ ప్రవేశానికి సంప్రదాయవాదులు చెప్పిన అభ్యంతరాలను తిరస్కరించి ఆధునిక ధృక్కోణంతో సానుకూలతను కల్పించినాడు. ఇదంతా
తే. కవులు, భక్తులు, ఋషులు చక్రాధిపతులు
మున్నుగా గల విజ్ఞులు పుట్టినట్టి
వంశముల నంటరాదని పలుకు జనులు
దేశ విద్రోహకులు గాక, దేశహితులె
(అస్పృశ్యతా దోషం)
‘బ్రాహ్మణుల మాలల నొక్క విధంబు జూచు
నా జనుడె మనీషి... (నీతి పంచకము)
అనే కవితల్లో వ్యక్తమయింది. ఇవి కూడా జాషువా ‘గబ్బిలం' (1941) కన్నా కుసుమధర్మన్న ‘హరిజన శతకం' (1933) కన్నా ముందే రాయడం విశేషం. కవిత్వాభివ్యక్తికే పరిమితమయిన మిగతా కవుల్లా కాకుండా కార్యాచరణలో కూడా ముందుండడాన్ని పైన పేర్కొన్న విషయాలు తెలుపుతున్నవి. అది సురవరం చిత్తశుద్ధికి నిదర్శనం. ‘చిత్ర గుప్తుని ఖాతా' అనే కవితలో కూడా వర్ణ వివక్షను సమర్ధవంతంగా, వ్యంగ్యంగా నిరసించిండు సురవరం. ‘అతిథులు తాకగూడదని బాధలొనర్తురు తోడి వారికిన్‌' అని ‘సూతాఖ్యాయిక'లో రాసిండు. కుల వ్యవస్థను నిరసిస్తూ ‘భక్త తుకారాం'లో గొప్ప పద్యాలు రాసిండు.

వెట్టివాని పాట (దండకం1931) ద్వారా వెట్టిచాకిరీ బీభత్స దృశ్యాన్ని కళ్ళకు కట్టించిండు. (కథల్లో కూడా అద్భుతంగా వర్ణించిండు.) సాహిత్యకారుడి పని అంతే. సురవరం అంతకుమించిన వాడు. కాబట్టే ఆంధ్రమహాసభలో వెట్టిచాకిరీ నిర్మూలనకు తీర్మానం చేయించినాడు. తత్ఫలితంగా, ఇంకా ఇతరుల కృషి మూలంగా నిజాం వెట్టిచాకిరీని నిషేధించిండు. (అది సంపూర్ణంగా అమలుకాకపోవడం వేరే విషయం)

ఆయన ప్రజాస్వామిక దృక్పథాన్ని పట్టించే మరో కవిత ‘పాలమూరు పటేండ్ల భాష'. ఇందులో భాష గురించే చెప్పినట్లు పైకి కన్పించినా ఆ భాష ద్వారా పటేండ్ల దౌర్జన్యాన్ని, ఆధిక్యతను, భూస్వామ్య భావాజాలాన్ని బట్టబయలు చేసిండు. చేసి తన మూలాన్నే ప్రశ్నించే చర్చను లేవదీయడం గొప్ప విషయం. భాష కూడ అధికార కేంద్రమే, భాషకు కూడా రాజ్య స్వభావం ఉంటదనే సూత్రీకరణను అప్పట్లోనే సురవరం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరం.

వర్ణధర్మాన్ని నిరసించే రెండు కవితల గురించి చెప్పుకోవాలి. అందులో ఒకటి ‘హంవీర సంభవం' (1934). ఇది గురజాడ ‘లవణరాజ కల'ను బోలిన దీర్ఘ కవిత. రెండిరటిలోను కులాతీత ప్రేమ, వర్ణధర్మ నిరసన సమాన ధర్మం. లవణరాజు కలలో ‘‘వర్ణధర్మ'' నిరసన వాచ్యం కాగా ఇందులో అది ధ్వని అయి
‘‘కాపు కన్నెను పెండ్లాడె క్ష్మాతలేశు''
అని ముగుస్తుంది. అందులో ‘కల' కాగా ఇందులో వాస్తవికతవుతుంది.

ఇంకో రకంగా చెప్పాలంటే అక్కడ వాచ్యమై కలగా ముగిస్తే ఇక్కడ ధ్వని గర్భితమై వాస్తవికతగా ముగుస్తుంది.
‘‘వియ్యమందగ మదిగోరి పిలిచి నాడ
మామవగుటకు నీకు సమ్మతము కలదె'' ఎదురేలేని రాజు ఇలా అడగడం కూడ ఆధునికతను పట్టిస్తోంది.

‘కవిత్వం' ‘కథ' విడివడుతున్న సంధికాలంలో కథాత్మక కవితగా లవణరాజుల కథ మొదలైనవి వచ్చినట్లుగానే ఈ దీర్ఘ కవిత వచ్చింది.

దాదాపు ఇదే ఇతివృత్తంతో (కులాతీత ప్రేమ) ఆయన రాసిన మరో కథాత్మక కవిత ‘ప్రేమార్పణం' 1931. సంభాషణాత్మకంగా సాగే ఈ కవితలో ఒక రాజు కూతురు గొల్లవాణ్ణి ప్రేమించినప్పుడు
‘‘నకట యెడ్డె గొల్లని మీద: నతివ నీవు
పాళి గొని యుంట నేరీతి: బాటి వచ్చె
అచ్చమౌ పసిండిని గాజు: నతికినట్లు...
అతివ మీ చెల్మి మిగుల హాస్యాస్పదంబు'' అన్న రాజు అభీష్టాన్ని అతిక్రమించి ప్రేయసీప్రియులు తీవ్రవేదనతో ఆత్మార్పణ చేసుకున్న తర్వాత
‘‘కులముగాని సర్వం సహా బలముగాని
ధనముగాని నిశిత ఖడ్గధారగాని
లేశమై నిరోధింప లేవు సుమ్ము
నిర్మల ప్రేమ శక్తిని నిశ్చయముగ'' అనే పాదాలతో కవిత ముగుస్తుంది.

గురజాడ తర్వాత ప్రేమ తత్వాన్ని ఇంత నిర్భీతిగా, వాస్తవికంగా, సామాజికాంశాలతో సంవదించి చెప్పిన కవి ఎవరూ లేరు. రాయప్రోలు గానీ, కృష్ణశాస్త్రి గానీ ప్రేమ గొప్పదనాన్ని అనిర్దిష్టంగా, కాల్పనికంగా గొప్పగా చెప్పినారు. కానీ, సాధారణీకరించి చెప్పినారు. నిర్దిష్టంగా కుల,ధన ఖడ్గ శక్తులకతీతమైనదని సురవరం లాగా ఎవరూ రాయలేదు. శక్తివంతమైన ఈ పాదాలు ప్రచారంలోకి రాలేదు. ఇంత శక్తివంతమైన పాదాలు గురజాడ కవితలాగా ప్రాచుర్యం పొందాల్సిన పాదాలు కాలగర్భంలో కలిసి పోవడానికి ఎవరు బాధ్యులు?.

కుల వివక్షతో బాటు సురవరం లింగ వివక్షను కూడా వ్యతిరేకించిండు. కింది పాదాల్లో.
‘‘స్త్రీల మీదనె దర్పంబు చెల్లుచుండు''
‘‘‘సతి'యని భర్త చావగనె చానల గాల్తురు క్రూర కర్ములై''
(సూతాఖ్యాయిక)

తెలంగాణలో ఆయన సమకాలికులు చాలా మందికంటె వస్తు వరణంలో కనబర్చిన ప్రతిభ, తెలంగాణ సమాజ పరివర్తనలో ద్విముఖంగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ, సమాజ పరిణామాన్ని రచనల్లో చిత్రిక పడ్తూ వచ్చిన ప్రతిభ గొప్పది. తెలంగాణ సాహిత్యంలో ఆధునికతను బహుముఖంగా ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. ఇది చిన్న విషయం కాదు. ఇది కవిగా సురవరం మొదటి విజయం.

కవి ప్రతిభను ఆవిష్కరించే రెండో అంశం తాను ఎన్నుకున్న అంశాన్ని అభివ్యక్తీకరించే తీరు. దీన్నే ‘శిల్పం' అని అంటారు.

ఈ అభివ్యక్తికి భాష, భావనాశక్తి రెండు పనిముట్లు (ఇతరాలతో పాటు). సంస్థానాల జిల్లా అయిన మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చిన వాడు కాబట్టి, సంస్థానాలు ప్రధానంగా (లేక మొత్తంగా) సంప్రదాయ సాహిత్యాన్ని ఆదరించడం వల్ల ఆ ప్రభావంతో పద్యంమీద, గ్రాంథిక భాషమీద సురవరం పట్టు సంపాదించిండు. ఆ కాలంలో ఇవి ఉన్నవాడినే కవి అనేవారు. సమాస భూయిష్టత కవి శబ్దశక్తికి, భాషాపటిమకు నిదర్శనంగా భావించేవారు. ఇది సురవరంలో పుష్కలం. శబ్దాలంకార శక్తిసరేసరి.
పరిపూర్ణ పావనాంబుస్తరంగోద్వేగ
గౌతమీ గంభీర గమనమునకు
ఆలంపురీ నందనారామ విభ్రాజి
మల్గోబ ఫలరాజి మధుర రుచికి (తెనుగు భాష)
వడిసెల వలకేలఁబట్టి త్రిప్పెడులీల
గంకణ కింకిణీ క్వణనమెసగ...
మధుర పీయూష నిష్యంది భాషణములు (హంవీర సంభవము)
భండనోద్దండ శుంభత్ప్రతాపోత్సాహ
సూర్య ప్రకాశుండు, సోమనాద్రి... (గద్వాల సంస్థాన భాషా పోషణ)
సారోదారవిచార సాగర నిమజ్జత్‌ స్ఫార విజ్ఞాన బృందారా (సూతాఖ్యాయిక) లాంటి పద్యాల్లో కుంటు పడని ‘ధార'ను సాధించిండు. ఎక్కువగా తేటగీతులు రాసిన సురవరం ‘తేటగీతి'తో ఆడుకున్నడు.

సంస్థానాల సాంప్రదాయిక సంరంభం నుంచి హైద్రాబాద్‌ ఆధునికతలో అడుగుపెట్టన సురవరం మాత్రా ఛందస్సు మీదా, వ్యావహారిక భాష మీద, అచ్చ తెలుగు నుడికారం మీద పట్టు సాధించిండు. ప్రజాస్వామ్య భావనలో భాగంగా ప్రజల భాష మీదా పట్టు సాధించిండు.

‘నా వచన పద్యాలనే దుడ్డు కర్రలతో చిన్నయసూరి వ్యాకరణాన్ని చాల దండిస్తాన్‌' అని పఠాభి రాయడానికంటె ముందే ‘వ్యాకరణాల సంకెళ్లను ఛేదించుకొని' అని శ్రీశ్రీ రాయడం కంటె ముందే 1935లో రాసిన ఈ కవితలో సురవరం
సూత్రములన్నియు తెగినయ్‌
భాష్యాలన్నియు భస్మం
వార్తికముల్‌ చూర్‌ చూర్‌
వ్యాకరణం చచ్చిపడెన్‌...
... వ్యాకరణ భయంబిక లేదూ
పాణిన్‌ చిన్నయ భూతాలన్నియు సోకనేరవింక
(గ్రామ్యబెబ్బులి కథ 1935)

వ్యాకరణ మూసను లేదా నియంత్రణను కట్టడిని నిరసించిండు. ఇది వ్యంగ్య కవిత అయినందువల్ల వ్యాకరణాన్ని నిరసిస్తున్నాడా? వ్యాకరణాన్ని వ్యతిరేకించే వాళ్లను నిరసిస్తున్నాడా అనేది స్పష్టం కావడం లేదు. అయితే పాలమూరు పటేండ్ల భాష, వెట్టి వాని పాట కవితల్లోనూ కథల్లోనూ తెలంగాణ వ్యావహారిక భాషను వాడిన తీరు ఆయన ఎటువేపో తెలుపుతున్నది.

ఈ కవితలో సురవరం గ్రామ్యం ద్వారా వ్యక్తం చేయదలచింది వ్యావహారిక భాషను. గ్రాంథికాన్ని అభిలషించే పండితులు తెలంగాణలో చాలామందే ఉన్నా ప్రధాన స్రవంతిలో లేనందువల్ల గ్రాంథిక వ్యవహారిక భాషా సంవాదం పెద్దగా జరిగినట్టు రికార్డు లభ్యం కావడం లేదు గాని, ఈ కవితను బట్టి ఏదో ఒక పొరలో ఈ ఘర్షణ జరిగిందని అర్థమవుతుంది.

దాశరథి దాకా సాగిన పద్య ప్రభావాన్ని చాలా ముందుగానే అధిగమించి కవిత్వం రాసిండు. మచ్చుకు కొన్నింటిని చూడొచ్చు.
తేట మాటలు తేనెలొలకుచు
పాటవంబున పరుష మొప్పుచు
సాటి భాషల నీటు మీరెడు
నాంధ్రభాషను బొగుడుమా (మిత్రుడాప్రత్యూష)
ఇది ‘ముత్యాలసరం'. ఈ ఛందస్సుకు మూలం జానపదం. దానికి శిష్టవర్గ సమ్మతిని సాధించిన కవిగా గురజాడను చెబుతుంటం. కాని అతని కంటె చాలా ముందుగానే తెలంగాణ కవి కందుకూరి రుద్రకవి
నాయమెరుగక చంపితివి నర
నాథ పాపముకట్టుకొంటివి
బోయ వింతియె గాక నీవొక
భూమి పతివా'' అని రాసి ఆ పని చేసినాడు. ఇది తగిన విధంగా చరిత్రలో నమోదు కాలేదు. దానికి తిరిగి తెలంగాణ వారసుడు సురవరం.

బహుశా తెలంగాణలో తొలి వచన కవిత (లయ వదలని) రాసింది సురవరమే.
కవినైతినోయీ
భావకవి నైతినోయీ
నేనేమి రాస్తాను
తెలియదోయి నాకు (1935)

లయ ఉన్నా ఛందో నియమాన్ని తిరస్కరించే ఈ కవిత తెలుగు కవిత్వం వచన కవితగా పరిణమిస్తున్న దశకు చెందింది. అప్పటికిది కొత్త పోకడే.

ఇంతకుముందే చెప్పినట్టు కావ్యభాషతో పాటు ‘గ్రామ్యం'గా నిందించబడిన ప్రజల భాష మీద కూడ పట్టు సాధించినాడు. (కథల్లో ఇంకా విస్తృతంగా ఉపయోగించినాడు) తద్వారా తెలంగాణ నుడికారానికి పట్టం కట్టిండు.
‘‘ఆరి కూర్మా జర్ర ఆడ చుట్టకు ఇంగలము పెట్టుకొని రార''
‘‘కూసొనికిస్కింత కాల్లొత్తి పోసి''

‘‘పోరిగిట్లెంద్కు పెట్టింది పూర లొల్లి'' (పాలమూరు పటేండ్ల భాష)
‘‘తెలసిన నింత కస్తిపడ: తిప్పలు వెట్టకె నిన్ను వేడెదన్‌''
(ప్రణయినీ ప్రార్థనము)
‘‘ఊరూర్కి యెట్టి మొయ్యాలె
పొట్టేళ్లు పెట్టల్‌ మరి గుడ్లు తేవాలె
పానీ పిలావ్‌ అంటే నోట్లోకి నీళ్లు పోసేది మేమే'' (వెట్టివాని పాట)
‘‘వాసనలు గల్గు కురువేరు వాసికెక్కు'' (పెద్దబాలశిక్ష వచనాలు)

‘‘పొద్దుగాల మా గొల్ర పోరి బర్లది పెర్గు
దెస్తదిలే దాన్తో నాస్త జేసి
దుకనంకు పెద్దోల్ల దోల్కపోయి...'' (హైద్రాబాద్‌ గ్రామ్యము)
ప్రజలభాషలో సీసపద్యం రాయడం ఇక్కడ విశేషం. ఇందులో ఉర్దూ తెలుగు మిశ్రమం కూడా ఉంది. తెలంగాణలో ఉర్దూ మిశ్రమ తెలుగు భాష వ్యవహారంలోనే కాదు కవిత్వంలో కూడా ఎప్పటినుంచో వాడుకలో ఉంది. (ఉదా: రంగరాజు కేశవరావు 18351905).

తెలంగాణలో ఆధునిక సాహిత్యం స్థానిక సమస్యల మీద వాస్తవికతా చిత్రణతో మొదలైనందు వల్ల తెలంగాణ భాష అసంకల్పితంగానే సాహిత్యంలోకి వచ్చింది. అది ఆనాటి వచన సాహిత్యంలో మరింత ప్రస్ఫుటంగా ప్రతిఫలించింది. (ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావంతో అది కనుమరుగై చాలా కాలం తర్వాత తెలంగాణ భాషను తిరిగి సాహిత్య భాషగా తీసుకు రావడానికి ప్రయత్న పూర్వకంగా కృషి చేయవలసి వచ్చింది)

మన ప్రాచీనులు కవికుండాల్సిన లక్షణాల్లో ‘లోకజ్ఞత'నూ చెప్పిండ్రు. సమాజానికి సంబంధించిన అన్ని విషయాల గురించి కవికి అవగాహన ఉండాలనేది దాని అంతస్సూత్రం. సమాజాన్ని గురించి వర్ణించే, వ్యాఖ్యానించే, సూత్రీకరించే శక్తి గలిగిన వాడే కవి అవుతాడని దాని తాత్పర్యం. కాని కాలక్రమేణ అది పాండిత్య ప్రకర్షకు కొలమానంగా అపభ్రంశం చెందింది. ‘లోకజ్ఞతకు' ఒరిజినలర్థం సురవరంలో కన్పిస్తుంది. ఇది కవిని సామాజిక వ్యాఖ్యాతగా, తత్త్వవేత్తగా నిలబెడుతుంది. వేమన అక్కడే నిలబడి వెలిగినాడు. కావ్య కవులు సుదీర్ఘ కావ్య నిర్మాణం ద్వారా చేసిన పనిని అనేక మంది శతక కవులు కొన్ని పద్యాల్లో చేసి చూపించిండ్రు. ఏది ఉత్తమం? అనేది వేరే ప్రశ్న. సామాన్యులకు విస్తృతంగా చేరింది మాత్రం శతక ప్రక్రియే. కవినీ తత్వవేత్తను ఒకచోట చేర్చింది శతకం. కవికీ తత్త్వవేత్తకూ మధ్యనున్న గీతను చెరిపేసింది శతకం. సురవరం సంపూర్ణమైన శతకం రాయకపోయినా దాని నాడిని కొన్ని పద్యాల్లోనే పట్టుకున్నాడు. అందుకు ఈ కింది పద్యాలు దాఖలా.
‘‘విజ్ఞుడగువాడు మెప్పొందు వికృతుడైన
సుందరుండగు మూర్ఖుని జూడరెవరు''
‘‘వాసనలు గల్గు కురువేరు వాసికెక్కు
అందమైనట్టి మోదుగ నడుగరెవరు'' (పెద్దబాల శిక్ష వచనాలు) ‘‘జ్ఞానియగు వాడు నమ్రత బూనియుండు
ధాన్యభరమున తలయొగ్గు దంటువడవు
అల్పుడెప్పుడు వాచాలుడై తనర్చు
ఢమఢమ ధ్వని చేయు పటహ విధంబు''

‘‘కాకి కోకిల రూపమొక్కటియె సుమ్ము
కూతమాత్రము భిన్నమై కొఱలు చుండు
మనుజులందున నీచోత్తమత్త్వములను
చెయ్దముల చేతనే విమర్శింప వలయు''
(నీతి పంచకము)
బలియు దర్పంబు నడగింప వలయునేని
బలము చేతనే సాధింప వలసి యుండు
వజ్ర కాఠిన్యమును ద్రుంప వలయు నేని
వజ్రమునె యుపయోగింప వలసి యుండు (నీతి పంచకం)


‘‘ప్రతాపరెడ్డి ఎక్కువగా పద్యాలు రాయని గొప్ప కవి'' - దాశరథి (కృష్ణమాచార్య)

సంఖ్య పక్కనబెడితే సురవరం గొప్ప పద్యాలు రాసిన గొప్ప కవి అని కచ్చితంగా చెప్పవచ్చు. పద్మిని, ప్రణయినీ ప్రార్థనం, ఘజ్నవీ, హంవీర సంభవం, ప్రేమార్పణం ఆ గొప్ప కవితలు. సురవరం కవితాశక్తికి నిదర్శనాలు ఇవి. కవిగా సురవరం విశ్వరూపం కనబడుతుంది ఈ కవితల్లో.

కావ్యంలో ‘ప్రఖ్యాత' కథ కనుమరుగవుతున్న కొద్దీ (ఆకథ అరిగిన పాట అయి పాఠకుడిలో స్పందనని కలిగించలేని స్థితి ఏర్పడి) కల్పిత కథ కొంతకాలం స్పందనను కలిగించి పాత ఛాయల్ని వదల లేని స్థితిలో వాస్తవికతకు ప్రాధాన్యం పెరిగింది. ఇందులో కూడ కథాంశకు ప్రాధాన్యత తగ్గి దాని చుట్టూ ఆవరించే వ్యాఖ్యానానికి (అంటె దృక్పథానికి, దృక్కోణానికి) వర్ణనకు తాత్వికతకు మళ్లింది. అట్లా పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, లవణరాజు కల, తృణకంకణం, కష్టకమల, లలిత, సౌభద్రుని ప్రణయయాత్ర, గిరికుమారుని ప్రేమగీతాలు లాంటి కావ్యాలు వచ్చినవి. అలాంటి రచనలే పైన పేర్కొన్న సురవరం కవితలు.

వాస్తవ జగత్తును ఉన్నదున్నట్టుగానే వ్యక్తీకరిస్తే అది ఒక ప్రకటన అవుతుంది. అలా కాక వాస్తవ జగత్తును భావనాప్రపంచ మంత్రనగరికి మోసుకెళ్ళి సమ్మోహితమై ఆవాహన చేసి మననం చేసి తాదాత్మ్యం చెంది అద్భుత కళాఖండాన్ని బయటికి తేవడం కవిత్వం. ఉత్త బీజాన్ని స్వీకరించి తల్లి గర్భం రక్తమాంసాలనిచ్చి శిశువుగా భూమ్మీద వేయడం కవిత్వం. సాధారణ మట్టినీ నీరును, గాలినీ, కాంతినీ, బీజాన్ని తన సంయోగ క్రియద్వారా రూపకల్పన చేసి మొక్క అందించే పుష్పమే కవిత్వం. చూపుల ద్వారా గ్రహించిన సాదాసీదా బింబాన్ని కనుల లోపల డార్క్‌ రూంలో రంగుల్ని అద్ది అందించే పంచవన్నెల ప్రతిబింబమే కవిత్వం. అలాంటి కవిత్వం రాసిండు సురవరం. ఆ కవిత్వానికి రూపం ఏమిటి? దీనికి నిర్దిష్ట రూపం లేదు.
దృశ్యమానం కావచ్చు.
రసాత్మకం కావచ్చు.
ధ్వని గర్భితం కావచ్చు.
వర్ణనీయ అంశాన్ని దృశ్యమానం చేయడానికి కవులు అలంకారాలను ఆశ్రయిస్తారు. సురవరం ఆ పనిని అద్భుతంగా చేసినాడు. అయితే తొలుత గతానుగతికంగా ప్రబంధయుగ, ప్రబంధయుగానంతర కాలంలో వాడి వాడి అరిగి పోయిన ‘వారిజలోచన' ‘తరళాయతనేత్ర' ‘కెంపుమోవి' ‘తరళాక్షి' లాంటి ఉపమానాల్నే వాడినాడు సురవరం. తర్వాత దాన్ని సరిదిద్దుకున్నాడు. ఈ కింది పద్యాల్లో దాన్ని గమనించొచ్చు.

‘‘...అఫ్ఘను లెంకలపుడు
జొన్న కంకుల కొడవండ్ల సులభముగను
కోయు రీతి ఛేదించిరి క్రూరమతిని''
‘‘బియ్యమున నూలు కలిసిన విధము'' (ఘజ్నవీ)

‘‘ప్రాణమందిర నవ్యచిత్రంపు ప్రతిమ
సౌరభంబెగజిమ్ము గొజ్జంగి తీవ
విరియ బూసిన తంగేడు వీరకాంత'' (హంవీర సంభవము) కావ్య, ప్రబంధ ఆలంకారికతకు పూర్తిగా భిన్నమైన స్థానిక ఉపమానాలతో కొత్త ఉపమలతో దృశ్యమానం చేయడం ఇక్కడ గమనించవచ్చు. ఇది సురవరం స్వతంత్ర, నవ్య అభివ్యక్తికి నిదర్శనం.

‘ప్రేమార్పణం'' (1931) అనే పెద్ద కవితలో ఒక రాజు కూతురు గొల్లవాడిని ప్రేమించిన సందర్భంలో వారి సంబంధం అసహజం అనీ అతకనిదనీ చెబుతూ
‘‘అకట యెడ్డె గొల్లని మీద నతివ నీవు
పాళిగొనియుంట నేరీతి బాటివచ్చె
అచ్చమౌ పసిండిని గాజు నతికినట్లు
మానికంబును మసిబట్ట మడచినట్లు
గొజ్జగిని గన్నెరులతోడ గూర్చినట్లు
అతివ మీ చెల్మి మిగుల హాస్యాస్పదంబు

గొప్ప పోలికలతో అది ఎట్లా కుదరనిదో చెప్తాడు. రాజు అభిప్రాయాలతో మనకు అంగీకారం లేక పోయినా హేతుబద్ధమే కదా అనిపించే రీతిలో అద్భుతమైన ఉపమానాలతో దృశ్యీకరించి చెప్పడం కవి ప్రతిభకు, భావనాశక్తికి నిదర్శనం. ప్రియుడు తన వేదనను అంతే తర్కబద్ధంగా ఉపమించి చెప్తాడు ఇలా.
‘‘తరుణి నీ మదనాగ్ని కింధనమైతి
పాలి చంపకిపై వ్రాలు భ్రమరమట్లు
మోహమున దివ్వెపై బడు పులుగులట్లు
అర్పణము జేసితిని ప్రాణ మతివనీకు''
ప్రేయసీ ప్రియుల ఆత్మార్పణం తర్వాత గొప్ప తాత్వికంగా ఇలా ముగిస్తాడు.
‘‘కులముగాని, సర్వం సహా బలముగాని...
నిర్మల ప్రేమశక్తిని నిశ్చయముగ''
కోమటిని వర్ణిస్తూ అతని రూపాన్ని దృశ్యమానం చేయడానికి ‘కారెనుము' అనే పోలికను సమర్ధవంతంగా వాడినాడు. (చిత్రగుప్తుని ఖాతా)

ఇప్పుడు అసంబద్ధంగా, అసందర్భంగా అనిపించవచ్చు గాని రసాత్మకత ధ్వన్యాత్మకత సురవరం కవిత్వం రాసేనాటికి సందర్భాన్ని కోల్పోలేదు.

రస,ధ్వని సిద్ధాంతాలు ప్రాచీనమే కానీ ఆధునిక టవవశ్రీఱఅస్త్రం, ంబస్త్రస్త్రవర్‌ఱశీఅ లతో సంవదిస్తవి. ‘కవిత్వం'లో కథాంశం పోయింది కాబట్టి ఇది కవిత్వానికి పూర్తిగా వర్తించక పోయినా కథ, నవల, సినిమాలకు ఇప్పటికీ వర్తించే కళా సిద్ధాంతాలే. కథాంశంతో రాసిన సురవరం కవితలకూ ఇవి వర్తించేవే!

అట్లా సురవరం హృదయాన్ని ద్రవింప చేస్తూ రాసిన గొప్ప కవితలు పద్మిని, ప్రణయినీ ప్రార్థనం, ఘజ్నవీ, హంవీర సంభవం, ప్రేమార్పణం.

‘సుల్తాన్‌ ఘజ్నవీ' కావ్యలక్షణాలను పుణికి పుచ్చుకున్న ఎనిమిది పేజీల దీర్ఘకవిత. జాషువా రచించిన ‘ఫిరదౌసి' ఇతివృత్తమే ఇందులో ఉన్నది. (‘ఫిరదౌసి 'కన్నా చాల ముందు ఈ కవిత రాయడం గమనించదగ్గ విషయం) ‘ఫిరదౌసి'లో ఫిరదౌసిని హీరోగా చేసిన కథానిర్మాణం కాగా, ఘజ్నవీని యాంటీ హీరోగా కథనం చేసే నిర్మాణం ఈ కవితది.

ఒక హీరోకు తగిన విధంగా అనేక హిరోచిత, ఉదాత్త, సాహస కృత్యాలు చేసినా అవి అమలులో ఉన్న చట్రానికి విరుద్ధమయితే అతణ్ణి హీరో అనకుండా యాంటీ హీరో పేరుతో పిలుస్తున్నారు. అతడు హీరోనే కాని చట్టానికి యాంటీ కాబట్టి అలాంటి యాంటీ హీరోలు చరిత్రలో కోకొల్లలు. రాబిన్‌హుడ్‌, పండుగ సాయన్న, సర్వాయి పాపన్న, మియాసాహెబ్‌. ఘజ్నవీ పూర్తిగా ఇలాంటి ఉదాత్తుడు కాకపోయినా కొన్ని లక్షణాలు
ఉన్నవాడు.

సురవరం ఘజ్నవీ వీరోచిత సాహస చర్యలను గొప్పగా వర్ణించి వాటిని హిందూ వ్యతిరేకమైనవిగా చిత్రించి ఘజ్నవీని యాంటీ హీరోగా దృశ్యమానం చేసినాడు.

యాంటీహీరోను చివరికి పశ్చాత్తాపంతో వాటికి స్వస్తిపలికేలా చేసి హీరోగా నిలపినట్లు, ఫిరదౌసికిచ్చిన మాట తప్పి పరితాపం చెందే సందర్భంలో ఘజ్నవీ పశ్చాత్తాపాన్ని హృదయద్రవీకరణగా చిత్రించి అతని మనస్తాపాన్ని పాఠకుడిలో కూడా కలిగించి, కంట నీరు పెట్టించి కరుణ రసాన్ని గొప్పగా ఆవిష్కరించినాడు.
ఘజ్నవీ తనను విజయపథంలో నడిపిన అశ్వాన్ని ఉద్దేశించి
‘‘అకట బాబా! విడిచి యరుగ గలనె
కదనమున నన్ను గెలిపించి ఖ్యాతి దెచ్చి
ఇంతవరకు సేవించితి వీవు నన్ను
నేడు బాసెను ఋణమును నీకు నాకు
ఘజ్నవీ ఎలాంటి వాడైనా ఈ పాదాలు చదివి కన్నీరు పెట్టకుండ ఎవరు
ఉండలేరు. ఇదీ రసాత్మకత.
‘‘చూచిన దిశనె సుల్తాను చూచుచుండె
పరి పరి విధములను బొంగి పొరలుచున్న
తనదు పరితాపమును మాన్ప దక్షులెవరు
కాంచి సకలంబు కన్నీరు కార్చి కార్చి
సదనమును జేరె...
ఘజ్నవీ (హిందూదృక్పథం ప్రకారం) ఎంత క్రూరుడైనా ఈ పాదాలు చదివి ఘజ్నవీ వేదనను కాదనలేరెవరు. కండ్లలో తడిని దాచలేరెవరు.

ఇది కవి విజయం.

ఈ కవితలోని ‘‘వీరి తనువులు మట్టిలో జేరిపోయె
కీర్తి యొక్కటి నిత్యమైక్షితిని వెలుగు' అన్న సురవరం అభివ్యక్తి ‘‘రాజు మరణించె ఒక తార నేలకూలె/ కవి మరణించె ఒక తార నింగికెగిసే'' అన్న జాషువాకు స్ఫూర్తి నిచ్చి ఉండవచ్చు.
బియ్యమున నూలుగలసిన విధము చూవె,
భూమిపై హెచ్చుతగ్గులు పొసగి యుండు... అని తాత్వీకరించడం ఇందులోని మరొక గొప్ప విశేషం.
ధరణి సురుల మంత్రంబుల ధ్వనులు లేవు
పక్షుల కలకలంబులు పరగు గాని
అర్చనలు సేయుటకు బంటులచట లేరు
ఎలుగుబంటులు కలవుగాని..
ఇలాంటి నడక, వర్ణన ఈ కవిత తర్వాత చాలాకాలానికి వచ్చిన విద్వాన్‌ విశ్వం గారి ‘‘పెన్నేటి పాట''లో కన్పించడం మరొక విశేషం.

‘ప్రేమార్పణం' అనే కవితలో కులాంతర ప్రేమికుల ఆత్మార్పణ ఘట్టం కూడా పాఠకుల్లోకి కన్నీళ్లను ప్రవహింప జేస్తుంది.

సురవరం కవితా శక్తికి మరొక నికషం ‘హంవీర సంభవము' అనే దీర్ఘ కవిత.
‘‘ధనికులకు మోకరించని దర్పయుతులు
నిత్య దారిద్య్రమందును నియతిపరులు
యుద్ధమున వెన్నుచూపని యోధవరులు'' అని ఈ కవితలో కావ్య నాయికా వంశాన్ని గూర్చి చేసిన వర్ణన తెలంగాణ ప్రజలకు నూటికి నూరుపాళ్ళు సరిపోయె వర్ణన. అది ఆయన నిశిత పరిశీలనను పట్టిస్తోంది.

‘ప్రణయినీ ప్రార్థనం' ‘పద్మిని' ల్లోని వర్ణన ప్రబంధ దృక్కోణం నుంచే జరిగినా ఈ కవితలోని నాయికా వర్ణన ఆధునికతను సంతరించుకుంది.
‘కరువు బోసిన యట్టి బంగారు బొమ్మ
... తంగేడు వీరకాంత' అనే పద్యం తెలంగాణ వాతావరణానికి అద్దం లాంటిది. పద్మం, కలువ, సంపంగి మొదలైన పదాలు తప్ప కావ్యభాషలో ఎన్నడూ చోటు చేసుకోని గొజ్జంగి తీవ, ‘తంగేడు వీరకాంత' లాంటి పదప్రయోగంతో తెలంగాణ స్థానికతను పట్టుకొచ్చిండు.

‘ఒకచేత మేత మోపును మరొక చేత మేకను' పట్టుకొని ఇంటికెళ్ళే కాపు స్త్రీ వర్ణనద్వార గ్రామీణ వాతావరణాన్ని, ఆ స్త్రీ ఆర్థిక పరిస్థితిని కళ్ళకు కట్టిండు. నాయికా నాయకుల పరస్పర ప్రేమను
‘ముదిత మోమున లేనవ్వు మొలకలెత్తె
నృపుని సమ్మతి కన్నుల నిండియుండె
ఒండొరుల దృష్టి ప్రేమాబ్ది నోలలాడె'
అని కవితాత్మకంగా వర్ణించిండు. ఈ పద్యంలోని కొన్ని శబ్దాలు పాతవైనా అభివ్యక్తి మాత్రం ఆధునికం.

ఈ కవిత స్థల కాలాలు సాంప్రదాయికతను సూచిస్తున్నా ఇందులో అంతర్లీనంగా ఆధునికత పొడగట్టడాన్ని గమనించాలి.

ఇంత అద్భుతమైన సురవరం కవిత్వం సాహిత్య చరిత్రలో ఎందుకు కనుమరుగయింది? (ఒక్క సురవరమే కాదు 1946కు ముందు తెలంగాణలో ప్రాచుర్యానికెక్కిన చాలా మంది రచయితలు అదృశ్యమయి కొందరే మిగిలినారు. 1956 తర్వాత మరింతగా అదృశ్యమయినారు. 1946లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం, దాంతో పాటు మొదలైన విశాలాంధ్ర వాదం వీటికి అనుగుణం కాని రచయితలందర్కీ గోరీ కట్టింది. కోస్తాంధ్ర బూర్జువా ‘తెలుగు వాదం', కోస్తా కమ్యూనిస్టుల కార్మిక వర్గ ‘విశాల'వాదం కలగలిసి పోయి తెలంగాణ గత ఘనవైభవ దృష్టిని దారి మళ్ళించినవి. తెలంగాణను టంకశాల అశోక్‌ అన్నట్టు‘భృత్య'వర్గంలో చేర్చినవి)

ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం'లో సురవరాన్ని సంపాదకుడుగా అదీ నామమాత్రంగా పేర్కొన్నాడు. కురుగంటి సీతారామయ్య నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో ‘అనేక కథలను పద్యాలను పాటలను వ్రాసి కవి అనిపించుకున్నాడని' ఎకసెక్కెం చేసిండు. అలాంటి ఎకసెక్కెమే గోలకొండ కవుల సంచిక గురించి చేసిండు. ఈయన ప్రభావంలో పయనించిన సి.నారాయణరెడ్డి ‘ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు'లో సురవరాన్ని ఎక్కడా ప్రస్తావించనే లేదు. తెలంగాణ ప్రాతినిధ్య సంకలనంగా వచ్చిన ‘గోలకొండ కవుల సంచిక' గురించైనా ప్రస్తావించలేదు.ఆధునిక కవిత్వం గురించి రాస్తూ, ఆధునికతను సంతరించుకున్న ‘గోలకొండ కవుల సంచిక'ను పేర్కొనక పోవడం దారుణం. జాతీయోద్యమం, దేశభక్తి, అస్పృశ్యతా నిరాకరణ, సంఘసంస్కరణ, ఆంధ్రాభిమానం వంటి శీర్షికల క్రింద పేర్కొనడానికి అవకాశం ఉండీ సురవరం కవితలను గానీ ‘గోలకొండ కవుల సంచిక' కవుల కవితలను గానీ సి.నారాయణరెడ్డి పేర్కొనలేదంటే ఆంధ్ర సాహిత్య చరిత్రకారుల సాహిత్య సిలబస్‌ నిర్దేశం ఎంత బలంగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. దాని వల్లే సురవరానికి ఆయనతోపాటు చాలామంది తెలంగాణ కవులకు, రచయితలకు అన్యాయం జరిగింది.

తెలుగు సాహిత్యంలో కట్టమంచి రామలింగారెడ్డికి అన్యాయం జరిగినట్టుగానే సురవరంకు కూడా జరిగింది. తొలి ఆధునిక కవిగా గుర్తింపు పొందాల్సిన కట్టమంచి పండితుల కుంటి సాకుల వల్ల ఆ గుర్తింపుకు నోచుకోలేదు. తొలి ఆధునిక విమర్శకుడిగా కూడా ఆయన గుర్తింపు పొందకుండా అదే పండితులు అనేక కుంటి వాదనలు చేసిండ్రు. సురవరంకు కూడా అదే పరిస్థితి సంభవించింది. ఆయన ఖాతాను మిగతా రంగాల్లో లెక్కవేసి సాహిత్య రంగంలో లెక్కనుంచి తీసి వేసిండ్రు. నిజానికి సాహిత్య రంగంలో కూడా సురవరం కృషి ఎనలేనిది. దేవలపల్లి రామానుజరావు అన్నట్టు ‘ఆధునిక వాఙ్మయ ప్రక్రియలన్నింటిని ఆయన చేపట్టి'నాడు. ‘ఆనాటి తెలుగు సాహిత్యంలోని నూతన ధోరణులన్నింటినీ ఆయన పరిశీలించి తన సారస్వత యాత్రను సాగించినాడు'. (ఈ విషయంలో సురవరం సమకాలికుల సాహిత్యంతో తులనాత్మక అధ్యయనం చేసి ఆయన దోహదాన్ని పరిశోధించాల్సి ఉంది.)

తెలంగాణలో ఏక కాలంలో అనేక భావజాలాల తొడ తొక్కిడి జరిగింది. ఇక్కడి తొలితరం రచయిత అయిన సురవరం ఈ సంక్లిష్టతను ఎదుర్కొన్నాడు. రైతు కుటుంబంలో జన్మించిన సురవరం భూస్వామ్య ప్రతినిధి కాడు. దాన్ని తీవ్రంగాను, నమ్రంగాను వ్యతిరేకించాడు. ఆయన ఏక కాలంలో ఆ వర్గ ప్రతినిధులతోను, దాన్ని వ్యతిరేకించే వారితోను పనిచేయవలసి వచ్చింది. స్వాభావికంగా తాను పుట్టిన మధ్యతరగతి నుంచి వ్యవహరించవలసి వచ్చింది.

తొలుత ప్రభుత్వ అనుకూలుర వల్ల నష్టపోయిండు. తర్వాత ప్రభుత్వ వ్యతిరేకుల వల్ల నష్టపోయిండు. అంతే కాక సురవరంలో ఉన్న ప్రగతి శీల భావాల వల్ల సాంప్రదాయికులు దూరం బెట్టిండ్రు. ఆయనపై ‘ఆర్యసమాజ' ముద్రవేసి ప్రగతిశీలురు దూరం బెట్టిండ్రు.

అందువల్లే మాడపాటి పితామహుడయి సురవరం ఏమీ కాక పోయిండు. వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ సాహిత్య ప్రతీక అయి సురవరం ఏమీకాక పోయిండు. పరిమితులున్నప్పటికీ కందుకూరి, గురజాడ, త్రిపురనేని రామస్వామి చౌదరిలను నెత్తికెత్తుకుండ్రు. సురవరానికి ఆ స్థాయి దక్కలేదు.

అందుకే ఈయన చివరి దశలో ‘‘ఇక వ్రాసి లాభము లేదు. రాయడం దండుగ అనిపించింది'' అనే నిర్వేదానికి లోనయ్యిండు. ఈ నిర్వేదంలోనే చనిపోయిండు. దానికి ఎవరు బాధ్యులు?

ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని సవరించి ‘సురవరం ప్రతాపరెడి...మాడపాటి హనుమంతరావు తెలంగాణలో ఆధునిక సాహిత్యానికి మూల స్థంభాలయ్యారు' అన్న సుప్రసన్నగారి మాటల్ని మననం చేసుకోవాలె.

ఇప్పటికైనా ‘మాతృభాష వికాసం, ప్రజాస్వామ్య స్థాపన, సంఘసంస్కరణ అన్న మూడు ఆశయాలకు త్రికరణ శుద్ధితో అంకితమైన విజ్ఞాని ఆయన' అన్న దేవులపల్లి రామానుజరావు మాటల్ని గుర్తులో ఉంచుకోవాలె.

ఇప్పటికైనా తెలుగులో తొలి ప్రజాస్వామిక కవుల్లో ప్రముఖుడూ, తెలంగాణలో పూర్తిస్థాయి తొలి ఆధునిక కవి సురవరం ప్రతాపరెడ్డి అనేదాన్ని స్థిరపర్చాల్సి ఉంది.

ఇప్పటిదాకా సామాజిక రాజకీయ రంగాల్లో ఆయన నిర్వహించిన పాత్రను బట్టి వైతాళికుడన్నారు. కవిత్వ రంగంలో నిర్వహించిన పాత్రను బట్టి కూడా ఆయన వైతాళికుడేనని నిర్ధారణకు రావాలి.

- డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి

English summary
Sangisetti Srinivas edited and published Suravaram Pratap Reddy's poetry as Suravaram Kavithvam. An eminent Telugu literary critic Dr Sunkireddy Narayana Reddy has written a forward to that book.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X