• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగులో ఆధునికాంతర ధోరణులు

By Pratap
|

 Yakoob
ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఈ మార్పుల నేపథ్యంలో 1980ల నుంచి ఆధునికానంతర వాద భావనలు తెలుగు సాహిత్య రంగంలో ప్రాముఖ్యతని సంతరించుకోవడం మొదలైంది. ఇంతవరకు తెలుగు సమాజంలో నిర్దిష్టంగా ప్రచారమైన సాహితీ తాత్విక సిద్ధాంతం మార్క్సిజం మాత్రమే. ఆధునికానంతర వాదం వెలుగులో దళిత, స్త్రీవాద ఉద్యమాల్నించి వచ్చిన విమర్శ మార్క్సిస్టు సిద్ధాంతాన్ని సంక్షోభంలో పడవేసింది. ఈ క్రమాన్ని దృష్టిలో వుంచుకుని సమకాలీన తెలుగు సాహిత్య విమర్శకు, ఆధునికానంతర వాదానికి ఉన్న సంబంధాన్ని పరిశీలించాల్సి వుంటుంది. ఇది వరకు వచ్చిన అన్ని సాహిత్య విమర్శ ధోరణులు ఆధునిక ప్రాతిపదికగానే కొనసాగాయి. అభ్యుదయ సాహిత్య పరిణామంలో భావసారూప్యత లేని సభ్యులతో సంఘం ఏర్పడటం, అది అమూర్తతకు చిహ్నం. 1960ల నాటికి అసంబద్దంగా మారడం, 1965ల తర్వాత దిగంబర కవితా ఉద్యమం సమాజ జీవిత అసంబద్దత మీదా, విలువల మీదా, ద్వంద్వ ప్రమాణాల మీదా తీవ్రనిరసన తెలియజేయడం - ఆనాటికి ఆధునికతను ప్రశ్నించడమే. ఈ ప్రశ్నలు తెలుగు సాహిత్య స్వరూపాన్ని మార్చివేశాయి. ఆ తర్వాతి విప్లవ సాహిత్యోద్యమం కొత్తగా ముందుకు వచ్చిన సమస్యల్ని గురించిన అవగాహన రాహిత్యం వల్ల బలహీనపడింది. విప్లవ సాహిత్యంలో ఆర్థిక, సామాజిక అంశాల గురించిన అంశాలే తప్ప కులం, మతం, జెండర్‌, వృత్తిలాంటి అంశాలు; సామాజిక జీవితంలో నిర్వర్తిస్తున్న రాజ్య పాత్రను విశ్లేషించలేకపోయారు. సాహిత్య వస్తు విస్తృతి వైపు దృష్టి మరల్చలేకపోయారు. వస్తు ఆధిక్యతనే ప్రధానమని భావించారు. ప్రత్యక్ష రాజకీయ సాహిత్యమే సాహిత్యమని నమ్మారు. ఆ సందర్భంగా మార్క్సిస్టుల పాత్ర నిర్వహణ ఆ పరిధి, పరిమితులలో సాగినా, అది అవసరంగా ముందుకొస్తున్న విషయాలను విస్మరించడం వల్ల సాహిత్యానికి దూరమవుతూ వచ్చారు.

1985ల తర్వాత దళిత, స్త్రీవాదాల సాహిత్యంలో విస్తృత అవగాహన, నిర్దిష్ట విశ్లేషణ కన్పిస్తాయి. సి.వి. సుబ్బారావు భావించినట్లు 'కొత్తగా అభివృద్ధి చెందుతున్న స్త్రీవాద ధోరణిలో సామరస్య సంబంధం లేకపోవడానికి8 మార్క్సిస్టు విమర్శ నెట్టబడింది. అటువంటి థలో తాత్విక ప్రేరణగా ఆధునికాంతర వాదాన్ని తీసుకుని స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీ వాదం మొదలైన ఉద్యమాలు రంగం మీదికి వచ్చాయి.9 1960ల నుంచి 80ల దాకా మొదటిథగా స్త్రీవాదాన్ని తీసుకుంటే ఆధునికతలో భాగంగా నడిచిన ఉదారవాద స్త్రీవాదం. 80ల తర్వాత మొదలైన స్త్రీవాదం ఆధునికాంతరవాదంలో భాగంగా కొనసాగుతున్న రాడికల్‌ స్త్రీవాదం. సోషలిస్టు స్త్రీవాద రచనగా 'జానకి విముక్తి'ని తప్ప మిగతా అంతా రాడికల్‌ స్త్రీవాదంగానే పరిగణించాలి. స్త్రీవాదంలో చాలా కీలకమైన రచనగా 'మనకు తెలియని మన చరిత్ర'ని ఒక క్రమానుగత సంఘటనల సమాహారంగా చూసే పద్ధతిని, దృష్టిని నిలదీసింది. చరిత్రలో మార్జినలైజ్‌ చేయబడిన స్త్రీల ప్రాధాన్యతని ఈ గ్రంథం నొక్కి చెప్పింది. విస్మృతిలోకి నెట్టబడిన స్త్రీల పాత్రని వెలికి తీయడం ద్వారా ఈ పుస్తకం వైయక్తిక జీవిత చరిత్రలకి, ఆత్మకథలకి, సమాజ స్థూల చరిత్రకి ఉండే సంబంధాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. మిషేల్‌ ఫుకో లాంటి ఆధునికానంతర తాత్వికులు అందించిన చరిత్ర రచనా పద్ధతుల ప్రేరణ ఈ పుస్తకం. అయితే ఈ రకపు రచనలు తెలుగులో స్త్రీవాదులు కొనసాగించలేకపోయారు. సాహిత్య విమర్శలో భాషకు సంబంధించిన చర్చల్లో కూడా స్త్రీవాదులు ఆధునికానంతర చేతననే కనబర్చినట్లు మనం చూడవచ్చు.

దళితవాదం, దళిత ఉద్యమం, దళిత సాహిత్య చేతన ఆధునికానంతర వాదానికి దగ్గరగా వుంటుంది. నిజానికి ఒక నిర్దిష్ట ప్రాంతీయ సమస్యకు విశ్వజనీన పరిష్కారాల్ని కాక ప్రాంతీయమైన పరిష్కారాల్ని వెతుక్కోవాల్సిన అవసరాన్ని గుర్తించే చైతన్యాన్ని ఆధునికానంతర వాదమే ఇచ్చింది. దానిలో భాగంగానే దేశీయ తాత్వికులు అంబేద్కర్‌, పూలే వంటి వారిని రంగం వీదికి తీసుకువచ్చారు దళిత సాహిత్యవాదులు. విశ్వమానవుడి స్థానంలో నిర్దిష్ట మానవుణ్ణి గురించి మాట్లాడటం మొదలైంది.

కె.జి. సత్యమూర్తి, కత్తిపద్మారావు, బి.యస్‌.రాములు, ఉ.సా, కె.శ్రీనివాస్‌, సురేంద్రరాజు, లక్ష్మీనరసయ్యల కృషి సాహిత్య విమర్శనా రంగంలో ఈ ప్రస్థానంలో గమనించవచ్చు. సాహిత్య విమర్శలో అతివాదపాత్రని నిర్వర్తించడం ద్వారా దళిత సాహిత్య పరిణామాన్ని వేగవంతం చేసిన విమర్శకుడు లక్ష్మీనరసయ్య. 'దేశీయ మార్క్సిజమే దళిత కవిత ఎజెండా''10 అని 'చిక్కనవుతున్న పాట' ముందుమాటలో ప్రకటించాడు. 'భారతీయ సమాజం కుల-వర్గసమాజం' అని 'చిక్కనవుతున్నపాటలో ప్రకటించి, ఆ తరవాత 'పదునెక్కిన పాట'లో సోషలిస్టు విప్లవం కంటే ముందు దళిత ప్రజాస్వామిక విప్లవం' జరగాలని ప్రకటించాడు. అంతేకాక ఆయన రచన 'దళిత సాహిత్యం - తాత్విక దృక్పథం'11 అనే వ్యాస సంపుటిలో 'అంబేద్కరిజం నుంచి బుద్దిజం'12 వైపుకు కూడా దృష్టి మరల్చాలని ప్రకటించాడు. బుద్దిజం అంటే ఒక మతం. అది ప్రజాస్వామిక విలువలకి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఇటువంటి వైరుధ్యాలు ఉన్నప్పటికి ఆయన చేసిన రచన ఆధునికానంతర విమర్శ దృష్టి కోణాన్ని ప్రకటించింది. చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాటకి మధ్యలో వెలువడిన 'బహువచనం' అనే కవితా సంపుటి ఆధునికానంతరవాద చేతనని ప్రకటించిందని బి. తిరుపతిరావు విశ్లేషణ.13 సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన ముందుమాటలో దళిత సాహిత్యానికి, ఆధునికానంతరవాద తత్వశాస్త్రానికి ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు.

మహా కథనాలనుకాదని, ప్రాంతీయ కథనాలను నిర్దిష్ట సామాజిక బృందాల, ప్రత్యేక అస్తిత్వ సంబంధ కథనాలను ముందుకు తెస్తుంది ఆధునికానంతరవాదం. అలా చూస్తే ఎండ్లూరి సుధాకర్‌ 'మల్లెమొగ్గల గొడుగు,' 'కొత్త గబ్బిలం', నాగప్పగారి సుందర్రాజు 'మాదిగోడు' వంటివి దీనిలో భాగమే. ఈ దృష్ట్యా చూస్తే ఖదీర్‌బాబు దర్గమిట్ట కథలు, నామిని 'సినబ్బకథలు', ఖాదర్‌ 'పుట్టుమచ్చ' కవిత, మైనార్టీ కథల సంకలనం 'వతన్‌', అలీ 'హర్‌ ఏక్‌మాల్‌', రహమతుల్లా 'బా' వంటి రచనలను ప్రత్యేక అస్తిత్వ సంబంధ కథనాలుగా చూడాల్సి ఉంటుంది.

ఇంతకు ముందటి అధ్యాయాలలో చెప్పుకున్నట్లుగా ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రపీఠం మార్క్సిస్టు విమర్శకుంది. ఆ తరవాత కాలంలో మార్క్సిష్టేతర విమర్శకులు లేదా ఒకప్పటి మార్క్సిస్టు విమర్శకులు తమ తాత్విక రాజకీయ అవగాహనలను, నూతనంగా రంగం మీదికి వచ్చిన సిద్ధాంతాల వెలుగులో పునర్‌ నిర్వచించుకుని, పునర్‌ వ్యాఖ్యానించుకుని ఒక కొత్త భావనాధారకు తెరవేశారు. అఫ్సర్‌, సురేంద్రరాజు, కె. శ్రీనివాస్‌, బి. తిరుపతిరావు, వాడ్రేవు చినవీరభద్రుడు, కంచె ఐలయ్య, గుడిపాటి, కాసుల ప్రతాపరెడ్డి, సీతారాం, కలేకూరి ప్రసాద్‌, బి. లక్ష్మీనరసయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఓల్గా, జయప్రభ మొదలైనవారు.

అమూర్త విభజన - అఫ్సర్‌

1990లలో కవి అఫ్సర్‌ రాసిన వ్యాసాలు 'ఆధునికత - అత్యాధునికత'తో ఒక సంపుటిగా వెలువడ్డాయి. ఈ పుస్తకంతో ఒక రకంగా అఫ్సర్‌ తెలుగులో ఆధునికాన్యంతరవాద విమర్శకు ఒక రకంగా తెరతీశాడు. అఫ్సర్‌ పుస్తకం తాత్వికంగా అంత శక్తివంతంగా లేకపోయినప్పటికీ స్థూలంగా ఆధునిక - అత్యాధునిక సాహిత్యాల మధ్య ఒక విభజన రేఖను ప్రయత్నం చేశాడు. ఈ రేఖ అంత నిర్ధిష్టంగా అన్పించనప్పటికీ మొదటిగా ఈ ప్రయత్నం చేసింది అఫ్సరే. అఫ్సర్‌ తన విమర్శకి ప్రధానంగా సాహిత్యం మీద ఆధారపడటంవల్ల అఫ్సర్‌ పెట్టిన విమర్శ కేవలం అప్పటికే ప్రాముఖ్యతని క్రమంగా కోల్పోతూ ఉన్న విప్లవ కవిత్వం మీద, నిర్ధిష్టంగా చెపితే విప్లవ రచయితల సంఘానికి వెలుపల అన్న కొంతమంది రచయితల కొంత అమూర్తతతో కూడుకున్న భావనల సముచ్ఛాయానికి 'అత్యాధునికత' అనే పేరు పెట్టాడు. అదే సంపుటికి అంతే అమూర్తమైన ముందుమాట రాసిన బి. తిరుపతిరావు దానిని 'ఆధునికానంతరవాదం' అని పిలవటానికి అవకాశం ఉందని సూచించాడు. పైన చెప్పుకున్నట్లుగా విరసం రచయితల వెలుపలున్న, లేక మార్క్సిస్టేతర రచయితల సమూహాన్ని అత్యాధునికత సాహిత్య వారసత్వానికి ప్రతినిధులుగా నిలిపే క్రమంలో గతసాహిత్యాన్ని పరిశీలించిన అఫ్సర్‌, మార్క్సిస్టేతర బృందాలకు వెలుపల ఉన్న నారాయణబాబు, బైరాగి లాంటి వాళ్ళలో అత్యాధునిక మూలాల్ని వెతికాడు. ఆధునికానంతర సాహిత్య లక్షణాలను అఫ్సర్‌ గుర్తించిన అంశాలు ప్రధానంగా భాషా సారళ్యం, రాజకీయ నిబద్ధతా రాహిత్యం, స్త్రీదళిత మైనారిటీ వర్గాల కవిత్వం - వాటి స్పృహ, గ్రామీణ నేపథ్యం, అంతర్ముఖత్వం, మధ్యతరగతి స్పృహ.

అఫ్సర్‌ నిర్వర్తించిన ఈ అమూర్త విభజన చేసిన ఈ పుస్తకం గురించి ప్రముఖ సాహిత్య విమర్శకులు చేరా ఇలా అన్నారు ''ఆధునిక కవిత్వ చరిత్రకు ఇది ముఖ్యమైన ఆకర గ్రంథం (సోర్సుబుక్‌) మాత్రమే కాదు, చరిత్ర రచనకు బహుశా ఒక ఉత్తేజకరమైన తొలి ప్రయత్నం. ఈనాటి ధోరణులకు ఒక బలమైన డిఫెన్స్‌ లాయర్‌గా కనిపిస్తాడు, అఫ్సర్‌ ఈ పుస్తకంలో - అభ్యుదయ విప్లవ కవిత్వాలకు కె.వి.ఆర్‌ చేసినటువంటి పనిని అత్యాధునిక కవిత్వానికి అఫ్సర్‌ చేసిపెడుతున్నాడు.''14 ఇవే కాకుండా దాని తర్వాత దాదాపు ఒక థాబ్ద కాలం పాటు అఫ్సర్‌ రాసిన అనేక వ్యాసాలు మరింత నిర్దిష్టతతో ఆధునికానంతరవాద విమర్శని రాయటానికి చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. అఫ్సర్‌ విమర్శలో ప్రధానలోపం మౌలికంగా తాత్విక, చారిత్రక ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన ఆధునికానంతర వాదపు కీలాకాంశాల స్పర్శ లేకపోవటం. ఫలితంగా ఆధునికానంతర వాదానికి సంబంధించిన అఫ్సర్‌ ప్రతిపాదనలు సాహిత్య పరిధిని దాటి సిద్ధాంత స్థాయికి చేరుకోలేకపోయాయి.

సైద్ధాంతిక ప్రాతిపదిక - తిరుపతిరావు

సరిగ్గా సైద్ధాంతికస్థాయిలో ఆధునికాకనంతర వాదాన్ని చర్చించడానికి ప్రయత్నించినవాడు, ఆ ప్రయత్నంలో ఆధునికానంతరవాద సిద్ధాంతాన్ని, దాని తాత్విక, చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, మనోవైజ్ఞానిక, సాహిత్య భావనలను మూలగ్రంథాల ఆధారంతో ప్రయత్నించినవాడు బి. తిరుపతిరావు. బహుశా ఆధునికానంతర వాదానికి సంబంధించి ఎంతో కొంత సమగ్రంగా తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం ఇదే. దాదాపు 1990ల నుండి విమర్శ రాసిన తిరుపతిరావు ప్రధానంగా ఆధునికానంతర సిద్ధాంత స్పర్శతోనే రాయడం జరిగింది. ప్రముఖ ఆధునికానంతర సాహితీ సాంస్కృతిక విమర్శకుడు రోవా బార్క్‌ 'రచయిత మరణం' అనే భావనను మొదటగా తెలుగులో చర్చించింది ఈయనే. ప్రముఖ నిర్మాణవాద విమర్శకుడు హెరాల్డ్‌ బ్లూమ్‌ ప్రతిపాదించిన 'పునర్లేఖన వాదాన్ని' తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా తెలుగు కవులు విశ్వనాథ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రిల నుంచి శివారెడ్డి దాకా కవులు సంఘర్షించిన క్రమాన్ని ఇందులో చర్చించడం జరిగింది. 2000 సంవత్సరంలో 'ఇండియా టుడే' వార్షిక సంచికలో 'సమస్త చీలికలు శిరోధార్యాలే' వ్యాసం ఆధునికానంతర వాదపు మౌలిక భావనలను, తెలుగు సాహిత్యానికి అనువర్తింపజేసి చర్చించారు. ఇవేకాక ప్రముఖ ఆధునికానంతర తాత్వికుడు డెరిడా, ఫుకో, బాదిలేర్‌, లయొధార్హ్‌ల సిద్ధాంతాలని వివరిస్తూ తెలుగు సాహిత్యానికి అన్వయిస్తూ అనేక వ్యాసాలు రాయడం జరిగింది.

అంతేకాక కథాసాహిత్య విశ్లేషణలో ఆధునికానంతర శ్రీబిజీజీబిశిరిఖీలి ఊలిబీనీదీరివితిలిరీని ఉపయోగించే ప్రయత్నం చేశారు.15 తెలుగు విమర్శనారంగం ఒక కీలకమైన మార్పుకు గురవుతున్న సందర్భంలో బి. తిరుపతిరావు నిర్వహిస్తున్న పాత్రకు ప్రాధాన్యత వుంది. సామాజిక కోణం, అస్తిత్వ పార్శ్వాల మధ్య పెరుగుతున్న దూరాన్ని పసిగట్టి, ఆ దూరాన్ని ఆధునికానంతర దృష్టికోణంతో విశ్లేషించి, ఆ వైపుకు తెలుగు సాహిత్యపు దృష్టిని మరల్చినవాడు బి. తిరుపతిరావు.

వాచక కేంద్ర విమర్శ - అడ్లూరి రఘురామరాజు

వాచక కేంద్ర విమర్శ అనేది ఆధునికానంతరవాద విమర్శలో మౌలికాంశం. నిజానికి తెలుగులో వాచక కేంద్ర విమర్శ కంటే, వాచకేతర విమర్శే ఎక్కువ ఉన్నట్లు అన్పిస్తుంది. రచయిత భావాల్ని అతని రచనతో సంబంధం లేకుండా గుర్తించి, అదే గుర్తింపులోంచి విమర్శ రాయడం ఫలితంగా సారాంశంలో సాహిత్య విమర్శకు మూలభూతమైన 'వాచకం' గాలికెగిరిపోయింది. ఎవరు కాదన్నా స్థూలంగా తెలుగు విమర్శలో ఈ తరహా ధోరణి ఇంకా కొనసాగుతూనే వుంది. దీన్ని ఏదో ఒక స్థాయిలో గుర్తింపచేసే ప్రయత్నం అడ్లూరు రఘురామరాజు తన 'మైదానం లోతుల్లోకి' పోస్టు మోడర్న్‌ పరిశీలనగా చేశారు. నిజానికి ఒకే వాచకంపై అనేక వ్యాసాలు రాయడం అంతకు ముందు కూడా ఉన్నప్పటికీ, రఘురామరాజు దానికి భిన్నంగా ఒకే వాచకంపై భిన్న దృక్కోణాల నుండి విభిన్నమైన వ్యాసాలు రాయటం జరిగింది.

ఈ విషయంలో రఘురామరాజు చాలా సృజనాత్మకమైన విమర్శ రాశాడు. అంటే, ఒక వాచకపు బహుళత్వాన్ని ఆవిష్కరించడమే కాకుండా, ఒక వాచకపు లోతుల్లోకి వెళ్లే క్రమాన్ని ఆయన సోదాహరణంగా వివరించాడు. తెలుగు విమర్శకులు ఎక్కువ సందర్భాల్లో వాచకంలో 'మూర్తం'గా కన్పించే అన్పించే అంశాలపై రాసినంత సులువుగా 'అమూర్తాంశాల' మీద రాయడం కన్పించదు. సరిగ్గా ఈ పనిని రఘురామరాజు ఈ వ్యాసాలలో వివరించాడు. వాచకపు 'బ్లైండ్‌ స్పాట్స్‌' వెతికి పట్టుకుని, వాటి నుంచి వ్యాఖ్యానించాడు. వాచకపు కేంద్రం నుంచి, వాచకాన్ని పరిశీలించడం కాకుండా దాని అంచుల్లోంచి విశ్లేషించడం రఘురామరాజు చేసిన ప్రత్యేకమైన పని. ఈ విషయంలో ఆయనకు స్పష్టమైన అవగాహన వుందని ఈ కింది వాక్యాలు తెలియజేస్తాయి. ''ఆధునిక తెలుగు సాహిత్యంలో అద్భుతమైన రచనలొచ్చాయి. కాని వాటిలో నిగూఢంగా దాగిన గొప్ప అంశాలు పలకరించకుండా అలాగే మిగిలి చిన్నబొయ్యాయి. వాటిని గుర్తించాల్సిన, పలకరించాల్సిన అవసరమెంతైనా వుంది''16 ఇదే సంపుటిలో పోస్టు మోడర్నిజం: అక్కడ, ఇక్కడ అని ఈయన రాసిన వ్యాసం ఆధునికానంతర వాదాన్ని ప్రాంతీయ సందర్భంలోంచి విశ్లేషించుకోవాల్సిన అవసరాన్ని గుర్తింపజేస్తుంది. రఘురామరాజులో చినవీరభద్రుడన్నట్లు 'ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆధునికానంతర ఆలోచనా తరంగాలున్నాయి''17

పిట్టకథలతో తాత్విక సమర్థన - కె. శ్రీనివాస్‌

గత 70 సంవత్సరాలలో తెలుగు సమాజంలో వచ్చిన ప్రతి సాహిత్యోద్యమం మార్క్సిస్టుల విమర్శకు గురవుతూనే వచ్చింది. సంప్రదాయ కమ్యూనిస్టు ఆలోచనాసరళికి, సిద్ధాంత చట్రానికి వొదగని అన్ని భావాల్ని, ఉద్యమాలను కమ్యూనిస్టులు ఎటువంటి ఆలోచనా లేకుండా ఖండించటమో, నిరాకరించటమో చేస్తూ వచ్చారు. ఈ నిరాకరణను దళిత, స్త్రీవాద, ప్రాంతీయవాద ఉద్యమాలు కూడా ఎదుర్కొనక తప్పలేదు. ఎనభైల తరువాత మరింత తీవ్రంగా కమ్యూనిస్టుల నుంచి విమర్శలను ఎదుర్కొన్న ఈ ఉద్యమాలను సమర్థించే పనికి కమ్యూనిస్టు పార్టీల వెలుపలి వుండి మార్క్సిస్టేతర తత్వశాస్త్రాలను, సామాజిక శాస్త్రాలను, ముఖ్యంగా ఆధుకానంతరవాద తాత్విక సిద్ధాంతాలను అధ్యయనం చేసిన కొంతమంది యువ విమర్శకులు కమ్యూనిస్టుల దాడి నుంచి ఈ కొత్త ఉద్యమాలకు అండగా నిలిచారు.అటువంటివాళ్ళలో ప్రముఖంగా చెప్పుకోవలసిన వాడు కె. శ్రీనివాస్‌. 'మహాకథనాలు - పిట్ట కథలు' పేరుతో ఆయనరాసిన వ్యాసం. ఆధునికానంతరవాదం మీద వస్తున్న విమర్శలకు స్థూలంగా సమాచారం చెప్పగలిగింది. స్త్రీవాద, దళితవాద భావనలను సమర్పించటమే కాకుండా మార్కిస్టు ఆలోచనలలో పరిమితులను, వాస్తవ నిరాకరణను కె. శ్రీనివాస్‌ అనేక వ్యాసాలలో ఖండించాడు. అలాగే ఈ వాదాల నుంచి వచ్చిన అనేక రచనలకు అతను తాత్విక సమర్థననిచ్చాడు.

అస్తిత్వవాద ఉద్యమాలను, ప్రాంతీయవాద ఉద్యమాలను సమర్థించటంతోపాటు తెలంగాణా తెలుగుభాషకు, కోస్తా ఆంధ్ర తెలుగు భాషకు మధ్య వ్యత్యాసం చూపించి తెలంగాణ తెలుగు మాండలికంకాదని, తెలంగాణ తెలుగు అని నిరూపించే ప్రయత్నం చేశాడు. అమెరికన్‌ ఇంగ్లీష్‌, బ్రిటిష్‌ ఇంగ్లీషుల లాగా తెలంగాణ తెలుగు, కోస్తా తెలుగు విడివిడిగా గుర్తింపబడటానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదని ప్రకటించాడు. తెలంగాణా కళా సాహిత్యాంశాలను, ప్రాంతీయ ప్రత్యేకతలను కె. శ్రీనివాస్‌ ఐతిలీబిజిశిలిజీదీ దృక్కోణంనుంచి విశ్లేషించే ప్రయత్నం చేశాడు. ఈ ఐతిలీబిజిశిలిజీదీ స్పృహ వల్లే తను ఈ కిందివిధంగా అనగలిగాడు, ''ఏ చరిత్రనయినా సామాజిక కోణాల నుంచి వ్యాఖ్యానించినప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. చరిత్రను కేవలం రాజకీయ ఉద్యమాల చరిత్రగానో, పలుకుబడి కలిగిన వర్గాలను శ్రేణుల చరిత్రగానో చూస్తే గతాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేము''.18 ఇవేకాక అసంఖ్యాకంగా శ్రీనివాస్‌ రాసిన వ్యాసాలు పత్రికకాలమ్స్‌ ఆధునికానంతర తాత్విక, చారిత్రక చైతన్యాన్ని ప్రదర్శిస్తాయి.

సంప్రదాయ మార్క్సిస్టులపై దాడి - లక్ష్మీనరసయ్య

ఆధునికానంతర వాదంలోని కీలకాంశాలలో ఒకటి ఇంతవరకు విస్మరించబడిన బృందాలను గురించి, సామాజికంగా అంచులకు నెట్టివేయబడిన వర్గాల గురించి, వాళ్ళ ప్రతి ప్రవచనాల (బీళితిదీశిలిజీ ఈరిరీబీళితిజీరీలిరీ) గురించి నూత్నప్రతిపాదనలు చేయటం. ముఖ్యంగా నల్లజాతీయుల కళా సాంస్కృతిక చరిత్రలు ఎలా అణిచివేయబడ్డాయో, సామాజికంగా వాళ్ళ ద్వితీయ స్థానంలోకి ఎలా కుదింపబడ్డారో విశ్లేషించటం కనిపిస్తుంది. డెరిడా ప్రతిపాదించిన 'ఇనీరిశిలి ఖగిశినీళిజిళివీరిలిరీ' అనే భావన వెనుక ఉన్నది ఈ స్పృహే. తెలుగులో దళితవాద ఆవిర్భావం వెనుక దళితులు ముందుకు తెచ్చిన ప్రతి ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు 1985ల ముందు కొంత అమూర్తంగాను, కేవలం సాహితీవ్యక్తీకరణలుగా ఉన్నాయి. వీటిని 1985ల తర్వాత తాత్విక, రాజకీయ అవగాహనలో, నిర్దిష్ట నేపథ్యంలో ప్రతిపాదించినవాడు జి. లక్ష్మీనరసయ్య. లక్ష్మీనరసయ్య సంప్రదాయ మార్క్సిస్టులతో చాలా ఘర్షణ పడాల్సివచ్చింది. అయినప్పటికీ అనేక వ్యాసాలలో ఆయన వాళ్ళతో తలపడ్డాడు. దళిత, బహుజన తత్వాన్ని ముఖ్యంగా అంబేద్కర్‌ దృక్కోణంలోంచి ప్రతిపాదించటమేకాకుండా, దానిని సాహిత్య విమర్శలో చొప్పించి సోదాహరణంగా దళిత సౌందర్య శాస్త్రం (జులిరీశినీలిశిరిబీరీ) ని ప్రతిపాదించటంలో విజయం సాధించాడు. మన సమాజంలో ఏవాదమయినా తీవ్ర పరిభాషలో, కొంత ఉద్రేకంతో జోడించి చెపితే తప్ప మన సమాజంలో ఆమోదం పొందటం అసాధ్యం. కొంత వివాదాస్పద అంశాలను కూడా లక్ష్మీనరసయ్య చాలా మొరటు పరిభాషలో చెప్పటం ద్వారా ఆమోదింపచేశాడు. దాదాపు 5 సంవత్సరాలపాటు లక్ష్మీనరసయ్య దళిత వాచకాలను తీసుకుని ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా విమర్శ రాసి సంప్రదాయ మార్కిస్టులచేత ఆమోదింపచేశాడు. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టులు కులం, జండర్‌లాంటి వాటికున్న ప్రాధాన్యతను, విలువను గుర్తించటం జరిగింది.

కొత్త కొలమానాల 'కొలుపు' - కాసుల ప్రతాపరెడ్డి

తెలుగు సమాజంలోని ఉద్యమాలను దగ్గర నుంచి చూసే అవకాశం, వాటిని విశ్లేషించే అవసరాన్ని గుర్తించి సాహిత్య సామాజిక విశ్లేషణను ప్రారంభించిన విమర్శకులలో కాసుల ప్రతాపరెడ్డిని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన 2001లో 'భౌగోళిక సందర్భం' 2002లో ప్రకటించిన 'కొలుపు', ఇంకా 'ముద్దెర' తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్య విమర్శ వ్యాసాలు. ఇవికాక పలు పుస్తకాలపై రాసిన సమీక్షలు, సాహిత్యవ్యాసాలు కొత్త సాహిత్య సందర్భాన్ని విశ్లేషిస్తూ సాగాయి. ఆధునికానంత వాదం ముందుకు తెచ్చిన 'ప్రతి సిద్ధాంతపు అస్థిరత, అనిశ్చితి, తాత్కాలికత నమ్మడాన్ని ఈయన రచనలు ప్రతిబింబిస్తాయి. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాహిత్యం వంటి అంశాలను 'నిర్దేశించిన కొలమానాల పరిమితుల్ని' ప్రశ్నిస్తూ సరికొత్తగా అర్థం చేసుకోవాల్సివుందని, ఆ భిన్నత్వమేమిటో చెప్పే ప్రయత్నం 'భౌగోళిక సందర్భం' సంకలనంలో ప్రయత్నించాడు.

ప్రాంతీయ విభేదాలు, అణచివేత చర్చ స్థానే 'స్థానిక దేశీయ సాహిత్యాన్ని' వెలికి తీసి అందించడం అనే స్పృహ పెరిగింది. ఆ దృష్ట్యా అనేక విశిష్టతలను, ప్రత్యేకతలను కలిగి ఉన్న 'కొలుపు' అనే పుస్తకం వెలువరించారు. ''తెలుగు పేరిట భాషావాద చారిత్రక దృక్పథాన్ని ఖండిస్తూ, స్థలకాల నిర్ధిష్టతల దృక్పథాన్ని ఈ సంకలనం ముందుకు తెచ్చింది. సిద్ధాంత చర్చల ఆధిపత్యవాదంతో అణగదొక్కిన అధ్యయన పద్ధతిని పూర్వపక్షం చేస్తూ సిద్ధాంతం కన్నా జీవితం ప్రాథమికమనే అధ్యయన పద్ధతిని సంకలనం పునః స్థాపించింది''19 అని ముందుమాటలో బి.యస్‌.రాములు, కాసుల ప్రతాపరెడ్డి విమర్శ అంతరంగాన్ని పట్టి చూపించారు. తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రను తనదైన ప్రత్యేక అస్తిత్వంలో, విశిష్టతలో, అధ్యయన పద్ధతులలో నూతన శతాబ్దానికి అందించడం ఆధునికానంతర వాద సిద్ధాంతాల ప్రతిఫలనంగానే చూడవచ్చు.

ఇంకా ప్రతాపరెడ్డి ''మొత్తంగా సాహిత్యం స్థల నిర్దేశితం. ప్రాంతాలన్నీ ఒకటి కానట్లే, సాహిత్య మంతా ఒక్కటికాదు. అంటే ఒకే భాషలో వెలువడిన సాహిత్యమంతా ఒకటి కాదు. ఇంకా చెప్పాలంటే ఒక కాలంలో వెలువడిన తెలుగు సాహిత్యమంతా ఒక్కటి కాదు''20 అంటున్నాడు. దీన్ని ఆధునికానంతరవాదం తన సూత్రీకరించింది. ''అన్నింటికి ఏకమొత్తంగా ఐక్యంగా చూసే దృష్టిని నిరాకరిస్తుందనే21 భావనను ప్రతిఫలిస్తుంది. అంతేకాక వాస్తవికతా వాద ముగింపును కూడా ప్రతిపాదిస్తూ సమాజాన్ని ఒక థలో విశ్లేషించిన సిద్ధాంతమే సత్యమని నిరూపించడానికి రచనలు చేస్తున్నారు తప్ప జీవితం చీకటికోణాల గుట్టువిప్పే పనిచేయడంలేదని కాసుల ప్రతాపరెడ్డి గుర్తించడమేకాక, ఆ ఎరుకను తన విమర్శకు ఆలంబనగా స్వీకరించాడు. తెలుగు సృజనాత్మక సాహిత్యం 'సైద్ధాంతిక దారిలో' నడుస్తోందని ఆయన విమర్శ. ఈ విమర్శ ఇది ఆధునికతపై విమర్శ. ఆధునికత యొక్క ప్రతిఫలనాలు సాహిత్యాన్ని ముందుకు సాగనివ్వకపోగా, ఆచట్రపు పరిమితుల్లోంచి చూసి, ఆయా చట్రాల సిద్ధాంతాల చట్రాలలోకి రాసి రచనలకు ప్రచారం రాకుండా చేస్తున్నారనేది ఆయన గుర్తించాడు. ''కాబట్టే త్రిపుర కథలను, పతంజలి, కేశవరెడ్డి నవలలను, రాయలసీమ రచయితల నవలలను, కథలను విశ్లేషించే విమర్శకులు కరువయ్యారు'22 అంటాడు.

తెలంగాణ ప్రత్యేక అస్తిత్వంకోసం ప్రయత్నిస్తున్న క్రమంలో తెలంగాణ రచయితల్లోనూ ఆ ఆత్మ సంఘర్షణ మొదలైంది. ప్రాంతీయ స్పృహ, భాషా స్పృహ, జీవితమూలాల్ని వెదుక్కునే స్పృహ పెరిగింది. చివరికి సాహిత్య విమర్శకు తెలంగాణ అనే ప్రాంతీయతల మధ్య ఉన్న భేదాల్ని వివరిస్తూ, సాహిత్యంలో ప్రతిబింబిస్తున్న అంశాలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసం 'వాళ్ళు - మనమూ'23. స్థానిక ప్రమాణాలతో సాహిత్యాన్ని చూడాల్సి ఉంటుందని కాసుల ప్రతాపరెడ్డి ప్రతిపాదించాడు. ఇప్పటి వరకు తెలంగాణ సాహిత్యకారులు తాము సృష్టించిన సాహిత్యాన్ని, చేసిన ఆలోచనలను, నమ్మిన సిద్ధాంతాలను వెనక్కి తిరిగి చూసుకొని, భాషను యాసను, జీవితామూలాలను కోల్పోయే పరిస్థితి నుంచి తమ 'అస్తిత్వాన్ని' కాపాడుకునే ప్రయత్నం మొదలవడాన్ని విమర్శకుడుగా గుర్తించాడు. అందువల్లనే స్త్రీవాదంలో, దళితవాదంలో, మైనారిటీ వాదంలో ఏకమొత్తంగా ఉన్న తెలుగు వాదాలను అంగీకరించడంలేదు. కోస్తా, తెలంగాణ స్త్రీ, దళిత, మైనారిటీ వాదాలు ఒకటి కావు, వేర్వేరు అని సూత్రీకరించాడు. 'స్థానిక ఉనికి' స్పృహతోనే రచనలు, విమర్శ రావాలని ప్రతిపాదించాడు. ''విశ్వాసాల దృష్ట్యా, సైద్ధాంతిక నిబద్ధతల దృష్ట్యా వెలువడిన ఒకే రకమైన సాహిత్యమంతా ఒకటి కాదు24 అని విశ్లేషిస్తున్నాడు.

ఈ రకపు విమర్శా స్పృహతో కాసుల ప్రతాపరెడ్డి రాసిన వ్యాసాలు విమర్శనారంగంలో మారిన సందర్భంలో కొత్త కొలమాలాలను రూపొందించుకునే క్రమాన్ని, అవసరాన్ని గుర్తించేట్లు చేస్తున్నాయి. ప్రతాపరెడ్డి ఆధునికానంతర వాదం ఎరుకలో ఈ ప్రతిపాదనలు చేశాడని కూడా నిర్ధారించడానికి వీలులేదు. ఏ విమర్శకుడు, సృజనకారుడు సిద్ధాంతాల, వాదాల ఎరుకతోనే రాస్తాడని చెప్పేందుకు వీలులేదు. అయితే తెలియకుండానే సామాజిక, సాహిత్య రంగాల్లో వ్యాప్తిలోకి వచ్చే, లేదా ప్రభావాన్ని చూపుతున్న కొత్త వాదాల భావజాలం, ఆయా కాలాల్లోని బుద్దిజీవులపై పనిచేస్తాయి. కాసుల ప్రతాపరెడ్డి చేస్తున్న విమర్శ ఆధునికానంతర వాదపు భావజాలానికి దగ్గరగా ఉండటం యాదృచ్ఛికమూ కావచ్చు. అయితే కాసుల ప్రతాపరెడ్డి రాసిన విమర్శను బి.యస్‌. రాములు విశ్లేషించినట్టు ''తెలంగాణ కొలుపుగా, సిద్ధాంతాల కొలుపుగా, యాంటి గ్లోబలైజేషన్‌ కొలుపుగా, యాంటీ ఫాసిస్టుగా కొలుపుగా, ప్రజాస్వామిక కొలుపుగా స్థిరపరచవలసి ఉంటుంది. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్య విమర్శ సంకలనంగా ముదిగంటి సుజాతారెడ్డి సంపాదకత్వంలో వెలువడిన 'ముద్దెర' (అక్టోబరు 2005) లో కాసుల ప్రతాపరెడ్డి రాసిన మూడు వ్యాసాలున్నాయి. అవి తెలంగాణ కవిత్వభాష - ఆధునికత', 'దీర్ఘకవితలు - తెలంగాణ అస్తిత్వం', 'తెలంగాణ పాట - దేశీయత'. ఈ వ్యాసాలు భాషను, అస్తిత్వాన్ని, దేశీయతను పలుకోణాల్లో విశ్లేషించాడు. తెలంగాణ కవిత్వంలో భాష స్థానికతను ప్రతిబింబించే సాధనంగా ఎలా చూడవచ్చో విశ్లేషించడమేకాక, నిర్ధిష్టతను ప్రతిఫలించే దీర్ఘ కవితల్లో అస్తిత్వ కోణాలను వివరించాడు. మాట్లాడే భాషను కవిత్వంచేసి స్థానిక అస్తిత్వాలను రికార్డు చేసిన కవిత్వంగా వీటిని ప్రతాపరెడ్డి చూపిన దృష్టికోణం ఆధునికానంతర అవగాహన పరిధిలోదే. అలాగే ఆధునికానంత వాదంలోని 'ప్రాంతీయ నిర్ధిష్టతలన్ని' తెలంగాణ పాటలో చూశాడు. గోరటి వెంకన్న పాటల్లో కన్పించే బైరాగుల తత్వాల లక్షణం, యక్షగాన రీతుల్ని వివరించాడు. ఆధునికతకు కొనసాగింపుగా విభిన్నతలను కాపాడుకోవడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విధ్వంసమైపోతూవున్న ప్రాంతీయ సంస్కృతుల పరిరక్షణ గురించిన స్పృహ ఆధునికత మీద చేసిన ఖండనలో భాగంగా ఆధునికానంతరవాదం స్పృహను కలగచేసింది. ఈ స్పృహ ప్రతాపరెడ్డి విమర్శలో ప్రతిబింబిస్తుంది.

ప్రపంచీకరణ సాహిత్య వ్యాఖ్యాత - గుడిపాటి

'ఇతివృత్తం' కథాసాహిత్య వ్యాసాలు, 'అభివ్యక్తి' కవిత్వ విమర్శ, 'గ్లోబలైజేషన్‌' సాహిత్య దృక్పథం గ్రంథాలు ప్రకటించిన గుడిపాటి తెలుగులో సాహిత్య విమర్శకుడిగా కొత్త ప్రతిపాదనతో కృషి చేస్తున్నాడు. రాచపాళెం చంథ్రేఖరరెడ్డి తన వ్యాసంలో గుర్తించినట్లు గుడిపాటి 'ప్రపంచీకరణ సాహిత్య వ్యాఖ్యాత'గా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.25 స్త్రీవాద, దళితవాద, మైనారిటీ ప్రాంతీయవాదాలను ఆహ్వానిస్తూనే వాటిలోని లోపాలను కూడా గుర్తించి చూపుతున్నాడు. అన్ని రంగాలలో విభిన్నతను గుర్తించడంలో భాగంగా ఈయన చేసిన విమర్శను గుర్తించాల్సి వుంటుంది. గ్లోబలైజేషన్‌ ప్రభావాన్ని చిత్రించే సాహిత్యం మీద గుడిపాటి చేసిన విమర్శ తెలుగు సాహిత్య విమర్శకు అదనంగా వచ్చిన చేరిన కోణం. గ్లోబలైజేషన్‌ భావన 'విశ్వజనీనమైన' భావన. అది మొత్తం సమాజాన్ని ఒకే దృష్టితో చూస్తుంది. దీనిని గుడిపాటి గుర్తించాడు. తెలుగు సాహిత్యంలోని కొన్ని అంశాలను కొన్ని అంశాలను తీసుకొని, గ్లోబలైజేషన్‌ ప్రభావ సాహిత్యాన్ని విశ్లేషించాడు. 'తెలంగాణ కథ - భాష' 26 వ్యాసం భాషా సంబంధమైన నిర్మాణాలలోని విభిన్నతలను ప్రతిపాదించిన వ్యాసం. ''ఎవరి అనుభవాల్ని వాళ్లు రాయడం మంచిదన్న వాదం వచ్చి పదేళ్లు దాటింది. ఈ వాదన ఇప్పుడు అందరికీ ఆమోదయోగ్యం. కానీ ఎవరి భాషలో వాళ్లు రాయాలన్న స్పృహ అందరిలోనూ ఏర్పడలేదు. తమ అనుభవాన్ని పరాయి భాషలో వ్యక్తీకరించాల్సి రావడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. తెలంగాణకు సంబంధించి ఇది కఠిన వాస్తవం'' అని అస్తిత్వ భావనలతో పాటు, ఆయా అస్తిత్వ సమూహాల వ్యక్తీకరణ కోసం ఏర్పరచుకోవాల్సిన భాష, దాని యొక్క పాత్రను గుర్తించడం విమర్శకుడిగా ఆధునికత స్థాయిని దాటి వచ్చాడని చెప్పడానికి నిదర్శనం.

ముస్లిం, ఇస్లాం వాదాల సాహిత్యాన్ని గుర్తించి అందులో భాగంగా ఒకే అస్తిత్వంలోని విభిన్నతలను చర్చలోకి ఆహ్వానించాడు.27 కవితానిర్మాణంలో మౌఖిక కథన పద్ధతులను, దేశీమార్గ కవితారీతుల్ని గుర్తించి విమర్శను అందుకు సన్నద్ధం చేస్తున్నాడు గుడిపాటి. 'బహుళ నిర్దిష్టతల వ్యక్తీకరణ'28 అనే వ్యాసంలో చర్చించిన పలు అంశాలు అతనిలోని ఆధునికానంతర లక్షణాలను పట్టిస్తాయి. ''ఇవాళ సాహిత్య సృజన జెండర్‌, కులం, మతం, ప్రాంతం అనే నిర్దిష్టతల దిశగా సాగుతోంది. దీనికి అదనంగా గ్లోబలైజేషన్‌ పీడన తోడైంది. వీటిలో ఎవరు కూడా ఏదో ఒక నిర్దిష్టతకే పరిమితమై రాయలేరు. ఒక గుర్తింపు వర్గానికి మాత్రమే పరిమితమై వుండదు''.29 ఈ విధమైన పరిశీలనలతో వ్యక్తిలోని బహుళత్వాన్ని గుర్తించడంలో కూడా గుడిపాటి విమర్శ తొంగిచూస్తుంది. ఇటువంటి భావనలతో సమకాలీన అత్యాధునిక నేపథ్యంతో కొత్త తోవలు వేస్తున్న విమర్శకుడిగా గుడిపాటిని గుర్తించాల్సి వుంటుంది.

విభిన్నతల గుర్తింపులు - అంబటి సురేంద్రరాజు

తెలుగు సాహిత్య విమర్శలో విభిన్నమైన దృష్టి కోణంతో విమర్శ రాస్తున్నవారిలో అంబటి సురేంద్రరాజును గుర్తించాల్సి వుంటుంది. విస్తారమైన జ్ఞానమూ, సాహిత్య సిద్ధాంతాల పాండిత్యమూ, ప్రాచ్యపాశ్చాత్య తాత్త్వికతల పరంపరల ఎరుకా, సమకాలీన భావజాలాలపై సమగ్రమైన దృష్టి కలిగివున్న విమర్శకుడిగా సురేంద్రరాజును చెప్పుకోవచ్చు. అన్ని రంగాలలో విభిన్నతని గుర్తించే తత్వం, గుణతో విమర్శనారంగంలోనూ, సృజనరంగంలోనూ సురేంద్రరాజు కృషి చేస్తున్నాడు. 'తెలుగు ముస్లింల అస్తిత్వ కాంక్షకు అక్షర రూపం జల్‌జలా' అనే ముల్కిలో రాసిన వ్యాసంలో ఆయన ప్రతిపాదనల ఆధారంగా ఎన్నుకున్న విమర్శధోరణిని పరిశీలించవచ్చు.30 ''ముస్లింలకు ఒక జాతిగా లేదు, అదే వారి బలం. ఇల్యూజన్స్‌కు తావులేని చైతన్యం వారి చూపును నిశితం చేసింది, వారి జీవన విధానాన్ని తీర్చిదిద్దింది''31 అనే పరిశీలనలో ఒక జాతిగా లేకపోవడాన్ని బలంగా గుర్తించడం అనే భావన విభిన్నతలను ప్రతిపాదించడం మాత్రమే కాక సామూహికీకరణలను లేక విశ్వజనీనతను నిరాదరించే ధోరణే కారణం. మరో సందర్భంలో ''.... దళిత బహుజనులు ఇందుకు భిన్నంగా తమ ప్రత్యేకతలననుసరించి, తమ భిన్నత్వాలకనుగుణంగా, రాజీ వైఖరి అవలంబించకుండా, ఆత్మవంచనకు లోను కాకుండా విడిపోతారు. విడిపోయి కూడా బలహీనపడరు. తమ బలాన్ని పెంచుకుంటారు. నిలుపుకుంటారు.... సామాజికంగా, సాంస్కృతికంగా ఇది వారి విశిష్టత'' అంటాడు. ఈ ఎరుకలోని అంతస్సూత్రం పోస్టు మాడర్నిజం భావనలకు సంబంధించినవిగానే గుర్తించాలి. అంతేకాక విశ్వజనీన సిద్ధాంతాలను నిరాకరించడం అనే దృష్టికోణాన్ని తన విమర్శలో ప్రతిపాదిస్తాడు. ''ఒకే సిలబస్‌తో కృత్రిమంగా కలిసి వుండటం కన్నా ఎవరంతటవారు వేరు పడటం'' అవసరమని చెబుతున్నాడు.32

అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో సురేంద్రరాజు సిద్ధాంతకర్తగా సాహిత్యవిమర్శను ఒక సామాజిక ప్రక్రియగా మలిచాడు. తెలంగాణ సాంస్కృతిక వేదిక ప్రచురించిన 'తెలంగాణ తోవలు' పుస్తకంలో ''తెలంగాణ రచయితకు తోవ దొరికింది'' అనే వ్యాసం రాశారు.33 ఇందులో ప్రధానంగా భాష గురించిన చర్చ చేశారు. ఆయా సమూహాలకు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరమైన భాషను ప్రామాణిక భాష దృష్టితో కోల్పోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని అంటారు.

తెలుగు కవిత్వం గురించి విశ్లేషణాత్మకంగా సుప్రభాతం పత్రిక, 1994లో రాసిన వ్యాసం గురించి ప్రస్తావించాలి.34 'అత్యాధునిక కవిత్వం యొక్క ప్రస్తావనను ఇందులో ప్రధానంగా స్వీకరించి కవిత్వరంగాన్ని విశ్లేషించడానికి ఈ వ్యాసం ప్రయత్నించింది. తిరుగుబాటు తత్వం అంతరించి యధాతథవాదం బలపడటం ''విప్లవ కవిత్వం కనుమరుగవడంతో ఉనికిలోకి వచ్చిన ఈ ధోరణి వెనక వున్న సామాజిక, సాంస్కృతిక నేపథ్యంపై, దానికి సమాంతరంగా తలెత్తిన స్త్రీవాద, దళిత కవిత్వాల చారిత్రక ఆవశ్యకతపై ఒక నిశిత పరిశీలనగా, ఒక విస్పష్ట విశ్లేషణగా ఈ వ్యాసం రూపొందింది. ఇందులోని ముఖ్యమైన ప్రతిపాదనలు కొన్ని: 1. మధ్యతరగతిలో చేరిపోవడం ఇష్టంలేక, అందులో చేరక, దాని విలువలను అంగీకరించిన (పుట్టింది దానిలోనే అయినా) దానికి వ్యతిరేకంగా, దాని విలువలను భూస్థాపితం చేస్తూ తెలుగులో ఆధునిక కవిత్వం తలెత్తింది. 2. కవిత్వం మధ్యతరగతి మందహాసంలానే మిగిలిపోయింది. 3. మధ్యతరగతి మనుషుల్లాగే కవిత్వాన్ని మృదువుగానే, కఠినమైన విషయాన్ని చెప్పడం కోసం కూడా వాడుతుండటం - సామాజికంగా ఉన్న వైరుధ్యాలే కారణం. ఈ విధమైన విమర్శలతో 'రచయితల అంతిమ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం' ద్వాఆర సాహిత్యంలో వుండే స్తబ్దతను ప్రశ్నించడం, ఆపై 'నిలువనీరు'ల లాంటి సృజనవ్యవస్థను ప్రక్షాళించడం వంటి విషయాలపై ఈ విమర్శకుడు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాడనిపిస్తుంది.

ఈ రకంగా తెలుగు సాహిత్యంలో కొంత మంది విమర్శకులు ఆధిపత్యాలను ధిక్కరించి నూతన ప్రతిపాదనల ద్వారా ఆధునికాంనతర ధోరణులకు పట్టం కట్టారు. డా|| సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సీతారాం, ముదిగంటి సుజాతారెడ్డి వంటివాళ్లలో కొంత మంది తెలిసి, మరికొంత మంది తెలియక ఆధునికానంతర విమర్శనా ధోరణిని అందిపుచ్చుకున్నారు.

- యాకూబ్

English summary

 Dr Yakoob analyses post modern trends in Telugu literature. Basically, a poet Yakoob has written this as a part of his doctoral thesis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X