• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంతకీ 'ప్రజల మనిషి' ఎవరు?

By Pratap
|

BS Ramulu
కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసరుగా పనిచేసి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీ విరమణ చేసిన అనుమాండ్ల భూమయ్య సుప్రసిద్ధ పద్య కవి. పద్యాన్ని పాటలాగ పాడి, విద్యార్థులు పద్యాన్ని ప్రేమించేట్టు చేయగలిగిన ఆచార్యులు.

పరిశోధనలో వైవిధ్యం:

ఈ వ్యాసం 'మాలపల్లి', 'ప్రజల మనిషి' అనే నవలలపై అనుమాండ్ల భూమయ్య చేసిన విశ్లేషణకు పరిమితం. అనుమాండ్ల భూమయ్య మౌలికంగా పరిశోధకులు. స్పష్టంగా చెప్పాలంటే అనుమాండ్ల భూమయ్య సత్యశోధకులు. మొదట పరిశోధకులు, ఆతర్వాతే కవి. సాహిత్య రచన తర్వాత చేద్దువుగాని, ముందు జీవితాన్ని గెలుచుకో. అధ్యాపక వృత్తికి ఆదర్శంగా ఎదుగు అని గురువర్యులు చెప్పడంతో జీవితంలో స్థిరపడ్డాకే సాహిత్య క్షేత్రంలో ప్రవేశించారు.

సత్యాన్ని సాహిత్యంనుంచి వెలికితీయడంలో అనుమాండ్ల భూమయ్య ప్రజ్ఞాపాటవాలు అపారం. ఈ సత్యాన్వేషణ అనుమాండ్ల భూమయ్య జీవితాన్ని నిరంతర పరిశోధకుడిగా, విశ్లేషకుడిగా నిలిపింది. నాయని సుబ్బారావు కృతుల పరిశీలన నుండి మొదలుకొని కవి కొరవి గోపరాజు సాహిత్య విశ్లేషణ గానీ, ఆధునిక ఇతిహాసంగా వేయిపడగలు నవలను పరిశీలించడం గానీ, మాలపల్లి నవల ఒక అభ్యుదయ మహాకావ్యంగా దర్శించడం గానీ, కట్టమంచి రామలింగారెడ్డి సాహిత్య విమర్శలో ఆద్యుడుగా వేసిన మార్గం గురించి గానీ, ఆధునిక కవిత్వంలో దాంపత్యం చిత్రించిన తీరును పరిశీలించడంలోగానీ, కర్పూర వసంతరాయలులో కథా కళాత్మక కథ సంశ్లేషణ గురించి గానీ, గోలకొండ కవుల సంచిక 1935 నాటి తెలంగాణ కవుల భావ విపంచికగా నడిపించిన తీరుగానీ, ప్రజలమనిషి నవలలో తెలంగాణ చైతన్య స్ఫూర్తి విశ్లేషణగానీ, భారతీయ సంస్కృతి వైభవం, ఆంధ్రపురాణంలో చిత్రించిన తీరుగురించి గానీ చేసిన పరిశోధనలు, విశ్లేషణలు ఒక సత్యాన్వేషకుడి మార్గాన్ని తెలుపుతాయి.

అనుమాండ్ల భూమయ్యను ఎలా అంచనా వేయాలి?:

ఆధునిక సాహిత్యంలో, సాహిత్య విమర్శలో, సాంప్రదాయిక దృక్పథం, గాంధీ దృక్పథం, అంబేడ్కర్‌ దృక్పథం, మార్క్సిస్టు దృక్పథం, హిందూవాద దృక్పథం, ప్రాంతీయ, స్థలకాలాల దృక్పథం బలంగా కొనసాగుతున్నాయి. అనుమాండ్ల భూమయ్య వీటిలో ఏ కోవకు చెందుతాడు అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు అంత సులభం కాదు. ఆయన సాంప్రదాయ సాహిత్యాన్ని పరిశీలించారు. ఆధునిక సాహిత్యాన్ని విశ్లేషించాడు. వామపక్ష దృక్పథంతో చేసిన విశ్లేషణలోని లోపాలను ఎత్తిచూపారు. వేయిపడగలు సమాజాన్ని వెనక్కి నడిపించేది అని చాలామంది అభిప్రాయమైతే, అది ఆధునిక ఇతిహాసంలో ఎలా పరిఢవిల్లిందో నిరూపించారు.

అలా చూసినప్పుడు హిందూవాద, సాంప్రదాయిక దృక్పథంతో సాహిత్య విమర్శ చేస్తాడని అనుకుంటారు. కానీ మాలపల్లిని తొలి అభ్యుదయ మహాకావ్యంగా విశ్లేషించిన తీరు అబ్బురపరుస్తుంది. అప్పుడు సాంప్రదాయికవాది అనేమాట వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. శ్రీశ్రీ ఆధునిక అభ్యుదయ సాహిత్యానికి ప్రతీకగా ప్రాచుర్యంలోకి వచ్చారు. దీన్ని అనుమాండ్ల భూమయ్య పరిశీలించారు. తనకుతానే ప్రశ్నవేసుకొని జవాబు వెతికే ప్రయత్నం చేశారు. ఆ జవాబు మాలపల్లి తొలి అభ్యుదయ మహాకావ్యమని నిరూపించింది.

'ఆనందమఠం', 'మాలపల్లి' నవలల్లోని గీతాలు:

బంకించంద్ర ఛటర్జీ రాసిన 'ఆనందమఠం' నవలలోని వందేమాతరం అనే పాట 1905నాటి బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమానికి గొప్ప నినాదమైంది. క్రమంగా అది జాతీయగీతంగా మారింది. అదేవిధంగా తెలుగులో మాలపల్లి నవలలో గల అభ్యుదయగీతాలు తెలుగు ఉద్యమాల్లో ఎందుకు ఉపయోగించబడలేదు? ఎందుకు తెలుగు జాతి గీతాలుగా ప్రాచుర్యంలోకి రాలేదు? వందేమాతరంలో ఉన్నది ఏమిటి? మాలపల్లి గీతాలలో లేనిది ఏమిటి? వందేమాతరంలో లేనిదేమిటి? మాలపల్లిలో ఉన్నదేమిటి?.

రెంటిలో జాతీయ భావాలున్నాయి. అయితే మాలపల్లిలోని అభ్యుదయ గీతాల్లో కులవర్గ దృక్పథం ఉంది. వందేమాతరంలో హిందూ మత దృక్పథం ఉంది. మాలపల్లిలో హిందూమతంలోని అట్టడుగు వర్గాల, దళిత కులాల దృక్పథం ఉంది. అందువల్లే అగ్రకులాల నాయకత్వంలో వందేమాతరం గీతం ముందుకు సాగి, జాతీయగీతంగా మారింది. ఈ అగ్రకులాలకు మాలపల్లిలోని గీతాలు తమను తమ నాయకత్వాన్ని, దుష్టత్వాన్ని ప్రశ్నించే గీతాలు కావడంవల్ల వాటిని పక్కకు పెట్టారు. ఇలాంటి మౌలిక సత్యాన్ని వెలికి తీయడానికి అనుమాండ్ల భూమయ్య మహత్తర ప్రయత్నం చేశారు. బహుజనులు ఆలోచించాల్సిన తీరు, ''మాలపల్లి అభ్యుదయ మహాకావ్యం'' అనే గ్రంథంలో స్పష్టంగా కన్పడుతుంది. అందువల్ల అనుమాండ్ల భూమయ్యగారు బహుజన సాహిత్య విమర్శకులుగా కనపడతారు.

ఎవరు ప్రజలమనిషి అని విశ్లేషించిన అనుమాండ్ల భూమయ్య:

వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన 'ప్రజల మనిషి' నవలను పరిశీలించి దాని మౌలిక అంశాల ఆధారంగా, అందులోని కథ నడిపిన హీరో కంఠీరవం కాదని, కొమురయ్య అని సోపత్తికంగా నిరూపించారు. ఇది చదివి అబ్బురపడ్డాను. ఈ విశ్లేషణ చదివినప్పుడు వామపక్షవాదుల్లో అనుమాండ్ల భూమయ్య బహుజనవాదిగా బీసీ, ఎస్సీ, ఎస్టీల పక్షాన నిలిచి వామపక్ష ఉద్యమాలను పరిశీలించిన వామపక్షవాదిగా వ్యక్తమౌతారు. ఇలా అనుమాండ్ల భూమయ్యలో అనేక కోణాలు కనపడతాయి. ఇలా భిన్న కోణాల్లో వ్యక్తం కావడానికి కారణమేంటి? సత్యం కోసం పరిశోధించడమే ఆయన లక్ష్యం. ఏ సిద్ధాంతాలకో కట్టుబడి సత్యాలను వదిలేయడం ఆయనకు ఇష్టం ఉండదు. అందుకని సాంప్రదాయవాదుల్లో, అనుమాండ్ల భూమయ్య అంటే ఒక పక్కబెదురు. వామపక్ష సాహితీవేత్తల్లో పక్కబెదురు. ఈ బెదురును ఆయన సాంప్రదాయవాదని కొట్టిపడేయడం ద్వారా పక్కకు నెడతారు. అంతేగానీ, ఆయన చేసిన సత్యాన్వేషణను అంగీకరించడం గానీ, వ్యతిరేకించి తమదే సత్యమని నిరూపించడం గానీ చేయలేకపోయారు.

దృక్పథానికి, సత్యానికి మధ్య వైరుధ్యం:

ఇదే అనుమాండ్ల భూమయ్య ప్రత్యేకతను సత్యశోధన, నిబద్ధతను తెలుపుతుంది. కొందరు తమ దృక్పథానికి ప్రాధాన్యతనిస్తారు. కొందరు సత్యానికి ప్రాధాన్యతనిస్తారు. దృక్పథానికి, సత్యానికి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు ఎటువైపు నిలబడ్డాడో అనేది వారి సత్యసంధతను తెలుపుతుంది. సత్యానికనుకూలంగా దృక్పథం ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. సత్యాల ఆధారంగా, దృక్పథం ఏర్పర్చుకోవాలి. తెలియని సత్యాలవల్ల దృక్పథంలో లోపం ఉండవచ్చు. సత్యం తెలిసిన తర్వాత లోపాన్ని సరిచేసుకోవాలి. ఉదాహరణకు 1921 తవ్వకాల్లో హరప్పా, మొహంజోదారో, సింధూ నాగరికత బయటపడింది. అప్పటిదాకా రాసిన చరిత్ర తిరగరాయబడింది. అరవైఐదువేల పుస్తకాలు వెలువడ్డాయి. మరోసత్యం వెలికివచ్చినప్పుడు మల్లొకసారి చరిత్రను తిరగరాస్తారు.

చరిత్ర నిరంతరం తిరగరాయబడుతుంది:

వర్తమాన దృక్పథంతో, వర్తమాన అవసరాల్లో చరిత్రను ఎప్పటికప్పుడు నూతన తరాలు తిరగరాస్తుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సాహిత్యంలో సామాజిక చరిత్ర రికార్డవుతుంది. అందువల్ల సాహిత్యంలోని సామాజిక చరిత్ర కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి, తిరగరాస్తుంటారు. తిరగరాయడం అవసరం కూడా. లేకపోతే నూతన అవసరాలు, నూతన సామాజిక వర్గాలు, వారి ప్రయోజనాలు ముందుకు రావు. అడ్డగించబడతాయి. అస్తిత్వ ఉద్యమాలు ముందుకు వచ్చేది ఇందుకోసమే.

సత్యాన్ని వదిలి దృక్పథం చూపి, పక్కదారి పట్టించేవాళ్ళు:

ఆయా ఉద్యమాలు దేన్నో పక్కదారి పట్టించడం కోసమేనని కొందరు అనడమే నిజానికి పక్కదారి పట్టించడం. లేదా వారిని పట్టించుకోకుండా పాతపద్ధతిలో వదిలేస్తూ ముందుకు సాగాలనుకోవడం. అనగా అస్తిత్వ ఉద్యమాలు అని పెట్టే పేరే ఒక వివక్షకూడా. అవి ప్రజల అవసరాలను, దృక్పథాలను, ప్రయోజనాలను కొన్నింటిని తీసుకొని నొక్కి చెప్పడానికి సంబంధించినవి. వాటిని పట్టించుకోకుండా తనదిమాత్రమే పట్టించుకోవడానికి వాటిని తక్కువ చేసి, వదిలివేసి మా ఉద్యమంలో భాగంగానే అది పరిష్కరించబడుతుందని ముక్తాయింపు యిస్తారు. అలా తమ ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఈ పని చేస్తుంటారు. దీన్ని సత్యాన్వేషణ అనగలమా? నూతన సత్యాలను, నూతన అవసరాలను, నూతన తరాలను వారి వివేచనను, ప్రాధాన్యతను గౌరవించడం అనగలమా?

ఆగిపోయే సత్యాన్వేషకులు:

చరిత్ర విషయంలో ఎప్పటికప్పుడు తిరగరాయబడుతుంది అని ఇ.హెచ్‌.కార్‌ చెప్పిన మాటను అంగీకరించేవాళ్ళు కూడా నూతన తరాల ఆకాంక్షలను, ఉద్యమాలను, ప్రాధాన్యతలను, సాహిత్య చరిత్రలను తిరగరాస్తున్న క్రమం అని అంగీకరించడానికి సిద్ధంగాలేరు. అందువల్ల వారు గతంలోనే బతుకుతారు. వారు వారి దృక్పథానికి బందీలై జీవిస్తారు. అందువల్ల నూతన సత్యాలను కనుక్కోలేరు. ఎవరైనా కనుక్కొంటే అంగీకరించనూలేరు. ఇది సాంప్రదాయ వాదుల్లో, హిందూవాదుల్లో, ముస్లిం వాదుల్లో, క్రైస్తవవాదుల్లో కనపడ్డం సహజం. వామపక్షవాదుల్లో కూడా ఇదే కొనసాగడం ఏమనుకోవాలి? అనుకోవడానికేమీ లేదు. అందరిలాగే వారుకూడా ఒక థకు వచ్చి ఆగిపోయారని అర్థం చేసుకోవాలి. అందువల్ల నూతన సత్యాలను మరింత బలంగా ముందుకు తీసుకుపోవడానికి వీరందరిని పూర్వపక్షం చేసి, లేదా ఒప్పించి లేదా వ్యతిరేకించి ముందుకు సాగాల్సి ఉంటుంది. అనుమాండ్ల భూమయ్య చేసింది ఇదే.

'ప్రజలమనిషి' నవలపై ఆచార్య అనుమాండ్ల భూమయ్య చేసిన విశ్లేషణ నూతన సత్యాలను వెలికితీసింది. ఈ నవలను తెలంగాణ ఉద్యమ నవల అనే తన పి.హెచ్‌డీలో పరిశీలించిన వరవరరావు స్వీకరించలేదు. అనుమాండ్ల భూమయ్య రాసిన కోణం తప్పు అని వ్యాసాలు రాయించాలని వరవరరావు ప్రయత్నించారు. నన్నుకూడా కొందరు వరవరరావు తరఫున అడిగారు. నేను అనుమాండ్ల భూమయ్య రాసిన వ్యాసమే సరైనది. సత్యవాక్కు అని స్పష్టం చేశాను. ఇది 1993 నాటి మాట.

ఎందుకు వరవరరావు అనుమాండ్ల భూమయ్య ముందుకు తెచ్చిన సత్యాన్ని అంగీకరించలేదు?:

ఎందుకు వరవరరావు అనుమాండ్ల భూమయ్య ముందుకు తెచ్చిన సత్యాన్ని అంగీకరించలేదు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అనుమాండ్ల భూమయ్య అదే నవలలోని కంఠీరవం కాదని కొమురయ్య కథానాయకుడని ప్రతిపాదించాడు. ఆయన నవలలో లేనిది ఏదీ చెప్పలేదు. నవలలో ఉన్నదాన్నే విప్పి చెప్పాడు.

కంఠీరవానికి, కొమురయ్యకు మధ్య ఆచరణలో తేడా ఏమిటి?:

కంఠీరవం వైష్ణవ కులంనుండి చైతన్యం పొంది సామాజిక ఉద్యమాల్లో ప్రవేశించేక్రమంలో ఎదుర్కొన్న సమస్యలు, ప్రాధాన్యతలు క్రమంగా ఆయన చైతన్యం పెరిగిన తీరు ఈ నవలలో కంఠీరవం ప్రధానపాత్రగా ముందుకు సాగింది. అయితే సమస్య ఎక్కడ వచ్చింది?. తెలంగాణ రైతాంగ ఉద్యమం దేనికోసం ప్రారంభమైంది?. భూమికోసం, భూస్వాముల ఆధిపత్యం వ్యతిరేకించడం కోసం, నిజాం రాజరికాన్ని వదిలించుకోవడం కోసం తెలంగాణ రైతాంగ ఉద్యమం థలు థలుగా ముందుకు సాగింది. సంగం పేరిట నిజామాంధ్రమహాసభ తీసుకొచ్చిన చైతన్యంతో ప్రజలు కదిలారు. ఆంధ్రమహాసభ రెండుగా విడిపోయింది. ఒకపాయ కాంగ్రెసు గాంధీ అభిమాన సంగంగా కొనసాగింది. మరొకపాయ వామపక్ష అభిమాన సంగంగా కొనసాగింది. వామపక్ష సంగం ప్రజల భూమిని ప్రజలకు ఇప్పించాలని, భూస్వాముల దోపిడీని, దౌర్జన్యాన్ని అరికట్టాలని, దున్నేవారిదే భూమి అని ప్రధానంగా ముందుకు సాగింది. అందులో భాగంగా నైజాం సర్కారును కూడా వదిలించుకొని నూతన సమాజాన్ని నిర్మించాలనుకుంది.

ఉద్యమంలో భూమి సమస్య ప్రధానమైనప్పుడు:

అందువల్ల ఆ సామాజిక ఉద్యమాన్ని చిత్రించినప్పుడు భూమి సమస్య గురించిన ఉద్యమం ప్రధానమైనప్పుడు దానికి కేంద్ర బిందువు నవలలో కొమురయ్య. అందువల్ల సామాజిక చరిత్రననుసరించి గానీ, ఉద్యమ చరిత్రను అనుసరించిగానీ 'ప్రజలమనిషి' నవలలో కథానాయకుడు కొమురయ్య అని నిరూపించారు అనుమాండ్ల భూమయ్య. కంఠీరవం అలాంటి ఉద్యమాల్లో ఎలా పనిచేయాలో అని ముందుకు వస్తూ, తననుతాను చైతన్యపర్చుకుంటూ, ముందుకు నడిచిన పాత్ర. కొన్ని విషయాల్లో ముందుకు నడిపించిన పాత్ర. ఏ విషయాల్లో ముందుకు నడిపించింది?. ఆర్యసమాజ్‌ ద్వారా ముస్లిములుగా మారిన దళితులను తిరిగి హిందువులుగా మార్చడానికి బాగా కృషి చేసినట్లు కనపడుతుంది. అంతేగాని భూమి సమస్యకోసం కంఠీరవం నాయకత్వం వహించినట్లు కనపడదు.

అయితే కంఠీరవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?. సామాజిక ఉద్యమంలో దిగువ మధ్యతరగతి నుండి చైతన్యం పొందిన ప్రజలు ఆయా పీడితవర్గ పోరాటాల్లో చైతన్యమౌతూ, ముందుకు సాగుతూ నాయకత్వంగా ఎదిగే క్రమానికి ప్రతీక. కులం రీత్యా కంఠీరవానిది వైష్ణవ బ్రాహ్మణ కులం. ఇది నవల రాసిన వట్టికోట ఆళ్వారుస్వామి జీవిత చరిత్రకు అనుకరణనే కావచ్చు. అది వేరే విషయం. ఇది వట్టికోట ఆళ్వారు స్వామి జీవిత చరిత్ర కాదు. ఆత్మకథ కాదు. ఆయన జీవితానుభవాలను నవలలోకి మలిచాడు. అందువల్ల నవలే ప్రధానం. నవలల్లోని వస్తువు ప్రధానం. నవలలో చిత్రించబడిన సమస్య, పరిష్కారం అందుకోసం ఉద్యమించిన ప్రజలు ప్రధానం. ఆ ప్రజల్లో కొమురయ్య ఉన్నాడు.

కొమురయ్య కథానాయకుడు కాకపోతే ప్రజలు కథానాయకులు కాదని అర్థం:

ఇక్కడొక సున్నితమైన ప్రశ్న ఎదురౌతుంది. కొమురయ్య కథానాయకుడు కాకపోతే ప్రజలు కథానాయకులు కాదని అర్థం. ప్రజలు చరిత్ర నిర్మాతలు కాదని నిరాకరించడం కూడా. ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే మాట మనం చాలా సులువుగా అనేస్తుంటాం. నిజంగా సందర్భం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఉండరు అనేదే చరిత్ర చెప్తున్నది. ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్పేవాళ్ళు తామే చరిత్ర నిర్మాతలమని భావిస్తుంటారు. ప్రజలే చరిత్ర నిర్మాతలనే పదంలోనే ప్రజలు వేరు, తాము వేరు అనే భావన కూడా ఉంది. అది ప్రజలు చెప్పిన మాట కాదు. అది ప్రజల గురించి ఇతర వర్గాలు చెప్పిన మాట. ప్రజలే ఆ మాట చెప్పాల్సి వస్తే మేమే చరిత్ర నిర్మాతలం అంటారు తప్ప ప్రజలే చరిత్ర నిర్మాతలు అనాల్సిన అవసరం గానీ, వాక్య నిర్మాణం గానీ ఉండదు.

తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలం:

తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? అని శ్రీశ్రీ ప్రశ్నించాడు. ప్రశ్నించిన శ్రీశ్రీ ఆ కూలీ కాదు. ఆ కూలీల్లో భాగం కాదు. ఆ కూలీల్లో శ్రీశ్రీ భాగమై ఉంటే, 'తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలం' అని అంటారు. ఇలా తమగురించి తాము మాట్లాడినప్పుడు భాష, అభివ్యక్తి వేరుగా ఉంటుంది. ఇతరుల గురించి వారిని సమర్థిస్తూ, వారివెంట నడుస్తూ, తన అస్తిత్వం విడిగా కొనసాగుతూ మాట్లాడినప్పుడు భాష, అభివ్యక్తి వేరుగా ఉంటుంది. అందువల్ల ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే మాట ప్రజలు చెప్పిన మాట కాదు. ప్రజలగురించి ఇతర వర్గాలు చెప్పిన మాట. ఆ యితర వర్గాలు ఎవరు?. మధ్య తరగతి కావచ్చు. మేధావులు కావచ్చు. చరిత్రకారులు కావచ్చు. సామాజిక శాస్త్రవేత్తలు కావచ్చు. కవులు కావచ్చు. కళాకారులు కావచ్చు.

శ్రమైక జీవన సౌందర్యం - కాపురాజయ్య:

ఒకసారి ఇరవైయేళ్ళక్రితం సుప్రసిద్ధ చిత్రకారుడు కాపు రాజయ్య కరీంనగర్‌లో తన చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన తాళ్ళు ఎక్కే గౌడుల బొమ్మలను, కట్టెలు మోసే మహిళలను ఇలా కష్టజీవుల చిత్రాలను ఎన్నో చిత్రించారు. ఆయనని శ్రమైక జీవనం సౌందర్యమని అంటారు కదా! మీరేమంటారు అని చిలిపిగా జవాబు తెలిసికూడా నేను ప్రశ్నించాను. చూసేవాడికి శ్రమైక జీవన సౌందర్యం కనపడుతుంది. మోసేవాడికి, చేసేవాడికి చెమటలు కారతాయి. భారంతో కుంగుతారు. ఆనందమెక్కడిది? అందువల్ల ఆమాట కూర్చొని తినేవాళ్ళదే తప్ప పని చేసేవాళ్ళది కాదని కాపు రాజయ్యగారు కుండబద్దలు కొట్టారు. నాకు చాలా సంతోషం వేసింది.

ఎందుకంటే నేను దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక అధ్యకక్షులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్గ దృక్పథం పేరిట అగ్రకుల మధ్యతరగతి దృక్పథాన్ని ఎలా ఆధిపత్యంలో కొనసాగిస్తున్నారో సభల్లో, సమావేశాల్లో చెప్తూ వ్యాసాలు రాస్తున్న కాలం అది. అందువల్ల నేను ప్రతి ఒక్కరినీ ఇలా వారిలోని వర్గ దృక్పథంలో ఉన్న నిజమైన దృక్పథమేమిటో స్పష్టం చేయడంకోసం ప్రశ్నించాను. చర్చించాను. విశ్లేషించాను. ఆక్రమంలోనే నాకు అనుమాండ్ల భూమయ్య కొత్తగా అర్థమయ్యారు. అభిమానపాత్రుడయ్యారు.

నిజానికి అనుమాండ్ల భూమయ్య నాకు ఎంతోకాలంనుంచి తెలుసు. ఆయన జగిత్యాలలోనే డిగ్రీ చేశారు. నాక్లాస్‌మేట్స్‌కి ఆయన క్లాస్‌మేట్‌. నా చదువు ఆగిపోవడంవల్ల నేను నా క్లాస్‌మేట్స్‌తో డిగ్రీ చేయలేకపోయాను. బి. ప్రభాకర్‌తోపాటు నేడు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా పని చేస్తున్న జయప్రకాష్‌ నాకు చిన్ననాటి క్లాస్‌మేట్స్‌. బెంచ్‌మేట్స్‌కూడా. వీరు అనుమాండ్ల భూమయ్య డిగ్రీలో క్లాస్‌మేట్స్‌ అయ్యారు. అలా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుమాండ్ల భూమయ్య చిర పరిచితుడే. కానీ ఆయన ఆర్‌.ఎస్‌.ఎస్‌. భావజాలంతో సాహిత్యాన్ని, సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడని ఒక ప్రచారం జరగడం వల్ల సన్నిహితం కాలేకపోయాను. సరిగ్గా ఆచార్య పేర్వారం జగన్నాథంగారి గురించి కూడా ఇలాగే ఆర్‌.ఎస్‌.ఎస్‌. భావజాలమని ప్రచారం చేశారు. దాంతో వారితో సన్నిహితం కాలేకపోయాము. కానీ దగ్గరగా పరిశీలించిన తర్వాత వారు బీసీ దృక్పథాన్ని తమ జీవితంలో భాగంగా అలవర్చుకున్నారని సాహిత్యంలో, జీవితంలో కొనసాగిస్తున్నారని తేలింది. అలా తేల్చుకునేలోపు ఎంతో కాలం గడిచిపోయింది.

అనుమాండ్ల భూమయ్యగారిలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. భావజాలం ఉందేమో కానీ, వారిలో బీసీ కోణంలో సమాజాన్ని చూసే చైతన్యం ఉంది. ఇది ముఖ్యమైన విషయం. దీన్ని వదిలేసి హిందూ భావజాలాన్ని మోస్తారని పక్కకు పెట్టడం అగ్రకులాల దగా, మోసం తప్ప వేరుకాదు. కొందరు దళితవాదులు కూడా అగ్రకుల హిందూ వామపక్ష వాదుల వలెనే హిందూ భావజాలపరిధిలో ఉంటూ బీసీల గూర్చి మాట్లాడేవారిని వ్యతిరేకిస్తుంటారు. అలా వారి ఆధిపత్యాన్ని కొనసాగించడానికి హిందూ మతంలో ఉండటం పొరపాటు అన్నట్టు మాట్లాడుతుంటారు. అయితే వారెవరూ అంబేడ్కర్‌ చెప్పినట్లు కనీసం బౌద్ధం స్వీకరించైనా తమ ఆచరణను నిరూపించుకున్నవారు కాదు.

ఇలా కొందరు దళితవాదులు, మరికొందరు అగ్రకుల వాద వామపక్షవాదులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఎదుటివారితో కలిసి పనిచేసి సమిష్టి నాయకత్వంగా ఎదగకుండా ఒంటెత్తు పోకడతో తమకు తామే గొప్పవాళ్ళమనుకోవడానికి ఇలాంటి పనులు చేస్తుంటారు. కలిసి పనిచేయాల్సిన అంశాలను వదిలేసి భిన్నాభిప్రాయాలను ముందుకు తెస్తుంటారు.

వరవరరావు అనుమాండ్ల భూమయ్య విశ్లేషణను స్వీకరించి ఉంటే ఎంత బాగుండేది?:

వరవరరావు అనుమాండ్ల భూమయ్య విశ్లేషణను స్వీకరించి ఉంటే ఎంత బాగుండేది? అప్పుడు వరవరరావు డీ క్లాస్‌, క్యాస్ట్‌ అయ్యాడని అంగీకరించి ఉండేవాళ్ళం. కానీ ఆపని చేయలేదు. పైగా 'ప్రజలమనిషి' పై చేసిన విశ్లేషణను విడిగా పుస్తకంగా పునర్మిద్రించినప్పుడు అనుమాండ్ల భూమయ్య 'కంఠీరవం కథానాయకుడు కాదన్నాడు. కొమురయ్య కథానాయకుడు అని ప్రతిపాదించాడు. కానీ 'నేను నా అభిప్రాయాన్ని మార్చుకోదల్చుకోలేదు' అని ముందుమాటలో పేర్కొన్నాడు.

కలిసిపనిచేయాలనుకునే అంశాలను ముందుకు తీసుకువచ్చేవారే నిజమైన అర్గనైజర్స్‌. ఈ స్థాయి అందరికీ రాదు. లేదు. అందువల్ల తమ పెత్తనం నిలబెట్టుకోవడం కోసం ఆగిపోయిన సత్యాలవద్దే నిలిచిపోయి తమదే సత్యమంటూ మాట్లాడుతుంటారు. నూతన సత్యాలను స్వీకరించలేరు. చరిత్రను తిరగరాయడాన్ని అంగీకరించలేరు. వరవరరావు ఇందులో భాగమే. అనుమాండ్ల భూమయ్య ముందుకు తెచ్చిన నూతన కోణాన్ని ప్రశంసించి వుంటే ఎంత బాగుండేది? బహుజన దృక్పథం లేకుండా అనుమాండ్ల భూమయ్య మాలపల్లి అభ్యుదయ మహాకావ్యమని అనిగానీ, తెలంగాణ చైతన్యస్ఫూర్తి 'ప్రజలమనిషి' కొమురయ్య అని నిర్ధారించడం గానీ, సాధ్యంకాదు.

దొడ్డి కొమురయ్య - ఆళ్వారుస్వామి వర్గాలు వేరు, క్రమాలు వేరు:

ఉద్యమ చరిత్రలో దొడ్డి కొమురయ్య పోరాటంతో ఉద్యమం మలుపు తిరిగిందని రాస్తారు. బందగీ, దొడ్డి కొమురయ్య, రైతాంగ పోరాటంలో కొన్ని మైలురాళ్ళు. చరిత్రను మలుపు తిప్పిన సంఘటనలకు ప్రతినిధులు. చరిత్రలో అంగీకరించినంత సులభంగా సాహిత్యంలో ఎందుకు అంగీకరించడంలేదు?. వట్టికోట ఆళ్వారుస్వామి కృషి సాహిత్య, సామాజిక ఉద్యమాల్లో మహోన్నతమైంది. అయినా ఆయన జీవితంలో చరిత్రకు మైలురాయిగా నిలిచే సంఘటనలకు ప్రతినిధి కాలేకపోయారు. ఒకవైపు ఉద్యమం మొదలౌతుంటే, ఉద్యమంలో చురుకుగా పాల్గొనేబదులుగా అక్కడనుండి వెళ్ళిపోయి నిజామాబాద్‌లో ఉండిపోయాడు. ఆర్య సమాజ్‌ వచ్చి ముస్లిములుగా మారిన దళితులను తిరిగి హిందువులుగా మార్చే ఉద్యమం చేపట్టినప్పుడు మాత్రం చురుకుగా పాల్గొన్నారు. అందువల్ల ఆళ్వారుస్వామి గొప్పవాడే కావచ్చు. కంఠీరవం విప్లవోద్యమంలో దిగువ మధ్యతరగతినుండి తనను తాను సంస్కరించుకుంటూ చైతన్యం అలవర్చుకుంటూ చురుకుగా పాల్గొనే క్రమానికి చేరుకుని ఉండవచ్చు. కానీ కొమురయ్యకు కంఠీరవానికి మధ్య స్పష్టమైన తేడా ఉంది. కొమురయ్య ప్రజలనుండి వచ్చిన ప్రజల మనిషి. కంఠీరవం మధ్యతరగతి అగ్రకులం నుండి వచ్చిన మనిషి. ప్రజలతో కలిసి పనిచేయడానికి చైతన్యం పొందుతున్న మనిషి. కొమురయ్య జీవితమే పోరాటం. కంఠీరవానికి అది ఒక ఆదర్శం. జీవిత వాస్తవికత కాదు. కొమురయ్యకు పోరాటం ఒక అనివార్యం. అది జీవిత వాస్తవికత.

బీసీలకు - అగ్రకులాలకు మధ్య అవగాహనలో వైరుధ్యం:

ఆర్య సమాజ్‌ ముస్లింలుగా మారిన హిందువులను తిరిగి హిందువులుగా మార్చడానికి పూనుకోవడం దాని లక్ష్యం. అయితే హిందువులు ముస్లిములుగా ఎందుకు మారారు అనే కారణాలు ఆర్య సమాజ్‌ తరఫున అగ్రకులాలు చూపేవి వేరు. ప్రజలు అనుకున్నవి వేరు. ఉదాహరణకు వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజలమనిషి. నవలను 1953లో రాశాడు. 1955లో అచ్చయింది. 1945లో కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లనుండి సినారె, జస్టిస్‌ జీవన్‌రెడ్డి, జి. రాంరెడ్డి గార్లకు తొలి విద్యాగురువైన జి. రాములు 'ఆత్మఘోష' అనే కథ రాశారు. ఆ కథను కరీంనగర్‌ జిల్లా కథలు మొదటి సంపుటిలో చేర్చడం జరిగింది. ఆ కథలో కులసంఘాలు, సమాజం పెట్టే బాధలు తట్టుకోలేక ఒక సంఘ సంస్కర్త ముస్లిం మతంలోకి మారి తన పిల్లలకు ముస్లింల అమ్మాయితో పెళ్ళి చేస్తారు. ఆర్య సమాజ్‌ వచ్చి హిందువుల్లోకి మారాలని కోరినప్పుడు ఈ పెళ్ళి, ఈ నూతన సంబంధాలు వదులుకోవడం ఎలా సాధ్యమని నిరాకరిస్తారు. ఇకనుండైనా అలా మారకుండా, బాధపెట్టకుండా ఉంటే హిందూ మతం బతుకుతుంది అని సూచిస్తాడు.

ఒక బీసీ ఐన జి. రాములు ఆర్య సమాజ్‌ పట్ల, ముస్లిం మతం తీసుకోవడంపట్ల ఉన్న అనుభవాలు, అభిప్రాయాలు వేరు. అదేకాలంలో జీవించిన అగ్రకుల ఆళ్వారుస్వామి, ఆర్యసమాజ్‌ అభిప్రాయాలు వేరు. ఇలా రైతాంగ ఉద్యమ కాలంనుండే అనేక కోణాల్లో అగ్రకులాలకు, బీసీలకు మధ్య అనుభవాల్లో, అభిప్రాయాల్లో వైరుధ్యం ఉంది. పరస్పర భిన్నాలవి. సాహిత్య ఉద్యమంలోను ఆనాటినుండే ఈ భిన్నాభిప్రాయాలను గమనించవచ్చు. ఉదాహరణకు: జి. సురమౌళి తెలంగాణ రచయితల మహాసభల గురించి 1954లో 'అంగుడుపొద్దు' అనే కథ రాశారు. ఆ కథలో ఆ ఊరి పెద్దమనిషికి ఆ ఊరి పేదరైతుకు కలిగిన భిన్న అనుభవాలు చిత్రించాడు. పెద్దమనిషి మీటింగులో పాల్గొన్నాడు. పేదరైతు ఆ మీటింగుకు ఏర్పాట్లలో వెట్టిచాకిరిగా పనిచేసి ఇంటికి చేరాడు.

''నాలుగురోజుల ముందుగానే నేనే ఊల్లకెల్లి ఎల్లిపోయిన్నా? నా అసమంటోల్లు ఓ యాభైమందచ్చింరు... మేమందరం కలిసి రెండెకరాల మైదానం సాపుజేసుట్ల దలిగినం. అన్లున్న మున్లు, పల్లేరుగాయలు, ఏరి, గడ్డిజెక్కి, ఊడ్చి, ఆ మైదాన్ల ఓ పెద్ద పందిరేసినం...'' అట్లా ఆలంపురం సభల నేపథ్యంలో సురమౌళి ఈ కథ రాశారు.

సాహిత్య చరిత్ర ఎప్పటికప్పుడు అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్యానికనువుగా తిరగరాయబడుతున్నది:

సాహిత్య చరిత్ర ఎప్పటికప్పుడు అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్యానికనువుగా తిరగరాయబడుతున్నది. సామినేని ముద్దునరసింహ నాయుడు, గోపాలకృష్ణమ శెట్టి, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఉన్నవ లక్ష్మినారాయణ, జాషువ వంటి వారిని వెనక్కినెట్టి వేస్తూ వారి స్థానంలో కందుకూరి వీరేశలింగం, గురజాడ, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ మొదలైనవారిని ముందుకు తెస్తారు. అలాగే సాహిత్యంలోను ఎప్పటికప్పుడు అగ్రకులాల ఆధిపత్యాన్ని స్థిరపర్చడానికి, మళ్ళీ నెలకొల్పడానికి సాహిత్య సమీక్షలు, విమర్శలు, సాహిత్య చరిత్ర రచన రూపంలో వందలాదిమంది పనిచేస్తుంటారు. వారు చాలామేరకు విజయం సాధిస్తారు. ఎందుకంటే వారికి సాహిత్యం ఒక కులవృత్తి. మిగతా ప్రజలకు సాహిత్యం కులవృత్తి కాదు. వారి సాహిత్య అవసరాలను జానపద కళలు, సాహిత్యం తీరుస్తుంటాయి. అక్షరబద్ధమైన శిష్టజన అగ్రకుల సాహిత్యం కళలు, వారికి ఎప్పుడోగాని అవసరంబడదు. శూద్రుల సంస్కృతి వేరు. బ్రాహ్మణీయ సంస్కృతి వేరు. రెండూ ఒక్కటేనని అగ్రకుల హిందూవాదులతోపాటు, అంబేడ్కరిస్టు, దళితవాదులు కూడా అంటుంటారు. కానీ శూద్రులది పని సంస్కృతి. పనినుండి పుట్టే సంస్కృతి, భాష, వారి జీవన విధానం, అగ్రకులాలు ఇతరుల శ్రమశక్తిపై, ఉత్పత్తులపై, సేవలపై, వారిపై ఆధిపత్యం మీద ఆధారపడి బతుకుతుంటారు.

దశాబ్దాలుగా భారతదేశంలో కార్మికవర్గం పేరిట అగ్రకుల మధ్యతరగతే ఊరేగుతున్నది:

భారతదేశంలో కార్మికవర్గ దృక్పథం పేరిట, నాయకత్వం పేరిట, అగ్రకుల మధ్య తరగతి థాబ్దాలుగా ఊరేగుతున్నది. నిజమైన కార్మికవర్గంనుండి నాయకత్వం, దృక్పథం, వచ్చినప్పుడల్లా వారిని వెనక్కి నెట్టివేస్తుంది. దీన్ని రంగనాయకమ్మకు జవాబులు అనే వ్యాసంలో వివరంగా రాశాను. దొడ్డి కొమురయ్యకు ప్రతినిధియైన కొమురయ్య పాత్రను నాయకుడిగా అంగీకరించకుండా, ఆళ్వారుస్వామికి ప్రతినిధియైన కంఠీరవంను నాయకుడు అని చెప్పడం ఇందులో భాగమే. అగ్రకుల మధ్యతరగతినుండి వచ్చి తామే కార్మికవర్గ నాయకత్వంగా ప్రకటించుకుంటారు. నిజమైన కార్మికవర్గంగా శూద్ర కులాలనుండి వచ్చేవారిని రకరకాల పేర్లతో వెనక్కి నెట్టివేస్తారు.

అంబేడ్కర్‌ను వామపక్ష కార్మికవాదులు ఇలాగే వెనక్కి నెట్టివేశారు. కులసమస్యను పట్టించుకోవాల్సిన అనివార్యత ఏర్పడ్డప్పుడు స్వామి వివేకానందను ముందుకు తెచ్చి, అంబేడ్కర్‌ను వెనక్కినెట్టే ప్రయత్నం చేశారు. 'మాలపల్లి' నవల కులవర్గ దృక్పథంతో వెలువడిన అభ్యుదయ మహాకావ్యం. దీన్ని వదిలేసి బ్రాహ్మణుల పనికిమాలిన జీవితాలను, సంస్కృతిని చిత్రించిన 'కన్యాశుల్కం' నాటకాన్ని వేలపేజీల చర్చలతో, ప్రశంసలతో ముందుకు తెచ్చారు. ఆధునిక మానవుడు గురజాడతోనో, గురజాడ రచనలతోనో మొదలైందంటారు. ఇటీవల 2013 విరసం సభల్లో పాణి మళ్ళీ గురజాడవద్దే ఆగిపోయాడు. కళ్యాణ్‌రావు దాన్ని ఖండిస్తూ అట్టడుగు వర్గాల, కులాల సాహిత్యానికి ప్రాధాన్యతనిచ్చారు. అయినా విరసంవారు గురజాడనే మోస్తున్నారు.

అంతేగానీ, ఆధునిక అభివృద్ధికి బాటలు వేసే రైలుపట్టాలు వేసిన కార్మికులు, రోడ్లు నిర్మించిన కూలీలు, ఓడరేవుల్లో ఆంగ్లేయుల సంపర్కంలో అనేక విషయాలు నేర్చుకున్న జాలర్లుగానీ, పోతులూరి వీరబ్రహ్మంగానీ, ఆధునిక మానవుని ఆవిర్భావానికి రాల్లెత్తిన కూలీలుగానైనా గుర్తించడానికి నిరాకరిస్తారు. అందువల్ల తొలి అభ్యుదయ మహాకావ్యంగా మాలపల్లిని ముందుకు తెచ్చేబదులు శ్రీశ్రీ మహా ప్రస్థానాన్ని ముందుకు తెచ్చారు. మాలపల్లిని మరిచిపోయేటట్లు చేస్తారు.

''అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి...'':

''అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి...'' అనే పాట ఆధునిక సాహిత్యంలో మొట్టమొదట వర్ణ కుల వ్యవస్థను ప్రశ్నించిన పాట. ఆ పాటను ముందుకు తేరు. గురజాడ రాసిన దేశంను ప్రేమించుమన్న అనే పాటను ముందుకు తెస్తారు. ఇలా పీడిత ప్రజలు తమ పైగల ఆధిపత్యాన్ని ప్రశ్నించినప్పుడల్లా జాతిపేరిట, జాతీయత పేరిట, దేశంపేరిట, దేశభక్తి పేరిట, సాహిత్య విలువల పేరిట, అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా నిలబెట్టే కృషి చేస్తుంటారు. సమాజాన్ని ఎప్పటికప్పుడు తప్పుడు చైతన్యంలోకి నడిపిస్తుంటారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని గురజాడ అంటే గొప్ప. మంచి అన్నది మాల అయితే, నేను మాలనే అగుదును అని గురజాడ అంటే గొప్ప. అంతేగాని, అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి అని స్వయంగా పీడితుడే, దళితుడే ప్రశ్నిస్తే పక్కకు పడేస్తారు. పీడితులకు తాను ప్రతినిధిగా మాట్లాడ్డం గొప్ప అని అగ్రకుల, మధ్యతరగతి భావిస్తుంది. పీడితులే తమకుతాము ప్రతినిధులుగా ఎదిగి ప్రశ్నిస్తే అనుభవవాదం అని, అస్తిత్వవాదమని, స్వార్థమని, స్వీయమానసిక ధోరణి అని, సంస్కరణవాదమని, రకరకాల పేర్లు పెడతారు. ఇతరుల తరఫున మాట్లాడినందుకు తాము గొప్పవారమని, విప్లవకారులమని, సమాజాన్ని సమూలంగా మార్చే శక్తులమని చెప్పుకుంటారు.

అనుక్షణం కులం నిర్వహిస్తున్న పాత్ర:

బంకించంద్ర ఛటర్జీ రాసిన 'ఆనందమఠం' నవలలోని వందేమాతరం గీతం, గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నా... గీతం జాతికి అందించబడుతూ, 'అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి....' గీతం, మాలపల్లిలోని ''వుండానిల్లా వండానేలా, వండ పొయ్యా దండనుయ్యా?, ''అండలేక మాలా లెండేరు, ఓ సంగ బావా! దండనుండా వను కుండేరు'' అనే గీతం, ''ఆదికాలమున అందరు జనులు - అన్నదమ్ములండి, నదులు వనంబులు నానామృగములు - నాల్గు సంద్రములును... అంతరువులా భేదములేక - అందరి సొమ్మండి.... నా నీ భేదములేక లోకము నడుస్తు ఉండేది...'' అనే గీతం ప్రాచుర్యంలోకి రాకుండా నిరాసక్తంగా వాటిని వదిలివేస్తుంటారు.

''అనుమాండ్ల భూమయ్య తొలి అభ్యుదయ కవి ఉన్నవ లక్ష్మీనారాయణ'' అని ఈ రెండు గీతాలను విశ్లేషిస్తూ ఇలా నిర్ధారించారు. ''మాలపల్లి నవలలో, మొదటి గీతంలో సాంఘిక అసమానతలు, రెండవ గీతంలో ఆర్థిక అసమానతలు చిత్రించబడినాయి. కవి చిత్రింపదలచుకొన్న సమస్యలు రెండు. ఈ రెంటిని కవి రెండు వేరువేరు గేయాలుగా రచించి వాటి ప్రాముఖ్యాన్ని సూచించాడు. ఈ రెండు గీతాల వ్యాఖ్యానమే ఈ నవల''.

సాంఘిక అసమానత, ఆర్థిక అసమానత:

సాంఘిక అసమానత, ఆర్థిక అసమానత - ఈ రెండూ మన ఆధునిక భారతదేశంలో ముఖ్యమైన సమస్యలే. సాంఘిక అసమానతను మున్ముందుగా కవి చిత్రించి దాని ప్రాధాన్యాన్ని సూచించినాడు. ఆర్థిక అసమానతను ఆ పిదప కవి చిత్రించినప్పటికి ఈ అసమానత రూపు మాయటానికి ఒక పరిష్కార మార్గాన్ని కూడ చూపి ఈ సమస్యకుగల ప్రాధాన్యాన్ని మరో రకంగా సూచించినాడు. కుల సంబంధమైన అసమానతలున్న సంఘాన్ని 'పునర్నిర్మాణం' చేయదలచుకున్నాడు కాబట్టే నవలకు కవి 'మాలపల్లి' అని పేరు పెట్టినాడు; 'సంగవిజయ'మని మరో పేరు కూడా పెట్టినాడు. సంఘ నిర్మాణానికి పూనుకున్న నాయకునికి 'సంగదా'సని కవి పేరు పెట్టినాడు. కవి ఒకచోట ''సంగదాసు శబ్దము సంఘదాసు శబ్దభవంగా తీసు''కోవాలనే సూచన చేసినాడు (పుట. 151). సాంఘిక అసమానతలు అనే సమస్య, పరిష్కారం - దీనికంతటికి నాయకుడు సంగదాసు.

సాంఘిక అసమానత అనే సమస్యకు ఇచ్చిన ప్రాధాన్యాన్నే కవి ఆర్థిక అసమానత అనే సమస్యకు కూడా ఇచ్చినాడు. నవలలో ఒకచోట ''.... దీనికి సాంఘికానికంటె ఆర్థికానికే ఎక్కువ సంబంధమున్నది'' (పుట 142) అని చెప్పినాడు. సాంఘిక అసమానతకు వలెనే ఈ ఆర్థిక అసమానత విషయానికి కూడా ఒక నాయకుణ్ణి (వెంకటదాసు) తయారుచేసి కవి కథను నడిపినాడు. సంగదాసు చిన్నవాడు. సంఘ పునర్నిర్మాణానికి పూనుకొన్నవాడుగా సంగదాసుకు ప్రాధాన్యాన్ని కల్పించి, వెంకటదాసును తెరవెనుకనే ఉంచి, మొట్టమొదట సంగదాసునే నాయకునిగా ప్రవేశపెట్టినాడు. సంగదాసు మరణించిన తరువాత వెంకటదాసును ఆర్థిక అసమానతల నిర్మూలనకోసం ఉద్యమ నాయకుణ్ణి చేసి కవి కథ నడిపినాడు. చిన్నవాడైనప్పటికి, సంగదాసును నాయకునిగా ముందు ప్రవేశపెట్టటాన్ని గమనిస్తే సామాజిక అసమానత రూపుమాపదగిన రుగ్మతే అయినప్పటికీ దానికంటే గొప్పది ఆర్థిక అసమానత అని, ఆర్థిక అసమానతను రూపుమాపగలిగితే సామాజిక రుగ్మత దానంతట అదే తొలగిపోగలదని కవి భావించినట్లు తెలుస్తుంది. మొట్టమొదట సాంఘిక అసమానత సమస్యను, ఆ పిదప ఆర్థిక అసమానత సమస్యను కవి ఎత్తుకోవటం మన భారతదేశంలో ఆయా సమస్యలు ప్రాధాన్యాన్ని వహించిన క్రమాన్ని సూచిస్తున్నాయి.

మనదేశంలో మొదటినుండి ఉన్న సమస్య ఈ సాంఘిక అసమానతయే. పూర్వకాలంలో ఆయా మతప్రవక్తలు, సంఘ సంస్కర్తలు, కవులు సాంఘిక అసమానతలను రూపుమాపడానికే ప్రయత్నించారు. కుల నిర్మూలన కోసం పాటుపడిన భక్తి ఉద్యమాలు కుల వ్యవస్థను మరింత పదిలంగానే ఉంచగలిగినాయి. సాహిత్యంలో చాతుర్వర్ణ్య వ్యవస్థ విధిగా చిత్రింపబడేది. తెలుగులో మొట్టమొదటి కావ్యమైన మహాభారతం మొదలుగా అనేక కావ్యాల్లో కొన్ని కులాల ఆధిక్యత, కులాల మధ్య ఉన్న వైరభావం కనిపిస్తూనే ఉన్నాయి.

పూర్వ సాహిత్యంలో క్షత్రియులు నాయకులుగా చిత్రింపబడటమే ప్రధానం. శూద్రులు నాయకులుగా కావ్యాలు కనిపించవు. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన ఒక 'మాల'ను నాయకునిగా చేసి రచన చేసింది మొట్టమొదట ఉన్నవవారే. ఆధునిక సాహిత్య ప్రక్రియలను ప్రారంభించిన కందుకూరి రచనల్లో శూద్రులు, 'మాల'లు నాయకులుగా ఉండటం కనిపించదు. వారి నవల 'రాజశేఖర చరిత్ర'లో నాయకుడు రాజశేఖరుడు నియోగి బ్రాహ్మణుడు.

అగ్రవర్ణాల వారిని కాకుండా శూద్రులను నాయకులుగా చేసి కావ్యం వ్రాసింది మొట్టమొదట కట్టమంచివారు. సామాన్య కాపు స్త్రీ ముసలమ్మను నాయికగా చేసి ఈ కవి 'ముసలమ్మ మరణము' వ్రాసినాడు. సాంఘికేతివృత్తాన్ని తీసుకొని, కాపు (శూద్ర) కులానికి చెందిన ఒక స్త్రీని నాయికగా, ప్రధాన పాత్రగా చేసి కావ్యం వ్రాయటం కట్టమంచివారి ప్రజాస్వామ్య దృక్పథానికి నిదర్శనం. ఆయన తరువాత కవులు గురజాడ కాని, రాయప్రోలు కాని శూద్రులను - అట్టడుగు వర్గాల వారిని నాయకులుగా, ప్రధాన పాత్రలుగా చేసి రచనలు చేసినట్లు కనిపించదు. 'పూర్ణమ్మ' పూజారిబిడ్డ, 'లవణరాజు కల' అనే ఖండికలో లవణుడు రాజు. ఇతివృత్తం సాంఘికం కాదు. అతడొక 'మాలెత'ను పెండ్లాడినట్లు చెప్పబడినా అది 'కల'యే, ఇంద్రజాలికుని సృష్టి అది. కులాల అంతరాలు పోవాలన్నది కవి భావన యైనట్లు మాత్రం తెలుస్తుంది. ఈ భావన కూడా కవికి గాఢంగా ఉన్నట్లు తోచదు. రాజులు తమకంటె తక్కువ కులం వారిని పెండ్లాడినట్లు ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తుంది. అది కుల భేదాన్ని తొలగించే ఉద్దేశంతో కాదు. ఆమె అందకత్తె అయితేనే; అతని కంటికి నచ్చితేనే. మనసుపడిన ఆ పడుచును తన కులానికి చెందింది కాదని పిదప తెలిస్తే అప్పుడు వెనుకడుగు వేయని లక్షణం మాత్రం నాయకునిలో కనిపిస్తుంది. ఈ పద్ధతే 'లవణరాజు కల'లో కనిపిస్తుంది. లవణరాజుకు మొదట వినిపించింది 'వింతగానం'. అప్పటికి అతనికి బడబాగ్నివలె ఆకలివేస్తుంది. పాట పిదప కనిపించింది 'జవ్వని'. ఆమె భుజంమీదకూటి కడవ ఉంది. అతనికి ఆ కడవ మొదట కనిపించలేదు. ఆమె అందమే అతని కంటపడింది.

''ఒక కట్టమంచి, ఒక గురజాడ, ఒక రాయప్రోలు రచనలను పరిశీలిస్తే - సమాజంకోసం వ్యక్తి త్యాగాన్ని ప్రబోధిస్తుండటం చేత ('ముసలమ్మ మరణము'లో ముసలమ్మ పాత్ర) కట్టమంచిది ప్రధానంగా జాతీయదృష్టి; గురజాడది సంఘ సంస్కరణ దృష్టి; రాయప్రోలుది శృంగార, రస సంస్కరణ దృష్టి. 1920 నాటికి ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రధానంగా ఉన్న దృక్పథాలివి. ఈ పరిస్థితిలో మాలపల్లిని వెలువరించినాడు ఉన్నవ. సామాజిక అసమానతలను రూపు మాపుకొంటూ ఆర్థికాభివృద్ధిని సాధించి దేశం ముందడుగేయాలని కోరుతున్నాడు కాబట్టి ఉన్నవది అభ్యుదయ దృష్టి. భావ కవిత్వం ఉద్యమంగా సాగుతున్న రోజుల్లో సంఘంలోని అసమానతలను ఎత్తి చూపుతూ 'చరమ' గీతాన్ని, దేశంలోని ఆర్థిక దుస్థితిని వివరించి ఆర్థికాభివృద్ధిని సాధించే మార్గాన్ని చూపుతు 'సమతాధర్మం'ను రచించి మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో అభ్యుదయ దృక్పథాన్ని ప్రవేశపెట్టిన కవి ఉన్నవ''.

శ్రీశ్రీ కోసం సాహిత్య చరిత్రను వక్రీకరించిన క్రమం:

మాలపల్లిలోని అభ్యుదయ గీతాలను వదిలి కురుగంటి సీతారామ భట్టాచార్యులు, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు, నవ్యాంధ్ర సాహిత్య వీరులు, చతుర్థభాగం, ద్వితీయ ముద్రణ, 1951లో శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి ప్రవక్త అయినట్లు రాశారు. అలాగే సి. నారాయణరెడ్డి తన పి.హెచ్‌డి. ఐన 'ఆధునికాంధ్ర కవిత్వము', 1967లో శ్రామికవర్గ చైతన్య మూపిరిగా గల ఒక సరిక్రొత్త కవితారీతికి పాదులు వేసిన స్రష్ట శ్రీశ్రీ అని పేర్కొన్నాడు. అలాగే వేల్చేరు నారాయణరావు 1978లో రాసిన 'తెలుగులో కవితా విప్లవాల స్వరూపం' అనే గ్రంథంలో 'అభ్యుదయ కవిత్వానికి ఆరంభ గీతం' అని చెప్పదగిన మరో ప్రపంచ గీతం అని పేర్కొన్నాడు. కె.కె. రంగనాథాచార్యులు సంకలనకర్తగా 1979లో తెచ్చిన సంకలనంలో ''అభ్యుదయ కవిత్వం: యుగకర్త - శ్రీశ్రీ'' అని కడియాల గోపాలరావు పేర్కొన్నారు. ఇలా అనేకమంది పదేపదే శ్రీశ్రీని అభ్యుదయ కవి అని పైకెత్తారు. అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడని స్పష్టంగానూ, అస్పష్టంగానూ థాబ్దాలుగా పేర్కొంటూ వస్తున్నారు. కడియాల రామమోహనరావు శ్రీశ్రీని ''కాలంతోపాటు కదిలివచ్చిన కవి మాత్రమే కాదు కాలానికి ముందుండి క్రాంతదర్శియై జాతిని ముందుకు నడిపించిన కవి'' అని చెప్పడంలో సత్యంలేదని అనుమాండ్ల భూమయ్య స్పష్టంగా నిరూపించారు. శ్రీశ్రీ కన్నా ముందే, శ్రీశ్రీకన్నా ఎక్కువ విషయాలను ముందుకు తెచ్చి వర్గ చైతన్యం, కులవ్యతిరేక చైతన్యాన్ని మహాత్మా జ్యోతిరావుఫూలేవలే, వారుస్థాపించిన సత్యశోధక సమాజ్‌ అనే కార్మికవర్గ ఉద్యమంవలే కృషి చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారిని స్పష్టంగానే క్రాంతదర్శిగా, మార్గదర్శిగా విశ్లేషించి మనముందుంచారు అనుమాండ్ల భూమయ్య.

ఫూలే, లోఖండే సత్యశోధక సమాజ్‌ కులవర్గ, కార్మిక దృక్పథం ప్రాధాన్యత:

భారతీయ కార్మిక వర్గ ఉద్యమంలో వామపక్షవాదులు ప్రవేశించిన తర్వాత వర్ణ కుల ఆధిక్య వ్యతిరేక, పీడిత వర్గ దృక్పథాలను రెంటిని కలిపి కార్మికవర్గ ఉద్యమాలను నడిపిన సత్యశోధక సమాజ్‌, దాని నాయకులైన మెఖంజీ నారాయణలోఖండే, జ్యోతిరావు ఫూలే మొదలైనవారి దృక్పథాన్ని వెనక్కినెట్టి కేవలం ఆర్థిక అసమానతలను, వర్గ దృక్పథాన్ని ముందుకు తెచ్చారు. సామాజిక అసమానతలను నిలబెడుతూ కొనసాగిస్తున్న వర్ణ కుల వ్యవస్థలను ప్రశ్నించే దృక్పథాన్ని వదిలివేశారు. సాహిత్యంలోను, ఇదే జరిగింది. తద్వారా మధ్యతరగతి పేరిట కార్మికవర్గానికి, నాయకత్వం పేరిట అగ్రకుల మధ్యతరగతి మార్క్సిజానికి, కార్మిక వర్గానికి తామే ప్రతినిధులమని ఊరేగడం సాధ్యపడుతున్నది. ఎప్పుడైతే సామాజిక అసమానతలు తొలగించాలని ఉద్యమిస్తారో అప్పుడు అగ్రకుల నాయకత్వం వెంటనే ఖండిస్తుంది. ఎందుకంటే తమ నాయకత్వం వదులుకోవాల్సి వస్తుంది కనుక.

ఉన్నవను తొలి అభ్యుదయ మహాకవి అని నిర్ధారించిన క్రమం:

''1943లో తెలుగుదేశంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడటానికి ముందే శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వం వ్రాసినాడు. కాని, భారతదేశంలో 1935లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడటానికి ముందే వంగ భాషలోను, ఉర్దూ భాషలోను అభ్యుదయ కవిత్వం ఆవిర్భవించడానికి ముందే, 1932లో లండనులో వామపక్షీయులు కొందరు కలిసి మార్క్సిస్టు దృక్పథంతో ప్రభావితులై, రష్యాలోని సోషలిస్టు వ్యవస్థను గమనించి ఉత్తేజితులై శ్రీలిగీ ఐరివీదీబిశితిజీలిరీ పేరుతో అభ్యుదయ కవితా సంపుటిని ప్రకటించటానికి ముందే 1928లో కార్మికోద్యమాలు వర్గ సంఘర్షణాన్ని అవలంబించటానికి ముందే, 1927లో బొంబాయి కార్మికులబిచేత మొట్టమొదటి 'మేడే' జరుపబడటానికి ముందే, 1925లో మనదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించటానికి ముందే 1917లో రష్యా విప్లవం విజయవంతమయిన తరువాత, 1922 లోనే సరిక్రొత్త తాత్విక దృక్పథంలో, వర్గచైతన్యం - కూలీలు, సమ్మెలు ధనికులు, పేదలు ఇత్యాది అభ్యుదయ భావాలను తెలుగు సాహిత్యంలో కవితారూపంలో ఉన్నవ ప్రవేశపెట్టినాడు. అందుకే తెలుగులో మొదటి అభ్యుదయ కవి ఉన్నవ అనటం. '1926 నుండి 1940 లోపుగా భారతదేశంలో విదేశములలో గల రాజకీయ పరిస్థితులను గమనించి ''ప్రేరితుడై మార్క్సిస్టు విజ్ఞానపు వెలుగులో'' శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వం వ్రాస్తే, 1917లో రష్యా విప్లవం విజయవంతమైన తరువాత అక్కడి పరిస్థితులను మనదేశంలోని స్థితిని గమనించి ప్రేరితుడై ఉన్నవ అభ్యుదయ కవిత్వం వ్రాసినాడు. ''అభ్యుదయ కవిత్వోద్యమానికి వైతాళికుడు'' ఉన్నవ''.

''శంకలు దక్కి మీరలెల్లరు, శపథము చేయండి, సమతా ధర్మం ప్రపంచ మందున, స్థాపింతురు గాని''.

శ్రామికులు స్థాపించే సమ సమాజం విషయంగా మార్క్స్‌ చెప్పిన భావాలను ఉన్నవ ఈ విధంగా 'సమతాధర్మ' గీతంద్వారా వ్యక్తం చేసినాడు. సమ సమాజ స్థాపనకు మార్క్స్‌ చెప్పిన అభిప్రాయాలను తన దేశీయ సాహిత్యంలో, వ్యక్తం చేయటంతో మాత్రమే ఉన్నవ ఊర్కోలేదు. ఈ ఆర్థిక పరమైన అంతరాలను తొలగించుకోవటంతో పాటు ఈ దేశంలో బలంగా ఉన్న వర్ణభేదాలను కూడ తొలగించుకోవాలన్నాడు. ఉన్నవాడు, లేనివాడు అనే భేద మెటువంటిదో అగ్రవర్ణాలవారు, దిగువ జాతులవారు అనే భేదం కూడ అటువంటిది. ఈ సాంఘిక అసమానతలను తొలగించుకొంటూ ఆర్థికాభివృద్ధిని సాధించగలిగితేనే మనదేశంలో 'సమతాధర్మ' మేర్పడుతుందన్న సూచనతోనే 'మాల'ల దుస్థితిని వర్ణించే 'చరమగీతాన్ని' కూడా కవి ముందుగా వ్రాసినాడు. వర్ణభేదాలు తొలగితే మనుషుల్లో సమత్వం. వర్ణభేదం - ఆర్థిక పరమైన అంతరువులు తొలగితే సమాజంలో సమత్వం. కుల సంబంధమైంది కానీ, ఆర్థిక సంబంధమైంది కానీ భేద భావ మనేది తొలగితేనే సమత్వం - అభ్యుదయం చేకూరుతుంది.

సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలన్నది అభ్యుదయ కవుల ధ్యేయం. వారి ధ్యేయానికి ప్రేరణ ఉన్నవ వారే. వీరు రచించిన ఈ రెండు కవితలు - 'చరమ గీతం', 'సమతా ధర్మం' అచ్చంగా ప్రజల భాషలో వ్రాయబడినవే. ఛందస్సు జానపద గేయాలకు సంబంధించింది. మొదటిది 'యాల'. రెండవది బుర్రకథ సాధారణ ప్రజలకోసం - కూలీలకోస ముద్దేశించిన వస్తువు, వారిని చేరటానికి వారి భాషాచ్ఛందస్సుల్లోనే ఉండటం న్యాయమన్న విషయాన్ని అభ్యుదయ కవులకు తెలియజేసింది మొట్టమొదట ఉన్నవ వారే. అభ్యుదయ కవితా ప్రవర్తకుడైన ఉన్నవ వేసిన మార్గమిది. కవిత్వం సామాన్య ప్రజలకే ఉద్దేశింపబడాలని చెప్పే కవులందరు ఉన్నవ మార్గంలో సాగినవారు కాదు. ఉన్నవ మార్గాన్ని అభ్యుదయ కవులకంటే ఎక్కువగా - గద్దర్‌ వంటి విప్లవ కవులే అనుసరించినట్లు కనిపిస్తుంది. ఉన్నవ కవితలతో పోల్చిచూస్తే శ్రీశ్రీ కవితల్లోని భాష అంత సరళమైంది కాదు. శ్రీశ్రీ గేయాలు, వచన, కవితల కంటే ఉన్నవ వారి పాటలే జనసామాన్యానికి సులభంగా అందేవి. ఉన్నవ వ్రాసిన పాటల్లోని వస్తువు, రచనలు పలువురు అభ్యుదయ కవులకు, విప్లవ కవులకు ప్రేరణనిచ్చినాయి; మార్గదర్శకమైనాయి''. ఇలా ఎన్నో కోణాల్లో మాలపల్లిలోని రెండు గీతాలు ఉన్నవ లక్ష్మీనారాయణను తొలి అభ్యుదయ మహాకావ్యకర్తగా నిర్ధారించారు అనుమాండ్ల భూమయ్య.

'ప్రజలమనిషి' కొమురయ్య అని నిర్ధారించిన తీరు:

'ప్రజలమనిషి' విషయానికొస్తే నిజంగా 'ప్రజలమనిషి' ఎవరో ఇలా స్పష్టం చేశారు. ''కంఠీరవం ప్రజలమనిషి'' అని ఒక విమర్శ. ఇది సరికాదు. ప్రజాశక్తిని కూడగట్టి ప్రజల కోసం, న్యాయం కోసం సమస్యల పరిష్కారం కోసం, విజయం లభించకపోయినప్పటికి, పోరాటాన్ని సాగించినవాడు ప్రజానాయకుడు - ప్రజల మనిషి అయ్యే అవకాశముంటుంది.

ప్రజాపోరాటాలకు ఈ నవలలో వేదికలు రెండు. ఒకటి దిమ్మగూడెం, ఒకటి నిజామాబాదు. ఒకటి పల్లెటూరు. ఒకటి పట్టణం. పల్లెటూల్లల్లో పట్టణాల్లో ప్రజలను వేధించేది నిజాం ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఏజంట్లు పల్లెల్లో దొర. పట్టణాల్లో అధికార్లు.

దిమ్మగూడెంలో అసలు సమస్య కొమురయ్య భూమిని దొర లాక్కోవటం. ఈ సమస్య పుట్టిన వేళకి కంఠీరవం పల్లెవిడిచి పట్నం చేరుకున్నాడు. ఈ భూమి సమస్య పుట్టింది మొదలు పురిష్కరింపబడేంత వరకు కంఠీరవం ప్రమేయమే లేదు. కొమురయ్య తన మిత్రుడైనా అతని భూమిని దొర స్వాధీనం చేసుకున్నప్పుడు తెలిసి కూడ పట్నం నుంచి రానేలేదు.

దిమ్మగూడెంలో భూమి సమస్యలు నవలలో రెండురకాల చిత్రింపబడినాయి. వ్యక్తికి సంబంధించిన భూమి - కొమురయ్య తోటబావి భూమి. ప్రజలకు సంబంధించిన భూమి - చెఱువు. వ్యక్తికి సంబంధించిన భూమి సమస్యలో గాని, ఊరి ప్రజలకు సంబంధించిన భూమి సమస్యలో కంఠీరవం పాల్గొనలేకపోయాడు. ప్రధానమైన ఈ రెండు చోట్ల జరిగిన పోరాటాల్లో నాయకత్వం వహించలేదు సరికదా పాల్గొన నయినాలేదు. అటువంటప్పుడు కంఠీరవం 'ప్రజల మనిషి' అయే అవకాశమెక్కడిది?.

దిమ్మగూడెంలో జరిగిన మరో సంఘటన మత పరివర్తన. భూమికి సంబంధించిన సమస్యల్లో రెండుచోట్ల ప్రతినాయకుడయిన రామభూపాల్‌రావు ఈ మత పరివర్తనకు వ్యతిరేకి. ఊరుకు సంబంధించినంతవరకు మత పరివర్తనకు కారకుడు హైదరలే. ఈ సందర్భంలో మతపరివర్తన నడ్డుకోవాలని పట్నం నుంచి వచ్చిన కంఠీరవం అది జరగకుండా అడ్డుపడనేలేదు. జరుగకూడనిది జరుగుతున్నంత సేపు ఊరక చూస్తూనే ఉండిపోయాడు. అంతా అయ్యాక మాత్రమే కంఠీరవం అంజుమన్‌ నాయకులను, ప్రభుత్వ విధానాలను దూషించి నిర్బంధింప బడినాడు. సరియైన సమయంలో తీసుకున్న సరియైన చర్యకాదిది.

ప్రజా పోరాటాలకు రెండవ వేదిక నిజామాబాదు. ఇక్కడిది గ్రంథాలయ వార్షికోత్సవ సభానుమతికి సంబంధించిన సమస్య. గ్రంథాలయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కంఠీరవం సభానుమతి నివ్వని ప్రభుత్వంతో పోరాటమే చేయలేదు. సమస్యను పరిష్కరించనేలేదు. సమస్య సమస్యగానే మిగిలిపోయింది.

ప్రజాపోరాటాలకు సంబంధించిన ముఖ్యమైన చోట్ల పాల్గొనని, ప్రజా సమస్యలను పరిష్కరించలేని కంఠీరవాన్ని 'ప్రజలమనిషి'గా చెప్పటం ఉచితంగా తోచదు.

నవలలో ప్రధానమైన సమస్య భూమికి సంబంధించింది. ఈ భూమిని, నవలారంభంలో లాక్కున్న దొర నెదుర్కొని కొమురయ్య తిరిగి తన భూమిని తానే పొందాడు. దొరతో కొమురయ్య సాగించిన పోరాటంలో ప్రజలు సహకరించారు. ఈ విధంగా 'ప్రజల మనిషి' నవలలో నాయకుడు గొట్టం కొమురయ్య.

'ప్రజల మనిషి' గొట్టం కొమురయ్య''. అని అనుమాండ్ల భూమయ్య ముక్కుమీదగుద్ది స్పష్టం చేశాడు. ఆయనకు ఈ ఆలోచన ఊరకే రాలేదు. ఏళ్ళ తరబడి 'ప్రజలమనిషి' నవలమీద వరవరరావు రాసిన వ్యాసాన్ని డిగ్రీ విద్యార్థులకు చెప్పి చెప్పి ఆలోచిస్తుంటే చివరగా ఎక్కడో లోపం ఉందని గమనించి ఈ నూతన విశ్లేషణకు రావడం సాధ్యపడింది. అంతగా కంఠీరవం పాత్ర నవలలో ప్రధానపాత్రగా పెనవేసుకుపోయింది.

సినిమాల్లో 1960ల నుండి స్టార్‌డమ్‌ హీరో ప్రాధాన్యత ఎలా పెరుగుతూ వచ్చిందో ఇతర పాత్రలను, హీరోయిన్‌లను కించపరుస్తూ ఎలా సినిమా రంగం ముందుకు సాగిందో పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో 1998లో శిక్షణ పొందినప్పుడు వివరంగా సినిమాలను చూపిస్తూ స్పష్టం చేశారు. సరిగ్గా అదే క్రమం సాహిత్యరంగంలో అగ్రకుల ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ఎలా చేస్తారో అనుమాండ్ల భూమయ్య చేసిన విశ్లేషణ తెలుపుతుంది.

దరకమే ఐక్య వేదిక కృషిలో భాగమైన అనుమాండ్ల భూమయ్య విశ్లేషణ:

'మాలపల్లి' పై, 'ప్రజలమనిషి'పై అనుమాండ్ల భూమయ్య చేసిన విశ్లేషణ చదివి నేను ఎంత సంతోషపడ్డానో...! నేను రాయాల్సిన కర్తవ్యాన్ని అనుమాండ్ల భూమయ్య నెరవేర్చారని కలిగిన సంతోషం అది. దరకమే ఐక్య వేదిక 1992లో వేగం పుంజుకొని ముందుకు సాగింది. సరిగ్గా అదే సమయంలో ఈ పుస్తకం వెలువడింది. దరకమే ఐక్య వేదిక చేయాల్సిన సాహిత్య విమర్శను, విశ్లేషణను అనుమాండ్ల భూమయ్య 'మాలపల్లి' నవల తొలి అభ్యుదయ మహాకావ్యంగా నిర్ధారించి, మార్గదర్శనం చేశారు. అలాగే ఆళ్వారుస్వామి 'ప్రజలమనిషి'ని ఎలా చూడాలో శూద్ర దృక్పథంతో, జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్‌ల దృక్పథంతో వర్గ దృక్పథాన్ని కలిపి విశ్లేషించి చూపి మనముందుంచారు. అందుకే నేను ఈ గ్రంథాలను అనుమాండ్ల భూమయ్య విశ్లేషణను దరకమే ఐక్య వేదిక ద్వారా సాహితీలోకానికి అందించాలని వందకు పైగా కాపీలను సబ్సిడీపై కొని, రాష్ట్ర వ్యాప్తంగా అందించడం జరిగింది. ఆ క్రమంలో మహాకవి జాషువాను, చలంను, విశ్వనాథ సత్యనారాయణను, సాహితీ చరిత్రలో పునర్‌మూల్యాంకనం చేయడం జరిగింది. చలం పై దళిత దృక్పథంతో, ఖాదర్‌ మొహియుద్దీన్‌ చేసిన విశ్లేషణ అనేక నూతన అంశాలను ముందుకు తెచ్చింది.

ఇలా ఇంగిలాల రామచంద్రరావు, 'పుట్టుమచ్చ' ఖాదర్‌ మొహియుద్దీన్‌, ననుమాస స్వామి, బి.ఎస్‌. రాములు, కత్తి పద్మారావు, కలేకూరి ప్రసాద్‌, నారగోని, మాస్టార్జీ, గూడ అంజయ్య, జయసలోమి, జయధీర్‌ తిరుమలరావు, జి. లక్ష్మినర్సయ్య, మొదలైనవారు ఇదే బాటలో ముందుకు సాగి, సమస్త వర్ణ, వర్గ, కుల, మత, భాష, దేశ, ప్రాంత, విచక్షణలకి అసమానతలకి వ్యతిరేకంగా సాహిత్య సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తమదైన ముద్ర వేశారు. అలా సాహిత్యంలో కార్మికవర్గం పేరిట, మార్క్సిజం పేరిట, విప్లవం పేరిట, అగ్రకుల మధ్యతరగతి కొనసాగుతున్న విషయాన్ని నిజమైన కార్మిక, కర్షక దృక్పథం దళిత బహుజన దృక్పథం అని స్పష్టం చేయడం జరిగింది. అలా 1990ల నుండి సాహిత్య, సామాజిక, సైద్ధాంతిక రంగాల్లో రాష్ట్రంలో రెండు సమాంతరంగా విస్తరిస్తు వస్తున్నాయి. దీనికి తోడుగా స్త్రీవాద, తెలంగాణ రాష్ట్రవాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అనుమాండ్ల భూమయ్య స్వయంగా ఇలాంటి విశ్లేషణ అందించి, సమాజానికి, సాహిత్యానికి ఎంతో వెలుగును అందించిన వైతాళికుడు.

- బి.ఎస్‌. రాములు

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 A prominent critic BS Ramulu has tried to place Anumandla Bhumaiah's analysis on Unnava Lakshminarayana's Malapalli and Vattokota Alwar Swamy's Prajala Manishi novels at appropraite position in Telugu literary criticism
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more