వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగ్నముని 'కొయ్యగుర్రం' మహాకావ్యమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

 Koyyagurram
నగ్నముని 'కొయ్యగుర్రం' కావ్యానికి చేకూరి రామారావు ముందుమాటలో ఆధునిక మహాకావ్యం అనే ప్రతిపాదనను తెలుగు సాహిత్యంలో సిద్ధాంత స్థాయిలో ముందుకు తెచ్చారు. అదే వేల్చేరు నారాయణ రావుకు, చేకూరి రామారావుకు మధ్య చర్చకు దారి తీసింది. ఆ తర్వాత దానిపై పెద్దగా చర్చ జరిగిన సూచనలు కనిపిండం లేదు. వాస్తవానికి, 'కొయ్యగుర్రం' గ్రంథాన్ని చేకూరి రామారావు కావ్యంగా మాత్రమే ప్రతిపాదిస్తే ఆ చర్చ జరిగి ఉండేది కాదేమో. ఎందుకంటే, శ్రీశ్రీ తర్వాత మహాకవిగా తెలుగులో 'కొయ్యగుర్రం' ద్వారా నగ్నమునిని నిలబెట్టాలని చేకూరి రామారావు భావించినట్లు అర్థం చేసుకోవడానికే ఆ చర్చకు కారణమైంది. అదే సమయంలో తెలుగులో తొలి ఆధునిక మహాకావ్యంగా చేరా దానికి కితాబు ఇచ్చారు.

'కొయ్యగుర్రం' ఆ తర్వాత రెండు ముద్రణలు పొందింది. 2007లో మూడవ ముద్రణ వచ్చింది.ఈ సమయంలో పుస్తకం అట్ట మీద ఆధునిక కావ్యం అని మాత్రమే నగ్నముని వేసుకున్నారు. కానీ తొలి తెలుగు ఆధునిక మహాకావ్యంగా వేసుకోలేదు. ఆంగ్లంలో మాత్రం Epic in Telugu అని వేసుకున్నారు.

'లోకంలో మహా కేవలం ఒక సైజునో, ప్రక్రియనో సూచించే అర్థంగా ప్రచురంగా లేదు. మహా కావ్యం అనే మాటని ముక్తకం కన్నా భిన్నమైన అర్థంలో అనేక అధ్యాయాలున్నా సర్గబంధంగా నిర్వచిస్తూ అందులో అష్టాథ వర్ణనలు వుంటాయని మొట్టమొదట చెప్పినవాడు దండి' అని చెబుతూ వేల్చేరు నారాయణ రావు పూర్వకాలపు ఆలంకారికుల పద్దతిని అనుసరిస్తూ తాను ఆధునిక వచన పద్యాల్లో మహాకావ్య/ మినీ కావ్య విభజన చేస్తున్నానని చేరా చెప్పి వుంటే స్పష్టతకు అపారంగా ఉపకరించేదని అన్నారు.

ఈ సమయంలో చేరా సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. 'పైన పేర్కొన్న రెండే కాక (కుందుర్తి 'నగరంలో వాన', శ్రీశ్రీ 'కవితా ఓ కవితా!) శివసాగర్‌ వివా లా శాంటియాగో!, శివారెడ్డి ఆసుపత్రి గీతం - ఇంకా ఇట్లాంటివాటిని మరికొందరు ప్రతిపాదించారు. ఇవన్నీ మహాకావ్యాలు అవునో కాదో టేపులూ, తూనికరాళ్లూ, కొలబద్దలు రెడీగా పెట్టుక్కూర్చోవాలా నేను? అది నా పని కాదని నారా గారికి ఇతర పాఠకలోకానికి మనవి చేసుకుంటున్నాను. ఒకరి పుస్తకానికి రాస్తున్న పీఠికలో ఇతరుల కావ్యాల తారతమ్యం తప్పనిసరిగా చూపాల్సిన అవసరం నాకు లేదు. మహాకావ్యం అనేది పెద్ద వచన కావ్యం అనే దృష్టితో నేను వాడలేదు. పెద్ద వచన కావ్యాలు తక్కువేం లేవు. ఆధునిక మహాకావ్యాల గురించి నేను మాట్లాడుతున్నది' అని చేరా అన్నారు.

చేరా వివరణ సంతృప్తికరంగా లేదనేది తెలిసిపోతూనే ఉన్నది. కొయ్యగుర్రం రచనను ఆధునిక కావ్యం అని చేరా అని వుంటే పేచీ ఉండేది కాదు. తొలి ఆధునిక మహాకావ్యం అని చెప్పడం వల్ల ఆ పేచీ వచ్చింది. ఒక రచనను అలా సూత్రీకరించినప్పుడు ఆధునిక దీర్ఘ కవితలు గానీ దీర్ఘ కావ్యాలు గానీ మహా కావ్యాలు ఎందుకు కావో, కొయ్యగుర్రం మాత్రమే అవుతుందో చెప్పాల్సిన బాధ్యత చేరా మీద ఉండాల్సింది. ఇతర కావ్యాలను పూర్వపక్షం చేసి, కొయ్యగుర్రాన్ని మహా కావ్యంగా నిలబెట్టడానికి ఆ పని తప్పనిసరిగా ఆయన చేయాల్సే ఉండింది. ఇదే సమయంలో ఒక్క మహాకావ్యం కూడా రాయకుండా శ్రీశ్రీ ఎలా మహాకవి అయ్యాడనే విషయాన్ని కూడా ఇరువురు పట్టించుకోలేదు (ఇక్కడ అది అప్రస్తుతం).

అయితే, ఆధునిక మహా కావ్యం అనే విషయాన్ని సూత్రీకరించడానికి చేరా ప్రయత్నం చేశారు. 'ఒక ప్రధాన వస్తువుతో ఒక తాత్విక చింతనతో సందేశంతో ఒక తాత్విక చింతనతో సందేశంతో అనేక భావాలతో, మూడ్సుతో, కథ లేకుండా అర్బెనిటటీ అనే లక్షణం కలిగి ఉండి, తగినంత విస్తారంగా ఉన్న దీర్ఘకవితను ఆధునిక మహాకావ్యం అంటున్నాను' అని ఆయన సూత్రీకరించారు.

చేరా సూత్రీకరణను బట్టి ఆధునిక మహాకావ్యానికి ఉండాల్సిన లక్షణాలను ఈ విధంగా చెప్పవచ్చు.

1. ప్రధాన వస్తువు 2. తాత్విక చింతన 3. కథారహితం 4. అనేక భావాలు, మూడ్స్‌ ఉండడం 5. అర్బెనిటీ 6. విస్తృతి.

అయితే, ప్రధాన వస్తువు అనేది ఆధునిక కవిత్వానికి అంతటికీ వర్తిస్తుంది. ఆధునిక వచన కవిత్వానికి అది ప్రధాన లక్షణం. అయితే, ఇతివృత్తం అనేది కావ్యానికి అత్యంత ప్రధానమైంది. దీర్ఘకవితను, దీర్ఘకావ్యాన్ని వేరు చేసే లక్షణాల్లో ఇది ముఖ్యమైంది. అదే సమయంలో వచనంలో ఉండడం అనేది కూడా ముఖ్యమైన లక్షణం. ఆధునికతను సూచించే రూపం వచనం. దాన్ని చేరా కథారహితం ద్వారా సూచించారు.

చేరా గానీ వేల్చేరు నారాయణ రావు గానీ రూపాన్ని, సారాన్ని రెండింటినీ తడిమారు. రూపసారాలను బట్టి ఆధునిక మహాకావ్యానికి ఈ కింది ప్రధాన లక్షణాలుంటాయని చెప్పవచ్చు.

1. ప్రధాన వస్తువు 2. ఇతివృత్తం 3 తాత్విక చింతన 4. కథారహితం 5. అనేక భావాలు, మూడ్స్‌ ఉండడం 6. అర్బెనిటీ 7. విస్తృతి

1. ప్రధాన వస్తువు

ప్రధానమైన వస్తువు ఒక్కటే ఉండాలి. ఇది కావ్యంలో ఏకసూత్రతను సంతరించి పెడుతుంది. భిన్న వస్తువులుంటే వేర్వేరు కవితా ఖండికల రూపాన్ని సంతరించుకుంటుంది కొయ్యగుర్రంలో తుఫాను ప్రధాన వస్తువు. అలాగే, ఎన్‌, గోపి జలగీతం కావ్యంలో జలం ప్రధాన వస్తువులు. ఇటీవల తెలంగాణ కవుల నుంచి వచ్చినవాటిలో తెలంగాణ అనేది ప్రధాన వస్తువు. తెలంగాణ కావ్యాల గురించి రాయాల్సి వచ్చినప్పుడు నేను కావ్యం, కవిత, మహాకావ్యం అనే సూత్రీరకరణల నుంచి దూరంగా జరిగి అన్నింటినీ దీర్ఘకవితలుగానే చెప్పి, వస్తువ విశ్లేషణకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చాను. వస్తు ప్రాధాన్యాన్ని వివరించడానికి అది ఆటంకంగా మారుతుందని, రూపచర్చ ప్రధానమై వస్తువు మరుగున పడి పోతుందని అలా చేశాను. పైగా, వాటిని దీర్ఘకవితలుగా, కావ్యాలుగా, మహా కావ్యాలుగా విభజించే పని నుంచి తప్పుకోవాలనే ఉద్దేశం కూడా ఆ వ్యాసం రాసే సమయంలో ఉంది.

2. ఇతివృత్తం

ఇది మహాకావ్యానికి గానీ, కావ్యానికి గానీ అత్యంత ప్రధానమైంది. ఒక ప్రధాన వస్తువును ఆవరించి ఉండే సంబంధిత విషయాలన్నీ ఇతివృత్తం కిందికి వస్తాయని నేను ఇక్కడ భావిస్తున్నాను. కొయ్యగుర్రంలో వస్తువు తుఫాను అయినా, దాని ఆవరించి ఉండే మూర్త, అమూర్త విషయాలన్నీ వస్తాయి. అలాగే, గోపి జలగీతంలో కూడా. ఇది కావ్యానికి వైవిధ్యాన్ని సంతరించి పెడుతుంది. ఈ వైవిధ్యం కారణంగానే రూపవిస్తృతిలో సుదీర్ఘమైనా పఠితలను చివరంటా సంతరించి పెడుతుంది. అంతేకాకుండా ముక్కలు ముక్కలుగా ఉన్న సత్యాన్ని ఏకమొత్తంగా ఆవిష్కరిస్తుంది. వ్యక్తీకరణ రీతుల్లో వైవిధ్యం ప్రదర్శించడానికి వీలవుతుంది. ఈ రకంగా సూచించినప్పుడు దర్భశయనం 'ఆట' దీర్ఘ కవిత అవుతుందే తప్ప కావ్యం కాలేదు. అందులో ప్రధాన వస్తువు ప్రపంచీకరణ. ఆ ప్రధాన వస్తువునే ఆయన రకరకాలుగా వ్యక్తీకరించారు గానీ ప్రపంచీరకణకు సంబంధించిన మూర్త, అమూర్త విషయాలను తడమలేదు. ఒకే విషయాన్ని రకరకాలుగా వ్యక్తీకరించారు. అంటే రూప వైవిధ్యం మాత్రమే ప్రదర్శించారు.

3. తాత్విక చింతన

ఆధునిక వచన కావ్యానికి సంబంధించి తాత్విక చింతన అనేది అత్యంత ప్రధానమైన అంశం. అది రాజకీయ తాత్వికతే అయి ఉండడం కూడా ఆధునికతకు ముఖ్యమైన లక్షణం. వచన కవిత్వమంటే ఆధునిక కవిత్వం కాబట్టి అది రాజకీయ తాత్వికత కావడమనేది అనివార్యత.

అయితే, చేకూరి రామారావు తాత్విక చింతనను మీమాంసకు కుదించారు.
'ఆలోచనకీ మనిషికీ ఉన్న సంబంధం ఏమిటి?
భాషకీ భావానికీ వున్న సంబంధం ఏమిటి?
వేదనకీ శరీరానికీ వునన సంబంధం ఏమిటి?
నేలకీ నీటికీ వున్న సంబంధం ఏమిటి?' అనే మూలభూతమైన ప్రశ్నలు వేసుకుంటాడని, ఈ రకపు ఆలోచనా పద్ధతి కావ్యమంతటా కనిపిస్తుందని ఆయన చెప్పారు. కానీ, తాత్విక చింతన అంటే అంత మాత్రమే కాదు. ఇదే పరిస్థితికి వేల్చేరు నారాయణ రావు కూడా గురయ్యారా, లేదా అనేది చెప్పలేం. కానీ ఇద్దరు కూడా కావ్య కేంద్రబిందువును అంచనా వేయడంలో విఫలమయ్యారు.

కొయ్యగుర్రాన్ని ప్రభుత్వ అసమర్థతగా, ప్రభుత్వానిది చెక్క హృదయంగా చేకూరి రామారావు గుర్తించారు. 'సమస్త విశ్వాన్నీ సమస్త కాలాన్నీ రంగం చేసుకుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆలోచనలకు అవధులు లేకపోవడం వల్ల అవి తాత్విక స్థాయికి చేరినై. కావ్యం మహాకావ్యం స్థాయికి ఎదిగింది' అని చేరా అన్నారు. అంటే, ఇతివృత్త వైవిధ్యంతో, భావవైవిధ్యంతో కవి సంతరించి పెట్టిన వ్యక్తీకరణ వైవిధ్యాన్ని ఆయన తాత్వికతగా చెప్పారని అర్థమవుతున్నది. ఆ వైవిధ్యంతో కవి తన తాత్విక చింతన మేరకు రూపుదిద్దిన కావ్యంతో పాఠకులను మమేకం చేస్తున్నాడు.

'అబద్ధానికీ, దిగంబరమైన నిజానికీ వున్న సంఘర్షణని వ్యక్తం చేసే ప్రతీక కొయ్యగుర్రం అని వేల్చేరు నారాయణ రావు సూత్రీకరించారు. 'ప్రకృతికీ - సంస్కృతికీ మధ్య ఉన్న సంఘర్షణ అసలు లేకపోతే మనిషి లేడు. అది ఎక్కువ అయిపోయినా మనిషి వుండడు. ఇది ఈ కావ్యంలోని తాత్విక చింతన' అని ఆయన అభిప్రాయపడ్డారు.

నిజానికి, కవి కొయ్యగుర్రాన్ని చలనశీలరాహిత్యానికి ప్రతీకగా తీసుకున్నాడు. కొయ్యగుర్రం కదులుతుంది గానీ దానికి చలనం ఉండదు. ముందుకు వెనక్కీ కదులుతూ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ అది నిజంగా తాను ఉన్న స్థలాన్ని అధిగమించలేదు. అలాగే, ప్రభుత్వం నడిచినట్టు కనిపిస్తుంది గానీ వెనక్కి గానీ ముందుకు గానీ వెళ్లదు. అదే అబద్ధానికి, దిగంబరమైన నిజానికి మధ్య ఉన్న తేడా. అది సంఘర్షణ స్థాయిలోనే ఆగిపోలేదు. ముందుకు సాగింది. కొయ్యగుర్రంలోని రాజకీయ చింతనను అవగాహన చేసుకోవడంలో వేల్చేరు నారాయణ రావు విఫలం కావడం వల్ల కవి తాత్విక చింతనను కుదించివేశారు.

4. కథారహితం

ఆధునిక వచన కవిత్వానికి ఇది ఓ ప్రధానమైన లక్షణం. ఆధునిక సమాజం లక్షణం కూడా. వస్తువు మాత్రమే ఉంటుంది. వ్యక్తీకరణ రీతుల ద్వారా, భావాల ద్వారా కవి సందేశాన్ని అందిస్తాడు. అందుకు పాత్రలను, సంఘటనలను ఆలంబనగా చేసుకోవాల్సిన అవసరం లేదు.

5. అనేక భావాలు, మూడ్స్‌ ఉండడం

మూడ్స్‌ను, భావాలను వేల్చేరు నారాయణరావు సమానార్థకాలుగా చూస్తే, చేకూరి రామారావు వాటి మధ్య భిన్నత్వాన్ని కూడా చూశారు. 'మూడ్‌ కేవలం మనస్థితిని మాత్రమే సూచిస్తుంది. భావం ఇంతకన్నా విశాలమైంది' అని చేరా సరిగానే అంచనా వేశారు. మూడ్స్‌లో, భావాల్లో వైవిధ్యమూ భిన్నత్వమూ ప్రదర్శిస్తూ పఠితను ఏకోన్ముఖంగా నడిపించే లక్షణం కావ్యానికి ప్రధానమైంది. మహాకావ్యాన్ని రూపుదిద్దడంలో ఇవి రెండు కూడా కీలకమైనవి.

6. అర్బెనిటీ

అర్బెనిటీ అనేది చిన్న విషయం కాదు. దీన్ని తెలుగులో నగరీకరణ అనవచ్చునేమో. ఆధునిక సమాజానికి మౌలికమైంది అర్బెనిటీ. అర్బెనిటీకి చేరా ఇచ్చిన వివరణ సరిపోదని అనిపిస్తుంది.

'సభారంజకత్వం కోసం చేసే అల్ప చమత్వారాల వారసత్వం నుంచి పదక్రమ వ్యత్యయం, సంబోధనలు మొదలైన చిట్కాల వలయం నుంచి, ప్రాబంధిక సమాస బంధురత నుంచి బయటపడి సీరియస్‌ ధోరణిలో సాగుతున్నది. పరిణతిని సాధిస్తున్నది. ఒక నాజూకుదనాన్ని, రిఫైన్మెంటును సాధించుకుంటున్నది. దానికి ఒక పేరు పెట్టుకోవాల్సిన అవసరం కనిపించి అర్బెనిటీ అనే మాట వాడాను' అని చేరా అన్నారు. అర్బెనిటీ అంటే అంత మాత్రమే కాదు. నిజానికి, అది కూడా కాదు. చేరా మంచి వచన కవిత్వగుణాలను అర్బెనిటీ కింద జమకట్టారు.

అర్బెనిటీ ఆధునికత లక్షణాల్లో ఒక్కటి. సమాజం ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థకు మారే క్రమంలో ఆధునికతను సంతరించుకుంటుంది. ఇది అనేక రూపాల్లో ఉంటుంది. ప్రజాస్వామీకీకరణ, హేతుబద్దత, శాస్త్రీయ దృక్పథం తదితర రూపాల్లో ఆధునికత వ్యక్తమవుతుంది. వచన కవిత్వమనేది ఆధునికతకు సంబంధించిన వ్యక్తీకరణ రూపం కూడా.

అర్బెనిటీ సమాజం పారిశ్రామీకీరణ చెందే క్రమంలో రూపు దిద్దుకుంటుంది. ఇది భౌతికమైంది మాత్రమే కాదు, మానసికమైంది కూడా. పరిశ్రమలు పెద్ద యెత్తున వెలిసినప్పటికీ ఆ పారిశ్రామిక ప్రాంతంలోని వ్యక్తుల ఆలోచనా సరళి మారకపోవచ్చు. హేతుబద్ధత, శాస్త్రీయ దృక్పథం సామూహిక వ్యక్తీకరణగా ముందుకు రాకపోవచ్చు. అందువల్ల అది మానసికమైంది కూడా. ఈ వైరుధ్యం భారతీయ సమాజంలో కనిపిస్తుంది.

ఇది కొయ్యగుర్రం కావ్యంలో ఇది ప్రధానమైన విషయంగా అంతర్లీనమైన ధారగా వ్యక్తమైంది. సమాజం నగరీకరణను సంతరించుకున్నప్పుడు పౌర సమాజం రూపుదిద్దుకుంటుంది. పౌర సమాజంలో ప్రభుత్వాలు కొయ్యగుర్రాల్లా మనుగడ సాగించలేవు. పౌరులు సమాజంలో తమ బాధ్యతలను గుర్తిస్తూనే హక్కులను గుర్తిస్తారు. హక్కులను గుర్తించినప్పుడు పౌరులు ఆందోళనలకు, ఉద్యమాలకు దిగుతారు. పౌర హక్కుల ప్రస్తావన ప్రధాన ఎజెండా అవుతుంది. పౌర సమాజం రూపుదిద్దుకోనప్పుడు మానవ సమాజం మాత్రమే అస్తిత్వంలో ఉంటుంది.

అయితే, భారతదేశానికి వచ్చే సరికి రెండు సమాజాలు కూడా వేర్వేరుగా మనుగడ సాగిస్తున్నాయి. అందుకే, ఉద్యమాలు కూడా అలాగే వ్యక్తమవుతున్నాయి. ఈ తేడాను గుర్తించకపోవడం వల్ల వామపక్ష ఉద్యమాలు ముందుకు సాగడం లేదు. కొయ్యగుర్రం కవి అర్బెనిటీని సంతరించుకున్నాడు, కావ్యం అర్బెనిటీని సంతరించుకుంది. ఈ రీత్యా అది ఆధునిక వచన కావ్యం అవుతున్నది.

7. విస్తృతి

విస్తృతిని చేకూరి రామారావు సైజుగానే పరిగణనలోకి తీసుకున్నారు. సైజు తప్పనిసరిగా కావ్య లక్షణాన్ని నిర్ణయిస్తుంది. కానీ, అది కేవలం రూపానికి సంబంధించింది మాత్రమే కాదు. అంటే, మూర్తం మాత్రమే కాదు, అమూర్తం కూడా. మూర్త రూపం చిన్నదై అమూర్తత విస్తృతి దీర్ఘంగా ఉండవచ్చు. ఒక్కో వ్యక్తరూపంలో అనేక అవ్యక్త భావాలు ముప్పిరిగొనవచ్చు. అనేక విషయాలు ఆలోచనల్లో మూర్త రూపం ధరించవచ్చు. ఈ విషయాన్ని వేల్చేరు నారాయణ రావు, చేకూరి రామారావు సరిగానే గుర్తించినట్లున్నారు. అందుకే, వేల్చేరు శ్రీశ్రీ కవితా, ఓ కవితా! అనే పద్యాన్ని ఉదహరిస్తే చేరా శివసాగర్‌ వీవా లా శాంటియాగోను ఉదహరించారు.

ఇవన్నీ ఆధునిక వచన కావ్యాన్ని రూపుదిద్దితే వాటిలో నవ్యత, అనుసరణీయత మహా కావ్యాన్ని నిర్దేశిస్తాయి. నవ్యత, అనుసరణీయత విషయానికి వస్తే ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీని మహాకవిగా పరిగణించవచ్చు. పైన చెప్పిన లక్షణాలన్నీ సరిగా అతికిన కొయ్యగుర్రం ఆధునిక వచన మహా కావ్యం అవుతుంది. అదే సమయంలో తన మహాకావ్య ప్రతిపత్తిని అది రద్దు చేసుకుంది కూడా. అందుకు ప్రధాన కారణం. కవి, కావ్యం ఆధునికతను సంతరించు కున్నప్పటికీ సమాజం సంతరించుకోలేదు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అస్తిత్వ ఉద్యమాలు ముందుకు వచ్చాయి. అస్తిత్వ ఉద్యమాలు తెలుగులో పాశ్చాత్య దృష్టికి సంబంధించినవి కావు. పాశ్చాత్యులు అస్తిత్వం అనేది వ్యక్తివాదంలోది. అది ఆధునికతను సూచించేది కూడా. కానీ, తెలుగులో అది కాదు.

అభివృద్ధిలో ఆధునికత అన్ని సమూహాలకు, ప్రాంతాలకు, కులాలకు, ఇతర శ్రేణులకు సమానంగా అందలేదు. అందుకే, ఇప్పుడు మహాకావ్యాలు ఉండవు. కావ్యాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఆధునిక వచన కావ్యాలు తెలంగాణ, దళిత సమూహాల నుంచి వెలువడుతున్నాయి.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
A prominent Telugu literary critic Chekuri Rama Rao termed Nagnamuni's Koyyagurram (wooden horse) as an modern prose epic. Velcheru Narayan Rao contradicted Chera's arguement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X