శివసాగర్ ఒక్కడే...

కవిత్వాన్ని కలవరించి పలవరించిన ఆధునిక కవులలో శివసాగర్ అగ్రగణ్యుడు. కవిత్వాన్ని ఆయుధంగా విసిరిన, విసరగల నేర్పు ఉన్న కొద్ది మంది అసలు సిసలైన తెలుగు కవుల్లో శివసాగర్ ఒక్కడే. శివసాగర్ కవిత్వాన్ని విశ్లేపించాల్సి వస్తే మూడున్నర థాబ్దాల పాటు దోపిడీకి గురైన, గురవుతున్న ప్రజల కోసం సాగిన, సాగుతున్న ప్రత్యామ్నాయ సామాజిక, రాజకీయ ఉద్యమాలను, ప్రపంచవ్యాప్తంగా నూతనసృష్టి కోసం జరిగిన ఉద్యమాల మంచీచెడులు, భారతదేశ ఉద్యమాలపై వాటి ప్రభావాలను కూడా విశ్షేలించాల్సి ఉంటుంది. ఈ మూడున్నర థాబ్దాలు శివసాగర్ కవిత్వానికి వచ్చే సరికి అరచేతిలో ఇమిడిపోతుంది. శివసాగర్ కవిత్వాన్నంతా కుప్ప పోసి ఒక్కొటొక్కటే హృదయం మునివేళ్లతో అందుకుంటూ పోతుంటే ఆ సామాజిక, రాజకీయ ఉద్యమాల చరిత్ర విస్తృతి, వాటిలోని ఆనందాల వెల్లువలు, విచార ఘట్టాలు విస్తృతమైన దృశ్యాలు దృశ్యాలుగా కళ్ల ముందు మెదులుతూ పోతుంటాయి. ఆ అవకాశాన్ని కొందరు మిత్రులు కల్పించారు. శివసాగర్ కవిత్వాన్నంతా ఏరి కూర్చి ఒక పుస్తకంగా అచ్చేశారు. కవిత్వానికి సంబంధించినంత వరకు గడిచిన సంవత్సరం తెలుగు సాహిత్యలోకానికి ఇచ్చిన గొప్ప కానుక ఇది. ఆ రకంగా మూడున్నర థాబ్దాల తెలుగు సమాజం ఇతిహాసంలోని చీకటివెలుగులను ఒక అరచేతిలో ధరించే అవకాశాన్ని మనకు ఆ మిత్రులు కల్పించారు. అదే సమయంలో తెలుగులోని అత్యంత సుందరమైన కవిత్వాన్ని ఆస్వాదించి, అక్కున చేర్చుకునే అనుభూతిని ప్రసాదించారు. శివసాగర్ కవిత్వాన్ని అసరా చేసుకొని తెలుగు సమాజంలోని ప్రజా రాజకీయ, సామాజిక ఉద్యమాలను విశ్లేషించడం ఒక పద్ధతి కావచ్చు. కానీ శివసాగర్ కవిత్వాన్ని ఆయన ఆచరణను పరిగణనలోకి తీసుకుంటూ కొన్ని విభజనలు చేసి, అవసరమైతే ముక్కలు ముక్కలు చేసి విశ్లేషించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న వేధిస్తూనే ఉంటుంది.
శివసాగర్ కవిత్వం ఒక వెన్నెలకుప్ప. అది కాలుతుంది కూడా. ఆ వెన్నెల కుప్పలోంచి వరుసగా ఒక్కొటొక్కటే అందుకుంటూ పోతే మనకు ఒక అవిచ్ఛిన్నత కూడా కనిపిస్తుంది. ఒక తరానికి ప్రాతినిధ్యం వహించిన కవిని లేదా ప్రజా రాజకీయ, సామాజిక ఉద్యమకారుడిని అంచనా వేసే సమయంలో అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని ఒక కుప్పగా పోసుకొని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా అధ్యయనం చేసినప్పుడు శివసాగర్‌లో అవిచ్ఛిన్నతే కనిపిస్తుంది తప్ప వైరుధ్యాలు కనిపించవు. విశ్వాసానికి, ఆచరణకు, అంటే చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకపోవడాన్ని మాత్రమే వైరుధ్యంగా పరిగణించాల్సి ఉంటుంది. రెండు విరుద్ధ శక్తుల మధ్య ఒక శక్తి నుంచి మరో శక్తికి గంతు వేసినప్పుడు అది వైరుధ్యం కాదు, అవకాశవాదం అవుతుంది.
అవకాశవాదానికి, వైరుధ్యానికి మధ్య ఈ తేడాను గుర్తించగలిగినప్పుడే శివసాగర్‌లోని అవిచ్ఛిన్నతను అర్థం చేసుకోగలం. వ్యక్తి అంతర, బాహిర్ ప్రపంచాలకు మధ్య పొంతన లేకపోవడాన్ని లేకపోవడాన్ని కూడా అవకాశవాదమని చెప్పాల్సి ఉంటుంది. ఈ పొంతన లేకపోవడమనేది ఎవరినీ మంచి కవిగా తీర్చిదిద్దలేదు. మంచి కవిత్వం అంతర్లోకాల సంఘర్షణ నుంచి వెలువడుతుంది. మనిషి తనతో తాను చేసే యుద్ధం నుంచి వెలువడుతుంది. మనిషి తనతో తాను చేసే యుద్ధంలో బయటి ప్రపంచం కూడా ఉంటుంది. సమాజంలో జరిగే సంఘటనలను, సంభవించే పరిణామాలను కవి, కళాకారుడు అనుభవించి పలవరిస్తాడు. అవి కవికీ, కళాకారుడికి, ఉద్యమకారుడికి అన్యాలు కావు. తనకు సంబంధించినవే. అందుకే వారి వ్యక్తిగత సంఘర్షణ కూడా బాహిర్ ప్రపంచంలోని సంఘర్షణను ప్రతిఫలిస్తుంది.
శివసాగర్ కవిత్వాన్ని చదువుతున్నప్పుడు మనకు ఈ సామాజిక సంఘర్షణ, ఆయన భావధారలోని అవిచ్ఛిన్నత అర్థమవుతుంది. దీన్ని వివరించడానికి సామాజిక, రాజకీయ ఉద్యమాలను, వాటి గమనాన్ని, వాటి గమనానికి ఉద్దేశించిన సిద్ధాంతాలను ఆచరణకు ఆన్వయించిన తీరును, వాటి లోటుపాట్లను, విశ్వాసానికి ఆచరణకు మధ్య ఉన్న అంతరాలను, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ఆ సిద్దాంతాలకు ఆచరణ రూపం ఇవ్వవలసిన అవసరాన్ని, అలా ఇవ్వడానికి జరిగిన ప్రయత్నాలను, ఆ ప్రయత్నంలో పొడసూపిన విభేదాలు, ఆ విభేదాలు తీసుకున్న రూపాలు, ఆ కారణంగా మన చరిత్రను మనమే తుడిచిపెట్టుకునే భారతీయ వారసత్వ లక్షణాలను, కాయం కష్టం చేసే శూద్రకులాల సాహిత్యాన్ని, భారతదేశంలో నిరాటంకంగా సాగుతున్న బ్రాహ్మణీయ ప్రవర్తక సంప్రదాయాన్ని, కుల ప్రత్యేక గురించి మాట్లాడే క్రమంలో దళిత వాదాన్ని వ్యక్తులకు మాత్రమే అంటగట్టి దాన్ని సారాన్ని విస్మరించిన తీరును, తద్వారా లబ్ది పొందడానికి ఉపయోగించుకున్న వైనం, అందులో ప్రభుత్వేతర సంస్థల వ్యూహాలు, ఎత్తుగడలు అన్నీ చర్చకు వస్తాయి. వీటన్నింటినీ పరిశీలించి విశ్లేషించే క్రమంలో శివసాగర్ కవిత్వానికి, ఆచరణకు అభిన్నత కనిపిస్తూ ఆయన విశ్వాసంలోని అవిచ్ఛిన్నత, ప్రజా రాజకీయాలకు శివసాగర్‌లాంటి కొద్దిమంది విశ్వాసాలకు సారంలో తేడా లేకపోవడాన్ని మనం గమనించవచ్చు. దీన్ని విశ్లేషించడానికి సందర్భం అక్కర్లేదు గానీ సమయం కావాలి. అందుకు ఇది సమయం కాదు.
శివసాగర్ కవిత్వాన్ని బహుజన బుక్ సిండికేట్ ఒక దగ్గర చేర్చి అచ్చేసిన పుస్తకాన్ని చూసినప్పుడు అంతా ఇంతేనా అనిపిస్తుంది. అయితే కొద్ది కవిత్వం ద్వారానే ఆయన మనకెవరో తెలియకుండానే మనవాడైపోయిన ముద్రలు గుండె మీద బలంగా నాటుకొన్న విషయాలు గుర్తొస్తాయి. గెరిల్లా విప్లవ గీతాలు, జనం ఊపిరిలో, పది వసంతాలు, నెలవెంక, నడుస్తున్న చరిత్ర అంటూ విభాగాలు చేసి ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. ఈ విభాగాలు పాఠకుల సౌలభ్యం కోసం మాత్రమే. ఆయా సందర్బాల్లో పుస్తకాలుగా వెలువడినప్పుడు చేరా, వరవరరావు ముందు మాటలను యధాతథంగా ప్రచురించారు. ఇటీవలి కవిత్వాన్ని నడుస్తున్న చరిత్ర కింద అచ్చేశారు. ఇదంతా చదువుతున్నప్పుడు శివసాగర్ గొప్ప సామాజిక చలనశీలిగా, ప్రేమికుడిగా మన ముందు కనిపిస్తాడు.
ఇక్కడే మరో విషయం జానపద రీతులను ఆయన విప్లవీకరించిన తీరు ఆయన మాటల్లోనే మనం చదవడానికి కూడా ఈ పుస్తకం వీలు కల్పిస్తుంది. తెలంగాణ జీవితాన్ని శివసాగర్ తనలో ఇముడ్చుకున్న విషయం కూడా ఆయన కవిత్వం ద్వారా బయటపడుతుంది. తెలంగాణను మిగతా కోస్తాంధ్ర మేధావుల మాదిరిగా ఒక విడిదిగా మాత్రమే చూడలేదు. తెలంగాణ నాది కాదనే భావన ఆయనలో లేదు. ఆ రకంగా ఆయన ఇతర ప్రాంతాల వారికి తెలంగాణ విషయంలో మార్గదర్శకుడు అవుతాడు.
ఇకపోతే, గేయ రచయితగా, వచన కవిగా శివసాగర్ పూర్తి పరిణతి సాధించాడు. వచన కవిత్వాన్ని ఎంత గొప్పగా రాయగలడో గేయాన్నీ అంతే సౌందర్యాత్మకంగా వెలువరించగలడు. ఆయన గేయాలు కేవల గానమాధ్యం వల్లనే గొప్పవి కావు. అందులోని కవిత్వం నెమరువేసుకొని అనుభవించి పలవరించడానికి వీలు కల్పిస్తుంది. ఈ విషయాన్ని చేరా, వరవరరావు విశ్లేషించారు. చెల్లీ చెంద్రమ్మా, నరుడో భాస్కరుడా, ఓ విలుకాడ, నల్లాటి సూర్యుడు కేవలం రూపం వల్లనే కాదు, అందులో కవిత్వం వల్ల కూడా గొప్పవిగా కనిపించడానికి శివసాగర్‌కు కవిత్వ మర్మం తెలియడమే కారణం. తెలంగాణ జానపద కవిత్వ రీతిని విప్లవ గేయానికి అన్వయించిన తీరు విస్మయం కలిగించకమానదు. భావతీవ్రతను మనసు అనుభవించడానికి ఒకే భావాన్ని వివిధ పదచిత్రాలతో మార్చి మార్చి వ్యక్తం చేయడం జానపద గేయ లక్షణం. ఆ లక్షణాన్ని ఆయన ఉన్నదున్నట్లు పట్టుకొని సారాన్ని మార్చి మనకు అందించాడు. అలాగే ఉద్యమం నెలుబాలుడు నుంచి ఇటీవలి సద్దాంకు ప్రేమలేఖ వరకు ఆయన వచన కవిత్వంలో సాధించిన పరిణతిని పట్టిస్తాయి. శివసాగర్ కవిత్వాన్ని అనుభవించి పలవరించి మనకు అందించాడు.
చివరగా ఒక మాట, ఇది శివసాగర్ కవిత్వానికి ప్రారంభ వాక్యాలు మాత్రమే. ఆయన కవిత్వాన్ని మాటల్లో విశ్లేషించడం కొంత కష్టమే. అది అనుభవించి పలవరించవలసిందే. సామాజిక ఆచరణలో భాగంగా తెలుగు సమాజం మొదటి నుంచి ఆ పని చేస్తూనే ఉన్నది.
-కాసుల ప్రతాప రెడ్డి
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications