ఏంటిది రాజుగోరూ..?

మీరు లేరన్న ధీమాతో రాజకీయ నాయకులు మరీ బరితెగించేస్తున్నారు. చెర్నాకోలాతో కొట్టినట్లు వీపు పై వాతలు తేలేలా కలంతో కదం తొక్కే వాళ్లే లేరన్న భరోసాతో వాల్లు రక రకాల విన్యాసాలు చేస్తున్నారు. పతంజలి భాష్యం లేదంటేనే వాళ్లకి ఊపిరి పీల్చుకునే వీలు దొరికిందంటే నమ్మండి.
మీరు ఇటు వైపు రావడం కుదరదేమోనన్న ధైర్యంతో వీర బొబ్బిలి తెగ తోకాడించేస్తోంది సుమండీ. ఒక్క వీర బొబ్బిలే కాదు బొబ్బిలి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇపుడు వివిధ రాజకీయ పార్టీల్లో చేరిపోయారు. బోయినం ముఖ్యమా...విశ్వాసం ముఖ్యమా అన్న మీమాంస లేదిపుడు. పదవి ముఖ్యమా విలువలు ముఖ్యమా అన్న ప్రశ్నలు వేసుకుని పదవే ముఖ్యమని తెలుసుకుని విలువలను చెత్తబుట్టలో పారేసింది బొబ్బిలి.
మన జర్నలిస్టు మిత్రులు మరీ చాదస్తాలకు పోకుండా ఉద్యోగాలు చేసుకుంటూ మధ్య మధ్యలో వార్తలు కూడా ఇస్తున్నారు.
మీరు లేరన్న ధైర్యంతో...మీ కలం తమనేం చేయదన్న ధీమాతో పోలీసులు తెగ రెచ్చిపోతున్నారు. తమను చికాకు పెట్టేవాళ్లని లాఠీతో రెండిచ్చుకుంటున్నారు. మరీ అన్యాయంగా తమనే నిలదీస్తే బొక్కలోకి తోసి వీపు తోమేస్తున్నారు. ఎవరూ కిక్కురు మనకుండా గుర్తుకొచ్చిన సెక్షన్ పై కేసు బుక్ చేస్తున్నారు. అంత టైమ్ కూడా లేకపోతే కేసు బుక్ చేయకుండానే కొట్లోకి నెట్టేస్తున్నారు. గజ దొంగలూ...కరడు గట్టిన నేరగాళ్లతో నెలవారీ మీటింగులూ ఇచ్చిపుచ్చుకోవడాలూ ప్రశాంతంగా చేసేస్తున్నారు. ఖాకీ వనాలను రాష్ట్ర మంతటా విస్తరిస్తున్నారు. వ్యవస్థను ఎదిరిస్తే నక్సలైటు గా భావించి లోపలకి తోసేస్తున్నారు.
ఫకీర్రాజు వంటి రాసోళ్లు తమ ఆబోరు కొచ్చిన ఇబ్బంది లేదని పోలుగు పిట్ట మాంసంతో కడుపు నిండా బోయినాలు లాగించేస్తూ..రాత్రి తెల్లార్లూ పేకాడుతూ... ఇండీషన్లు పుచ్చుకుని వేటాడేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
గోపాత్రుడు మాత్రం కొంత మారేడండోయ్. ఇదివరకటిలా భూమి బల్లపరుపుగా ఉందని గోపాత్రుడు ఇపుడు వాదించడం లేదు. భూమి మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గెడ్డంలా ఉందని గోపాత్రుడు వాదిస్తున్నాడు.
లెక్కల తాబేళ్లూ...కళాకార్ చిలకలూ...సత్తెకాలపు వెర్రి మిడతలు...సీతాకోక చిలుకలంత అసహ్యకరమైన ప్రాణులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయే గొంగళీ పురుగులు..తోక పీతలు..ఒకటేమిటి అన్నీ కూడా మీ కబుర్లే చెప్పుకుంటూ గడిపేస్తున్నాయి.
కానీ రాజుగోరూ..వీళ్లంతా కాదు కానీ...
మీరు లేరన్న బెంగతో దగాపడ్డ పేదలు...అన్యాయమైపోయిన అభాగ్యులు..బాల్యం కోల్పోయిన బాలమల్లేశులూ ...నర్సన్న గౌడ్ లా గాల్లో దీపంలా ప్రాణాలు ఆకాశంలో పెట్టుకుని బతుకులు వెళ్లదీస్తోన్న కార్మికులు ...ఏడుపును దిగమింగుకుని ఇక ఎవరికి చెప్పుకోవాలంటూ ఒకటే రోదిస్తున్నారు. వాళ్లును చూస్తేనే కడుపు తరుక్కుపోతోందంటే నమ్మండి. తమకు మాట మాత్రంగానైనా చెప్పకుండా వెళ్లిపోయిన మీ పై ఏదో ఒక కేసు పెట్టాలన్నంత కోపంతో ...బాధతో...ఆక్రోశంతో వారంతా క్షోభిస్తున్నారు. మీరు మర్యాదగా ఇక్కడికి రాకపోతే మాత్రం మీపై కుట్ర కేసు పెట్టడానికి కూడా వెనుకాడేది లేదని వారు మీతో చెప్పమన్నారు కాబట్టే ఈ ఉత్తరం ముక్క రాశాను తప్ప నాకు మరో ఉద్దేశం లేదండీ రాజుగోరూ.
వాళ్లకి మాత్రం మీరు సమాధానం చెప్పుకోవాలి మరి. సమాధానం చెప్పడానికి మీరే వస్తారు కదూ.రండి రండి తొందరగా.మీకోసం అంతా ఎదరు చూస్తూనే ఉంటాం.
(అక్షరాన్ని ఆయుధంగా ఎలా మలుచుకోవాలో...ఆపదలో ఉన్న వారిని అక్షరంతో ఎలా కాపాడుకోవాలో...బాధలో ఉన్న వారిని ఆ అక్షరంతోనే ఎలా ఆదరించాలో చెప్పి..అన్నీ నేర్పి పతంజలి గారు మాయమై నాలుగేళ్లు పూర్తయిన బాధలో..)
-సి.ఎన్.ఎస్.యాజులు












Click it and Unblock the Notifications