మహోన్నత శిఖరం ఇనాక్‌

Darla Venkateswar Rao
సృజన, పరిశోధన, విమర్శన రంగాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారికి సి.పి.బ్రౌన్‌ అకాడమీ పురస్కారాన్ని ప్రకటించి, సాహిత్య విలువల్ని పెంపొందించడంలో ముందువరుసలో నిలిచే ప్రయత్నం చేసింది. తెలుగు భాషా,సాహిత్యాలకు సి.పి.బ్రౌన్‌ చేసిన సేవ అభ్యుదయమార్గంలో సాగింది. అంతవరకూ నిర్లక్ష్యానికి గురైన వేమన సాహితీ ప్రపంచానికి తెలిసాడంటే దానిక్కారణం సి.పి.బ్రౌన్‌. నిఘంటువుల్ని రూపొందించడంలోను, తెలుగు ప్రబంధాల్ని సంపాదించి, వాటికి వ్యాఖ్యానాల్ని రాయించి, అందరికీ అందించడంలోను ఆయన చేసిన సేవ విస్మరించలేనిది. అలాంటి మార్గంలోనే పయనించిన వారు ఆచార్య కొలకలూరి ఇనాక్‌.

సి.పి.బ్రౌన్‌ పుట్టుకతోనే ధనవంతుడైతే, ఆచార్య ఇనాక్‌ దీనికి పూర్తి వ్యతిరేకమైన ఆర్థిక, సామాజిక పరిస్థితుల నుండి వచ్చినా, ఇరువురూ క్రైస్తవమతం భావాల్ని ఆచరించే కుటుంబం నుండి రావడం విశేషం. అందుకేనేమో తాము చేసే ప్రతి పనినీ దైవసమానంగా భావించటం ఇరువురిలోను కనిపిస్తుంది. బ్రౌన్‌ కాలేజీ గా పండితుల్ని ఒక బృందంగా పరిశోధన చేయించడం, తానూ చేయడం సి.పి.బ్రౌన్‌లో కనిపించినట్లే, ఆచార్య ఇనాక్‌ గారిలోనూ ఇలాంటి పరిశోధక లక్షణం కనిపిస్తుంది. వీరి పర్యవేక్షణలో సుమారు 24 మంది పిహెచ్‌.డి., 18 ఎం.ఫిల్‌., పరిశోధనలు చేసి, డిగ్రీలు తీసుకున్నారు. సుమారు 198 జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాల్ని సమర్పించారు. సమారు 180 పరిశోధన పత్రాలు ప్రచురించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘‘ తెలుగు వ్యాస పరిణామం'' పై పరిశోధన చేశారు. అదే విశ్వవిద్యాలయానకి వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించడం ఒక చారిత్రక సన్నివేశం.

నన్నయ నుండి ఆధునిక పత్రికా రచయితల వరకూ తెలుగు వ్యాసపరిణామం కొనసాగిన తీరు తెన్నుల్ని విశ్లేషిస్తూ,వ్యాసాల్ని రాయడంలో సాహిత్య విషయాలకే మన రచయితలు అధిక ప్రాధాన్యాన్నిచ్చారని సూత్రీకరించారు. వ్యాసం ఆలోచన కలించడంతో పాటు, అనుభూతిని రగిలించడానికి సహకరించినప్పుడు అందరినీ అలరించగలుగుతుందని, దానికెలాంటి లక్షణాలను కలిగి ఉండాలో వేలాది వ్యాసాల్ని పరిశీలించిన అనుభవంతో సిద్ధాంతీకరించారు.నేటికీ చాలా మందికి దొరకలేదంటున్న పురాణం సూరిశాస్త్రి లాంటి వారు రాసిన వ్యాసాల్ని కూడా ఆనాటికే సంపాదించి, వాటిపై కూడా నిర్ణయాల్ని ప్రకటించడం పరిశోధకునిగా ఆచార్య ఇనాక్‌ గారికున్న అన్వేషణ, శాస్త్రీయ దృక్పథాలకు ఈ పరిశోధన నిదర్శనం.

డాక్టరేట్‌ సాధించిన గ్రంథం రిఫరెన్సు గ్రంథం కావడం పరిశోధనకు నిజమైన గుర్తింపనుకోవచ్చు. అలాంటి గుర్తింపు వీరి తెలుగు వ్యాసపరిణామం గ్రంథానికి లభించింది. ఈయన చేసిన మౌలికమైన పరిశోథనలో కలికితురాయిగా చెప్పుకోదగింది వసుచరిత్ర ప్రబంధాన్ని రాసిన శుభమూర్తిపై చేసిన పరిశోధన. ఇది పరిశోధన గ్రంథమైనా, విమర్శక దృక్పథం ఉండటం వల్ల దీని పరిశోధనాత్మక విమర్శ గ్రంథంగా పిలవడం సమంజసం.

పరిశోథనలో అన్వేషణ, కొత్తవిషయాల్ని బయటపెట్టడం, సిద్ధాంతాన్ని స్థాపించడం లేదా ఒక విషయాన్ని సూత్రీకరించడం ముఖ్యం. వీటిలో అంతర్భాగంగానే కనిపిస్తున్నా, గుణ,దోష విశ్లేషణ, నిర్ణయ ప్రకటన విమర్శలో ప్రధానంగా చూడాలి. పరిశోధనలో కనిపించే అన్వేషణ, సమాచార సేకరణ వంటివి విమర్శలో అంతగా కనిపించవు. లభించిన సమాచారాన్ని విశ్లేషించి, తులనాత్మకంగా పరిశీలించి, తనదైన దృష్టితో వ్యాఖ్యానించి, అది గుణమో, దోషమో ఒక నిర్ణయాన్ని ప్రకటించడం విమర్శ స్వభావం. ఈ రెండు స్వభావాలు సంతరించుకుంటే దాన్ని పరిశోధనాత్మక విమర్శ అనొచ్చు. అలా రెండు లక్షణాల్ని సంతరించుకున్న గ్రంథం ‘‘శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం''. తన పేరు శుభమూర్తి, మూర్తికవి అని ‘వసుచరిత్ర' కారుడు చెప్పుకున్నా, అతణ్ణి భట్టుమూర్తి, రామరాజభూషణుడు అని నాటి నుండి నేటి వరకూ పండితలోకం పిలవడంలో ఒక శూద్రుణ్ని కవిగా గాని, అతని పేరుతో గాని పిలవడానికిష్టపడని వర్ణాధిక్యాన్ని సోదాహరణంగా నిరూపించారు. శుభమూర్తిలో కవిలోకం పట్ల దళిత, బహుజనులు అలవరుచుకోవలసిన ప్రతిఘటన చైతన్యాన్ని గుర్తించేలా గ్రంథాన్ని సాధికారికంగా రాశారు. ఇంతవరకూ దీన్నెవరూ ఖండిరచకపోవడం దీనిలో ప్రతిపాదించిన పరిశోధనాంశాల్లోని శాస్త్రీయతకు మరో నిదర్శనం.

-డా॥ దార్ల వెంకటేశ్వరరావు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+