కవితా ప్రాణవాయువు అలిశెట్టి

Posted By:
Subscribe to Oneindia Telugu

అలిశెట్టి.

టీకా తాత్పర్యాలు అక్కర్లేని పేరు. అర్దవ్యాకోచం అర్ద సంకోచం చెందని నిటారు నిటార్సయిన పేరు. నిజానికది వ్యక్తి పేరు కాదు. కణకణమండే కవితా శక్తి పేరు. మామూలు గా కవులేం చేస్తారు...ఉప్పొంగిన భావావేశానికి అక్షరాలను అద్దుతారు. అలిశెట్టి కవితకు తన రక్తాన్ని అద్దాడు. ఊపిరిని ఫణంగా పెట్టి అక్షరానికి ప్రాణ ప్రతిష్ట చేశాడు. అతన్ని జీవితం అడిగింది నేనా?కవితా? ఎవరు కావాని? అతను కవితే తన ప్రాణవాయువన్నాడు. కవిత కోసమే బతికాడు. కవిత కోసమే ప్రాణాలిచ్చాడు. కవితా ప్రాణవాయువు అలిశెట్టి. కుటుంబం కుటుంబ పోషణార్దం ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకున్నప్పటికీ తాను బతకడానికి కవిత్వాన్నే ఆహరంగా తీసుకుని ఆ కవిత్వాకలికే ఆహారమైన వ్యక్తి అలిశెట్టి.

వాస్తవానికి అప్పుడు..,ఇప్పుడు..,ఎప్పుడైనా అలిశెట్టి గురించి మాట్లాడుకోవడమంటే అన్నపానాధులెరుగని అక్షరం గురించి మాట్లాడుకోవడం..,కెమెరా కన్ను...కుంచె గన్ను...కవాతు పెన్ను గురించి మాట్లాడుకోవడమే. ఒక్కమాటలో చెప్పాంటే అలిశెట్టి తన కవితకు చెమట ధారపోసి రక్తాన్నద్దాడు. చివరికి తన కుంచెకు అదీ సరిపోక తన ప్రాణాన్నే ఆ కవితకు ధారపోసి కవిత్వమె తనకు ఊపిరని తేలియజేసి మనల్ని ఆశ్చర్యంలొ ముంచెత్తిన మొడి ఘటం అలిశెట్టి. సగటు మనిషిని ఊపిరాడనీక చేస్తున్న సంఘాన్ని..,మాయమారి టక్కుటమారపు గారడీ విద్యలో ఆరితేరిన ఈ సమాజాన్ని తన కవితతో తూర్పారబట్టి మనకు అక్షరాయుధాన్నిచ్చాడు. అలిశెట్టిని తెలుగు సాహిత్యం ఆలస్యంగా గుర్తించొచ్చు..,అలిశెట్టి ప్రస్తుతం మన మధ్యలో లేకపోవచ్చు కానీ నాలుగు దశాబ్దాలుగా గోడల మీద కొటేషన్లయి..,ఉపన్యాసాల్లో అమృతవాక్కులుగా..,ఎక్కడో సెటైరుగా..,ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి నాలుకపైన కదనరంగానికి కవాతు నేర్పుతున్న పద్యమై సజీవంగానే ఉన్నాడు. మరచిపోవడానికి అవి మూమూలు కవితలా?..హృదయం పోటెత్తి పల్లవించి నిప్పులో కాలని నీటిలో తేలని నిఖార్సయిన ప్రజాకవి కవితలవి.

Dr Chintam Praveen on alisetti Prbhakar's poetry

1974లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో వచ్చిన 'పరిష్కారం' కవిత మొదుకుని 1992లో అచ్చయిన 'సిటీలైఫ్‌'వరకు రెండు దశాబ్దాలు అలిశెట్టికి అక్షరాలే ఆప్తమిత్రులయ్యాయి. 1993లో తాను చనిపోయేనాటి చివరిక్షణం వరకూ తన అక్షరాలను అగ్నికణమై మండిరచాడు అలిశెట్టి.ఎర్రపావురాలు(1978),చురకలు,మంటల జెండాలు (1979),రక్తరేఖ(1985),ఎన్నికల ఎండమావి(1989),సంక్షోభ గీతం(1990),సిటీలైఫ్‌(1992).అలిశెట్టి కుంచె నుండి వెలువడి అచ్చయిన కవితా సంకలనాలు.

అలిశెట్టి కవిత్వంలో ఏముంది? అతని కవిత్వం ఏం చెబుతున్నది?అని వివేచిస్తే...ఏవో కొన్ని అంశాలను కవిత్వీకరించి కొన్నింటిని పక్కన పెట్టాడని చెప్పడానికి లేదు. నిజానికి నాలుగు తూకపు రాళ్ళతో అలిశెట్టి కవిత్వాన్ని అంచనా వేయడం కుదరదు. కులం,మతం,ప్రాంతం,పేదరికం,ప్రపంచీకరణ,వ్యాపార సంస్కృతి.,ఆడ,మగా, సంఘం,వ్యక్తిత్వాలు, ప్రెస్సు, పాలిటిక్సు,ఉద్యమాలు,కవుల రాజకీయాలు, గుంపులు కట్టడాలు,వర్సిటీ,కుటుంబం, పల్లొ,పట్టణాలు,మెట్రో,కాస్మోపాలిటన్‌ సంస్కృతి... ఒక్కటేమిటీ అలిశెట్టి పెన్నుగన్ను టార్గెటు నుండి తప్పించుకున్న అంశం ఒక్కటీ కనిపించదు. అంతలా సామాజిక,సాంస్కృతిక,ఆర్దిక,చారిత్రక,సమకాలీన సమాజం పట్ల ఒక అంచనా,అవగాహన ఉన్న వ్యక్తి అలిశెట్టి.

అలిశెట్టి కవిత్వాన్ని గురించి చెబుతున్న క్రమంలో ఆయన కవితల్లో ఏదో ఒక్క కవితని కోట్ చేయడం కష్టమైన పని. ఎదుకంటే కవులకే కోచింగ్ ఇచ్చిన కోత్"ఇంగ్ కవితలు అలిశెట్టివి. తెలుగు కవిత్వంలో తనదైన టెక్నిక్ వాక్యాలతో మనందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసి నాలుగు దశాభ్దాలు మొదలుకుని నేటి వరకు ఆయన కవిత ఎక్కడో ఒకచోట నిత్యం కోట్ అవుతూనే ఉన్నది.తెలంగాణకు సంబంధించిన కవుల్లో ఇంతగా కోట్ అయిన కవిత్వం మరోకటి లేదు.

''పడుకుని ఉన్నా
గుండె
గడియారమౌతుంది
ఒక్కొక్కప్పుడు
నిద్రపట్టనివ్వని
అలారమవుతుంది''అంటారు అలిశెట్టి ఒక కవితలో_

నిజంగా అలిశెట్టి కవిత్వాన్ని ఆయనకే అన్వయిస్తే ...

''అలిశెట్టి ఒక్క కవితను తడిమినా చాలు
గుండె
గడియారమవుతుంది
భద్రజీవితానిక్కూడా
నిద్రపట్టనివ్వని
అలారమవుతుంది''... అంతటి శక్తివంతమైన కవిత్వం అలిశెట్టిది.

చాలామంది కవు అలిశెట్టి అంటే..,అతని కవిత్వం అంటే నేటికీ హడలిచచ్చేంతగా పదునైన కవితలల్లాడు. కుకవులు..,సుఖ అకవులు చెలామణీ అవుతున్న చోట తెలుగునేలలో ఇలాంటి ముందూ వెనకా ఎవరూ లేని ముక్కుసూటి కవి పట్ల సాహిత్యరంగం తీవ్ర నిర్లక్ష్యాన్ని వహించింది. ప్రజాకవిగా నీరాజనాలు అందుకోవాల్సిన కవిని అల్లంత దూరంలోనే నిలబెట్టింది తెలుగు సాహిత్య సమాజం...అయితే ఈ లోటును పూడ్చుతూ ఆయన కవిత్వాన్ని అజరామరం చేస్తూ అలిశెట్టి మిత్రులు 2013లో ''అలిశెట్టి ప్రభాకర్‌ కవిత''ను ప్రచురించి కవిత్వానికి ప్రాణాలిచ్చిన ప్రజాకవికి ఊపిరిపోసారు.


డా.చింతం ప్రవీణ్‌ కుమార్‌
9346 886 143

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dr Chintam praveen Kumar writes on the merits of Alisetti Prabhakar's Telugu poetry.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X