బోయ జంగయ్య లేరు, సాహిత్యం ఉంటుంది
తెలుగు దళిత సాహిత్యంలో ముందుచూపుతో రచనలు చేసిన బోయ జంగయ్య ఇక లేరని అనుకోవడానికి మనసుకు కష్టంగానే ఉంటుంది. దళిత సాహిత్యం అనే పదం తెలుగు సాహిత్యంలో వాడుకలోకి రాక ముందే ఆయన దళిత రచనలు చేశారు. అయితే, తాను దళితవాదినని, తనను అలాగే గుర్తించాలని ఆయన పట్టుబట్టలేదు. ఆయన దళితులకు అవసరమేమిటో, వాళ్లు సమాజంలో ఎలా దగాకు గురవుతున్నారో తన రచనల చెబుతూ వెళ్లారు.
ఆయన జాతర, జగడం నవలలు తెలుగు సాహిత్యంలో విశిష్టమైనవి. ఈ రెండు నవలలు కూడా బోయ జంగయ్య తప్ప మరొకరు రాయలేరని చెప్పడానికి సందేహం అక్కరలేదు. ఆయన విరివిగా కథలు రాశారు. ఆ కథల్లో చీమలు, బొమ్మలు వస్తు రీత్యానే కాకుండా అద్భుతమైన శిల్పం దృష్ట్యా కూడా ఎన్నదగినవి.
ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. చివరకు ఈ లోకాన్ని కాదని వెళ్లిపోయారు. జాతర నవల అప్పట్లో విశేషమైన ఖ్యాతిని ఆర్జించింది. ఆ నవలను విమర్శకులు దళిత నవలల కింద చేరుస్తూ వచ్చారు. కానీ, అది స్త్రీవాద నవల. స్త్రీవాదం తెలుగు సమాజంలో వెళ్లూనుకోక ముందే ఆయన ఆ నవలలో లైంగిక దోపిడీ గురించి మాట్లాడారు. స్త్రీలు అదనంగా అనుభవిస్తున్న వివక్షను, పొందుతున్న అన్యాయాన్ని ఆ నవలలో ఆయన చిత్రీకరించారు. జగడం నవల తెలంగాణ సామాజిక పరిణామ క్రమాన్ని దళిత కోణంలో ఆవిష్కరిస్తుంది.

బోయ జంగయ్య రచనల విశిష్టతను చెప్పాలంటే, అందరూ ఎంచుకున్న మార్గాన్ని కాకుండా తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. విప్లవ సాహిత్యం ఉర్రూతలూగిస్తున్న సమయంలో కూడా తనదైన ప్రత్యేకమైన వస్తువును మాత్రమే స్పర్శిస్తూ వచ్చారు. ఆయన హేతువాది, మార్క్సిస్టు కూడా. తన రచనల్లో ఆయన శాస్త్రీయ దృక్పథాన్ని దళితులు అలవరుచుకుని, బ్రాహ్మణ సమాజం మోపిన అనవసర సంప్రదాయాలను, ఆచారాలను వదిలేయాలని ఆయన చెప్పారు.
పూజాదికాలను, వాటి పేర జరుగుతున్న అన్యాయాలను, అవి దళితులను విజ్ఞానానికి మాత్రమే కాకుండా విద్యకు కూడా దూరం చేస్తున్న వైనాన్ని ఆయన చిత్రీకరిస్తూ వచ్చారు. జాతర నవలలో మాత్రమే కాదు, ఆయన కథలన్నింటిలోనూ అది కనిపిస్తుంది. శాస్త్రీయ దృక్పథం పట్ల చైతన్యం కలిగించడం ఆయన రచనల అంతస్సూత్రం.
మరోటి కూడా ఆయన విషయంలో చెప్పుకోవాలి. ఆయన ఎవరినీ తన రచనల్లో తూలనాడలేదు. కానీ బ్రాహ్మణీయ విలువలు సమాజాన్ని అంధకారంలోకి నెడుతున్న విషయాన్ని ఆయన రచనల్లో నిర్భయంగా, నిర్భీతిగా వ్యక్తం చేశారు. బొమ్మలు నవలల్లో దళితులు సృష్టించిన దేవుడు బ్రాహ్మణులపరమైన, అదో వ్యాపారంగా పరిణామం చెందిన క్రమాన్ని ఆయన అద్భుతంగా చిత్రించారు. దళితుల సృష్టిని బ్రాహ్మణీయ సమాజం తన సొంతం చేసుకుని, దాని ఫలాలను దళితులకు ఎలా దూరం చేస్తుందో ఈ కథలో ఆయన అద్భుతమైన శిల్పనైపుణ్యంతో చెప్పారు.
బోయ జంగయ్య రచనల్లో మరో గుణం ఏమిటంటే, క్లుప్తత. ఆ క్లుప్తత సూటిగా రచయిత నిర్దేశించిన లక్ష్యం వైపు పాఠకులు నడపడానికి ఉపయోగపడేది. ఆయన రచనల్లో ప్రతిదీ కథను ముందుకు నడవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అనవసరమైనదేదీ ఉండదు. దళిత రచయితలకే కాదు, కథా రచయితలందరికీ ఈ విషయంలో తప్పకుండా బోయ జంగయ్య రచనలు మార్గనిర్దేశం చేస్తాయి.
తన రచనల్లో ఏది వ్యక్తం చేయాలో, దాన్నే బోయ జంగయ్య వ్యక్తం చేశారు. సాహిత్యంలో విరివిగా ప్రచారంలో ఉన్న మార్గం వైపు ఆయన వెళ్లిన దాఖలాలు లేవు. అందుకే బోయ జంగయ్య అచ్చమైన తెలుగు కథారచయిత. అనుసరించదగిన రచయిత కూడా. ఆయనకు నివాళులు అర్పించడమంటే ఆయన విశ్వాసాలను ముందుకు నడిపించడమే...
- కాసుల ప్రతాపరెడ్డి












Click it and Unblock the Notifications