ఉద్యమంలో సాహిత్యం ధూంధాం

అక్షరాలు కరవాలాలుగా మారి యుద్ధం చేయటం కావ్యాల్లోనే ఉంటాయంటారు. ఈ జనకావ్యాలే, ఈ ప్రజల కలాలే సమాజాలను మేల్కొలిపి కదిలిస్తాయి. సమాజంలో సుఖానికైనా శాంతికైనా కావ్యాలే. సమాజంలో సుస్థిరతకు, సమత్వానికి పునాదులు మహోన్నత రచనల్లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఒక యుద్ధానికి శంఖారావం పూరించగలిగిన మహత్తరశక్తి సాహిత్యానికే ఉంది. అందుకే ఒక ఉత్తమ కావ్యం కొన్ని కాలాలపాటు సమాజాన్ని ఏ ఆటంకం లేకుండా నడిపించగలుగుతుంది. సమాజాన్ని ముందుకు నడిపిస్తూ జన జాగృతగీతాలు ఆలపించగలశక్తి మాత్రమే కాదు. కలాన్ని వెనకకు మళ్లించగల శక్తికూడా రచనలకుంటుంది. అందుకే కళకళకోసమేనన్నవాదన, సమస్త కళలు సాహిత్యం ప్రజల కోసమేనన్న దారులు నిత్యం ఉంటాయి.
అయితే సాహిత్యానికి ఎంతో గొప్పతనముందని రాయటం, కవితలల్లటం, పాటలు కట్టటం, సుదీర్ఘకావ్యాలు అల్లుకుని అందులోనే సేదతీరి పరవశించి పులకరించటం జీవితమయ్యింది. కానీ కవుల అక్షరాలే కదనరంగాలుగా మారినప్పుడు, ఆ పగిలిన కవుల కంఠాల నుంచే ఉద్యమ జేగంటలు మోగుతున్న సందర్భాన్ని చూసే అవకాశం కలగటం కంటే ఉన్నతమైనది మరొకటి ఉండదనుకుంటా. చైనా సాంస్కృతిక విముక్తి ప్రదాత తాసన్, అమ్మ నవలతో భూగోళాన్ని ఎర్రబరిచిన మాక్సిమ్‌గోర్కీ, భారత స్వాతంత్య్ర సమరాంగణాన్ని కదిలించిన బకించంద్రచటర్జీ, రవీంద్రనాథఠాగూర్, భగత్సింగ్ రాతలు, స్వామి వివేకానందుని మేల్కొలుపు మాటలు, గరిమెళ్ల సుబ్బారావు, పాణిగ్రాహి, చెరబండ రాజుల పాటలు, మైఖేల్ జాక్సన్ నృత్యాలు, ట్రేసీచాప్‌మెన్ నల్లగీతాలు, క్యూబాలో ఫెడరల్ కాస్ట్రో శక్తివంతమైన కంఠాన్ని చీల్చుకొచ్చిన ధైర్య వచనాలు, చేగువేరా డైరీలు, జ్యూలియస్ ఫ్యూజిక్ రక్తాక్షరాలతో కదిలిన కదలికల్ని, మారిన వ్యవస్థలను చదువుకున్నాం. కానీ కవులు తమ కాలంలో రాసిన అక్షరాలు తమ ముందే ఒక విముక్తి గీతాలై నిలిచి ఒక ఆత్మగౌర ఢమరుకాతో యుద్ధం చేస్తుంటే ఆ పొందే అనుభూతి అంతా ఇంతా కాదు.
ఎన్నో అస్తిత్వ ఉద్యమాల నుంచి ఎగిసిపడుతున్న కావ్యాలను చదువుతున్నాం. తాము అనుభవిస్తున్న స్థితినే అక్షరాలుగా మలిచితే అది విస్తృత పరిధిగల సమాజముఖచిత్రం అవుతుంది. గత 60 సంవత్సరాల సాహిత్య సాంస్కృతిక నేపథ్యంగా కొనసాగుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు కన్న కలలన్నీ తమ కళ్లముందే పెనుగులాటలై, ఉద్యమాలై, పోరు ఘర్షణలై, అస్తిత్వ ఉద్యమ విముక్తి గీతికలై ఎగిశాయి. కవులు, రచయితలు రాసినవి అప్పటికప్పుడు కళ్లముందే కార్యరూపాలు దాల్చి కదలిపోయి అవి ధూంధాంలుగా ఎగిసి పడుతుంటే అంతకంటే కవిలోకానికి కావల్సింది ఇంకేముంటుంది. కావ్యాలకు ఇంతకంటే ఫలసిద్ధి ఏముంటుంది. రాసిన కవిత్వ పంక్తులు అప్పటికప్పుడు మొలకెత్తి కళ్లముందే కాయలు కాసి అవి ఉద్యమ పండ్లుగా పండి పోరాటాలుగా మాగి సమస్త ప్రజలకు పీల్చే గాలి కావటం కంటే మించిన సందర్భం మరొకటి ఉండదు. ఈ అద్భుత అవకాశాన్ని తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు అనుభవించారు. ఈ భూగోళం మీద సజీవ కవిత్వాన్ని అందించగలిగారు. సృజనశీల కావ్యాలను రచించారు. ప్రజలను కదిలించగల మౌఖిక సాహిత్య ముఖచిత్రాన్ని అందించగలిగారు. మార్కెట్ సమాజ ముఖచిత్రాలను చీల్చివేసి చలనశీల రచనలను ప్రపంచానికి అందించగలిగారు. ఈ సాంస్కృతిక సందర్భం మహత్తర పాఠంగా మారింది. తెలంగాణ నేలంతా సాహిత్య సాంస్కృతిక సైన్యంతో నిండినట్లుగా అయ్యింది.
సాహిత్యం ఏం చేస్తుందనే వాళ్లకు, కవుల కావ్యాలు ఏం చేస్తాయి. ఏం కదిలించగలుగుతాయని మాట్లాడే వారి వాదనలు తెలంగాణ కవులు రచయితలు పటాపంచలు చేయగలిగారు. దోపిడీ నోళ్లను మూయించగలిగారు. దగాకోరు ఆక్రమణదారుల ఆధిపత్య సంస్కృతిని బైటపెట్టగలిగారు. ఆధిపత్య భావజాలంపై కవులు, రచయితలు అక్షరాయుధాలు ఎక్కుపెట్టటమే కాదు, అందుకు ప్రతిస్పందనగా ఆధిపత్య గోడలుకూలటం కూడా తెలంగాణ కవులు కళ్లారా చూడగలిగారు. తమ ప్రతిమాటకు, పాటకు, పాటల పల్లవులకు తెలంగాణ నేలంతా ఎర్రపడటాన్ని తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగం చూడగలిగింది.
నిత్యం సమాజంలో ఎత్తి చూపుతున్న సామాజిక అంశాలన్నింటికీ వెంటనే పరిష్కారం లభించదు. కవులు స్వేచ్ఛాప్రియులు కాబట్టి భవబంధాలు వదిలి సంచరిస్తారు కాబట్టి బంధనాలను తెంచుకుంటూనే పోతారు. కవులకు మొత్తం సామాజిక ప్రయోజనమే వస్తువుగా ఉంటుందికానీ వ్యక్తిగత వస్తుగత సంపదగత ఆశలు ఆలోచనలూ ఉండవు. వ్యక్తి ఆలోచిత రచనలుంటాయి. కానీ అవి సమాజాన్ని ప్రభావితం చేయలేవు. తెలంగాణ కవులు సమాజహితాన్ని కోరుకున్నవారు. అందుకే తన నేలపై ఆధిపత్యాన్ని సాంస్కృతికంగా తిప్పికొట్టగలిగారు. ఒక ప్రాంతంపై మరోప్రాంతం ఆధిపత్యం అన్నది చెదపట్టటంలాంటిదే. కొన్ని ఆధిపత్యాలన్నవి అంత ప్రమాదకరంగా బయటకు కనిపించవు. కానీ అవి మనకాళ్లకిందనున్న నేలను కబ్జాచేసి సొంత నేలపై పరాయివాణ్ణి చేయగలవు. దీన్ని కనిపెట్టి చెప్పి ప్రజలను ఒప్పించగశక్తి సామర్థ్యాలు ఒక్క సాహిత్య సాంస్కృతిక రంగానికే ఉన్నాయి. ఈ రంగమే కోట్లాది మందిని ఐక్యం చేసి, నిలబెట్టగలదు. సరిగ్గా తెలంగాణ సాహిత్య సాంస్కృతికరంగం ఆ పని చేసింది. గళగర్జనలతో జడివాన కురిపించగలిగింది.
సమాజంలో ఏ మార్పయినా రాజకీయరంగం నుంచే జరుగుతుంది. రాజకీయపార్టీలు, ప్రజలను నడిపించే రాజకీయరంగం కూడా ఒక్కొక్కసారి విఫలమవుతుంది. కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీలకే మార్పు రావటం ఇష్టం ఉండకపోవచ్చును. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం విషయంలో కూడా ఇక్కడి రాష్ట్ర రాజకీయాలను నడిపించే ప్రధాన పార్టీలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష పక్కన నిలబడలేదు. ప్రజా సంఘాల ద్వారా సబ్బండవర్ణాలు కదిలాయి. ఆ సబ్బండ వర్ణాల కదిలకలకు ఒక దారిచూపే కిరణంలాగా సాహిత్య సాంస్కృతిక రంగం నిలబడిరది. సాహిత్య సాంస్కృతికరంగాలంటే రాజకీయ పార్టీల దిశానిర్ధేశం చేస్తే దాని వెనుక ఉండేవని చెబుతారు.
కానీ తెలంగాణ సమాజాన్ని ఏకం చేయటంలో రాజకీయపార్టీలకంటే ముందుగా సాహిత్య సాంస్కృతిక రంగం నిలబడిరది. ప్రతిపల్లె ఒక ధూంధాంగా మారిపోయింది. తెలంగాణ వీధులన్నీ ఉద్యమ గీతాలతో కిక్కిరిసిపోయాయి. తెలంగాణ వాకిళ్లన్నీ పోరు అక్షరాల ముగ్గులతో నిండిపోయాయి. తెలంగాణలో గడపగడప కదిలి .....లందుకునేందుకు ఈ పాటలే సన్నద్ధం చేశాయి. ఎక్కడో గుండెలోతుల్లో వున్న నూన్యతాభావాన్ని ఈ కవుల పదాలే బైటపెట్టి జనజాతర్లకు ముగ్గులు పోశాయి. తెలంగాణ కోసం తెగించిన యువతరానికి ఈ పాటలే దప్పిక తీర్చే చెలిమలయ్యాయి. ప్రాణత్యాగాలు చేసుకున్న వీరుల త్యాగాలను ఈ కవుల కలాలే వెలుగెత్తి చాటాయి. వేయిమంది తల్లుల గర్భశోకాన్ని, ఆ తల్లుల కన్నీళ్లను పోటెత్తిన నదులుగా మార్చి ఉద్యమ ప్రవాహ గీతాలుగా మలిచారు. ‘‘ఇది తెగదెంపుల సంగ్రామం తెగిస్తేనే తెలంగాణ సాధ్యమని'' కవులు తేల్చి చెప్పారు.
- జూలూరు గౌరీశంకర్
అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక












Click it and Unblock the Notifications