చిట్యాలకు వీచిన కల్లోనికుంట గాలి..
ప్రముఖ తెలంగాణ కవి, రచయిత ఏనుగు నరసింహా రెడ్డి స్వీయ విశ్లేషణ ద్వారా తన జీవిత ప్రయాణం గురించి వివరించారు.
సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై.. పద్యం, నాటకం, వ్యాసం, నవల, ఇలా ప్రతీ సాహిత్య ప్రక్రియతో ఆయన కరచాలనం కొనసాగింది. సాహితీ మూలాలను వెతుక్కుంటూ స్వీయ విశ్లేషణ ద్వారా తన జీవితపు నేపథ్యం గురించి వివరించారు నరసింహారెడ్డి.
*
ఏ గాలెటు వీస్తుందో.. ఎందుకలా వీస్తుందో చెప్పలేం.. ఈ గాలి వానల చోదక శక్తులేమిటో పట్టుకున్నట్లు భ్రమిస్తుంటాం కానీ నిజానికి నిజాల వెనుకున్న నియమాలు మనకు తెలియవు. నియమాల సృష్టి కారణమూ మనకు తెలియదు. కర్త అసలే తెలియదు.
అతడు ఎక్కడున్నాడో తెలియదు మనం ఎక్కడున్నామో తెలియదు. వాడు తెలుసంటాను, వీడు తెలుసంటాను నిజంగా నేనెవడినో ఇప్పటికీ నాకు తెలియదు.
*
అనంతగిరి కొండల్లో గలగలమన్న మా సీమతల్లి భాగ్యనగరాన్ని తనివితీరా ఆలింగనం చేసుకుని, మైలపడి నీలగరి జిల్లా చెరువుల్ని, కుంటల్ని చెక్కిలిగిలి పెట్టింది. అందుకు పులకించిన కుంటల్లో కల్లోనికుంట ఒకటి. ఆ కుంటను నమ్ముకున్న నలభై, యాభై రైతు కుటుంబాలు తమ ఊరిని కల్లోనికుంటగానే పిలుచుకున్నై. కుంట కింది నారెకరాల పొలమే ఆ మట్టిబిడ్డల జీవనాధారం.

పీఠభూమితో పాటు ఆ పల్లెను రాచరికం వీడి ఇరవై ఏళ్లయినా ఏ వైద్య సౌకర్యమూ ఆ పల్లెను తాకలేదు. మనుషుల నిష్క్రమణ ఎలా ఉంటుందో చెప్పడానికి తెలంగాణ జీవన దైన్యాన్ని విప్పడానికి మా నాన్న కృష్ణారెడ్డి చనిపోయిన విధానం ఓ మచ్చుతునక. అది మచ్చు మాత్రమే, రాశి చాలా ఉందని వేరే చెప్పనవసరం లేదు.
ఏప్రిల్6,1968లో నేను పుట్టిన తర్వాత మూడేళ్లకు మా నాన్న టీబీతో బాధపడుతూ చనిపోయాడు. నిజానికి టీబీ ఏమంత పెద్ద రోగం కాదు. కానీ ఆనాటి వైద్యం, ఆర్థిక లేమిని సూచిస్తున్న వాస్తవం. ఆయన బతికిన నలభై ఏండ్లు చెరువు, పొలం, చెల్క, ఇల్లు తప్ప మూడో విషయం తెలియదు. వైద్యం కోసం కేవలం రెండుసార్లు నల్లగొండ గొల్లగూడెం దవాఖానా చూసిండు. కరువు విలయ తాండవం చేసిన ఒక దశలో రిక్షా తొక్కడానికి మద్రాసుపోయి విఫలమై వచ్చిండు, కొన్నిరోజులు కృష్ణా జిల్లా పెనమలూరు పోయి అక్కడ ఉండలేక తిరిగొచ్చిండు.
నన్ను ఆయన బాగానే చూసి ఉంటడు. నేను మాత్రం ఆయన్ను గుర్తుండేట్లు చూడలేకపోయాను.
'కాలానికి ఆరబెట్టిన
నీటిరంగుల వర్ణచిత్రంలా
నాన్న నాకొక అస్పష్ట జ్ఞాపకం'
పక్కనే ఉన్న మూసీ, వర్షాలు బాగా వచ్చినప్పుడు కల్లోనికుంటను నింపితే ఆ ఊరికి బతుకమ్మ. కొత్తపాత సందులో కాపుల ఇండ్లలో కూడా తిండిగింజలు నిండుకున్న రోజులు చాలానే ఉండేవి. వంటలు సరిగ్గా చేసీ చేయక, ధాన్యం అరకొరలు నాన్న మరిచిపోవడానికి ఆ పల్లెలో బోనాలు నిజమైన పండుగను తెచ్చేవి. కట్టమైసమ్మకు ఎన్నారం మారెమ్మకు పెట్టినట్లు భ్రమించి ఊరు కల్లు కూరలతో మైమరిచేది.
నాన్న చనిపోయినట్లే కుంట ఎండిపోయింది. పాలివాళ్ల నడుమ కూలీ చేయలేని మా అమ్మ లక్షమమ్మకు బతుకుదెరువుకు కొత్త ప్రాంతాలను అన్వేషించక తప్పలేదు. నాన్న చనిపోయిండు కాబట్టి అక్క పెండ్లి కష్టమవుతుందని భావించి 11ఏండ్లకే అక్క పెండ్లి చేసింది. 1970లలో పరిస్థితులు జరిపించిన బాల్య వివాహమది.
నన్ను చంకలో వేసుకుని మా పెద్దనాన్న లింగారెడ్డి కుటుంబం జాడ పట్టుకుని అప్పటికీ మహానగరం కాని భాగ్యనగరంలోని తార్నాకకు వచ్చింది. నన్ను గంపకింద కమ్మితే తప్ప అమ్మ కూలీకి పోలేదు. నేను అమ్మను వదిలే పరిస్థితి లేదు. నన్ను నాకన్నా ఒక్కరోజే పెద్దదైన అండాలక్కను కలిపి నిర్మాణంలో ఉన్న ఒక భవనంలోకి ఆడుకొమ్మని తోలి పనికి వెళ్లింది. వెళ్లేముందు తను వెళ్లాక కొడుకు ఎలా వెతుక్కుంటాడో చూద్దామని గోడ చాటుకు దాక్కొని చూసింది.
ఒకటీ రెండు నిమిషాల్లోనే అమ్మ గుర్తొచ్చి నేను బయటికి పరుగెత్తుకొచ్చి చూసాను. అమ్మ కనిపించకపోయేసరికి గుండెలవిసిపోయేలా ఏడ్చానట. పక్కనే దాక్కున్న అమ్మ ఎదురొచ్చి కన్నీళ్ల పర్యంతమై, నా కొడుకు ఆగమైతడని దు:ఖించి మళ్లీ కల్లోనికుంటకు తిరిగి వచ్చింది.
జీవితం తన ప్రశ్నను తిరిగి సంధించింది? ఎలా బ్రతుకుతావు? పాలోల్ల కూలీతోనా? పక్క ఊరికి వలసబాటలోనా? మా మేనత్త భర్త కందాటి రామచంద్రారెడ్డి చెప్పాడు 'చెల్లే, నువ్వీ వూళ్లే బతకలేవు. చిట్యాలకు పోయి ఏ మిల్లులనన్నా జబ్బ మోసి నీ కొడుకును సాదుకో'
ఒక శీతాకాలపు ఎడ్లబండిలో నేనూ, అమ్మ, అమ్మమ్మ సాయమ్మ కల్లోనికుంటను వీడాం. నాకు బాగా గుర్తుంది! రెండు మూడు వంటగిన్నెలు, కొన్ని గింజలతో పాటు ఆముదం దీపం మాతో పాటూ చిట్యాలకు వచ్చింది. పొద్దెక్కే వేళకు కక్కిరేను, పిల్లిగూడెం, వనిపాకల మీదుగా చిట్యాల చేరాం. రానైతే వచ్చాం కానీ ఎవరింట్ల దిగాలో ముందే మాట్లాడుకున్నట్లు లేదు. 'పందోంకోట'లో ముఖపరిచయం ఉన్న వాళ్లింట్లో దిగి ఆరోజుకు అక్కడే ఉన్నాం. మరుసటిరోజు సంజీవనగర్ లో 'బొబ్బిలి మల్లమ్మ' వాళ్ల ఇంట్లో కిరాయికి చేరాం. ఒక గది పూరిల్లు. రూ.5/-నెలసరి అద్దె. బహుషా అది 1972 అనుకుంటాను.
సామమ్మ మా అమ్మమ్మ. పేదరికం నిజమే కానీ ప్రేమలో ఆమె కోటాను కోటీశ్వరురాలు. నన్ను కళ్లలో పెట్టుకుని చూసేది. బడికి పంపితే ఆగమై పోతనేమోనని ఆమె భయం.'ఒక్క మొలక, వీన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలనేది'. 'తండ్రిలేని పిలగాడు అని నా మీద జాలి చూపేది. బడి నుంచి రావడం కాస్త ఆలస్యమైతే ఆమె నన్ను వెతుకుతూ బడికి వచ్చేది. అట్లా వచ్చినందుకు నేను ఎన్నోసార్లు గట్టిగట్టిగా తిట్టాను.నువ్వు బడిదాకా రావద్దని అరిచేవాడిని. ఇవేవి ఆమెకు పట్టేవి కాదు, నా క్షేమం కోసం నిరంతరం ఆమె ఓ తపస్సే చేస్తూ ఉండేది.

ఆమె ఎంతో కష్టజీవి. బిడ్డకు ఆసరాగా ఉండాలని వృద్దాప్యంలోను పొలం పనులకు కూలీకి పోయేది. ఒక్కనాడు నాకా పెట్టేది కాదు. ఒకరోజు రోజంతా పొలంలో నాని కలుపు కలిసి వస్తుంటే ఆమె అరికాలికి తుమ్మ ముల్లు గుచ్చుకుని మిగాలు పైకి పొడుచుకొచ్చింది. పక్కనే నడుస్తున్న మా అమ్మ ప్రాణం బిగబట్టుకుని ఆ ముల్లు పీకి పడేసింది. అమ్మమ్మ మీగాలు మీద రక్తం ఫౌంటెన్ లా రెండు నిమిషాల పాటు విరజిమ్మింది. అంత దారుణమైన గాయమైనా ఆమె కేవలం ఒక్కరోజు మాత్రమే ఖాళీగా ఉంది. మరుసటిరోజు మళ్లీ పనికి పోయింది. ఆమె ఎంత దూరమైనా నడిచేపోయేది.
'దిగుడు బావుల నీళ్లు
చెట్ల కొమ్మల పండ్లు
సుడిగాలి ఆ స్నేహం
తొలి సంధ్య మొదలు
మలిసంధ్య గమనం
అమ్మమ్మతో నేను కల్లోనికుంట'
*
చిట్యాల ఒక కొత్త లోకం. నాకు అమ్మకూ. ఆమె కూలీ కోసం రోజంతా పొలాల్లో, నేను చిన్నబడిలో. ఒక్క పలక కొనిస్తే ఏడాది దాకా బేఫికర్ చదువుకుంటడని ఎవరో అన్నారట! పొద్దటూరి వాళ్ల దుకాణంల ఒక స్లేటు పలక( అలానే అనేవాళ్లం అప్పుడు) కొనిచ్చి బడిలో కూర్చోబెట్టి వచ్చింది. సాయంత్రానికల్లా పలకను నాలుగైదు ముక్కలు చేసుకుని ఇంటికొచ్చాను. ఏమనలేక మరుసటిరోజు మరొక పలక కొనిచ్చింది. దాన్ని రెండు మూడు రోజుల కంటే ఎక్కువ కాపాడుకోలేకపోయాను. ఈసారి పలకముక్కలతోనే రాసుకొమ్మంది. మళ్లీ నాలుగురోజులకు బందోబస్తు రేకుపలక కొనిచ్చింది.
'అఆలు నేర్చించడానికి ముందు
తంగేడు చెట్టుకు వేసిన
మొగ్గంత స్వల్పమని
జీవితం గురించిన పాఠాలు చెప్పింది పలక
కొనిచ్చిన కొత్త పలకను
రెండురోజుల్లోనే ముక్కలు చేసానని
మొట్టెకాయలేసింది కానీ
పలక ముక్కలు చెప్పిన కథలు
అప్పుడు నాకు లాగానే
అమ్మకూ అర్థంకాలేదు
ఎంతకూ తరగిపోని గుండె ధైర్యాన్ని పెంచుకోవాలని చెప్పలేక
అమ్మ నాకు రేకుపలక కొనిచ్చింది
రజను రాలిపోతే నల్లబల్లకులాగానే
బొగ్గాకు పసరు రాసుకోవచ్చని
పట్టీలూడిపోయినా
రేకు మీద ఎక్కాలు దిద్దుకోవచ్చని
పలక గురించి అనుకుని
జీవితం గురించిన పాఠాలు చెప్పింది'
అలా పలక కాపీయై, పుస్తకమై, పాటై, కవిత్వమై, అనువాదమై, నన్నిలా ఆలింగనం చేసుకుంది. నాతో తొలి అక్షరాలు దిద్దించిన రాణి టీచర్, సోమిరెడ్డి సార్ నా కవిత్వం మీద పరిమళాన్ని అద్దుతారు.
'ఇప్పుడొక పలక దొరికితే బాగుండు
చెరిపి రాయాల్సిన జీవితపు పాఠాలు
చాలా గుర్తొస్తున్నాయి'
*
ఎమర్జెన్సీ తర్వాత అనుకుంటాను 1966-77లలో చిట్యాలలో ఇందిరాగాంధీ టాపులేని జీపులో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ రోడ్ షో నిర్వహించింది. అంత పాతకాలంలోను ఇందిరాగాంధీ పర్యటనకు చిట్యాలలో రోడ్లకు ఇరువైపులా బారుకేడ్లు కట్టారు. బాల్యంలో ఇందిరను చూడడం మరిచిపోలేని అనుభూతి.
పాఠశాల విద్య నన్ను బాగా వడిపెట్టింది. చిట్యాల మా ఊరు కాదనే ధ్యాసే లేదు. ఏ రకమైన నిమ్నతకు అవకాశం లేని విధంగా చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండేది. దుర్గయ్య సార్, అమరేందర్ సార్, దామోదర్ రెడ్డి సార్ నా మనోఫలకం మీద చెదరని ముద్ర వేశారు. విఠల్ సార్, మధుసూధన్ రావు మమ్మల్ని ఎంతో ఆకర్షించారు. గోపాల్ రెడ్డి సార్ ఒకరోజు క్లాస్ రూమ్ లో మహాప్రస్థానం గురించి గొప్పగా చెప్పాడు. నేను 'అది ఎంత లావుంటుంది సార్' అని అడిగాను. మరుసటిరోజు ఆయన మహాప్రస్థానం పుస్తకం తెచ్చి నాకు చదవమని ఇచ్చాడు. దాని సైజుకు ఆశ్చర్యపోయి, ఆనందపడి రెండు మూడుసార్లు చదివి ఇచ్చాను.
నా ఆసక్తి గమనించి 'మన స్కూల్ లో ఒక లైబ్రరీ మీరే ఎవరైనా నడపండి' అనడంతో.. స్కూల్‌లో ఒక లైబ్రరీ కూడా ఉందని తెలిసి వచ్చింది. మా స్కూల్ లైబ్రరీలోనే రష్యన్ అనువాదాలు, బెంగాలీ అనువాదాలు చాలా చదివాను. కుప్రీన్, టాల్ స్టాయ్, తుర్గనేవ్ నాకు అప్పుడు తొలిసారిగా పరిచయమయ్యారు. ఆరోజుల్లో చదివిన నవలల్లో యమకూపం(యామా) నన్ను విపరీతంగా ఆకర్షించింది.
ఏనుగు చంద్రారెడ్డి సారా ఛందస్సు చెప్పినప్పుడు చాలా ఆసక్తి పుట్టింది. మరుసటిరోజే ఒక పద్యం రాసుకుని పోయి చూపించాను. ఆయన ఆశ్చర్యపోయి ఆనందపడ్డాడు.'కొన్ని తప్పులున్నాయి గానీ నువ్వు ఛందస్సులో వేలుపెట్టావురా' అన్నాడు. గొప్ప కవినైనట్లు పొంగిపోయాను.
మా క్లాసు అమ్మాయిలు మాధవి, రాజేశ్వరి, సబిత తరచూ నవలలు చదువుతుండేవారు. నవలా రచయితల్ని బాగా పొగుడుతుండేవారు. కిరణ్ కుమార్ అనే మిత్రుడు 'ANR నువ్వు నవల రాయొచ్చు కదా!' అన్నాడు. నేను పదవతరగతిలో ఉన్నప్పుడు అది ప్రేరణగా ఒక బాలల మాసపత్రిక పెట్టిన బాలల నవల పోటీకి 'ఊరు మారింది' అనే నవల రాసి పోటీకి పంపించాను. 120 పేజీలున్న ఆ నవల తన స్వంతర రచనేనని హెడ్ మాస్టర్ సర్టిఫికెట్ కోసం మాధరావు సార్ దగ్గరికి పోయినప్పుడు ఆయన ఆనందంతో పులకించిపోయాడు. ఆ నవలకి బహుమతి రాలేదన్నది వేరే విషయం.
కానీ మా హెచ్ఎం గారి ప్రోత్సాహం చూసి మరొక నవల రాసి మా క్లాసులో చూపించాను. దానిపేరు 'సినీయాక్టర్ని'. ఈ రెండూ ఫక్తు సినిమా ప్రభావంతో రాసినవే అయినప్పటికీ రాయగలిగే శక్తి, భాషపై నాకున్న పట్టు అందరికీ తెలిసిపోయింది. ఇది గమనించి 'పాఠశాల' అనే విద్యార్థి మ్యాగజైనుకు వ్యాసం రాయమని మా టీచర్లు ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో శ్రీనాథ మహాకవిపై నేను రాసిన వ్యాసానికి మొదటి బహుమతి వచ్చింది. అలా నా మొదటి రచన 1983లో అచ్చయింది. నేను ఈ ఉత్సాహంలో ఉండగా.. మా హైస్కూల్ లో గోడపత్రిక చాలా సంచికలు తీసుకొచ్చాం.
తొమ్మది, పది తరగతుల్లో నేను చాలా యాక్టివ్ అయిపోయాను, అన్నిఆటలలో, వ్యాస రచనలో, వక్తృత్వ పోటీలలో పాల్గొనేవాడిని. చాలా బహుమతులు వచ్చేవి. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు పాఠశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యాను. 10వ తరగతిలో అధ్యక్షుడినయ్యాను. ఒకసారి మర్రి చెన్నారెడ్డి మా చిట్యాలకు వచ్చినప్పుడు ఆయనకు నా చేత పూలమాల వేయించిన గుర్తు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీలు తీసినట్టు గుర్తు.
చూస్తుండగానే టెంత్ అయిపోయింది. ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకపోయినా రోజు కలవలేమన్న నిజం తెలిసి కళ్లకు నీళ్లొచ్చాయి. ఆడిన ఆటలు, పాడిన పాటలు, నిలిచిపోయిన వ్యాసరచనలు, గెలిచిన వక్తృత్వాలు కళ్ళముందు కదలాయి.
'కాలం ముందుకు గడిచినప్పుడు
ఖచ్చితమైన వీడ్కోలు తప్పనప్పుడు
పరీక్షల చివరి రోజు
పట్టపగ్గాల్లేని విశ్రాంతితోనూ
ఊహాతీతమైన శూన్యంలో
బరువైన జ్ఞాపకాలతో
చిట్యాల నుండి చిత్రచిత్ర ప్రదేశాలకు
అంతుచిక్కని ఆకాశంలో ఊరపిచ్చుకలమై
లోతెరుగని సముద్రంలో చేపపిల్లలమై'
*
ఇంటర్ ఒక గందరగోళమే. 400/600 మార్కులు వచ్చాయి కాబట్టి ఎంపీసీయే చేయాలని శ్రేయాభిలాషుల పట్టు. SSCలోనే లెక్కల్లో రాత బాగుండి బయటపడ్డాం, మళ్లీ మ్యాథ్స్ జోలికి వెళ్ళొద్దని నా పట్టుదల. బైపీసీ చేసి, కొన్ని స్టేజీ నాటకాలు, ఏకపాత్రాభినయాలు, కవిత్వాలు చెప్పి ఇంటర్ పూర్తి చేసాను. ఇంటర్ లో ఉండగా ఆకాశవాణి ప్రభావం ఎక్కువై కవిత్వం ఒక ఛాయకు వచ్చింది. రామన్నపేటలో ఇంటర్ చదువుతూ ఉన్నరోజుల్లో యువవాణిలో కవిత్వం చదవడానికి అవకాశం రావడం గొప్ప ఆనందాన్నిచ్చింది.
కేవలం అలా కవితాపఠనం కోసం హైద్రాబాద్ స్వంతంగా వచ్చాను. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం వారి పురాణ ప్రబోధ పరీక్షలో జిల్లా ఫస్టు ర్యాంకు వచ్చిన సందర్బంగా రజత పతకం స్వీకరించడానికి గాను లింగోజీ సార్ నన్ను మొదటిసారిగా పదవ తరగతిలో ఉన్నప్పుడు హైద్రాబాద్ తీసుకువచ్చాడు.

ఆ సందర్బంగా ఆంధ్రప్రభ దినపత్రికలో పురాణ ప్రబోధ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన 'మునుగోడు సమితి విద్యార్థుల ప్రతిభ' పేరున నా పేరు మీద వార్త రావడం 1982లో చాలా గొప్ప విషయమే. 1987లో ఆనాటి ఉదయం డైలీలో 'స్త్రీలకు రిజర్వేషన్లు అవసరమా?' అని ఒక వ్యాసం రాసాను. ఆ వ్యాసానికి మల్లాది సుబ్బమ్మ నా మీద ఏకంగా విమర్శావ్యాసమే రాసింది. అనేకమంది నన్ను సమర్థిస్తూ, మల్లమ్మను సమర్థిస్తూ రాసారు. 'స్త్రీలు, రిజర్వేషన్లు : రూపుదిద్దుకున్న చర్చా వేదిక' అని కొన్ని వారాల పాటు ఉదయం ఈ చర్చను నడిపించింది. దాంతో నేను ఫోకస్ లోకి వచ్చాను.
ఈరోజుల్లో చిట్యాల యువజన సంఘం వారు ఒక గ్రంథాలయాన్ని స్థాపించి నడిపిస్తుండేవారు. ఆ గ్రంథాలయానికి నేను రోజు క్రమం తప్పకుండా వెళ్ళేవాడిని. చివరికి దాని నిర్వహణ బాధ్యతలను నాకు అంటగట్టారు. అలా నేను ఆ గ్రంథాలయంలోని చాలా పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని చదివే అవకాశం పొందాను. తెన్నేటి హేమలత, యండమూరి, యుద్దనపూడి, మాదిరెడ్డి లాంటి ఆ కాలపు రచయితలతో పాటు ఠాగోర్, శరత్, ప్రేమ్ చంద్ పుస్తకాలు చదవగలిగాను. మార్క్సిజం అక్కడే పరిచయమైంది. సుందరయ్య, రావి నారాయణరెడ్డి, మందుముల నరసింహారావుల పుస్తకాలు నా జ్ఞాన పరిధిని విస్తృత పరిచాయి. బుచ్చిబాబు, గోపిచంద్, కొడవటిగంటి లాంటి సీరియస్ రచయితల్ని, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్ కవితల్ని అక్కడే చదివాను.
ఈరోజుల్లోనే చిట్యాలలో శాఖా గ్రంథాలయం ఏర్పాటవడంతో ఈ నేతాజీ గ్రంథాలయాన్ని శాఖా గ్రంథాలయాన్ని ఇచ్చివేయడం జరిగింది. తారక రమేష్ మా ఊరి గ్రంథపాలకుడయ్యాడు. నా ప్రియమిత్రుడు సర్దార్ బహుద్దూర్ సింగ్ ఒక రాత పత్రికను నెలనెలా తీస్తుండేవాడు. నాతో చాలా ఆర్టికల్స్ రాపిస్తుండేవాడు.ఏదో టెక్నాలజీ ఉపయోగించి నా ఫోటో కూడా ప్రచురిస్తూ ఉండేవాడు.చిట్యాలలో ఔత్సాహిక యువత స్వంతంగా తయారై నాటకలు వేయడం బాగా గుర్తుంది.
నవోదయ కళాసమితి, యువజన విజ్ఞాన కళా సమితి ఒకేరోజు పోటాపోటీగా వేర్వేరు చోట్ల నాటకాలు వేసి మెప్పించడం నేను చూసాను. ఆ నాటకాల ముద్ర నా మనసులో చాలా గాఢంగా నాటుకుంది. ఆనాటి ఒకనాటి ఆటలో ఒకేసారి విన్నపాట నాకు ఇప్పటికీ గుర్తుండడం ఆ ప్రభావం యొక్క గాఢతకు గుర్తు.
'మనిషిని బ్రహ్మయ్య
మట్టిలో చేసేనయా
ఆడించుచున్నాడు బొమ్మలాగ
నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగ'
1984లో ఎన్టీ రామారావును పదవీచ్యుతున్ని చేసి నాదెండ్ల ప్రమాణం, ప్రజల ఆందోళనలో భాగంగా మొదటిసారి నేను లాఠీ దెబ్బలు తిన్నాను. ఇందిరాగాంధీ హత్య సందర్బంగా ఒక విషాద కవిత రాసాను.
***
నేను ఇంటర్ సమ్మర్ సెలవుల్లో ఉన్నప్పుడు చతుర నవలల పోటీ నిర్వహించింది. అప్పుడు నేను కూడా 'పగిలిన గుండెలు' అనే నవల రాసి పంపించాను. ఆ నవలల పోటీలో నెగ్గింది ఓల్గా గారి స్వేచ్ఛ.
***
డిగ్రీ మొదటి సంవత్సరం సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో చదివాను. తిరుమల శ్రీనివాసాచార్య పాఠాలు కొన్నే విన్నాను. రెండవ సంవత్సరం, మూడో సంవత్సరం నల్గొండ ఎన్.జీ కాలేజీలో చదివాను. నల్గొండలో ముదిగొండ వీరభద్రయ్య, రత్నయ్య, వేముల సత్యనారాయణ గార్ల పాఠాలు కూడా బహుకొద్దిగా విన్నాను.
నల్గొండలో నేను రెండవ సంవత్సరం డిగ్రీ చదువుతున్నప్పుడు నా పగిలిన గుండెలు నవల ప్రజాపోరాటం సాయంకాల దినపత్రికలో డైలీ సీరియల్ గా రెండున్నర నెలలు ప్రచురించబడ్డది. అలా మరోమారు రచయితగా అందరికీ పరిచయమయ్యాను.
డిగ్రీ రెండవ సంవత్సరం, పరీక్షలు రెండు రోజులు ఉండగా మేనమరదలు అరుణతో నా పెళ్లైపోయింది. నా డిగ్రీ అయిపోయింది. ఎంఏ తెలుగు ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి కాగానే ఎంఫిల్ తులనాత్మక అధ్యయనం కోసం తెలుగు విశ్వవిద్యాలయంలో చేరాను. డా.సి. మృణాళిని గారి వద్ద ఎంఫిల్ పీహెచ్.డి పూర్తి చేసాను. డా.సి.మృణాళిని గారికి మొదటి విద్యార్థిగా చెప్పుకోవడం ఒకింత ఆనందం. శ్రమ, సమయపాలన ఆమె దగ్గర నేను నేర్చుకున్న నిజమైన చదువు.
పీహెచ్.డి మధ్యలో ఉండగా ఏపీపీఎస్సీ గ్రూప్-2Aలో రెండవ ర్యాంకు సాధించి ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దారుగా చేరిపోయాను. జేఆర్ఎఫ్ కు రాజీనామా చేసి పీహెచ్.డీ కొనసాగించాను. తులనాత్మక సాహిత్యంలో అధ్యయనం చేయడం వల్ల భాషలకు అతీతంగా సాహిత్యాన్ని చూడాలన్న లోచూపు నాకు కలిగిందని చెప్పగలను. డా.సి.మృణాళిని గారి పర్యవేక్షణ నాతో మంచి క్రమశిక్షణకు పునాది వేసింది. డా. భార్గవీరావు, శిఖామణి గార్లు నన్ను సాహిత్యం అర్థంచేసుకోవడానికి సహకరించారు. డా.నందిని సిధారెడ్డి గారి వ్యక్తిత్వం నన్ను నేను తరుచు సవరించుకోవడానికి పనికి వచ్చింది.
***
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, హైద్రాబాద్,రంగారెడ్డి జిల్లాలతో వివిధ స్థాయి ఉద్యోగాలు నిర్వహించడం నాకు పరిణితిని తెచ్చిందో లేదో నా కవిత్వమే చెప్పాలి. ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నా సాహిత్యమే నా శ్వాస.
***
నిరుద్యోగం, తెలంగాణ గ్రామీణ జీవన దైనం నా కవితా వస్తువు కావడానికి కారణం నా నేపథ్యమే. సాధారణమైన తెలంగాణ రైతు బిడ్డ నేపథ్యమే నాది. కాలానుగుణంగా అది వామపక్ష భావజాలంగా కనిపించవచ్చు. తెలంగాణవాదంగా రూపుదాల్చవచ్చు. ప్రజా పక్షపాతం నా సాహిత్య అంశంగా కనిపిస్తే అందుకు కారణం నేను నడిచొచ్చిన బాటలే. 1986నుండి 1995వరకు వామపక్ష విద్యార్థి యువజన ఉద్యమాలతో పనిచేయడం నా సాహిత్యానికి అదనపు అవగాహన కలిగించిందని భావిస్తుంటా.
సమాంతర స్వప్నం, నేనే, కొత్త పలక, వచన కవితా సంపుటాలు ప్రచురించినా; మట్టిపాట పల్లెజీవన శతకాన్ని రచించినా; హైద్రాబాద్ విషాదం అనువాదం అందించినా; తెలంగాణ రుబాయిలు ఆంధ్రప్రభలో ధారావాహికంగా కొనసాగిస్తున్నా నాలోని చోదక శక్తి పీడిత ప్రజల, రైతు కూలీల పక్షపాతమే. తెలంగాణ గడ్డమీద అవగాహనతో కూడిన మమకారమే. కొత్త పలకను పరిశోధించిన పరిశోధక విద్యార్థి అంజనీబాయి చెప్పినట్లు శీతాకాలం చలి గురించి రాస్తూ చలి కూడా పేదలనే ఎక్కువగా బాధించిందంటాను.
'మూలమీద పండ్లబండి
చౌరస్తాలో రేగుబండ్లు
కరెంటు స్తంభం కింద వేగిన పల్లీ
సాదరంగా ఆహ్వానిస్తై
చలి తల్లి దాక్కునేందుకు కూడా
పేద బతుకులే ఆశ్రయమిస్తై'
మూడవ ప్రపంచ దేశాలలో రైతుల ఆత్మహత్యలు సర్వ సాధారణమవడానికి కారణాలను అన్వేషించాలనుకుంటాను.
'అప్పులోల్లు పైసలడిగితే ఎట్లంచు
పొట్టకూటి గింజలెట్టులనుచు
పెరచి రైతుబిడ్డ ఉరికొయ్యకూగెరా!
పల్లెబతుకు మాది పాడుగాను'
తెలంగాణ సాకారాన్ని సందేహంలో పడేసినప్పుడు ప్రతి కవి అనివార్యంగా ఉగ్రుడైపోయాడు. అందులో నేనూ ఒకడ్నై రాయకుండా ఉండలేకపోయాను. ఆరువందల పది జీవోలోని నైతికతను సమర్థిస్తూ..

'మీకు తెలియదు అన్నలారా
610 ఐదూళ్లపెట్టు
కురుక్షేత్రాన్ని తాత్కాలికంగా
వాయిదా వేయడానికి
ఇన్నాళ్లూ చక్రం తిప్పిన
సెక్రటేరియట్ల కుట్రలు మరవడానికి
'ఆరవ జోన్'ను ఫ్రీగా ఎంజాయ్ చేసిన దగా
ఆరు సూత్రాల పథకాన్ని అంగట్లో పెట్టిన ఆగం
ముల్కీ నిబంధనల్ని నట్టేట ముంచిన బాధ
అక్రమ డిప్యుటేషన్లు, అంతులేని చొరబాట్లు
సృష్టించిన విషవలయం విషయం మరవడానికి
610 ఐదూళ్ళ పెట్టు
ఇంత చేసినా మీరు గిలికిన లెక్కతో తేలిన
మూ ముష్టి ఉద్యోగాల వాటా అడిగాము కానీ
మేమేమన్నా ధవళేశ్వరాలడిగామా?
ప్రకాశం బ్యారేజీలడిగామా?
కొసకు మా నేల మీద కట్టిన
నాగార్జునసాగరం నీరైనా నిలదీసి అడిగామా?'
అని ప్రశ్నించాను. ఆశ్చర్యంగా ఆంధ్రులు కష్టబోతులని తెలంగాణ వాళ్లు సోమరిపోతులని ఒక వింత విష ప్రచారం పుట్టించారు. అది విన్న ప్రతి మట్టిబిడ్డ మండిపోయాడు. నేను దాన్నే రివర్స్ గేర్ లో..
'వాళ్లు
కోనసీమ కొబ్బరాకులమ్మి
మూడోపంటకు నోరొదులుకుని
సెక్రటేరియెట్ల నౌకర్లుంటరు
కుడికాలువ ఎడమకాలువల్ని
రెండున్నర జిల్లాలకు మల్పుకుని
ముక్కారు పంటల రైతన్నలైతరు
ఆంధ్రా క్రిష్టియన్ కాలేజీల్లో
మూడు తరాలుగా మెదళ్ళు సద్దుకొని
ఇరవై మూడు జిల్లాల్లో దోపిడీకి బాటగడ్తరు
ఫ్యాక్టరీల మిషతో ద్రవ్య సంస్థల్ని ముంచేసి
నింపాదిగా జెండా లేపేస్తారు
వాళ్లు కష్టపడ్తర్సార్
మనోళ్లు
చరిత్ర చింతాక్రాంతమైనప్పుడు
రాయిముక్క అవసరం లేకుండా
చార్మినార్ని కట్టి చందమామకు పోటీ పెడ్తరు
మట్టిపెళ్ళ పట్టులేకుండా
మక్కా మజీదును
అల్లాకు దట్టీగడ్తరు
కాలే కడుపులతో కరువును తరిమేసి
ఆసియాకే ఆణిముత్తెపు యేసుప్రభువు ఆట విడుపు
మెదక్ చర్చి నిలబెడ్తరు
ఎడతెగని శిలాతోరణంతో
ఓరుగల్లు శిల్పులు
సృష్టినే సవాలు విసుర్తరు
మనోళ్లు సోమరిపోతులు
వాళ్లు ధనధాన్యాల గరిసెలు నింపుకుంటుంటే
మనోళ్లు పోరాటాల చరిత్రలు సృష్టిస్తరు
వాళ్లు సముద్రంల జలకమాడుతుంటే
మనోళ్లు గుట్ట చెరికలల్ల తుడుంగడ్తుంటరు'
అని వ్యంగ్యీకరించి వాళ్లు నోరెళ్ళబెట్టేలా చేసాను. ఉద్యమం ఉధృతంగా మొదలవని రోజుల్లో కూడా కవులకు గొప్ప సాంస్కృతిక చైతన్యం ఉంది. బతుకమ్మ కల 2000 సంవత్సరంలో రాయబడింది.
'దూరంగా కొండ నింగిని కలిసేచోట
సృష్టిలోతుల్ని కొలవాలని
పండిన గోరింటల పరువం మీంచి
నీటవాలి లోనికి జారేది బతుకమ్మ
అలలు పాదాలకు గొలుసులు కడుతుంటే
జలస్పర్శకు జంకి
నిలువుగానో అడ్డంగానో
తలలూపి
తప్పని వీడ్కోలు పాటలో తరలిపోయేది
పోయే పోయపే గౌరమ్మా
తాడులోతు నీళ్ళల్లో
తరలిపోయే గౌరమ్మా
మళ్ళొచ్చే పండుగాకు
మళ్ళీ మళ్ళీ రావమ్మా
***
ఏనుగు లక్ష్మమ్మ, డా.కూరెళ్ళ విఠలాచార్య, కోమటి రెడ్డి రవీందర్ రెడ్డి, వంగర రవీందర్ రెడ్డిలకు నా పుస్తకాలను అంకితమిచ్చాను. నా హృదయంలో అంతటి చోటు గలిగినవారు గుడిపాటి, కందాటి శకుంతల, చెరుపల్లి రఘునాథం, వై.వసంత, పాటి మోహన్ రెడ్డి, గ్లోరియా బుజ్జాయి.
నేను పుట్టిన నేల, నేను నడిచిన బాటలు, నేను కలిసిన వ్యక్తులు, నన్ను దిద్దిన పుస్తకాలు, నేను చేసిన పనులు అవి ఇచ్చిన అనుభవాలు ఒకచోట రాశిపోస్తే అది నేను-ఏనుగు నరసింహా రెడ్డి.
-ఏనుగు నరసింహా రెడ్డి
8978869183












Click it and Unblock the Notifications