నలిమెలకు అకాడమీ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్‌కు అనువాద ప్రక్రియలో ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మలయాళ రచయిత పునాతిల్ కున్హాబ్దుల్లా రచించిన 'స్మారక శిలగళ్' అన్న నవలను భాస్కర్ 'స్మారక శిలలు' పేరిట తెలుగులో అనువదించారు. 27 ఏళ్లపాటు బోధనా వృత్తిలో కొనసాగిన భాస్కర్ బహుభాషా కోవిదుడు. 14 భాషలపై ఆయనకు పట్టుంది.
ఆయన కవితా సంపుటి "అద్దంలో గోదారికి'' తెలుగు యూనివర్సిటీ సాహిత్య పురస్కారం లభించింది. తెలంగాణ మాండలికాలపై పరిశోధన చేసి 'తెలంగాణ పదకోశం' వెలువరించారు. ఇప్పటిదాకా 20కి పైగా పుస్తకాలను వెలువరించారు.

ప్రస్తుతం అఖిల భారత తెలంగాణ రచయితల వేదికకు అధ్యక్షునిగా, నేషనల్ బుక్ ట్రస్ట్ సలహామండలి సభ్యుడిగా, సాహిత్య అకాడమీ గ్రంథ సమీక్షకుడిగా పనిచేస్తున్నారు. కాగా, అవార్డులో భాగంగా రచయితకు రూ.50వేల నగదు, కాంస్య పతకం లభిస్తాయని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన నలిమెల భాస్కర్ అనువాద ప్రక్రియలో విశేష కృషి చేశారు. తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషలకు అందించడంలోనూ, ఇతర భాషల సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకురావడంలోనూ ఆయన కృషి ఎన్నదగింది.












Click it and Unblock the Notifications