బిఎస్ కథల్లో ప్రత్యేక పాత్రలు
కథలో పాత్ర చిత్రణతో మనిషి స్వరూపం, స్వభావం, నడత, వర్తన, సంభాషణ, మాటతీరు, ఎదుటివారితో నిర్వహించే సంబంధ బాంధవ్యాల రీతీ, వ్యక్తులకూ పరిస్థితులకీ, సంభవాలకూ, స్పందన ప్రతిస్పందనలూ, అన్నీ ప్రాముఖ్యత వహిస్తాయి.
కథానికలో పాత్ర పోషణ పద్ధతుల్ని గమనిస్తే సాంకేతికంగా, శాస్త్రీయంగా రచయితలు తమ నైపుణ్యానికి ఎంతగా పదును పెడుతున్నారా అని అబ్బురం కలుగుతుంది.
పాత్రల ఆలోచనాధోరణి ద్వారా పాత్ర యొక్క జ్ఞానవిజ్ఞానాల స్థాయి చిత్రణ జరుగుతుంది. సంఘటనల్లో, సంభవాల్లో పాత్ర చర్యలూ, ప్రతి చర్యల వివరణ ద్వారా ఆ పాత్ర స్వభావాన్ని ఆవిష్కరించటమూ ఒక పద్ధతి. కేవలం ఇతర పాత్రల వర్తన ద్వారా ప్రధానపాత్రని వర్ణించటం ఒక విధానం!
ఈ విధానాలన్నీ బి.ఎస్. తమ కథల్లో సమయోచితంగా నిర్వహించారు.
ఒకేసారి బిఎస్ రాసిన 'కాలం తెచ్చిన మార్పు', 'చికాగోలో నానమ్మ', 'గెలుచుకున్న జీవితం' సంపుటాల్లోని మొత్తం 47 కథల్నీ చదివేసరికీ, కొన్ని ప్రత్యేక పాత్రలు మనసంతా ఆక్రమించి, కళ్ళముందు నిలుస్తాయి. అలాంటివన్నీ కొన్ని విలక్షణతలతో ప్రత్యేక పాత్రలుగా కథా సాహిత్యంలో ఉన్నత, ఉత్తమ స్థానాన్ని సంపాదించుకుంటాయి.
ఈ అసాధారణ పాత్రలు మనల్ని వేధిస్తూ వుంటాయి. మన ఆలోచనల్ని వెంటాడుతూ వుంటాయి. మన కళ్ళముందు తిరుగుతూ, కొన్ని భావాలకు అసంకల్పంగా ప్రేరణ కలిగిస్తూ వుంటాయి. కొన్ని ఉద్వేగాల్నీ, ఉద్విగ్నతల్నీ తట్టిలేపి మనసుని ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోను చేస్తూ ఉంటాయి.
బి.ఎస్. కథా ప్రపంచంలోని అలాంటి రెండు మూడు అసాధారణ పాత్రల్ని గురించి ప్రత్యేకంగా పేర్కొంటాను.
'బతుకు నేర్పిన పాఠం' లో ఎర్రగొల్ల మల్లయ్య
ఈ కథలో బతుకుని అనుభవించినవాడు- ప్రధాన పాత్ర- మల్లయ్య. ఇంత చిన్న కథను ఎంతో అనన్య సామాన్యం చేస్తూ ఇతివృత్తాన్ని పోషించిందీ మల్లయ్యే.
తన బతుకు పట్టకంలోని ఒక నలుపురంగుని, సమాజంలోని అనేక వ్యవస్థల్లోని, అనేకమంది మనుషుల్లోని కారు నలుపునీ, తారునలుపునీ - అమోఘంగా కథ కేన్వాస్‌మీద వెదజిమ్మినవాడు - ఈ మల్లయ్య.
మల్లయ్య పీడత వర్గ ప్రతినిధి. గొర్లని కాచుకొని పొట్ట పోసుకునేవాడు. అడవిదారివాడు. గొర్లుని మేపుకోవటం అనే జీవికలో అతనికి అడుగడుగునా పరపీడనే! అందుకనే మెత్తని పులిలా సమాజం మొత్తం మీద గర్జించాడు. అధికార జులం మీద జూలు విదిల్చాడు. యుగాల వెనక్కి వెళ్ళి మరీ - మనిషన్న వాడి మీదల్లా ప్రశ్నాశరాల్ని సంధించాడు. న్యాయాన్నీ, చట్టాన్నీ, నీత్యవినీతుల్ని రచ్చకెక్కించాడు! మా తెలుగు చిన్నకథ శక్తి ఇదీ అని జబ్బ చరిచి ఛాతీ విరుచుకునీ చూపుకోగల కథ ఇది!
కథానికా ప్రక్రియకి ప్రాణమైన క్లుప్తత, స్పష్టత, ఆర్ద్రత కలిగిన గొప్ప కథ ఇది! అలాగే వస్తుపరంగా - ఈనాటికీ out of date కాని సామాజిక స్పృహని బిందువులో సింధువులా విస్తరించుకున్న కథ! శిల్పపరంగా అన్ని గుణ విభాగాల్నీ, విశేషాల్నీ 'కేంద్రీకరణం' చేసుకున్న కథ.
బి.ఎస్.మూడు కథా సంపుటాల్లోని అన్ని కథల్లోనూ తిరుగులేని ధైర్యంతో తలెత్తుకు నిలబడిన పాత్ర - ఎర్రగొల్ల మల్లయ్య!
'కథానిక' అంటే ఇదే! ఇంతే! ఇది మాత్రమే! ఇంతమాత్రమే! - అని చెప్పటానికి ఒక నమూనాగా చెక్కిన శిల్ప భరితమైన వాక్య సముచ్చయం - ఈ 'బతుకు నేర్పిన పాఠం'!
బి.ఎస్.కి శతసహస్ర హృదయపూర్వక అభినందనలు!
'వరలక్ష్మి' కథలో వరలక్ష్మే!
దేనికీ ఆశపడే స్వభావం లేని వరలక్ష్మి- అందితే ఆనందించే స్వభావం వున్న వరలక్ష్మి- ఒక గొప్ప తాత్త్వికపాత్ర. స్థిత ప్రజ్ఞా దురంధరురాలు ఆమె. ఇది కావాలనీ, అది రాలేదనీ జుట్టు పీక్కునే స్త్రీ కాదు - ఈ వరలక్ష్మి!
వరలక్ష్మి పుట్టగానే యిది నా కోడలు అని మాట తీసుకుంది మేనత్త. పెళ్ళి గురించి ఏమీ తెలియని తొమ్మిదేళ్ళ వయసులో పధ్నాలుగేళ్ళ ఆంజనేయులుతో ఆమె పెళ్ళి జరిగింది. ఆంజనేయులుకి ఎనిమిది తర్వాత చదువు సాగలేదు. కిరాణా షాపు పెట్టుకున్నాడు. మామ సాయం చేశాడు. కిరాణా షాపులోనే చాయ్, పాన్, దుకాణాలు తెరిచాడు. ధాన్యం వ్యాపారం మొదలెట్టాడు. సైకిల్ కాస్తా సుజకీ బండి అయింది. డబ్బు సంపాదించే కిటుకు తెలిశాక మిగతాదేన్నీ లక్ష్య పెట్టలేదు. చివరకు భార్యనీ లక్ష్య పెట్టలేదు. ఇదీ వరలక్ష్మి జీవితంలో మలుపు. పుట్టింట్లో దింపి పోయి, తప్పించుకు తిరగసాగేడు భర్త. చివరికి ఆమెకి చెవుడు నేనేలుకోను అన్నాడు.
వరలక్ష్మి మూగగా నిలబడింది. పంచాయితీలు జరిగాయి. కడకు విడాకులైనాయి. తండ్రికి గుండెపోటు.
ఈ ఏడుపుల్లో వరలక్ష్మి దుఃఖాన్ని ఎవరూ గమనించలేదు. బయటికి పంటి బిగువున అదిమి పట్టింది. కాని 'చీకటి నిండిన సామాను గదిలో పాతకుండల దొంతర పక్కన ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది'!
ఆమె ధీర గాంభీర్యంలో ఇది ఒక సహజాతం. మానవ సహజమైన ఉద్విగ్నత, విలాపం!
వరలక్ష్మికి రెండో పెళ్ళి అంటే తల వొంచింది. చేనేత సంఘంలో కూలికి నేసే రాజయ్యతో పెళ్ళి జరిగింది. అన్నల ఉదాసీనత. వారు పట్టించుకోలేదు. ఆమెకు పిల్లలయ్యారు. భర్తకు టి.బి. సోకింది. ఆ జబ్బుతో అతనిక ఎన్నాళ్ళో బతకడనే స్థితికి చేరిందనీ తెలిసింది.
ఇక్కడ పాత్ర చిత్రణలో - పరిసరాలకూ, పరిస్థితులకూ అనుగుణమైన వరలక్ష్మి భావోద్విగ్నతని ఒక్క వాక్యంతో రసాత్మకం చేసి, పఠిత కన్నుని చెమరింపజేశారు బి.ఎస్. ''నన్ను అదృష్టరాలివంటివి గదవే అమ్మా! అదృష్టం అంటే ఇదేనా?'' అంటూ వరలక్ష్మి ఏడ్చింది. వరలక్ష్మి ఏడ్పును ఎవ్వరూ ఆపలేకపోయారు. ''నువ్వు అదృష్టవంతురాలివేనే. కానీ నీ అదృష్టాన్ని నీకు కాకుండా ఇతరులెత్తుకుపోతున్నారు'' అంటూ విలవిలలాడింది తల్లి ఎల్లమ్మ. చదువరికి కూడా కన్నుల్లో నీరు క్రమ్ముతుంది. గుండెలో కొర్రు దించినట్లువుతుంది! ఇదీ పాత్ర పోషణ నైపుణ్యం!
వరలక్ష్మి ఇతివృత్తం ద్వారా రచయిత జీవితం గురించి వెల్లడించదలచుకున్న సాధారణీకరణ అంశం ఉమ్మడి కుటుంబాల్లో ఆడపిల్ల పట్ల తోబుట్టువుల నిర్లక్ష్యం. తల్లిదండ్రులు ఎంత వేదనపడినా, ఏడ్చినా, మొత్తుకున్నా, ఆమెకు అందవలసిన సహానుభూతిగానీ, సహాయంగానీ అందవు అనే వాస్తవం!

'వారసత్వం' కథలో కిరణ్మయి, గంగరాజం
'వారసత్వం' కథ -కాలక్రమంగా సమాజంలో నెలకొంటున్న పరిణామాల్నీ తత్కారణంగా మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్నీ చిత్రించింది.
ఆ మార్పుల్లో ఒక పెనుమార్పు - స్త్రీకి అందుతున్న ఆర్థిక స్వాతంత్య్రం.
ఎమ్మెస్సీ, ఎంఫిల్, బిఈడి చేసింది కిరణ్మయి. గోల్డ్ మెడలిస్ట్. ప్రస్తుతం టీచర్‌గా చేస్తున్నది. భవిష్యత్తు మీద కొండంత ఆశగల యువతి. గ్రూప్‌వన్ లేదా లెక్చరర్ అవుతాననే ఆత్మవిశ్వాసం గలిగిన యువతి.
పల్లెటూరి విజయ్ సంబంధం తనకు వద్దంటుంది. 'పెళ్ళికాని ముగ్గురు చెల్లెండ్రున్న వాన్ని చేసుకుని నేను సుఖపడేదేముంటుంది. ఇద్దరి సంపాదనా వాళ్ల పెళ్ళిళ్ళకు, ప్రసూతులకే చాలవు'' అని నిష్కర్షగా చెబుతుంది. అంతేకాదు, ముసలివాళ్ల కోసం (తాత, నాన్నమ్మ) నా నిండు జీవితం బలి కావాలా? '' అని కూడా కుండబద్దలు కొట్టి మరీ అడుగుతుంది.
ఆలోచనల్లో, ఆచరణలో, భావజాలంలో వచ్చిన తరాల అంతరాల ప్రభావాన్ని నేర్పుగా కథా శిల్పంతో ఆవిష్కరించారు బి.ఎస్.
ఆ అమ్మాయి- గంగరాజం తాతకి ఇంకా పెద్దలైన జవాబులేని ప్రశ్నల్ని ఇలా సంధిస్తుంది.
''తాతయ్యా! నువ్వేదో పెద్ద స్వాతంత్య్ర పోరాటం చేసానని గర్వం నీకు. నిన్ను నువ్వు ప్రేమించుకున్న స్వార్థం తప్ప నువ్వు నిజంగా ప్రజల్ని ప్రేమించేదెప్పుడు. ఎపుడో చేసిన దాన్ని చెప్పుకొని అంతకు ఎన్నో రెట్లు మీరే సుఖాలనుభవించారు. మీ పచ్చి స్వార్థం వల్లనే అక్కడే ఆగిపోయారు. మీరింకా పోరాటం చేసి ఉంటే సమాజం యింకా ఎదిగి ఉండేది. సర్‌పంచ్ పదవే నీకు గొప్పదైపోయింది. ఎమ్మెల్లేవో, ఎం.పీ.వో ఎందుకు కాలేదు. నీ స్వార్థం కోసం కాకపోతే పల్లెల్లో ఉన్నదంతా అమ్ముకొని కోరుట్లలో ఎందుకు సెటిల్ అవుతావు. తద్వారా పల్లె సమాజం ముప్పయి ఏళ్ళు వెనక్కి పోలేదా!'' అంతేకాదు. పల్లె గురించీ, పల్లె వాతావరణం, మనుషులూ పరిస్థితుల గురించీ - ఆమె అభిప్రాయాలు విపరీతంగా వున్నాయి.
''.... యిక్కడ పల్లెలో యింట్లో పశువులు, కోళ్ళు, రొచ్చు. పేడ, వ్యవసాయం. సంస్కృతి -కిరణ్మయికి భరించరానిదిగా ఉంది.
ఈ వ్యవసాయమే లేకపోతే దేశంలో పాడీపంటలు ఎక్కడివి.
అన్నీ తెలిసీ కిరణ్మయి ఏమన్నది...
''తాతయ్యా! పల్లెలు ఫోటోల్లో బాగుంటాయి. చూడ్డానికి బాగుంటాయి. ఉండటానికి బాగుండవు. పట్నంలో ఉంటూ పల్లెలు అద్భుతమైనవని నేనూ కథలు, వ్యాసాలు రాస్తాను. పట్నాల్లో సకల సౌకర్యాలున్న యిళ్ళల్లో, అపార్టుమెంటుల్లో, స్వర్గం లాంటి కాలనీల్లో ఉంటూ అభివృద్ధి ఫలాలన్నీ పోటీపడి ముందు లాగేసుకుని పైకి మళ్ళీ పల్లెలు బాగుంటాయి అని వాదించేవాళ్ళను ముందుగా షూట్ చేయాలి తాతయ్యా!'' కిరణ్మయి అన్నప్పుడు యువతరం ఆలోచనా తీరుకు వణికిపోయాడు తాను. ''అయిదు నిమిషాలు కరెంటు పోతే అబ్బ ఉక్కపోత- వెధవ బతుకు, వెదవ ప్రభుత్వాలు అని తిట్టిపోసే మహానుభావులే పల్లెలు బాగుంటాయని అంటార''ని కిరణ్మయి నిశ్చితాభిప్రాయం.
''తాతయ్యా! పల్లెటూరి మనస్తత్వాలు యిప్పటికీ క్రూరమైన ఫ్యూడల్ మనస్తత్వాలే. ప్రజాస్వామిక వ్యవస్థ వేళ్ళూనుకోకుండా ప్రజాస్వామిక సంస్కృతి పల్లెల్లో ఎదిగే అవకాశం లేదు. అంతదాకా యివే కుత్సితపు మనస్తత్వాలు- ఓర్వలేనితనం. కాస్త వరసైతే చాలు వయస్సు ఆధిక్యతతో ఏమో, ఓసే అని పిలుస్తారు. ఇంట్లో లెట్రిన్ ఉండదు. అదే చెరువులో స్నానాలు, అదే చెరువులో చాకిరేవులు., అదే చెరువులో కాలకృత్యాలు.''
''తాతయ్యా! పల్లెల్లో ఏదో ఒక కులానికో, యింటికో పరిమితం చేసి, నన్ను ఫలానా కులం అమ్మాయి, ఫలానా యింటి కోడలు అని చూస్తారే తప్ప వ్యక్తిగా నా వ్యక్తిత్వాన్ని, తెలివితేటల్ని, జ్ఞానాన్ని అప్రధానం చేసి చూస్తారు. నన్ను ఎవరికో మనమరాలుగా, కూతురుగా, కోడలుగా, భార్యగా చూసి గౌరవించడం అంటే నాకు అసహ్యం. నన్ను నన్నుగా గౌరవించాలి. అది పల్లెల్లో సాధ్యం కాదు'' కిరణ్మయి యింకా ఎన్ని అన్నదో...
ఆ దెబ్బకి గంగరాజం తన గతంలోకి దూరిపోయాడు. పదిపేజీల 'ఫ్లాష్‌బ్యాక్' ఆలోచనలు సాగినై!
విజయ్ తమ్ముడు అజయ్ కూడా ఈ తరం యువకుడు. అతనూ గంగరాజంని దెప్పుతాడు. ఎలా?
ఇదిగో ఇలా :
''గా కండక్టరు పోస్టు యిప్పియ్యిమంటే చాతగాలేదు గానీ అందరు నా కండ్ల ముంగటి పోరగాన్లే అని మా అంటవులే'' అని అజయ్ హేళనగా అన్నాడు. గంగరాజంకు చాలా కోపం వచ్చింది. తమాయించుకుని అన్నాడు.
''నాకు యిష్టం లేకపోయినా నీ కోసం అడిగితే పనీ గాకపాయె- నాకు అవమానం మిగిలె. అయినా మనం ఎపుడూ అడుక్కొంటూ, వాళ్ళేమో ఎపుడూ అధికారంలోనే ఉండాల్నారా! నేను నీ వయస్సులో యిట్లా వాన్ని వీన్ని కాల్లు మొక్కుకుంటూ ఉంటే ఈ పల్లె యిట్లా అభివృద్ధి అయ్యేదేనా! ధైర్యం ఉంటే కొట్లాడురా! నా కాలంలో నేను సర్‌పంచ్‌నైనాను. నువ్వు మండలాధ్యకక్షునివో, ఎమ్మెల్లేవో కారాదుర. దిక్కుమాలినట్టు అరబ్బు దేశాలకు పోతానని పైరవీ చెయ్యవడ్తివి. మీరు అరబ్బు దేశాలకు పోతే వాల్లు మీ పెండ్లాలకు అలవాటైతరు. ఏం పుటుకలురా మీవి. గింత రోషం లేని బతుకు. దేశం అమ్ముడుపోతుంటే ఒక్కడూ పోరాటం చెయ్యడేమిరా!''
అజయ్‌కు రోషం మొలుచుకొచ్చింది.
''ఈ దేశం నాకేమిచ్చిందని పోరాటం చెయ్యాలె తాతా! ఈ స్వాతంత్య్రం వల్ల ఈ అభివృద్ధి వల్ల లాభపడ్డవాళ్ళు పోరాటం చెయ్యాలె. కనీసం కండక్టరు ఉద్యోగం యివ్వకుండా అరబ్బు దేశాలకు తరుముతున్న ఈ దేశం అమ్ముడుపోతే నేనెందుకు పోరాడాలె. దేశాన్ని అమ్ముక తింటే నా వాటా నాకు పారెయ్యమంటా. అంతే. ఈ దేశం ఏమైపోతే నాకేమిటి! మళ్ళీ విదేశీ పాలనలోకి పోతే ఎక్కువ సంతోషిస్తాను. నాకు లేని అభివృద్ధి, స్వాతంత్య్రం మిగతావాళ్ళకెందుకుండాలె!''
సూటిగా ఆ మాట హృదయంలో బాణంలా గుచ్చుకుంది. విలవిలలాడి పోయాడు గంగరాజం.
యువతరం ఆలోచనా తీరు చూసి అవాక్కయిపోయాడు. తేరుకొని ఏదో చెప్పబోయేంతలో ''నువ్వు వచ్చినట్టు చుట్టాలకు చెప్పి వస్తా'' అంటూ బయల్దేరాడు అజయ్.
తన ఆలోచనల్లోకి తాను జారుకున్నాడు గంగరాజం.
''సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తూ తన బతుకు తాను బతకడం నేరమా?... తాను కష్టపడకపోతే తన కొడుకు రాజేశం లెక్చరరై కిరణ్మయికి ఈ అభివృద్ధి అందడం సాధ్యమయ్యేదేనా!' అనుకుంటాడు.
ఏమైనా, కిరణ్మయి తన పట్టుదలమీద, తన బెట్టుని సాగించింది. పెళ్ళి ఆగిపోయింది. కడకు నానమ్మ కూడా మనవరాలి భావాలకూ, నిర్ణయాలకూ మద్దతునివ్వడం - కథకి కొసమెరుపు!
ఈ విధంగా కిరణ్మయి పాత్ర తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఎదిగి, ఆలోచనల్లో, మనస్తత్వ ధోరణిలో, ప్రవర్తనలో తన తరానికి ప్రాతినిధ్య పాత్రగా మెరుపులీనుతూ నిలిచింది.
ఇదే సందర్భంలో గంగరాజం పాత్ర పోషణనీ ప్రత్యేకించి ప్రశంసించాల్సిందే!
ఒక స్వాతంత్య్ర సమరయోధుడుగా, ఉద్యమ కార్యకర్తగా, కష్టజీవిగా 80 ఏళ్ళ అనుభవశాలిగా- ఆయన ఒక పరిణామశీలి, ప్రవాహశీలి. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ సంభవించిన సామాజిక పరిణామాల్నీ, రాజకీయాల్నీ, ఆర్థిక సాంస్కృతిక మార్పుల్నీ గమనించిన వాడు. అనుభవించిన వాడు ఈ గంగరాజం.
గంగరాజం జీవిత సారాన్ని పట్టుకుని తన అనుభవాలతో మేళవించి సాంద్రతరం చేసి - వాటి ప్రతిఫలనాన్ని పాత్ర రూపకల్పనలో ఒదిగించారు బి.ఎస్. అందుకనే, నేనన్న ఆత్మీయతా ముద్ర ఆయన కథల్లోని ఇలాంటి కొన్ని పాత్రల్లో మరీ ఎక్కువగా పారదర్శకమైంది. దీనికి సాక్ష్యంగా అనేక వివరణల్లో గంగరాజం తలపుల్లోకి బి.ఎస్. పరకాయ ప్రవేశం - కనిపిస్తుంది! ఔట్‌సైడర్‌గా కంటే ఇన్‌సైడర్‌గానే ఆయన కథావరణంలోకి దూకి కథనంతో, పాత్రతో మమేకం చెందారు. అదొక భావోద్వేగ ప్రకటనం! పాత్ర క్రమోల్మీనం అయ్యే ప్రక్రియల్లో రచయిత అనుసరించే అనేక కథాకథన విశేషాల్లో ఇదీ ఒకటి!
కిరణ్మయి ఒక క్రియాశీల పాత్ర! ఒక రాశీభూత చైతన్యం! కిరణ్మయి పాత్ర ద్వారా రచయిత అందించిన జీవనసూత్రం - సమాజ వికాసం, సాంస్కృతిక అభ్యుదయం, నాగరికతా వృద్ధి చెందాలంటే - విద్యా, విజ్ఞానం, వివేకం, కలిగిన యువత - ప్రశ్నించటం నేర్చుకోవాలి. భవిష్యత్తుని కాపాడుకోవటానికి అవసరమైతే గతంనీ, 'యధాస్థితి'నీ - నిరసించాలి, తిరస్కరించాలి, ఎదిరించాలి- అనేది! కథా ప్రయోజనం దృష్ట్యా ఆలోచిస్తే ఈ కిరణ్మయి, గంగరాజం చదువరి మనసులో కలకాలం నిలిచి వుండే పాత్రలు.
- విహారి












Click it and Unblock the Notifications