కవిత: దు:ఖభాజ్యంగా...

చినుకుతెప్ప మీద కురిసినట్లు
ఉరుకుల్లో పరుగుల్లో
ఊపిరి ఎగెసెగిసి పడుతున్నట్లు
విజృంభిస్తున్నది విశ్వశక్తి
ఏడుపులతో నవ్వులతో
ఆగమాగం చేసే ఆకలితో అల్లరితో
భయంలో పెరిగిన పెద్ద గుండె
నిలువరించలేని నీరసంలో
శిశు తాకిడిని తట్టుకోలేని ఆసహనంలో
అదుపులోకి తెచ్చుకునే అణచివేతలో
దెబ్బలు కొట్టి
ప్రతి తరం
మనోగాయాల పొరల్లో నాటుకుపోయే
పెద్దల కోర్కెల భావాల్ని
తలకెక్కించే తన్నుల దాడిలో
భయానకం
ఆకాశమంత విశాలంలోకి
పక్షి తన అండజాన్ని
ఎందుకు పొదిగి ఎగరినస్తుందో...
భూమంత విస్తరణలోకి
జంతువు తన పిండజాన్ని ప్రసవించి
చెంగున ఎందుకు గెంతనిస్తుందో...
విశ్వమంత గాలిలోకి
చెట్టు తన ఉద్భీజాలాన్ని
మొక్కగా లోతైన వేర్లతో
ఎందుకు ఎదగనిస్తుందో...
పెంచటానికో ఆక్రమించటానికో
శిశువంటే చిన్నది కాదు
విశ్వ సూక్ష్మం
మనిషంటే వస్తు మారకం కాదు
స్వీయాత్మ
వస్తూ వస్తూ అనంత శక్తితో
పోతూ పోతూ అతి బలహీనంతో
కులానికి కుటుంబానికి మధ్య
మధ్యముడిగా
మతానికి రాజ్యానికి మధ్య మూఢుడిగా
ప్రతి బాల్యం పెరిగి పెద్దై
దైన్యంలో భీతిలో
హత్యలుగా ఆత్మహత్యలుగా
ఎప్పుడూ లోలోపల తెమిలే
కవిత: దు:ఖభాజ్యంగా...
- దుర్గాప్రసాద్ అవధానం












Click it and Unblock the Notifications