మెర్సీ మార్గరెట్ కవిత 'అక్షరయానం'
బీటలు వారిన పుడమి పెదవిని
కళంకరహిత సత్యం అంచున పుట్టిన
మేఘంతో
తడిపినప్పుడు
అక్షరం నీడలో మొలిచిన
నాలుగు గొప్ప కవితల్ని దోసిటపట్టి
గుండెకు హత్తుకోవాలి

రంగులన్నీ చినుకు మెట్లేసుకుని
మబ్బు మబ్బుకు మధ్య
ఇంద్రధనుస్సు వంతెనైనప్పుడు,
ఒక సన్నని సుతారపు రాగస్వప్నం
నయనాల కొలనులో విచ్చుకున్నప్పుడు,
ఆనందానికి గుర్తుగా ధరించాలి
మునిమాపువేళ
పరుగులు తీసే సెలయేటి రాగాలతో శృతికలిపే
పక్షుల మిగిలిన ఆకలి భాషను జతచేసి,
కుంకుమపూల కొత్తభాష నేర్పి
అరుణవర్ణంలో మాట్లాడే భానున్ని
నలుపు చేసిన కాగితంతో కప్పేస్తూ...
దేహంమీంచి కాలం జారిపోతూ
ఋతువులు రాలుస్తున్నప్పుడు
ప్రకృతిని
పరమాద్భుతంగా శ్వాసించి
అంతరాత్మ కౌగిలిలో ఒదిగిపోవాలి
ఇంతకన్నా అందంగా
జీవితాన్ని నిర్వచించేందుకు
ఏం చేస్తుండాలి ?
అవును
లోలోపలి సముద్రాల్ని ఈదుతూ
అనంతాలకావల ప్రశ్నల్ని వెలిగించి
ఇంకా లోలోపలి లోతులకు పయనమవ్వాలి












Click it and Unblock the Notifications