తెలుగు కవిత: దేహ చోరులు
సహస్రాబ్దాలుగా కలలు
బలవంతుల కాళ్ళ కింద చిటుక్కుమని
తాము పెట్టిన పుట్టల మీదా
తవ్వి పోసిన సంపదల గుట్టల మీదా
హక్కులు కోల్పోయినయ్
ఈ నేల మీది చీమలు
అండర్ గ్రౌండ్ పుట్టల్లో
బలిసిన దోపిడీ సర్పాలు
అధికారం గుట్టల మీద
అభయ హస్తమిచ్చే దేవుళ్ళు
కొలువయ్యాయిక్కడ
స్వతంత్రించక శతాబ్దాలు
బానిసలకు బానిసలుగా మారిన వాళ్ళకు
కర్మ నుదుటనే రాయబడి ఉందనే వ్యాఖ్యానం
పురిట్లోనే పురోహితులు రాసెళ్ళిపోతారిక్కడ
స్వతంత్రించి దశాబ్దాలు గడుస్తున్నా
ప్రణాళికలు చిత్తుకాగితాలుగా పేరుకుపోతున్నా
ప్రధానులు కూడా ప్రశ్నలు దేవుళ్లకే వదిలేస్తారు కనుక
విధి బలీయమన్న నానుడులు
గోడలమీదా రాయబడుతాయిక్కడ
ఈ ఐదేళ్లకూ మార్గమేదైనా ఉందా అంటే
కన్నీళ్ళనూ
పవిత్ర నదిలో మునిగి
పోగొట్టుకోవాలని రాజకీయపర్వాలు
మంగళారతులు తిప్పుతాయిక్కడ
ఎప్పుడూ అధికార మంత్ర దండం
ఉన్నవాడి వైపే చూసి
మరణశయ్య మీద ఉన్నవాడికి
మీది లోకంలో స్వర్గాన్ని చూపి
ఐదేళ్ళలో అదృశ్యమౌతుందిక్కడ

- బూర్ల వెంకటేశ్వర్లు












Click it and Unblock the Notifications