తెలుగు కవిత: ఎగపోత
నీ నవ్వుతో నా నవ్వు
మమేకమైన జ్ఞాపకాల
దుఖ్కం ఆనవాళ్లు
అస్తమించె ప్రతి సూరీడు
నా లోలోపల తడుముతూనే ఉంటాడు
నీ కోసం నిరీక్షణలో వేసారి
పాడుబడ్డ ఇంట్లో
చెదలు మింగిన చేటలా
మరో జన్మను దేవులాడుకుంటున్న విగత జీవిని
కన్నీళ్లను విస్తీ మత్తులోనూ
నువ్వు శేషంగా మిగిల్చితే
కండ్లు మూయడం తెరవడం తప్ప
మరో క్రియ తెలియని వాణ్ణి

సమాజపు ఈర్ష్యకైనా నోచుకోని
నిలువెత్తు సజీవ విగ్రహాణ్ణి
దశాబ్దాల కిందటనే
మరణించినట్లున్నది
నన్నెవరూ పారేయట్లేదెందుకో
వెన్నెల సాక్షిగా
చీకట్లను మింగి
ఏంటీనాకు వేలాడుతున్న
ఒంటరి పావురాన్ని
సకలం ఎరిగిన వాణ్ణని
గర్వంగా ఎంత జబ్బలు చరచినా
దాగని కన్నీళ్లకు జారిపడ్డ
నిరుపేదను
లొట్టిని మింగిన కల్లు
గతాన్ని పొక్కిలి చేసి
ముదనష్టపోడా
కాష్టం నిన్నింకా కావిలించుకోలేదా
అని పెదాల మీది తెల్లటి నవ్వుతో
ఓదారుస్తున్నా
ఎగపోత దుఖ్కంలోనూ
ఉబుకుతున్న అక్షరాల మీద
కవితలు ఏరుకుంటున్న
- గంట్ల అనంతరెడ్డి
సెల్: 9848899559 & 9948066635












Click it and Unblock the Notifications