కపిల రాంకుమార్ కవిత: ఎచ్చరిక ...

Posted By:
Subscribe to Oneindia Telugu

కొట్లాడి సాధించుకున్నం కదా తెలంగాణ.
గిట్ల బొక్కబోర్లపడ్డవేంది
మనోడిని పదవిలో కూకోపెడతనుకుంటే
బూర్లమూకుడు నెత్తినపెట్టిండా
గోచిగుడ్డ ఊడేలా ఎగిరి గంతేసినవ్
ఎగిరి యే తానవడ్డదో యెతకబోయె
మా ఈరిగాడు...దొర్కలే
దొరమాటతో పాటు గదీ గాలికి కొట్టకపాయె
కమ్మరి చక్రం కూలబడె.
కంసాలి కొలిమి సల్లవడె
కులవృత్తులు ఈడ్చకపాయె
పాడి గేదెలు పాడెక్కె
యవుసాయం కాటికి కాళ్ళు జాపె
ఇంకా యెన్ని సంకనాకి పోవాల్నో
యెన్ని పీనుగులు కమురుకంపు కొట్టల్నో
మాయలమరాఠోలె ముక్కూపుకుంట
అరసేతి యైకుంటాలెన్ని సూడాల్నో వారి
ఈతలు. తాళ్ళు మోతాదులతోసహా
సెదలువట్టి ముంతలు ముండవోసినయ్

Kapila Ramkumar's Telugu poem Eccharika

ఇంకా నమ్మబలికితే సెవులో పూలు లేవు
ఎంతమందుసురు తగల్తదోకాని.
రా యీ పాలి యే ముచ్చటి సెప్పి
ఓట్లడుగుతవో సూతం
పిచ్చోళ్ళమనుకుంటున్నవ
పెజలంటే
సెప్పిందిని. పెట్టింది తినేటందుకు
వెర్రిపప్పలంకాదు
మా వాటా మాకిచ్చేదంక
తంట్లాడుతాం
నీతోనే - నీ తొత్తులతోనే
నీలి యెర్రజెండాలందుకున్నాం
నైజామునే తరిమి కొట్టినం
నువ్వెంత..జర పైలం బిడ్డా
నీ అడ్డాకదుల్తది
కూసాలిరిగి కుర్సీ కూలబడ్తది
గుంజకు కట్టి గంజికూడ దొరకకుండ జేస్తం
పేదోడికి కోపం వత్తే
కోటలే కూలినయాని సదూకోలే...
దినాలెట్టే దినాలు దాపుకొచ్చే
సందెటేలకే తప్పులుదిద్దుకో
లేదా దినవారాలకు
బయలెల్లే దినం దాపులోనే వున్నాది
కపడ్దార్...దుగ్ధగీతం పాడుకుంటా
దగ్ధమయ్యే పోగాలమొస్తాంది
ఆడోళ్ళని అలుసు సేస్తివంటే
చర్మ వొలిసి డోలు వాయిస్తరు,
బతుకమ్మం లాడించుడు కాదు
నీకే బతుకులేకుంట సేత్తరు
జనంతో పెట్టుకుంటే
యే జనానా కాని. నీ జనాలు కాని
ఆదుకోలేరు. నీ జమానా ఖతమై
జన రాజ్యం వస్తాదని హెచ్చరిస్తుండాం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Telugu senior poet Kapila Rankumar expressed his opinion on the situation after the formation of Telangana state.
Please Wait while comments are loading...