సాహిత్యం: దాగుడుమూతలు
ఆశలు చిగుళ్లు వేస్తయి
రాలి పడిన ఆకు తిరిగి చెట్టు కొమ్మను చేరాలని
అణగి మణగి కొమ్మ సందుల కోయిల పాట పాడాలని
కదలని కాలం రెక్కల మీద ఉరుకులూ పరుగులూ
శాంతి లేదు, విశ్రాంతి లేదు
క్షణం తీరిక ఉండదు, పిసరంత ఊపిరాడదు
ఇసుకకు ప్రాణం వచ్చి లేచి పోతుంది
వాగులు వొట్టిపోయి పగుళ్లు వారుతయి
చెలిమిలు పురా జ్ఞాపకాలు

మరు జన్మ ఉన్నదో లేదో
మళ్లీ మళ్లీ పుడుతామో లేదో
అద్దం బద్దలై కలలు చిట్లిపోతయి
నా ముఖం పచ్చెలు పచ్చెలు అవుతుంది
ప్రాణాలు అడ్డేసి కట్టలు కడితే
గుండె చెరువైంది, తూము గొంతు ఎండిపోయింది
మోట బాయి తెట్టె కూలింది
మాపటిలో, అద్మ రాత్రో
కరెంటు కోసం కాపలా
అలసిన కళ్ల మీద రెప్పల తలుపు పడవు
తెర్లయిన బతుకు, తెల్లారిన జీవితం
కాట గలిసిన తల్లి తెలంగాణ
గోరుకొయ్యలు పొడవవు, కోడిపుంజు కూయదు
పొద్దు పొడవదు, పోరాడుతనే ఉంటం
ఎముడాల రాజన్న, కొమురెల్లి మల్లన్న
భుజం మీద భేతాళ మాంత్రికుడు
నిప్పు గుండం తొక్కుతున్నం, శివశివా అంటున్నం
నుదుటికి విభూతి పూసుకున్నం, వేపమండలు పట్టి శిగాలూగినం
దారి చూపుతామన్న వాళ్లు దాగుడు మూతల్ దండాకోర్
- కాసుల ప్రతాపరెడ్డి