కవి స్వరం: ఒక వాన-కొన్ని ఊహలు
ఆధునిక వచన కవిత్వంపై కొన్ని అపోహలున్నాయి. రాయడం సులభమని, వాక్యాలను ఒకదాని కింద ఒకటి పేర్చుకుంటూ పోతే వచన కవిత అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది కాదు. ఛందోబద్ధ కవిత్వం రాయడం కన్నా వచన కవిత్వం రాయడం కష్టం. పద్యంలో ఛందస్సు కారణంగా కవి తప్పించుకోవచ్చు. కానీ వచన కవిత్వంలో అది సాధ్యం కాదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ప్రతీకలు, ఊహా శక్తి కొరవడినా కవి తేలిపోతాడు.
అలా తేలిపోకుండా, చిక్కనైన కవిత్వాన్ని రాఘవ మనకు అందించాడు. వాక్యాలను చిక్కగా, ఆకాశం నుంచి ఏకధాటిగా జాలువారుతున్న జలధారలా మనకు ఈ కవితను అందించాడు. ఒక వాన - కొన్ని ఊహాలు అంటూనే బాహ్య ప్రపంచం నుంచి అంతర్లోకాల్లోకి ఆ కవిత ద్వారా రాఘవ పాఠకులను నడిపించుకుని వెళ్లాడు. వానలో తడిసి ప్రకృతి ప్రసాందించిన అనేక లౌకిక, అలౌకిక దృశ్యాల సౌందర్యాన్ని కవి మనకు చూపిస్తాడు.
చలం అందించిన ఓ అభౌతిక, పారలౌకిక ఆనంద పారవశ్యాన్ని రాఘవ ఈ కవిత ద్వారా మనకు కలుగజేస్తున్నాడు. ఇది కేవలం ప్రాకృతిక కవిత్వమే అనుకోవడానికి లేదు, అధ్యాత్మిక సారాన్ని కూడా మనకు కవి అందించాడు. ఆ పారలౌకిక, అభౌతిక సౌందర్యం కోసం సాగే అన్వేషణ కూడా ఈ కవిత. చలం కవిత్వ ఛాయలనే కాదు, ఆధ్యాత్మిక చింతనను పూర్తిగా సంతరించుకున్న కవిత ఇది.
- కాసుల ప్రతాపరెడ్డి

..ముసురు పడుతుంది. మబ్బులు నేలతో అలా తడితడిగా ఊసులాడుతూనే ఉంటాయ్.ఇంటిముందున్న పసుప్పచ్చని పూలచెట్టు అదేపనిగా స్నానం చేసీ చేసీ అందంగా అలసిపోతుంది.
ఒక చల్లటి గాలి అలా బరువుగా వచ్చి పలకరిస్తుందా..నాలో కదుల్తోన్న నీ ఙ్నాపకాల నులివెచ్చదనం సోకి ఇలా తేలికవుతుంది.నిన్ను చూడాలన్పిస్తుంది నాకు.
బయల్దేరుతాను నీ సమ్మతి కోరకుండానే."ఇంత వానలో ఇలా తడుస్తూ ఈ రావడమేంటి బాబూ"అంటావు. పై పై మాటలే గదా అవి.నిజం మాటలు నీ కళ్ళలోంచి వినిపిస్తాయ్.
పక్కన కూర్చుని నీ అరచేతిని అపురూపంగా అందుకుంటానా..కాస్త పైకెత్తుతానా..కొంచెం కిందకు వొంగి తడితడిగా ఆ చేతికి ప్రణమిల్లుతానా..అప్పుడాచేతి నుంచీ వినిపిస్తాయామాటలు"భలే వచ్చావ్..ఎంత బావుందో నీ రాక!"
...
కాస్త ఇటు తిరిగి "చెప్పు ఏం చేద్దాం"అంటావు. ఊరికే నవ్వుతాను. కళ్ళనుండీ, పెదవుల నుండీ, సమస్త శరీరం నుండీ పరిమళించిన నీ నవ్వు ఒక పరమాద్భుత విన్యాసమేదో చేస్తుంది. చిన్నప్పుడు చేసుకున్న తామరకాడల దండను తెచ్చి నా మెళ్ళో వేస్తుంది.
...
అనంతస్వచ్చమైన ప్రేమ మన లోతుల్లోంచి అలా అలా మాటలై తేలివస్తుంది. ఎటు చూసినా ప్రవహిస్తోన్న నీళ్ళమీదుగా మన బుల్లి పడవేసుకుని మనం బయలుదేరుతాం.
"ఇదిగో ఈ కొంగ చూడు. ఇది భలే పరిచయం నాకు. ఇదిగో ఈ చోటు చూడు. ఈ చెట్లు..ఈ పొలాలు.."-నీ లోకమంతా నాకు పరిచయం చేస్తావు- గొప్ప మురిపెంతో మనసు కళ్ళను విప్పార్చుకుని అన్ని లోకాలనూ నీలోనే నేను చూస్తుంటాను..
...
ఒక మాట..ఒక స్పర్శ..వేలాది పువ్వులు..-ముసురులా కొనసాగుతూనే ఉంటుంది.
- రాఘవ
౨౭-౯-౨౦౧౪












Click it and Unblock the Notifications