కవిస్వరం: వాహెద్ కవిత

ఈ వారం కవిసంగమం కవిని ఎంపిక చేసుకోవడం కత్తి మీద సామే అయింది. ఒక్కదాన్ని మించిన కవిత మరోటి కనిపించింది. సారంలోనే కాదు, అభివ్యక్తి తీరులో పోటీ పడ్డాయి. చివరకు అబ్దుల్ వాహెద్‌ను ఎంపిక చేసుకున్నారు. మండు వేసవిని ప్రతీకగా తీసుకుని జీవిత నడవడికను చెప్పిన కవిత. ఎండా కాలం గడిచిపోక ముందే దాని మీద రాస్తే బాగుంటుంది కదా అనిపించింది.

మండు వేసవిలో నగర వాతావరణాన్ని చిత్రిస్తూనే మానవ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పిన కవిత ఇది. అభివ్యక్తి తీరు ఎండలోని మెరుపులా తళుక్కుమనడం ఈ కవిత ప్రత్యేకత. 'వెలుగు వానలో తడిసిపోతోంది', 'చెమటలా ఆత్మను కమ్ముకుంది ఒంటరితనం' వంటి కొత్త అభివ్యక్తిని ప్రతిబింబించే వాక్యాలు ఈ కవితలో మెరుపులు చిమ్ముతున్నాయి.

కాగా, ఇంత వెలుతురును భరించలేమనే కవి వాక్యం ఓ జీవిత వాస్తవికతను ప్రతిబింబిస్తోంది. వెలుతురు ఎక్కువైతే కళ్లు మూసుకుపోయి అంతా చీకటిమయం అవుతుంది. జీవితం కూడా అంతే. అంధకారం అలుకునేంత వెలుతురును ఊహించుకోవడం ఓ అనుభవం. నల్ల సుదరి, చీకటి కన్య, రాత్రి ప్రేయసిని చూడాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. ఇలా చెప్పడంలో విలువలను తలకిందులు చేయాల్సిన అవసరాన్ని కూడా వాహెద్ చెబుతున్నాడు. జీవితాలు ఎండమావుల్లా ఉండకూడదనే సందేశాన్ని కూడా కవి అందిస్తున్నాడు.

- కాసుల ప్రతాపరెడ్డి

Kavisangamam poet: Abdul Wahed

ఎండ

ఎండుటాకులా
రాలుతోంది మిట్టమధ్యాహ్నం
రోడ్డును కావలించుకున్న తారులా
కాంక్రీటు అడవిని హత్తుకుంది
వెలిసిపోయిన మనిషిరంగులా మిగిలింది నగరం

ఎండమావి
కాదు...కాదు...
దూరాన.. నేలను ముద్దాడే ఆకాశం వైపు
దుమ్ము దుస్తులు తొడుక్కున్న బాధలు
అలలు అలలుగా కదులుతున్నాయి
కాల్చే ఎండలో కరుగుతున్నాయి పొగమంచులా
ఏ.సీ.రూములకు చల్లదనం ఇస్తున్నాయి...

కాంక్రీటు అరణ్యం వెలిగిపోతోంది
వెలుగు వానలో తడిసిపోతోంది
కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి
తోటి మనిషి కనబడని వెలుగు...
మనిషి మనిషికి మధ్య ఎడబాటు గోడలా వెలుగు తెరలు...
ఆవిరైపోయిన కంటితేమ నిస్త్రాణగా
చల్లని చీకటి కావాలంటోంది...

ఇక ఆలోచించడానికేముంది?
అంతా వెలుగుమయమే కదా...
నీడను కూడా తరిమేసిన వెలుగు...
భరించరాని ఉక్కపోతలో
చెమటలా ఆత్మను కమ్ముకుంది ఒంటరితనం.

కాస్త కళ్ళు విప్పి మనసారా మనిషిని చూడాలి
నల్లసుందరి, చీకటికన్య, రాత్రి ప్రేయసి
చిరునవ్వు కురవాలి.
ఇంత వెలుగు భరించలేం..

మిట్టమధ్యాహ్నం ఎండలో
ఎండమావుల్లా ఎంతకాలం?

కవిసంగమం గ్రూప్ కోసం క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+