కవి స్వరం: బాల సుధాకర్ మౌళి

Kavisangamam poet: Balasudhakar Mouli poem
నది పుట్టుక ఎక్కడో మనకు తెలియకపోవచ్చు. కానీ అది పాడే వింటూ ఉంటాం. అది మోసుకుని వచ్చే సుఖదుఖ్కాలను కూడా అనుభవిస్తూ ఉంటామేమో. బాలసుధాకర్ మౌళి నది అద్భుతమైన కవిత రాశాడు. నది గత వర్తమానాలను మోసుకుని వస్తుందంటూనే దాని గత వర్తమానాలను చిత్రీకరించారు. అది వాటిని కడగిస్తూ మనిషిని పుణీతున్ని కూడా చేస్తుంది.

గతంలో నది మార్దవంగా, లాలిత్యంగా పాడుతూ ఉండేది. మానవ నాగరికతకు నది చిహ్నం. నదికి ఇరువైపులా జీవనం పచ్చగా పుష్పిస్తూ వికసిస్తూ ఉండేది. ఇప్పుడు మానవుడికి నదితో పనేముంది? నది ఉల్లాసాన్ని, ఉత్సహాన్ని చూసి పక్షులు రెక్కలు విప్పి ఆకాశంలో నాట్యం చేస్తాయి. కానీ, ఇప్పుడు "నది మీది ఆకాశాన్ని/ రెక్కల కింద బరువుగా మోస్తూ/ మహా గుంభనంగా.." పక్షులు ఎగురుతున్నాయి.

బాలసుధాకర మౌళి నది తన లాలిత్యాన్ని, మార్దవాన్నీ కోల్పోయి, ప్రవాహ గుణాన్ని కోల్పోయి ఎలా ఉందో చెప్తాడు. నదీ విధ్వంసాన్ని కళ్లకు కట్టిస్తాడు. వాచ్యంగా ఏదీ చెప్పకుండా జీవం ఉట్టి పడే నది జీవం కోల్పోయిన దశను ఎలా చేరుకుందో పాఠుకుడి అనుభవంలోకి వచ్చే విధంగా వివరిస్తాడు. తన అనుభవాన్ని పాఠకుడి అనుభవంలోకి తేవడమే కవిత్వం అనిపించుకుంటుంది. బాలసుధాకర్ మౌళికి ఆశ చావలేదు, నది పురి విప్పుతుందనే ఆశను ప్రకటిస్తాడు.

ప్రకృతి విధ్వంసం ద్వారా ఆధునిక నాగరికత ఎలా జడలు విరబూసి నర్తిస్తుందో, అది మానవ వికాసాన్ని ఎంతగా దెబ్బ తీస్తుందో చెప్పి, విషాదానుభూతిని కవి పాఠకుడికి కలిగిస్తాడు. ఇది ఒక్క చంపావతి నదికి మాత్రమే కాదు, ఏ నదికైనా వర్తిస్తుంది. డాక్టర్ సుంకిరెడ్డి వాగు మీద రాసిన కవితను ఇది గుర్తుకు తెస్తుంది. అయితే, ఇది దాని అనుకరణ కాదు, ఇది సొంత గొంతుక నుంచి వెలువడిన కవిత.

ఆధునిక అభివృద్ధి నమూనాలోని డొల్లతనాన్ని, వ్యతిరేక ఫలితాన్ని బాలసుధాకర్ మౌళి తన కవిత ద్వారా మనకు అర్థం చేయిస్తున్నాడు. ప్రకృతితో మానవుడు సహజీవనం చేసే అభివృద్ధి నమూనాను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని కవిత మొత్తంలో మనకు అర్థం చేయిస్తాడు. ఈ విషయం కవితలో చెప్పకపోవడమే కవితలోని సుగుణం. అనుభూతిని కలిగించి, విషాద వాతావరణాన్ని కల్పించి, కవిత తన ప్రయోజనాన్ని నెరవేర్చింది. బాలసుధాకర్ మౌళి కవిత మానవుడి బాధ్యతను కూడా గుర్తుకు తెస్తుంది. ఆ కవితను చదవండి...

- కాసుల ప్రతాపరెడ్డి

నదిపాట

అలల గొంతుతో
నది పాడుతుంటుంది
ఏ సుదూరాన్నుంచో పక్షులు నదిపాట విని
కచేరీ ముందు వీక్షకులు చేరినట్టు
నది వొడ్డున చేరుతుంటాయి
నది గొంతెత్తి
మరింత మార్దవంగా ఆర్ధ్రంగా లాలిత్యంతో
పాడుతుంది
నదిది
సమూహపు పాట
సర్వదుఃఖాలనూ, దుఃఖావశేషాలనూ కడిగేసే
జోలపాట
జలపాట
ఈ నది పుట్టి ఎన్నాళ్లయ్యిందో
ఏ ఆదిమకాలపు వీరుడో నదిని నిలువునా ఛేదించి
ఆవలి తీరానికి తొలి దారి వేసాడో
ఎందరి మబ్బు బట్టిన కన్నుల్లో
వేకువ సూరీణ్ణి నాటిందో
నది
గత వర్తమాన చరిత్రకు నిలువుటద్దంలా
ఈ నది
2
నది దుఃఖాన్ని ప్రేమిస్తుంటుంది
నురగల పరవళ్ల పాటలాగే
దుఃఖాన్నీ గొంతు నిండుగా నింపుకుని
దిక్కుల గుండెల్లో ధ్వనించేట్టు
మహా ఆవేశంతో ఆలపిస్తుంది
నది పాటంటే
గాయాల పాటేనేమో
ఏ ఆదివాసీ తల్లో పరమ ఆవేదనతో కార్చిన కన్నీరు
ఎండి
జ్ఞాపకంలా మిగిలిన కన్నీటి చారికేనేమో
ఈ నది -
కౄర అరణ్యమృగం దాడికి
ఎముకలు బయల్పడిన లేత జింక దేహంలా
నిండా తేలిన రాళ్లతో
చుక్క నీరు లేని
ఈ నది -
3
ఈ రోజు తెల్లారి కలలో నది కనిపించింది
పడవేసుకుని నది మీదికి బయలుదేరాను
లయబద్ధంగా తంత్రుల్లా
కదలాడాల్సిన అలలు
మూగగా రోదిస్తూ..
ఏవో కొన్ని పక్షులు
నది మీది ఆకాశాన్ని
రెక్కల కింద బరువుగా మోస్తూ
మహా గుంభనంగా..
నది చనిపోయిందా ?
ఏఏ అరణ్యాలనో, ఏఏ పర్వతాలనో దాటుకుంటూ
తరాల మధ్య వంతెనలా
అనంత జీవకోటి దేహాంతర రక్తప్రసరణలా
ఎన్నెన్ని ఊళ్లనూ ఎన్నెన్ని పొలాలనూ వొరుసుకుంటూ ప్రవహించిందో !
నది మీద నాలుగు కన్నీటి బిందువులు రాల్చాను
నదిని దగ్గరకు చేరదీసాను
చేతులారా తడిమాను
మూగబోయిన నదికి
మళ్లీ తన రెక్కల పాటను గుర్తుచేయాలనుకున్నాను
యిలా అనుకోవడమే అనుకోవడమే
నది పాటయ్యింది
పాటే నది అయ్యింది
4
విష పుష్పావృతచేతులతో నదిని దహనం చెయ్యొచ్చు
వికశిత పుష్పాలంకారిక మాంత్రిక హస్తంతో నదిని మహానదిని చెయ్యొచ్చు
నది
ప్రజల అరచేతుల్లో
నిండా మొలిచిన తడి మొలక
నది -
నది పురివిప్పుతుంది
నది పురివిప్పుతుంది
( 'చంపావతి నది'ని చూసి దుఃఖంగా.. )

- బాలసుధాకర్ మౌళి
రచనా కాలం : 1 ఏప్రిల్ 2014

కవిసంగమం గ్రూప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://www.facebook.com/groups/kavisangamam/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+